సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల అమెరికా కలను డాలర్ దెబ్బకొడుతోంది. అక్కడి పరిస్థితులతో ఫీజులు పెరగడం ఓ వైపు.. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఎక్కువ చెల్లించాల్సి రావడం మరోవైపు ఇబ్బందిగా మారుతోంది. ముందుగా అనుకున్న ఖర్చు కంటే ఎక్కువ అవుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
కొన్ని ఏజెన్సీలు వివిధ మార్గాల్లో బ్యాంకు బ్యాలెన్స్ చూపించి విద్యార్థులను విదేశాలకు పంపుతుంటాయి. ఇప్పుడా ఏజెన్సీలు కూడా ఎక్కువ కమీషన్ తీసుకుంటున్నాయని.. విదేశీ విద్యకు నిధులిచ్చే విషయంలో బ్యాంకులు కూడా మరిన్ని షరతులు పెడుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. ఆరు నెలల క్రితం నాటి డాలర్ విలువతో పోల్చి రుణాన్ని లెక్కిస్తున్నాయని, భవిష్యత్‌లో ట్యూషన్ ఫీజు పెరిగితే విద్యార్థులే భరించాలని కొర్రీ పెడుతున్నాయని చెబుతున్నారు.
‘చదువుల’సీజన్ మొదలు
అమెరికా సహా వివిధ దేశాల్లోని యూనివర్సిటీల్లో ఆగస్టు, సెప్టెంబర్‌లో మొదటి దశ అడ్మిషన్లు జరుగుతాయి. దీనికోసం విద్యార్థులు జనవరి నుంచే సన్నద్ధమవుతారు. పాస్‌పోర్టు, వీసా కోసం ప్రయత్నించడం, విదేశీ భాషకు సంబంధించి పరీక్షలు రాయడం చేస్తుంటారు. కోవిడ్ కాలంలో విదేశాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గినా.. గత ఏడాది నుంచి మళ్లీ పుంజుకుంది.
2017లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది విదేశాలకు వెళ్తే.. 2022లో 6.48 లక్షల మంది వెళ్లారు. తెలంగాణ నుంచి అన్నిదేశాలకు కలిపి ఏటా సుమారు 60 వేల మంది వెళ్తుండగా.. అందులో అమెరికాకు చేరుతున్నవారే 30 వేల మంది. చాలా మంది సాఫ్ట్‌వేర్ కెరీర్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. డిజిటల్ ఎకానమీలో అవకాశాలు పెరగడంతో నైపుణ్య విభాగాలైన బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్‌కు భవిష్యత్‌లోనూ మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు.
ఈ అంచనాలతోనే ఎక్కువ మంది విదేశాల్లో డేటాసైన్స్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం.. డేటా అనాలసిస్‌లో 23 శాతం, డేటా విజువలైజేషన్‌లో 10శాతం, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ 26 శాతం, మెషీన్ లెర్నింగ్ 41 శాతం భారత విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. నిజానికి దేశంలో 2020–21 మధ్య డేటా సైన్స్ ఉద్యోగాలు 47.10 శాతం మేర పెరిగాయని, ఎంఎస్ పూర్తి చేసిన వారికి ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.
పెరిగిన ఫీజులతో..
ప్రధానంగా అమెరికా విద్యకు ఖర్చు గణనీయంగా పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడమే ఇందుకు కారణం. ఆరు నెలల క్రితం రూ.79 వద్ద ఉన్న ఉన్న డాలర్ విలువ ప్రస్తుతం రూ.82 దాటింది. దీంతో అమెరికాలో ఖర్చు 15 శాతం పెరిగిందని ఓ కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది. దానికితోడు ఆర్థిక మాంద్యం పరిస్థితి కారణంగా అమెరికాలో తాత్కాలిక ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. దీంతో అమెరికాలో ఉన్న భారత విద్యార్థులకు పూర్తిగా తల్లిదండ్రులు పంపే డబ్బులే దిక్కు అవుతున్నాయి. ఇక బ్యాంకులు ముందుగా నిర్ణయించిన మేరకు ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తున్నాయి. డాలర్ మారకం భారం విద్యార్థులు/తల్లిదండ్రులపైనే పడుతోంది.
అమెరికాలోని యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ట్యూషన్ ఫీజుకు సరిపడా బ్యాంకు బ్యాలెన్స్ చూపించాల్సి ఉంటుంది. కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు అవసరమైన బ్యాలెన్స్ బ్యాంకులో వేసి.. విద్యార్థి అమెరికా వెళ్లిన తర్వాత డ్రా చేసుకుంటాయి. ఇందుకోసం కమీషన్లు తీసుకుంటాయి. ఇప్పుడీ కన్సల్టెన్సీలు తీసుకునే మొత్తాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచేశాయని విద్యార్థులు వాపోతున్నారు.
మరింత అప్పు చేయాల్సి వస్తోంది
మా అక్క గత ఏడాది అమెరికా వెళ్లింది. సెయింట్ లూయిస్ వర్సిటీలో రూ.10.85 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనంతో కట్టాల్సిన సొమ్ము రూ.12.02 లక్షలకు పెరిగింది. ఎనిమిది నెలల్లోనే రూ.1.20 లక్షల వరకు భారం పడింది. నేను కూడా అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాను. రూ.25 లక్షల్లో ఎంఎస్ పూర్తి చేస్తానని అనుకున్నా.. మరో నాలుగైదు లక్షలపైనే ఖర్చయ్యేలా ఉంది. మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
– ప్రదీప్‌కుమార్, వరంగల్ (అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థి)
ఏం చేయాలన్నది తేలడం లేదు
అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీలో చేరాలనుకున్నా. అన్నీ సిద్ధం చేసుకున్నాను. మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు. నేను సిద్ధమైనప్పుడు ఫీజు ఏడాదికి రూ.19.17 లక్షలు అయితే డాలర్ రేటు మార్పుతో.. రూ.21.25 లక్షలకు చేరింది. యూనివర్సిటీ ఆఫ్ న్యూహెవెన్‌లో ఫీజు రూ.21.36 లక్షల నుంచి రూ.23.67 లక్షలకు చేరిందని మరో ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పటికే అతి కష్టం మీద రూ.25 లక్షలు అప్పు చేశాం. మరో ఆరేడు లక్షలు ఉంటే తప్ప అమెరికా వెళ్లి చదవడం కష్టం. ఏం చేయాలన్నది తేలడం లేదు.
– విశాల్ త్రివిక్రమ్, విద్యార్థి, హైదరాబాద్
అమెరికా కలకు డాలర్ బరువు
Published Tue, Mar 28 2023 1:28 AM | Last Updated on Tue, Mar 28 2023 11:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment