rupee against dollar
-
బాబోయ్ రూపాయ్
కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం. ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే.. వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది. ఐటీ, ఫార్మా హ్యాపీస్... దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.దిగుమతులకు భారం.. చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి. రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్ చేసే స్మార్ట్ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి. విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు.. చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్ ఫీజు .. డిసెంబర్ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది. సానుకూలం→ ఎగుమతి ఆధారిత రంగాలు → ఫార్మా→ ఐటీ సర్విసులు→ జౌళి→ ఉక్కు → రెమిటెన్సులు ప్రతికూలం → విదేశీ ప్రయాణాలు → విదేశీ చదువులు→ ధరల సెగ: ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి → వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
నినాదాలు కాదు, విధానాలు కావాలి
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి మాటలలో వివరించలేనంత ఆందోళనకర స్థాయిలో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 80కి చేరింది. రూపాయి పతనాన్ని ఆపడానికి 1.5 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని కుమ్మరించినా పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా లేదు. ముడిచమురు, బొగ్గు, ఆహార ధాన్యాలు వంటివాటి దిగుమతులు గణనీయంగా పెరిగి దేశం నుండి జరిగే ఎగుమతులు తగ్గాయి. దాంతో, విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకు పోతోంది. విదేశీ రుణం రికార్డు స్థాయికి చేరింది. ఫలితంగా విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతిని కరెంట్ ఖాతా లోటును నిర్వహించడంలో ఆర్థిక శాఖ సతమతం అవుతోంది. దేశంలో చిల్లర విపణి ధరలు, వంట గ్యాస్, కిరోసిన్, బొగ్గు ధరలు అదుపు తప్పాయి. అన్ని సరుకుల టోకు ధరల సూచీ 15 శాతం పైకి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించే మాట్లాడుతున్నారుగానీ... కుటుంబాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడ్డం లేదు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి గత్యంతరం లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు అప్పుల ఊబిలో దిగిపోయారు. దేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక దుస్థితి హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అలాగని కరోనా దెబ్బతోనూ, రష్యా ఉక్రెయిన్ల యుద్ధంతోనూ పూర్తిగా ఈ స్థితి దాపురించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ఆర్థిక విధానం లోపించడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని నరేంద్రమోదీ 2014లో అధికారం చేపట్టేనాటికి దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.4 శాతం వృద్ధిరేటుతో ఆరోగ్యకరంగానే ఉంది. పైగా, 2014 తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు అంటే 2018 వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా... కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కానీ, ఈ అనుకూలతను ఆర్థిక రంగ పటిష్టతకు విని యోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అయింది. 2016 నవంబర్‌లో నల్లధనం అరికట్టడం లక్ష్యంగా హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఓ విఫల కార్యక్రమంగా మిగిలి పోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. నిరు ద్యోగం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత సన్నగిల్లడంతో అనేక మంది డిపాజిట్‌దారులు తమ డబ్బును బ్యాంకుల నుండి ఉపసంహరించుకొని డాలర్ల రూపంలో విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. అంటే, భారత బ్యాంకుల్లో ఉండాల్సిన డిపాజిట్లు విదేశాలకు తరలడం వల్ల ‘రూపాయి’పై భారం పెరగడమే కాక.. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. కోట్లాదిమందికి ఉపాధి కల్పించే దేశీయ అసంఘటిత రంగాలను దెబ్బతీయడమే పెద్దనోట్ల రద్దు విజయంగా మిగిలి పోయింది. స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేస్తాయి. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయంతో నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50 శాతం నుంచి 90 శాతం వరకు అనుమతి ఇస్తున్నారు. మరో పక్క స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్ఐఐలు) ప్రోత్సహి స్తున్నారు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణిస్తుందో... అప్పుడు స్టాక్ మార్కెట్ల నుండి ఎఫ్ఐఐల ఉపసంహరణ ఊపందుకుంటుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప గూలడం అనేకసార్లు చూశాం. డాలర్‌తో రూపాయి మారకం విలువ వేగంగా పతనం కావడంతో అనేక రంగాలలో ఈ దుష్ఫలితాలు కనపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కు వగా అమెరికన్ డాలర్ చుట్టూ పరిభ్రమించడం వల్లనే ఈ దుస్థితికి ప్రధాన కారణం. అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బంగారం, ఇతర విలాస వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది. ఇక, దేశాన్ని పన్ను ఉగ్రవాదం నుండి విముక్తం చేయడమే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లక్ష్యం అని చెప్పుకున్న ఎన్డీఏ ప్రభుత్వం హేతుబద్ధత లోపించిన ఆచరణతో ప్రజలపై పెనుభారం మోపింది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు కొండలా పెరిగిపోయాయి. 2014 జూన్ నాటికి దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరాయన్న నివేదికలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతాయి. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటే అర్థం.. ఆర్బీఐ తన బాధ్య తను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నదనే. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలను వెనక్కి రప్పించి వారి ఆస్తులను జప్తు చేయించడంలో కూడా కేంద్రం విఫలం అయింది. కాగా, నష్టాల్ని తగ్గించు కోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టడం అనేక విమర్శలకు గురైంది. తాజాగా, ఎస్బీఐ మినహా దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే కలిగే అనర్థాలు అనేకం. ఉద్యోగ భద్రత లోపించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవు. ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ వంటి పసలేని నినాదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జీఎస్టీని సరళతరం చేయాలి. రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. నల్లధనాన్ని వెనక్కు రప్పించాలి. అధిక వ్యయంతో కూడిన దిగుమతులను నిలుపుదల చేసి వైవిధ్యభరితమైన ఎగుమతులపై దృష్టి పెట్టాలి. దేశంలోని మానవ వనరులను సద్వినియోగ పర్చుకొని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడిగా దేశం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి స్థిరమైన ఆర్థిక విధానాలతో తగిన కార్యాచరణ రూపొందించాలి. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
పెట్రో షాక్ : సెంచరీ దిశగా ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరల భారంతో పాటు రూపాయి క్షీణించడంతో ఇంధన ధరలు సరికొత్త గరిష్టస్ధాయిలకు చేరాయి. లీటర్ పెట్రోల్ రూ వంద దిశగా పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 89.29కి చేరగా డీజిల్ ధర లీటర్‌కు రూ 78.26కు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ 86.25 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 81.91కు పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్‌కు రూ 73.32కు చేరాయి. ముంబైలో శనివారం తొలిసారిగా పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 80కి చేరడంతో ఇంధన ధరల రికార్డు పెరుగుదలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టడంతో పాటు, పెట్రో ఉత్పత్తులపై పన్ను భారాలు తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంది. aasss -
ఆగని పెట్రో ధరలు
-
షాకింగ్ : ఆగని పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు. ఇంధన ధరలు వరుసగా సోమవారం మూడోరోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్‌కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్ ధరలు లీటర్‌కు 40 పైసలు పైగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది. ఇక ముంబయిలో రెండు రోజుల కిందట రూ 83.76 పలికిన లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ 86.56కు ఎగబాకింది. ఇక చెన్నైలో రూ 82.24, కోల్‌కతాలో రూ 82,.02, ఢిల్లీలో రూ 78.84గా నమోదైంది. మరోవైపు డీజిల్ ధరలూ భారమయ్యాయి. ముంబయి, చెన్నై, ఢిల్లీల్లో డీజిల్ లీటర్‌కు వరుసగా రూ 75.54, రూ 75.19, రూ 71.15కు పెరిగింది. ఇక కోల్‌కతాలో డీజిల్ లీటర్ ధర రూ 74కు చేరింది. ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాటు డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. కాగా అమెరికా ఏకపక్ష విధానాలతోనే అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
షాకింగ్ : పెట్రో బాంబు పేల్చిన కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : రోజురోజుకూ భగ్గుమంటున్న పెట్రో ఉత్పత్తుల ధరలపై కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటంతో ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు అంతర్జాతీయ అంశాలే కారణమని పేర్కొన్నారు. మరోవైపు శనివారం రికార్డు గరిష్టస్ధాయిలకు చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం సైతం మరింత భారమయ్యాయి. ఇక హైదరాబాద్‌లో ఆదివారం పెట్రోల్ లీటర్‌కు 17 పైసలు భారమై రూ 83.59కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ 86.09కు చేరగా, డీజిల్ లీటర్‌కు రూ 74.76 పలికింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి రూ. 71కి పడిపోవడంతో ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. -
రూపాయి 8 నెలల కనిష్టం
ముంబై: డాలరుతో మారకంలో వరుసగా ఐదో రోజు నష్టపోయిన రూపాయి ఎనిమిదిన్నర నెలల కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 22 పైసలు బలహీనపడి 61.96 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు నష్టపోవడం, దిగుమతిదారుల నుంచి డాలరుకి డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలు రూపాయిని దెబ్బకొట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. విదే శీ పెట్టుబడులు మందగించడం కూడా ఇందుకు జతకలిసినట్లు తెలిపారు. వెరసి ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్రితం ముగింపు 61.70తో పోలిస్తే 61.80 వద్ద బలహీనంగా మొదలైంది. ఆపై ఒక దశలో 61.78 వరకూ బలపడింది. చివరికి 0.4% నష్టంతో 61.96 వద్ద ముగిసింది. 2014 మార్చి 3 తరువాత రూపాయికి ఇదే కనిష్టస్థాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడింగ్‌లో డాలరు స్థిరంగా ట్రేడవుతోంది. అక్టోబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టిన పాలసీ సమీక్ష వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో డాలరు బలాన్ని పుంజుకోవడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. -
పరుగులు పెడుతున్న రూపాయి, పసిడి
ముంబయి : రూపాయి పుంజుకోవటంతో స్టాక్ మార్కెట్లకు ఈవాళ ఎక్కడలేని బలం వచ్చింది. అమెరికా సెంట్రల్ బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం రూపాయిని, షేర్లను, బంగారం ధరను పరుగులు పెట్టిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు స్టిమ్యులస్ ప్యాకేజీలు కొనసాగించాలని ఫెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అమెరికా నుంచి ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్లలోకి నిధుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ కారణంగా రూపాయి ఈ ఉదయం 165 పైసల లాభంతో ప్రారంభమైంది. ప్రస్తుతం 61 రూపాయల 72 పైసల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలో 600 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 500 పాయింట్ల దాకా లాభపడుతూ 20,460కి సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు లాభపడుతూ 6,060 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఒకే రోజు 60 డాలర్ల దాకా లాభపడింది. ప్రస్తుతం 1360 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. అయితే మన మార్కెట్లో బంగారం ధర ఈ స్థాయిలో పెరగకపోవచ్చు. రూపాయి బలపడటమే ఇందుకు కారణం. -
163 పైసలు (రూ)పాయే!
ముంబై: రూపాయి కష్టాలు తొలగిపోలేదు. వరుసగా రెండు రోజులు లాభపడ్డాక సోమవారం స్వల్పంగా క్షీణించిన రూపాయి విలువ మంగళవారం ఒకేసారి 163 పైసలు(2.47%) పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో మళ్లీ 67.63 కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఒక దశలో ఏకంగా 68.27 వరకూ దిగజారడం గమనార్హం. సిరియాపై సైనిక చర్యల అంచనాలతో ముడిచమురు ధరలు పుంజుకోవడం ప్రధానంగా ప్రభావాన్ని చూపిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పలు ఇతర కరెన్సీలతో డాలరు బలపడటం కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను బలహీనపరచిందని తెలిపారు. కాగా, జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ, నోమురా వంటి సంస్థలు ఇండియా ఆర్థిక వృద్ధి అంచనాలలో కోత విధించిన సంగతి తెలిసిందే. వెరసి డాలరుతో మారకంలో 66.29 వద్ద బలహీనంగా మొదలైన రూపాయి చివరికి 163 పైసలు పతనమై 67.63 వద్ద నిలిచింది. -
షాక్ మార్కెట్ 651 పాయింట్లు పడ్డ సెన్సెక్స్
మూడు వారాలు కూడా తిరక్కుండానే స్టాక్ ఇన్వెస్టర్లకు మరోసారి షాక్ త గిలింది. సెన్సెక్స్ ఏకంగా 651 పాయింట్లు పడిపోయింది. డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో 68కు పతనంకావడం, క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశముందన్న ఎస్అండ్పీ వ్యాఖ్యలు, సిరియాపై సైనికదాడి వార్తలు కలగలసి సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. వెరసి సెన్సెక్స్ 19,007 పాయింట్ల స్థాయి నుంచి 18,235కు దిగజారింది. ఇక నిఫ్టీ సైతం 209 పాయింట్లు పతనమై 5,341 వద్ద స్థిరపడింది. ఈ దెబ్బకు మొత్తం 170 షేర్లు ఏడాది కనిష్టస్థాయిలకు చేరాయి. కాగా, ఇంతక్రితం ఆగస్ట్ 16న సెన్సెక్స్ 769 పాయింట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. యథాప్రకారం పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. ఓపక్క డాలరుతో మారకంలో రూపాయి 3% పతనంకాగా, మరోవైపు సిరియాపై సైనిక దాడి జరిగిందన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపాయి. వీటికితోడు ఇండియా క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు పెరిగాయన్న ఎస్అండ్పీ వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను బలహీనపరచాయి. దీంతో రోజు గడిచేకొద్దీ ఇన్వెస్టర్లలో టెన్షన్లు పెరిగిపోయి అమ్మకాలు శ్రుతిమించాయి. ఫలితం.... సెన్సెక్స్ పతనం ఉధృతమవుతూ వచ్చింది. 19,007 గరిష్ట స్థాయి నుంచి పడుతూ వచ్చిన సెన్సెక్స్ ఒక దశలో కనిష్టంగా 18,166ను తాకింది. చివరికి 651 పాయింట్లు పోగొట్టుకుని 18,235 వద్ద స్థిరపడింది. ఇదే విధంగా స్పందించిన నిఫ్టీ కూడా ఏకంగా 209 పాయింట్లు కోల్పోయి 5341 వద్ద ముగిసింది. ఇప్పటికే జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్, నోమురా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు దేశ జీడీపీ వృద్ధిని 6% నుంచి 4%కు తగ్గించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. ఇవిచాలవన్నట్లు జూలైలో మౌలిక రంగ వృద్ధి 4.5% నుంచి తగ్గి 3.1%కు పరిమితంకావడం కూడా ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఇక సిరియాలో అశాంతి కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ కారణంగా కరెంట్ ఖాతా లోటు మరింత పెరుగుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో అసహనాన్ని పెంచాయని వివరించారు. అన్నింటా నేల చూపులే జారుడు బల్లపై: అమ్మకాల సెగ తగలడంతో బీఎస్ఈలో అన్ని రంగాలూ 1-5% మధ్య పతనమయ్యాయి. ప్రధానంగా బ్యాంకెక్స్ 5% కుప్పకూలగా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ 4.5-3% మధ్య నీరసించాయి. మళ్లీ మొదలు: బ్యాంకింగ్‌లో అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. యాక్సిస్, ఇండస్ఇండ్, యస్ బ్యాంక్ ఏకంగా 9% పడిపోగా, ఫెడరల్, బీవోఐ, పీఎన్బీ, కెనరా, యూనియన్, ఐసీఐసీఐ, కొటక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బీవోబీ 7.5-2.5% మధ్య పతనమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! 52 వారాల కనిష్టం: ఇప్పటికే పలుషేర్లు ఏడాది కనిష్టాలను తాకగా తాజాగా మరో 170 షేర్లు ఈ జాబితాలో చేరాయి. వీటిలో పీఎన్బీ, ఐడీబీఐ, ఫెడరల్, సిటీ యూనియన్, కార్పొరేషన్, ఆంధ్రాబ్యాంకు ఉన్నాయి. అమ్మకాలవైపే: ఇటీవల అమ్మకాలవైపే మొగ్గుచూపుతున్న ఎఫ్ఐఐలు తాజాగా రూ. 716 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ ఫండ్స్ రూ. 596 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. పతన తీరిదీ: సెన్సెక్స్‌లో కోల్ ఇండియా, ఎంఅండ్ఎం... నిఫ్టీలో లుపిన్, కెయిర్న్ మినహా మిగిలిన అన్ని దిగ్గజాలు నష్టాలతో డీలాపడ్డాయి.దిగ్గజాలు డీలా: ఇండెక్స్ షేర్లలో హీరో మోటో ఏకంగా 7% కుప్పకూలగా, ఆర్ఐఎల్, ఐటీసీ, భారతీ, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, హిందాల్కో, హెచ్‌యూఎల్, జిందాల్ స్టీల్, సన్ ఫార్మా, సిప్లా, ఎన్టీపీసీ, మారుతీ 6-2% మధ్య క్షీణించడం విశేషం! ఐటీ సైతం: డాలరు బలపడినప్పటికీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 2.3-1% మధ్య నష్టపోయాయి.