మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!
న్యూఢిల్లీ: మార్కెట్లు ఈ వారం భారీ హెచ్చుతగ్గులను చవిచూస్తాయని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. గురువారం(28న) ఆగస్ట్ సిరీస్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌లు ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు. దీంతో ఒడిదుడుకులకు అధిక అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషించారు. చమురు ధరల తీరూ ట్రెండ్‌కు కీలకమని చెప్పారు.
29న గణేశ్ చతుర్థి సెలవు...
గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా శుక్రవారం(29న) బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)సహా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు, ఇరాక్ సంక్షోభంపై అమెరికా ప్రతిస్పందన వంటి అంతర్జాతీయ వివాదాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. వీటితోపాటు కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య నడుస్తున్న కాల్పుల విరమణ వంటి అంశాలపైనా దృష్టిపెడతారని చెప్పారు.
సెంటిమెంట్ సానుకూలం
మార్కెట్లు ఈ వారం కొంత సానుకూలంగానే కదులుతాయని సియాన్స్ అనలిటిక్స్ సీఈవో అమన్ చౌధురి అంచనా వేశారు. దేశీయ ఆర్థిక అంశాల విషయానికివస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)కు సంబంధించిన జీడీపీ గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. మార్కెట్లు మెరుగ్గా ఉన్నాయని, ట్రేడ్ పొజిషన్లు, డెరివేటివ్స్ వంటి అంశాలు ప్రోత్సాహకర సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తున్నాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. వెరసి ఈ వారం మార్కెట్లు కొత్త రికార్డులవైపు పరుగుతీయొచ్చనేది ఆయన అంచనా.
ఫారెక్స్ ఆధారిత షేర్లపై దృష్టి
గడచిన వారం మార్కెట్లు 1%పైగా లాభపడి కొత్తరికార్డులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు. అయితే ఫారెక్స్ ఆధారిత షేర్లు, పసిడి, వెండి వంటి లోహాలు వెలుగులో నిలుస్తాయని అంచనా వేశారు. ఆగస్ట్ డెరివేటివ్స్ ముగింపు కారణంగా ఈ వారం మార్కెట్లు కొంతమేర ఊగిసలాటకు లోనవుతాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. దీంతో ట్రేడర్లు కొద్దిపాటి కీలకమైన స్టాక్స్‌పైనే దృష్టిపెడతారని తెలిపారు. గత వారం అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ కొత్త రికార్డులను తాకాయి. వారం ముగిసేసరికి 316 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 26,419 వద్ద ముగియగా, 121 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 7,913 వద్ద స్థిరపడింది. గత గురువారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 26,530ను అధిగమించి రికార్డు సృష్టిస్తే, నిఫ్టీ సైతం శుక్రవారం 7,929 పాయింట్ల గరిష్టాన్ని అందుకుంది!