163 పైసలు (రూ)పాయే!
ముంబై: రూపాయి కష్టాలు తొలగిపోలేదు. వరుసగా రెండు రోజులు లాభపడ్డాక సోమవారం స్వల్పంగా క్షీణించిన రూపాయి విలువ మంగళవారం ఒకేసారి 163 పైసలు(2.47%) పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో మళ్లీ 67.63 కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఒక దశలో ఏకంగా 68.27 వరకూ దిగజారడం గమనార్హం. సిరియాపై సైనిక చర్యల అంచనాలతో ముడిచమురు ధరలు పుంజుకోవడం ప్రధానంగా ప్రభావాన్ని చూపిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా పలు ఇతర కరెన్సీలతో డాలరు బలపడటం కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను బలహీనపరచిందని తెలిపారు. కాగా, జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ, నోమురా వంటి సంస్థలు ఇండియా ఆర్థిక వృద్ధి అంచనాలలో కోత విధించిన సంగతి తెలిసిందే. వెరసి డాలరుతో మారకంలో 66.29 వద్ద బలహీనంగా మొదలైన రూపాయి చివరికి 163 పైసలు పతనమై 67.63 వద్ద నిలిచింది.