పన్ను వసూళ్లు బలహీనంగా ఉండటంతో మందగమనం మరింత కాలం కొనసాగుతుందనే భయాందోళనతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. రేట్ల విషయమై ఫెడరల్ రిజర్వ్ కఠినమైన వ్యాఖ్యలు చేయడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ కీలకమైన 10,800, 10,750 పాయింట్ల మద్దతు స్థాయిలను కోల్పోయింది. రోజంతా 626 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 470 పాయింట్లు పతనమై 36,093 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 10,705 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంక్, లోహ, ఆర్థిక, టెక్నాలజీ, ఫార్మా, వాహన, ఐటీ షేర్లు పతనమయ్యాయి.
10,500 పాయింట్ల దిశగా నిఫ్టీ !
ఆరంభ కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ప్రారంభంలోనే 50 పాయింట్లు పెరిగినప్పటికీ, ఆ తర్వాత 576 పాయింట్ల నష్టంతో 35,988 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిను తాకింది. రోజు మొత్తం మీద 626 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. నిఫ్టీ... తదుపరి మద్దతు స్థాయి, 10,500 పాయింట్ల దిశగా కదులుతోందని నిపుణులంటున్నారు. నిఫ్టీ 10,650 పాయింట్ల మద్దతు స్థాయి బుల్స్‌కు చివరి అశ అని ఇండియాబుల్స్ వెంచర్స్ ఎనలిస్ట్ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి.
పేపర్ షేర్ల రెపరెపలు
వివిధ రంగాల షేర్లు పతనబాటలో ఉన్నా, పేపర్, జ్యూట్ ఉత్పత్తుల కంపెనీల షేర్లు రెపరెపలాడాయి. వచ్చే నెల 2వ తేదీ నుంచి ఒక్కసారే ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు దీనికి కారణం. మాలు పేపర్ మిల్స్, లడ్‌లౌ జ్యూట్ అండ్ స్పెషాల్టీస్, ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్, ఇమామి పేపర్ మిల్స్, వెస్ట్ కోస్ట్ పేపర్, స్టార్ పేపర్ మిల్స్, జేకే పేపర్, శేషసాయి పేపర్‌అండ్ బోర్డ్స్, షెవ్‌లట్ కంపెనీ షేర్లు 2–10 శాతం రేంజ్‌లో ఎగబాకాయి.
మరిన్ని విశేషాలు...
► యస్ బ్యాంక్ షేర్ 15.5 శాతం నష్టంతో రూ. 54వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆల్టికో కంపెనీ చెల్లింపుల్లో విఫలం కావడంతో రియల్టీ రంగానికి అధికంగా రుణాలిచ్చిన బ్యాంక్‌లకు ప్రతికూలమని మూడీస్ సంస్థ పేర్కొంది. యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు రియల్టీ రంగానికి అధికంగా రుణాలిచ్చాయని, వాటి రుణ నాణ్యత కొంత క్షీణించవచ్చని వివరించింది. మరోవైపు యస్ బ్యాంక్ ప్రమోటర్ సంస్థ, ఎమ్‌సీపీఎల్(మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్) ఎన్‌సీడీల రేటింగ్‌ను కేర్ సంస్థ తగ్గించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో యస్ బ్యాంక్ షేర్ ఈ రేంజ్‌లో పతనమైంది.
► 31 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ మినహా మిగిలిన 26 సెన్సెక్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
► దాదాపు 100కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. యస్‌బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. కాఫీ డే, సీజీ పవర్, హెచ్‌డీఐఎల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► బలహీన మార్కెట్‌లోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ పుంజుకుంది. 0.6 శాతం లాభంతో రూ.1,100కు పెరిగింది. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను ఈ బ్యాంక్ రూ.1 ముఖ విలువ గల రెండు షేర్లుగా విభజించింది.
రూ.1.65 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.1.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,65,438 కోట్లు తగ్గి రూ.1,38,54,439 కోట్లకు పెరిగింది.
ఈ నష్టాలు ఎందుకంటే..
నిరాశపరిచిన పన్ను వసూళ్లు...
ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు 17.5 శాతం పెరగగలవని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. కానీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 17వరకూ, మొదటి ఆరు నెలల్లో పన్ను వసూళ్లు 4.7 శాతం వృద్ధి మాత్రమే చెంది రూ.5.50 లక్షల కోట్లకు పెరిగాయి. డిమాండ్, వృద్ధిలకు సంబంధించిన సంక్షోభం మరింతగా విషమించిందన్నదానికి ఇంత తక్కువ వృద్ధే నిదర్శనమని నిపుణులంటున్నారు. మిగిలిన ఆరు నెలల్లో పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలను అందుకోవడం కష్టమేనని, మందగమనం మరింతగా ముదరనున్నదని వారంటున్నారు. మరోవైపు జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ఆశలు అడియాశలయ్యాయి. దీంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఫెడ్ కఠిన వైఖరి....
అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పావు శాతం మేర తగ్గించింది. 2008 తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఇది రెండో రేట్ల కోత. అయితే తదుపరి రేట్ల కోత విషయమై ఫెడ్ సానుకూల సంకేతాలు ఇవ్వలేదు. భవిష్యత్తు కోతల విషయమై అప్రమత్త విధానాన్ని అవలంభిస్తామని పేర్కొనడం మనలాంటి వర్థమాన దేశాలకు అశనిపాతమే. మరోవైపు వృద్ధికి సంబంధించి జపాన్ కేంద్ర బ్యాంక్ హెచ్చరికలు జారీ చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది.
కొనసాగుతున్న విదేశీ అమ్మకాలు...
మందగమన భయాలతో నష్టభయం అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గురువారం రూ. 893 కోట్లుతో కలుపుకొని విదేశీ ఇన్వెస్టర్లు ఈ వారంలో మొత్తం రూ. 3,411 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
పెరిగిన చమురు ధరలు....
బుధవారం చల్లబడ్డ ముడిచమురు ధరలు గురువారం మళ్లీ భగ్గుమన్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా విషమిస్తాయనే ఆందోళనతో ఒక పీపా బ్రెంట్ చమురు ధర 2 శాతం మేర పెరిగి 64.81 డాలర్లకు పెరిగింది.
రూపాయి పతనం....
డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పతనమై 71.34 వద్ద ముగిసింది.
నిఫ్టీ.. పల్టీ!
Published Fri, Sep 20 2019 5:31 AM | Last Updated on Fri, Sep 20 2019 5:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment