రూపాయి భారీ పతనానికి కారణాలు | reasons for indian rupee value fall compared to us dollar | Sakshi
Sakshi News home page

రూపాయి భారీ పతనానికి కారణాలు

Published Mon, Oct 14 2024 10:20 AM | Last Updated on Mon, Oct 14 2024 12:56 PM

reasons for indian rupee value fall compared to us dollar

రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 84.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.

ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో  దేశీయంగా ఉన్న డాలర్‌ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. కానీ చైనా మార్కెట్లపై ఆసక్తి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని అక్కడ ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల 70 డాలర్లకు చేరిన బ్రెంట్ ముడి చమురు ధర క్రమంగా పెరిగింది. ప్రస్తుతం అది 80 డాలర్లకు దగ్గర్లో ఉంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత వచ్చే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానంతో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో చమురు ధరలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రభావం ఇలా..

రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే  ఆర్‌బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది.

కారణాలివే..

1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్‌ అధికం. భారత ‘కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.

2. ముడిచమురు ధర 79 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.

3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.

4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్‌ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గించాయి. భారత్‌లో మాత్రం ఆర్‌బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా జపాన్‌, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..

ఏం చేయాలంటే..

దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement