మరో సరికొత్త కనిష్టానికి రూపాయి
17 పైసలు పతనమై 85.91 వద్ద ముగింపు
గతేడాది సుమారు 3 శాతం డౌన్
దిగుమతులు, విదేశీ విద్య మరింత భారం
ఐటీకి లాభించినా.. పోటీపరంగా ప్రతికూలం
కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది.
అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి.
ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం.
ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే..
వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది.
ఐటీ, ఫార్మా హ్యాపీస్...
దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.
దిగుమతులకు భారం..
చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి.
రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది.
ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్ చేసే స్మార్ట్‌ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి.
విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు..
చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్ ఫీజు .. డిసెంబర్ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది.
సానుకూలం
→ ఎగుమతి ఆధారిత రంగాలు
→ ఫార్మా
→ ఐటీ సర్విసులు
→ జౌళి
→ ఉక్కు
→ రెమిటెన్సులు
ప్రతికూలం
→ విదేశీ ప్రయాణాలు
→ విదేశీ చదువులు
→ ధరల సెగ: ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి
→ వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.
– సాక్షి, బిజినెస్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment