షాక్ మార్కెట్ 651 పాయింట్లు పడ్డ సెన్సెక్స్
మూడు వారాలు కూడా తిరక్కుండానే స్టాక్ ఇన్వెస్టర్లకు మరోసారి షాక్ త గిలింది. సెన్సెక్స్ ఏకంగా 651 పాయింట్లు పడిపోయింది. డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో 68కు పతనంకావడం, క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశముందన్న ఎస్‌అండ్‌పీ వ్యాఖ్యలు, సిరియాపై సైనికదాడి వార్తలు కలగలసి సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. వెరసి సెన్సెక్స్ 19,007 పాయింట్ల స్థాయి నుంచి 18,235కు దిగజారింది. ఇక నిఫ్టీ సైతం 209 పాయింట్లు పతనమై 5,341 వద్ద స్థిరపడింది. ఈ దెబ్బకు మొత్తం 170 షేర్లు ఏడాది కనిష్టస్థాయిలకు చేరాయి. కాగా, ఇంతక్రితం ఆగస్ట్ 16న సెన్సెక్స్ 769 పాయింట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే.
యథాప్రకారం పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. ఓపక్క డాలరుతో మారకంలో రూపాయి 3% పతనంకాగా, మరోవైపు సిరియాపై సైనిక దాడి జరిగిందన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపాయి. వీటికితోడు ఇండియా క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు పెరిగాయన్న ఎస్‌అండ్‌పీ వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను బలహీనపరచాయి. దీంతో రోజు గడిచేకొద్దీ ఇన్వెస్టర్లలో టెన్షన్లు పెరిగిపోయి అమ్మకాలు శ్రుతిమించాయి. ఫలితం.... సెన్సెక్స్ పతనం ఉధృతమవుతూ వచ్చింది. 19,007 గరిష్ట స్థాయి నుంచి పడుతూ వచ్చిన సెన్సెక్స్ ఒక దశలో కనిష్టంగా 18,166ను తాకింది. చివరికి 651 పాయింట్లు పోగొట్టుకుని 18,235 వద్ద స్థిరపడింది. ఇదే విధంగా స్పందించిన నిఫ్టీ కూడా ఏకంగా 209 పాయింట్లు కోల్పోయి 5341 వద్ద ముగిసింది.
ఇప్పటికే జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ రీసెర్చ్, నోమురా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు దేశ జీడీపీ వృద్ధిని 6% నుంచి 4%కు తగ్గించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. ఇవిచాలవన్నట్లు జూలైలో మౌలిక రంగ వృద్ధి 4.5% నుంచి తగ్గి 3.1%కు పరిమితంకావడం కూడా ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఇక సిరియాలో అశాంతి కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ కారణంగా కరెంట్ ఖాతా లోటు మరింత పెరుగుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో అసహనాన్ని పెంచాయని వివరించారు.
అన్నింటా నేల చూపులే జారుడు బల్లపై: అమ్మకాల సెగ తగలడంతో బీఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-5% మధ్య పతనమయ్యాయి. ప్రధానంగా బ్యాంకెక్స్ 5% కుప్పకూలగా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ 4.5-3% మధ్య నీరసించాయి.
మళ్లీ మొదలు: బ్యాంకింగ్‌లో అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. యాక్సిస్, ఇండస్‌ఇండ్, యస్ బ్యాంక్ ఏకంగా 9% పడిపోగా, ఫెడరల్, బీవోఐ, పీఎన్‌బీ, కెనరా, యూనియన్, ఐసీఐసీఐ, కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బీవోబీ 7.5-2.5% మధ్య పతనమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! 52 వారాల కనిష్టం: ఇప్పటికే పలుషేర్లు ఏడాది కనిష్టాలను తాకగా తాజాగా మరో 170 షేర్లు ఈ జాబితాలో చేరాయి. వీటిలో పీఎన్‌బీ, ఐడీబీఐ, ఫెడరల్, సిటీ యూనియన్, కార్పొరేషన్, ఆంధ్రాబ్యాంకు ఉన్నాయి. అమ్మకాలవైపే: ఇటీవల అమ్మకాలవైపే మొగ్గుచూపుతున్న ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 716 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ ఫండ్స్ రూ. 596 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
పతన తీరిదీ: సెన్సెక్స్‌లో కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం... నిఫ్టీలో లుపిన్, కెయిర్న్ మినహా మిగిలిన అన్ని దిగ్గజాలు నష్టాలతో డీలాపడ్డాయి.దిగ్గజాలు డీలా: ఇండెక్స్ షేర్లలో హీరో మోటో ఏకంగా 7% కుప్పకూలగా, ఆర్‌ఐఎల్, ఐటీసీ, భారతీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, హెచ్‌యూఎల్, జిందాల్ స్టీల్, సన్ ఫార్మా, సిప్లా, ఎన్‌టీపీసీ, మారుతీ 6-2% మధ్య క్షీణించడం విశేషం! ఐటీ సైతం: డాలరు బలపడినప్పటికీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 2.3-1% మధ్య నష్టపోయాయి.