అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది.
ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్‌గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి.
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది.
మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment