Rupee falls
-
కార్పొరేట్లకు.. రూపాయి టెన్షన్
రూపాయి పతనంతో ధరలు పెరిగిపోయి సామాన్యులు పడే కష్టాలు అటుంచితే కార్పొరేట్లకు కూడా టెన్షన్ తప్పట్లేదు. ముఖ్యంగా విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గత రుణాలను తీర్చేందుకు మరింత ఎక్కువగా చెల్లించాల్సి రానుండటమే ఇందుకు కారణం. సాధారణంగా కార్పొరేట్లు తమ వ్యాపార అవసరాల కోసం, దేశీయంగా వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటే విదేశీ మార్కెట్ల నుంచి తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకుంటూ ఉంటాయి. చౌకగా వచ్చిన నిధులను వ్యాపార విస్తరణకు లేదా అధిక వడ్డీ రేటు మీద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. గత రెండేళ్లుగా మిగతా కరెన్సీలు ఒడిదుడుకులకు లోనవుతున్నా రూపాయి మాత్రం దాదాపు స్థిర స్థాయిలోనే కొనసాగింది. దీంతో కార్పొరేట్లు గణనీయంగా విదేశీ రుణాలు సమీకరించాయి. ఈ మధ్య సంగతే చూస్తే గతేడాది ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో నికరంగా 13.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు వచ్చినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. గతేడాది నవంబర్‌లో దాదాపు 2.83 బిలియన్ డాలర్ల ఈసీబీలను సమీకరించే ప్రతిపాదనలను కంపెనీలు సమరి్పంచాయి. రూపాయి విలువ పడిపోకుండా, స్థిరంగా ఉన్నన్నాళ్లూ విదేశీ రుణాల వ్యవహారం బాగానే ఉంటోంది. కానీ ఎక్కడా ఆగకుండా పడిపోతుంటేనే సమస్యాత్మకంగా మారుతోంది. ‘‘ఆర్బీఐ లెక్కలను బట్టి చూస్తే రూపాయి వేల్యుయేషన్ ఇప్పటికే అధిక స్థాయిలో ఉంది. దాని విలువ ఇంకా తగ్గాల్సి ఉంది. అమెరికా టారిఫ్‌లు విధిస్తే మరింతగా పడే అవకాశం ఉంది’’ అంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్లకు రూపాయి బాధ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభాలపైనా.. సాధారణంగా విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌ల లీజింగ్‌లు, ఇంధన కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులను డాలర్ల మారకంలో నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనంతో ఎయిర్‌లైన్స్ ఖర్చులూ పెరిగిపోయి లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు ఇండిగోను తీసుకుంటే ఇటీవలి మూడో త్రైమాసికంలో లాభం ఏకంగా 18 శాతం పడిపోయింది. రూపాయి క్షీణతతో విదేశీ టూర్లు మరింత భారంగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణాలను వాయిదా లేదా రద్దు చేసుకునే అవకాశాలు ఉండటంతో టూరిజం, హాస్పిటాలిటీ లాంటి రంగాల మీద కూడా పడొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అలాగే దిగుమతులపైన ఆధారపడిన లేక గణనీయంగా విదేశీ కరెన్సీలో రుణభారం ఉన్న రంగాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారం ఇలా.. 2020లో భారత్, అమెరికాలో వడ్డీ రేట్ల మధ్య దాదాపు అయిదు శాతం వ్యత్యాసం ఉన్న తరుణంలో రూపాయి మారకంలో కన్నా విదేశీ మారకంలో రుణాలు తీసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అవే రుణాలు ఇప్పుడు గుదిబండలుగా మారుతున్నాయి. అప్పట్లో గానీ రూ. 2,000 కోట్లు విదేశీ రుణం తీసుకుని ఉంటే పెరిగిన వడ్డీ భారంతో పాటు రూపాయి కూడా క్షీణించడం వల్ల 22 శాతం అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు డాలరు విలువ రూ. 75గా ఉన్నప్పుడు 500 మిలియన్ డాలర్లు రుణం తీసుకుని ఉంటే, దేశీ కరెన్సీ విలువ 5 శాతం క్షీణించిన పక్షంలో అదనంగా రూ. 2,500 కోట్ల భారం పడుతుందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పాబ్రి తెలిపారు. ఇలా ఒకవైపు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడిపోవడం వల్ల విదేశీ రుణాలను తీర్చడం భారంగా మారుతోంది.హెడ్జింగ్ అంతంతే..విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు రూపాయి పడిపోతే నష్టపోకుండా ఉండేందుకు, తిరిగి చెల్లించేటప్పుడు ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు కంపెనీలు హెడ్జింగ్ వ్యూహాన్ని పాటిస్తుంటాయి. సుమారు గత మూడేళ్లుగా భారీగా విదేశీ నిధులు సమీకరించినవి, సమీకరించడంపై కసరత్తు చేస్తున్న వాటిలో ఆర్ఈసీ (500 మిలియన్ డాలర్లు), టాటా మోటార్స్ ఫైనాన్స్ (200 మిలియన్ డాలర్లు), ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (125 మిలియన్ డాలర్లు), టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు (100 మిలియన్ డాలర్లు) బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైనవి ఉన్నాయి. అయితే, దేశీ కంపెనీలు తీసుకున్న ఈసీబీల్లో దాదాపు మూడో వంతు రుణాలకు హెడ్జింగ్ రక్షణ లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2023–24లో దాదాపు 38.4 బిలియన్ డాలర్ల రుణాలు రాగా ఇందులో సుమారు 11.52 బిలియన్ డాలర్ల మొత్తానికి హెడ్జింగ్ రక్షణ లేదు. ఇలా హెడ్జింగ్ చేసుకోని కంపెనీలన్నింటికీ ప్రస్తుత రూపాయి పతనం సమస్యగా మారినట్లు పేర్కొన్నాయి. ఇటీవలి ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో సమీకరించిన మొత్తం ఈసీబీల్లో 40 శాతాన్నే పెట్టుబడి వ్యయాల కోసం కంపెనీలు ఉపయోగించుకున్నాయి. అంటే మిగతా 60 శాతాన్ని ఖరీదైన ఇతరత్రా రుణాలను తీర్చేందుకు ఉపయోగించుకుని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బాబోయ్ రూపాయ్
కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం. ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే.. వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది. ఐటీ, ఫార్మా హ్యాపీస్... దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.దిగుమతులకు భారం.. చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి. రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్ చేసే స్మార్ట్ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి. విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు.. చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్ ఫీజు .. డిసెంబర్ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది. సానుకూలం→ ఎగుమతి ఆధారిత రంగాలు → ఫార్మా→ ఐటీ సర్విసులు→ జౌళి→ ఉక్కు → రెమిటెన్సులు ప్రతికూలం → విదేశీ ప్రయాణాలు → విదేశీ చదువులు→ ధరల సెగ: ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి → వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
దేశీ ఎయిర్‌లైన్స్ రికవరీకి ఏటీఎఫ్ సెగ
ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్‌గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్‌తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది. -
రూపాయి మళ్లీ పతన బాట
రూపాయి మళ్లీ పతన బాట -
రికార్డ్ స్థాయిలో రూపాయి విలువ పతనం!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో దేశీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం డాలర్‌తో పోలిస్తే మరో 18 పైసలు క్షీణించి 79.9975 వద్ద క్లోజయ్యింది. కీలక స్థాయి అయిన 80కి పైసా కన్నా తక్కువ దూరంలో నిల్చింది. టోకు ద్రవ్యోల్బణం వరుసగా 15వ నెలల జూన్‌లోనూ రెండంకెల స్థాయిలోనే కొనసాగడం, కరెంటు అకౌంటు లోటు మరింత దిగజారవచ్చన్న అంచనాలు, విదేశీ మారక నిల్వలు తగ్గనుండటం తదితర అంశాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. గడిచిన కొద్ది రోజుల్లో క్రూడాయిల్ రేట్లు తగ్గడం .. దేశీ కరెన్సీ మరింతగా పడిపోకుండా కొంత ఊతమిచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పటిష్టంగా 79.71 వద్ద ప్రారంభమైంది. కానీ యూరప్ మార్కెట్లు ప్రారంభమయ్యాక మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు ఏకంగా 24 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగియడంతో రూపాయి పడిపోయింది. క్రితం ముగింపు 79.81తో పోలిస్తే 18 పైసలు పతనమైంది. -
ఎకానమీకి ‘రూపాయి’ కష్టాలు.. సామాన్యులకు భారం..
ఒకవైపు మండిపోతున్న ముడి చమురు ధరలు, మరోవైపు తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల.. వెరసి మన రూపాయికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టాయి. ప్రధానమైన ఈ రెండింటితో పాటు ఇతరత్రా కారణాలతో దేశీ కరెన్సీ నిత్యం క్షీణిస్తోంది. కొత్త రికార్డు స్థాయిలకు పతనమవుతోంది. తాజాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఆల్–టైమ్ కనిష్ట స్థాయి 77.81కి పతనమైంది. చివరికి కొంత కోలుకుని అంతక్రితం రోజుతో పోలిస్తే 6 పైసల నష్టంతో 77.74 వద్ద క్లోజయ్యింది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 125 డాలర్ల పైన స్థిరపడితే మార్కెట్లు మరింత అతలాకుతలం కానున్నాయి. దీంతో దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం తీవ్రమైతే.. రూపాయిపై ఒత్తిడి ఇంకా పెరిగిపోతుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తదితర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మనకేంటి.. 2017 మేలో 64 రూపాయలు ఇస్తే ఒక అమెరికన్ డాలర్ లభించేది. కానీ ప్రస్తుతం అదే డాలర్‌కు 77 రూపాయలు పైగా ఇవ్వాల్సి వస్తోంది. అంటే గడిచిన అయిదేళ్లలో మన కరెన్సీ విలువ ఏకంగా రూ. 13 పైగా పడిపోయింది. డాలర్ రూపాయి పతనమైతే మనకేమిటి, పెరిగితే మనకేమిటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన రోజువారీ కొనుగోళ్లన్నీ దీని విలువతోనే ముడిపడి ఉన్నాయి. రూపాయి కాస్త తగ్గితే ఎగుమతులపరంగా ప్రయోజనకరమే అయినా దిగుమతులు మొదలుకుని పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో, ద్రవ్యోల్బణం, ఈఎంఐలు, విదేశీ విద్యలాంటి అనేకానేక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మన ఇంధన అవసరాల్లో 85 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. దీనికి డాలర్ల మారకంలో చెల్లించాలి. రూపాయి విలువ పడిపోయిందంటే మరిన్ని ఎక్కువ డాలర్లు ఇచ్చి క్రూడాయిల్ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఆయా ఉత్పత్తుల రేట్లు దేశీయంగా మరింత పెరుగుతాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం స్థాయికి ఎగిసింది. దీంతో ధరలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను అయిదు వారాల వ్యవధిలో దాదాపు 1 శాతం (0.90 శాతం) మేర పెంచింది. దీనికి తగ్గట్లుగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయడం ప్రారంభించాయి. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీలు, నెలవారీ వాయిదాల భారం మరింత పెరుగుతోంది. పెట్టుబడులపై ప్రభావం.. ఇక దేశీ కరెన్సీ క్షీణతతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటాయి. వారు తమ పెట్టుబడులను డాలర్ల రూపంలోనే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రూపాయికి డిమాండ్ మరింత పడిపోయి, కరెన్సీ ఇంకా క్షీణించే అవకాశం ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు కూడా క్షీణిస్తాయి. ఫలితంగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన దేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. భారీ స్థాయి క్రూడాయిల్ రేట్లు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో సెంట్రల్ బ్యాంకులు కఠినతర విధానాలు అమలు చేస్తుండటం, మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. విదేశీ చదువు .. ప్రయాణాలు భారం.. విదేశాల్లో విద్య కోసం, విదేశీ ప్రయాణాల కోసం ప్లానింగ్ చేసుకునే వారిపైనా రూపాయి పతన ప్రభావం పడుతుంది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 21 శాతం పైగా ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు కొన్నాళ్ల క్రితం విదేశీ విద్య కోసం రూ. 20 లక్షలు ఖర్చయితే ఇప్పుడు రూ. 24 లక్షలపైగా ఖర్చవుతుంది. ఇదే కాదు, విదేశీ ప్రయాణాలు కూడా భారం అవుతాయి. దేశీ కరెన్సీ మారకం విలువ పడిపోవడం వల్ల ఇతర దేశాల కరెన్సీలను కొనుగోలు చేసేందుకు మరిన్ని ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో విదేశీ యాత్రల కోసం మరింత ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. రూపాయి పతనం, పెరగడం ఎందుకు.. అంతర్జాతీయంగా కరెన్సీ లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా డాలర్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన యూరో ప్రామాణికంగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకుల దగ్గర ఉన్న విదేశీ కరెన్సీల్లో డాలర్ వాటా 64 శాతంగాను, యూరోల వాటా 20 శాతంగాను ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బడా ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం భారీ స్థాయిలో భారత్ వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలోను ద్రవ్యోల్బణం పెరిగిపోయి, వడ్డీ రేట్లు పెంచుతుండటంతో ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోని పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో పరిమిత స్థాయిలో లభించే డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ తగ్గుతోంది. ఇక ప్రత్యేకంగా భారత్ విషయానికొస్తే ఎగుమతులతో పోలిస్తే దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయి. క్రూడాయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటివి ఈ లిస్టులో ఉంటున్నాయి. వీటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటోంది. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉండటం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ క్రమంగా కరుగుతూ వస్తోంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ పరిణామాలతో క్రూడాయిల్ సహా పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్లుగానే వాటిని భారత్ సహా దిగుమతి చేసుకునే దేశాల్లో రేట్లు మండిపోతున్నాయి. -
గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ మార్కెట్ బుధవారం నష్టంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 13 పైసల పతనం కూడా ప్రతికూలంగా మారింది. ఫలితంగా సెన్సెక్స్ 291 పాయింట్లను కోల్పోయి 50వేల దిగువున 49,903 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లను కోల్పోయి 15,030 వద్ద స్థిరపడింది. మెటల్, ఆర్థిక, ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంక్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం లాభపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 362 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి. ఎఫ్ఐఐలు రూ.698 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.853 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి. కమోడిటీ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలు దేశీయ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అయితే క్రమంగా తగ్గుతున్న కోవిడ్ కేసులు.., మార్కెట్లో భారీ అమ్మకాలను అడ్డుకున్నాయి’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడేలో నిఫ్టీ 100 పాయింట్లు క్రాష్... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 50,089 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లను కోల్పోయి 15,059 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత రెండురోజులుగా సూచీల భారీ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 362 పాయింట్లను కోల్పోయి 49,831 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లను నష్టపోయి 15,009 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. -
నిఫ్టీ.. పల్టీ!
పన్ను వసూళ్లు బలహీనంగా ఉండటంతో మందగమనం మరింత కాలం కొనసాగుతుందనే భయాందోళనతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. రేట్ల విషయమై ఫెడరల్ రిజర్వ్ కఠినమైన వ్యాఖ్యలు చేయడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ కీలకమైన 10,800, 10,750 పాయింట్ల మద్దతు స్థాయిలను కోల్పోయింది. రోజంతా 626 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 470 పాయింట్లు పతనమై 36,093 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 10,705 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంక్, లోహ, ఆర్థిక, టెక్నాలజీ, ఫార్మా, వాహన, ఐటీ షేర్లు పతనమయ్యాయి. 10,500 పాయింట్ల దిశగా నిఫ్టీ ! ఆరంభ కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ప్రారంభంలోనే 50 పాయింట్లు పెరిగినప్పటికీ, ఆ తర్వాత 576 పాయింట్ల నష్టంతో 35,988 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిను తాకింది. రోజు మొత్తం మీద 626 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. నిఫ్టీ... తదుపరి మద్దతు స్థాయి, 10,500 పాయింట్ల దిశగా కదులుతోందని నిపుణులంటున్నారు. నిఫ్టీ 10,650 పాయింట్ల మద్దతు స్థాయి బుల్స్‌కు చివరి అశ అని ఇండియాబుల్స్ వెంచర్స్ ఎనలిస్ట్ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. పేపర్ షేర్ల రెపరెపలు వివిధ రంగాల షేర్లు పతనబాటలో ఉన్నా, పేపర్, జ్యూట్ ఉత్పత్తుల కంపెనీల షేర్లు రెపరెపలాడాయి. వచ్చే నెల 2వ తేదీ నుంచి ఒక్కసారే ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు దీనికి కారణం. మాలు పేపర్ మిల్స్, లడ్లౌ జ్యూట్ అండ్ స్పెషాల్టీస్, ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్, ఇమామి పేపర్ మిల్స్, వెస్ట్ కోస్ట్ పేపర్, స్టార్ పేపర్ మిల్స్, జేకే పేపర్, శేషసాయి పేపర్అండ్ బోర్డ్స్, షెవ్లట్ కంపెనీ షేర్లు 2–10 శాతం రేంజ్లో ఎగబాకాయి. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 15.5 శాతం నష్టంతో రూ. 54వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆల్టికో కంపెనీ చెల్లింపుల్లో విఫలం కావడంతో రియల్టీ రంగానికి అధికంగా రుణాలిచ్చిన బ్యాంక్‌లకు ప్రతికూలమని మూడీస్ సంస్థ పేర్కొంది. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు రియల్టీ రంగానికి అధికంగా రుణాలిచ్చాయని, వాటి రుణ నాణ్యత కొంత క్షీణించవచ్చని వివరించింది. మరోవైపు యస్ బ్యాంక్ ప్రమోటర్ సంస్థ, ఎమ్‌సీపీఎల్(మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్) ఎన్సీడీల రేటింగ్‌ను కేర్ సంస్థ తగ్గించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో యస్ బ్యాంక్ షేర్ ఈ రేంజ్లో పతనమైంది. ► 31 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ మినహా మిగిలిన 26 సెన్సెక్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► దాదాపు 100కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. యస్‌బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. కాఫీ డే, సీజీ పవర్, హెచ్‌డీఐఎల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► బలహీన మార్కెట్లోనూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ పుంజుకుంది. 0.6 శాతం లాభంతో రూ.1,100కు పెరిగింది. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను ఈ బ్యాంక్ రూ.1 ముఖ విలువ గల రెండు షేర్లుగా విభజించింది. రూ.1.65 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.1.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,65,438 కోట్లు తగ్గి రూ.1,38,54,439 కోట్లకు పెరిగింది. ఈ నష్టాలు ఎందుకంటే.. నిరాశపరిచిన పన్ను వసూళ్లు... ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు 17.5 శాతం పెరగగలవని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. కానీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 17వరకూ, మొదటి ఆరు నెలల్లో పన్ను వసూళ్లు 4.7 శాతం వృద్ధి మాత్రమే చెంది రూ.5.50 లక్షల కోట్లకు పెరిగాయి. డిమాండ్, వృద్ధిలకు సంబంధించిన సంక్షోభం మరింతగా విషమించిందన్నదానికి ఇంత తక్కువ వృద్ధే నిదర్శనమని నిపుణులంటున్నారు. మిగిలిన ఆరు నెలల్లో పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలను అందుకోవడం కష్టమేనని, మందగమనం మరింతగా ముదరనున్నదని వారంటున్నారు. మరోవైపు జీఎస్టీ రేట్ల తగ్గింపు ఆశలు అడియాశలయ్యాయి. దీంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్ కఠిన వైఖరి.... అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పావు శాతం మేర తగ్గించింది. 2008 తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఇది రెండో రేట్ల కోత. అయితే తదుపరి రేట్ల కోత విషయమై ఫెడ్ సానుకూల సంకేతాలు ఇవ్వలేదు. భవిష్యత్తు కోతల విషయమై అప్రమత్త విధానాన్ని అవలంభిస్తామని పేర్కొనడం మనలాంటి వర్థమాన దేశాలకు అశనిపాతమే. మరోవైపు వృద్ధికి సంబంధించి జపాన్ కేంద్ర బ్యాంక్ హెచ్చరికలు జారీ చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. కొనసాగుతున్న విదేశీ అమ్మకాలు... మందగమన భయాలతో నష్టభయం అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గురువారం రూ. 893 కోట్లుతో కలుపుకొని విదేశీ ఇన్వెస్టర్లు ఈ వారంలో మొత్తం రూ. 3,411 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. పెరిగిన చమురు ధరలు.... బుధవారం చల్లబడ్డ ముడిచమురు ధరలు గురువారం మళ్లీ భగ్గుమన్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా విషమిస్తాయనే ఆందోళనతో ఒక పీపా బ్రెంట్ చమురు ధర 2 శాతం మేర పెరిగి 64.81 డాలర్లకు పెరిగింది. రూపాయి పతనం.... డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పతనమై 71.34 వద్ద ముగిసింది. -
టెల్కోలకు రూపాయి దెబ్బ
ముంబై: తీవ్ర పోటీతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాగా రూపాయి పతనం, డీజిల్ రేట్లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి పతనం కారణంగా టెల్కోలపై రూ.4,000 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పెరిగే డీజిల్ రేట్ల మూలంగా నిర్వహణ వ్యయాలూ పెరిగి కంపెనీల లాభదాయకత మరో రూ.2,000 కోట్లు మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పైగా రుణభారంతో అల్లాడుతున్న టెల్కోలకు ఇది మరింత భారంగా మారనుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం మూలంగా టెల్కోల ఎబిటా (పన్నుకు ముందు ఆదాయం) 7–8 శాతం మేర తగ్గవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ హర్‡్ష జగ్నాని తెలిపారు. ఇక డీజిల్ అంశం కూడా తోడైతే ఇది మొత్తం పది శాతం దాకా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రూపాయి క్షీణత మూలంగా విదేశీ మారకంలో తీసుకున్న రుణాల రీపేమెంట్ మరింత పెరుగుతుందని, ఇక నెట్వర్క్ విస్తరణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వ్యయాలు కూడా పెరుగుతాయని ఆయన తెలియజేశారు. 2018 మార్చి 31 నాటికి పరిశ్రమ మొత్తం రుణ భారం రూ. 4.7 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో విదేశీ రుణం సుమారు రూ.1 లక్ష కోట్ల దాకా ఉంది. దీనిలో మళ్లీ 70 శాతం రుణాలు డాలర్ మారకంలోనే ఉన్నాయి. ఇదే టెల్కోలను కలవరపెడుతోంది. టవర్ కంపెనీలకు కూడా సెగ.. దేశీయంగా 4.7 లక్షల టెలికం టవర్లుండగా... వీటిలో సుమారు పావు శాతం టవర్లు మాత్రమే నామమాత్రపు డీజిల్ వాడకంతో నడుస్తున్నాయి. మిగతావన్నీ ప్రధానంగా డీజిల్‌పై ఆధారపడినవే. ప్రస్తుతం రేట్ల పెరుగుదల వల్ల టెలికం టవర్ సైట్ల ఇంధనాల వ్యయాలు పెరగనున్నాయి. సాధారణంగా టవర్ సైట్ల నిర్వహణకు సంబంధించి డీజిల్ వ్యయాలు పరిశ్రమకు సుమారు రూ.13,000 కోట్ల మేర ఉంటోంది. డీజిల్ రేట్లు సుమారు 15 శాతం పెరిగిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఎబిటాపై 3–4% ప్రభావం పడి... కంపెనీల ఎబిటా దాదాపు రూ. 2,000 కోట్ల మేర తగ్గనుంది. ఒకవైపు.. రిలయన్స్ జియో ప్రారంభించిన రేట్ల యుద్ధంతో భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు ఇప్పటికే నష్టాలు నమోదు చేస్తున్నాయి. ఇక దీనికి రూపాయి, డీజిల్ కూడా తోడైతే ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. డీజిల్ రేట్ల పెరుగుదల సెగ కేవలం టెలికం ఆపరేటర్లకే కాకుండా కొన్ని టవర్ కంపెనీలకు కూడా తగలనుంది. టవర్ సైటు ఇంధన వ్యయాలను కొన్ని సందర్భాల్లో టవర్ కంపెనీలు, టెల్కోలు కలిసి భరిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా టవర్ కంపెనీల నిర్వహణ వ్యయాల్లో విద్యుత్, ఇంధన వ్యయాల వాటా 30–40% ఉంటుంది. తమ ఒప్పందాలను బట్టి డీజిల్ రేట్ల పెరుగుదలలో కొంత భాగాన్నే టవర్ కంపెనీలు.. టెల్కోలకు బదలాయించగలుగుతాయి. అయితే, సౌర విద్యుత్, ఫ్యూయల్ సెల్స్ వంటి పునరుత్పాదక విద్యుత్ వనరులను వినియోగిస్తూ.. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నందున రేట్ల భారం మరీ భారీ స్థాయిలో ఉండకపోవచ్చని టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. 2011–12 లో ఒక్కో టవర్ నిర్వహణకు ఒక్కో సంస్థ రోజుకు 7.34 లీటర్ల డీజిల్ ఖర్చు పెట్టేదని, ఇది 2015–16 నాటికి 4 లీటర్లకు తగ్గిపోయిందని వివరించాయి. రూపాయికి మరింత చిల్లు డాలర్‌తో 74.39కు పతనం చమురు ధరల తాజా పెరుగుదల ప్రభావం ముంబై: రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో మరో 33 పైసలు కోల్పోయి నూతన జీవిత కాల కనిష్ట స్థాయి 74.39వద్ద ముగిసింది. అధిక చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంకులు, ఎగుమతిదారులు చేసిన డాలర్ల అమ్మకాలతో రూపాయి 18పైసలు కోలుకుని 73.88 వరకు వెళ్లింది. అయితే, బ్రెంట్ క్రూడ్ మరోసారి 84 డాలర్ల మార్కుపైకి వెళ్లడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడంతో రూపాయి యూటర్న్ తీసుకుని నష్టాలవైపు ప్రయాణించింది. సోమవారం కూడా 30 పైసల నష్టంతో రూపాయి 74.06 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. విదేశీ నిధులు భారీగా బయటకు వెళ్లిపోవడం రూపాయిపై ప్రభావం చూపించినట్టు ఫారెక్స్ ట్రేడర్ల అభిప్రాయం. దిగుమతిదారుల నుంచి డాలర్లకు బలమైన డిమాండ్, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళన, పెరిగే చమురు ధరలు కూడా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రతికూలంగా మారడంతో రూపాయి గడిచిన రెండు నెలల్లో వేగంగా బలహీనపడింది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆసియాలో ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి డాలర్‌తో ఎక్కువగా నష్టపోయింది’’ అని నోమురా తన పరిశోధన నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ నుంచి విధానపరమైన చర్యల్లేకపోవడం రూపాయిపై ఆందోళనలను పెంచినట్టు తెలిపింది. చమురు ధరల క్షీణత ఒక్కటే రూపాయి ఈ సమయంలో స్థిరపడేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 3.26 శాతానికి పెరిగింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని అమెరికా ట్రెజరీల్లో ఇన్వెస్ట్ చేస్తారన్న భయాలు ఉన్నాయి. చమురు ధరలు కూడా ఒక శాతం పెరిగి 84.7 డాలర్లకు చేరాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వీకే శర్మ తెలిపారు. -
కరుగుతున్న అమెరికా కలలు
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో డాలర్ విలువ అనూహ్యంగా పెరిగిపోవడం, రూపాయి విలువ పతనంతో అమెరికాలో భారతీయ విద్యార్థుల తిప్పలు అన్నీఇన్నీ కావు. రూపాయి పతనంతో కొందరు మోదీ పాలనపై విరుచుకుపడుతోంటే, మరికొందరు కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నారు. రాజకీయ కారణాలను పక్కన పెడితే ఆశల రెక్కలు తొడుక్కుని అమెరికాలోకి అడుగుపెడుతున్న వారిని రూపాయి పతనం కలవరపెడుతోంది. ఆరు నెలల క్రితం డాలర్ విలువ రూ.65 స్థాయి నుంచి ఈ నెలలో ఏకంగా రూ.72.54కు పడిపోవడంతో అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల అంచనాలకు, ప్రస్తుత ఖర్చులకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడుతోంది. రూపాయి విలువను బట్టే ప్రయాణాలు గతంలో అమెరికాలో వారానికి 3 మూడు రోజులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్లు సైతం ప్రస్తుతం నిద్రాహారాలు మానేసి ప్రతిరోజూ పనిచేసేందుకు పరుగులు పెడుతున్నారు. దీంతో అటు పిల్లలూ, వాళ్ళ ఖర్చులకు డబ్బులు పంపాల్సిన తల్లిదండ్రులూ తమతమ అవసరాలను కుదించుకోవడమో, లేదంటే ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలను మానుకోవడమో చేస్తున్నారు. పిల్లల ఖర్చుల కోసం త్యాగాలు రూపాయి విలువ పడిపోవడంతో విద్యా రుణాలతో అమెరికా వెళ్లిన భారతీయ యువతీయువకుల అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడి విశ్వవిద్యాలయాలకు చెల్లించాల్సిన ఫీజుల భారీగా పెరగడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ముంబైకి చెందిన ప్రఫుల్ల వేదక్ డాలర్ విలువ రూ.65గా ఉన్నప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని అమెరికాలో చదివించేందుకు బ్యాంకులోన్లూ, ఇతర ఖర్చులపై ప్రణాళిక వేసుకున్నారు. రూపాయి పతనం ప్రారంభం కావడంతో కొద్దికాలం ఎదురుచూశారు. అయినా రూపాయి విలువ పెరగకపోగా మరింత దిగజారింది. దీంతో విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సిన ఫీజుతో పాటు జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా అనుకున్న దానికంటే ఎక్కువ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పెద్దకొడుకు స్నాతకోత్సవ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్న వేదక్ దంపతులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పెరిగిన విదేశీ ఖర్చు రూపాయి విలువ పతనంతో ప్రతి సెమిస్టర్‌కు కట్టాల్సిన ఫీజు సగటున రూ.10,000 నుంచి రూ.12000కు పెరిగిపోయింది. 7–9 శాతానికి పైగా అదనపు భారం పడడంతో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన భారతీయ విద్యార్థులు ఒక్క ట్యూషన్ ఫీజు విషయంలోనే రూ.60వేల వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. జీఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్ వంటి ప్రవేశపరీక్షలకు పెడుతున్న ఖర్చు సైతం విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా వర్సిటీల దరఖాస్తుల ఖరీదు సైతం రూ.3,500 నుంచి రూ.14,500 వరకు పెరిగి విద్యార్థులకు చుక్కలు చూపుతున్నాయి. ఒకటికన్నా ఎక్కువ కాలేజీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు భారంగా మారింది. దీంతో అమెరికాను కాదని ఆస్ట్రేలియా, కెనడాల వైపు దృష్టి సారిస్తున్నారు. గుమ్మడి, సొరకాయ కూర టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 22 ఏళ్ల అంకుర్ వైశంపాయన్ మాట్లాడుతూ.. గతంలో సమయం వృధా కాకుండా ఉండేందుకు బయట తినేసే వాళ్లమనీ, ఇప్పుడు రెస్టారెంట్ల వైపు కన్నెత్తికూడా చూడటం లేదని తెలిపారు. ప్రస్తుతం తాముండే గదిలోనే అందరం కలిసి వండుకుని తింటున్నామని వెల్లడించారు. గతంలో పళ్లు, కూరగాయలపై వెచ్చించే మొత్తాన్ని తగ్గించుకుని, తక్కువ ధరలకు లభించే గుమ్మడి, సొరకాయ వంటివాటిని వారానికి మూడు రోజులు వండుకుని తింటున్నామని చెప్పారు. ఇంటి అద్దె, ఇతరత్రా ఖర్చుల సంగతి సరేసరి. -
రూపాయి @ 71
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ 71ని చేరింది. గురువారం ముగింపుతో చూస్తే ఇది 26 పైసలు(0.37%) పతనం. ఇది రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ప్రారంభంలోనే గ్యాప్‌డౌన్‌తో 70.95 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత బలహీన ధోరణిలోనే కదలాడింది. కాగా, రూపాయి పతనం ప్రభుత్వ ఆర్థిక విధానాలు ‘వైఫల్యం’గా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా... అభివృద్ధి చెందుతున్న పలు దేశాల కరెన్సీలు బలహీన పడుతుండటంతో, రూపాయి బలహీనత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం మంచిదేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇంకా అధిక విలువలోనే: ఎస్బీఐ రూపాయి ప్రస్తుత ధోరణి పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అభిప్రాయపడింది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా ఒక ప్రకటన చేస్తూ, ‘‘రూపాయి కొంచెం పతనానికే ఎవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదు. ఇంకా రూపాయి అధిక విలువలోనే ఉంది’’ అని అన్నారు. టర్కీ, అర్జెంటీనా, ఇండోనేషియా వంటి వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చిచూసినా, భారత్ కరెన్సీ ఇంకా మెరుగ్గానే ఉందని అన్నారు. 2019 మార్చి వరకూ రూపాయి 70–71 శ్రేణిలో ట్రేడవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నివేదిక పేర్కొంది. -
10 నెలల గరిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!
-
10 నెలల కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!
ముంబై: రూపాయి విలువ యుఎస్ డాలర్‌తో పోల్చితే పది నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈరోజు రూపాయి విలువ 31పైసలు పడిపోయి 62.33 రూపాయలకు తగ్గింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా యుఎస్ డాలర్‌తో రూపాయి విలువను 62.2059గా నిర్ధారించింది. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 1091పాయింట్లు పడిపోయింది. నవంబరు 28న సెన్సెక్స్ 28,694 ఉండగా, ఈరోజు 27,602 కి పడిపోయింది. గత పది సెషన్లలో నిఫ్టీ 296 పాయింట్లు పడిపోయింది. గత నెల 28న నిఫ్టీ 8588 ఉండగా, ఈరోజు 8293కు పడిపోయింది. ** -
టేపరింగ్ భయాలతో రూపాయి డౌన్
ముంబై: అమెరికాలో సహాయక ప్యాకేజీ ఉపసంహరణ (టేపరింగ్) భయాలతో దేశీ స్టాక్‌మార్కెట్ల తరహాలోనే రూపాయి మారకం విలువ కూడా గురువారం పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 36 పైసలు క్షీణించి 62.93 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) స్టాక్స్ కొనుగోళ్లు తక్కువ చేయడం, దిగుమతిదారుల (చమురు రిఫైనింగ్ సంస్థలు) నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగటం కూడా రూపాయిపై ప్రభావం చూపిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.57 కన్నా బలహీనంగా 62.85 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరికి 0.58 శాతం క్షీణతతో 62.93 వద్ద ముగిసింది. అమెరికాలో రిటైల్ అమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉండటం డాలర్ బలపడేందుకు తోడ్పడిందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు. -
మరింత పతనమైన రూపాయి