Heavy losses
-
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్‌కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్‌లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రికార్డు గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్( –1%), భారతీ ఎయిర్టెల్(–2%), ఎల్అండ్టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. వారాంతాపు రోజున సెన్సెక్స్ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది. ∗ సెన్సెక్స్ ఒకశాతం పతనంతో బీఎస్ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
20 వేలమందిని బఖ్‌ముత్‌లో కోల్పోయాం
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని బఖ్ముత్ నగరంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రైవేట్ సైన్యమైన ‘వాగ్నర్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ సేనలతో జరిగిన పోరాటంలో 20,000 మందికిపైగా సైనికులను కోల్పోయామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ప్రభుత్వం ఖైదీలకు, వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నవారికి కొంత శిక్షణ ఇచ్చి, ప్రైవేట్ సైన్యంగా మార్చి, ఉక్రెయిన్‌లో యుద్ధ రంగానికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. బఖ్‌ముత్‌లో గత తొమ్మిది నెలలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధంలో ఉక్రెయిన్ జవాన్లు ఎంతమంది మరణించారన్నది తెలియరాలేదు. దీనిపై ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది వేల మందికిపైగానే ఉక్రెయిన్ సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఫ్యూచర్ సప్లైకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 624 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించిన రుణ నష్టం ప్రధానంగా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్.. దివాలా చట్ట చర్యలను ఎదుర్కొంటోంది. కాగా.. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో ఫ్యూచర్ సప్లై కేవలం రూ. 19 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇక మొత్తం ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 134 కోట్లకు పరిమితమైంది. 2020–21 క్యూ4లో ఫ్యూచర్ సప్లై రూ. 150 కోట్ల ఆదాయం సాధించింది. బోర్డులో ఖాళీల కారణంగా సమావేశాన్ని నిర్వహించలేకపోవడంతో క్యూ4 ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు కంపెనీ తెలియజేసింది. ఈ బాటలో గ్రూప్‌లోని పలు కంపెనీల క్యూ4 ఫలితాలు సైతం ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 28.5 వద్ద ముగిసింది. -
సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టాలు
టోక్యో: అంతర్జాతీయంగా పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోవడంతో జపాన్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం భారీగా నష్టాలు చవి చూసింది. ఏకంగా 1.7 లక్షల కోట్ల యెన్ల (దాదాపు 13 బిలియన్ డాలర్లు) నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ 4.9 లక్షల కోట్ల యెన్ల లాభాలు ఆర్జించింది. తాజా సమీక్షాకాలంలో అమ్మకాలు 10.5 శాతం పెరిగి 6.2 లక్షల కోట్ల యెన్లకు చేరాయి. కంపెనీ పోర్ట్‌ఫోలియోకు ప్రత్యక్షంగా ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన ఇంధన ధరలు మొదలైనవన్నీ కొంత కాలం పాటు తమ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇక నుంచి తమ పెట్టుబడులపై మరింత అదుపు తెచ్చుకోవడంతో పాటు కొంత రక్షణాత్మకంగా వ్యవహరించనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్ తెలిపారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు యాహూ వెబ్ సర్వీసెస్, చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా, వాహన సేవల సంస్థ డీడీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు ఉన్నాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, ట్విటర్‌ను ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్లగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
నష్టాల ఊబిలో ఏవియేషన్
ముంబై: విమానయాన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనూ భారీ నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రూ.25,000–26,000 కోట్ల మేర నష్టాలను నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జెట్ ఇంధన ధరలు (ఏటీఎఫ్) పెరిగిపోవడం, టికెట్ చార్జీలపై పరిమితులు కంపెనీలకు ప్రతికూల అంశాలుగా తెలిపింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నష్టాలు రూ.14,000–16,000 కోట్లకు తగ్గుతాయని అంచనా వేసింది. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిశ్రమకు అదనంగా రూ.20,000–22,000 కోట్ల వరకు నిధుల అవసరం ఉంటుందని తెలిపింది. పెరిగిన రద్దీ దేశీయ ప్రయాణికుల రద్దీ వార్షికంగా చూస్తే 2021–22లో 50–55 శాతం మేర వృద్ధి చెందుతుందని ఇక్రా పేర్కొంది. టీకాలు ఎక్కువ మందికి ఇవ్వడం, ఆంక్షలు సడలిపోవడం అనుకూలించే అంశాలని తెలిపింది. అయినప్పటికీ కరోనా ముందస్తు గణాంకాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2023–24 సంవత్సరంలోనే కరోనా ముందున్న స్థాయికి విమాన ప్రయాణికుల రద్దీ చేరుకుంటుందని పేర్కొంది. కరోనా రెండో విడత తీవ్రంగా ఉండడం, ఆ వెంటే ఒమిక్రాన్ వెలుగు చూడడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదల నిదానంగా ఉన్నట్టు వివరించింది. వ్యయాల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఏటీఎఫ్ సగటు ధరలను పరిశీలించినప్పుడు, గతేడాదితో పోలిస్తే 68 శాతం పెరిగాయని.. అదే సమయంలో టికెట్ చార్జీలపై పరిమితులు నష్టాలకు దారితీస్తున్నట్టు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు త్వరలో అనుమతిస్తుండడం, ఒమిక్రాన్ తగ్గిపోవడంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో ప్రయాణికుల రద్దీ పుంజుకుంటుందని ఇక్రా తెలిపింది. ఎయిర్‌లైన్స్ రుణ భారం తక్కువగా ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నికర నష్టాలు తగ్గేందుకు సాయపడుతుందని పేర్కొంది. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో 2022–23 సంవత్సరంలో ఏటీఎఫ్ కోసం ఎయిర్‌లైన్స్ అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా విక్రయానికి ముందు రుణ భారం గణనీయంగా తగ్గించుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత ఏవియేషన్ పరిశ్రమపై నెగెటివ్ అవుట్‌లుక్ (ప్రతికూల దృక్పథం)ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. పనితీరును మెరుగుపరుచుకోవడం, రుణభారాన్ని తగ్గించుకునే వరకు భారత ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిళ్లు కొనసాగుతాయని తెలిపింది. -
మూడోరోజూ అమ్మకాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇంధన, ఐటీ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 531 పాయింట్లను కోల్పోయి 48,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమైన 14,238 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు. ఈ మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1444 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 407 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు సిక్కిం సరిహద్దుల్లో భారత్– చైనా సైనిక బలగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల ఒకశాతం పతనంతో రూ.2.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.192.3 లక్షల కోట్లకు దిగివచ్చింది. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.765 కోట్ల షేర్లన విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (మంగళవారం) మార్కెట్లకు సెలవు. ఇంట్రాడేలో 988 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్..! ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల పరిణామాలతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో కొంత షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 385 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న అంతర్గత బలహీనతలు సూచీల లాభాలకు అడ్డువేశాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. నేడు మార్కెట్‌కు సెలవు, ఎల్లుండి జనవరి ఎఫ్అండ్ఓ ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. చివరి అరగంటలో అమ్మకాల తీవ్రత మరింత పెరగడంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి(49,263) 988 పాయింట్లను కోల్పోయి 48,275 వద్దకు వచ్చింది. నిఫ్టీ సైతం డే హై(14,491) నుంచి 274 పాయింట్లు నష్టపోయి 14,491 స్థాయిని తాకింది. రిలయన్స్‌ను అధిగమించిన టీసీఎస్ రిలయన్స్ షేరు పతనం టీసీఎస్ కంపెనీకి కలిసొచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్‌ను అధిగమించి టీసీఎస్ దేశంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ.3,345 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకి చివరికి 0.36% స్వల్ప నష్టంతో రూ.3,291 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 12.34 లక్షల కోట్లకు చేరింది. ఇక 5.36% పతనమైన రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12.29 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఒక్కరోజులో ముకేశ్ అంబానీకి రూ. 38వేల కోట్ల నష్టం రిలయన్స్ షేరు భారీ పతనంతో ఈ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే రూ.38 వేల కోట్ల సంపదను కోల్పోయారు. రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లు మెప్పించలేకపోయాయి. దీంతో షేరు ఇంట్రాడేలో 5.71% నష్టపోయి రూ.1932 స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఫలితంగా కంపెనీలో సగానికి పైగా వాటా కలిగిన ముకేశ్ ఏకంగా రూ.38 వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలినియర్ ఇండెక్స్‌లో అంబానీ 11వ స్థానం నుంచి 12వ స్థానానికి తగ్గింది. -
మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, మన మార్కెట్ మాత్రం నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో మొదలై, నష్టాల్లోకి జారిపోయి, భారీ నష్టాల నుంచి ఒకింత రికవరీ అయ్యాయి. ఇంట్రాడేలో 406 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 66 పాయింట్ల నష్టంతో 37,668 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 11,132 పాయింట్ల వద్దకు చేరింది. స్టాక్ సూచీల నష్టాలు వరుసగా ఐదో రోజూ కొనసాగాయి. మార్చి 2వ తేదీ తర్వాత స్టాక్ సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం ఇదే మొదటిసారి. యూరప్‌లో కరోనా కేసులు మరింతగా పెరుగుతుండటం, ఆర్థిక రికవరీపై సంశయాలు కొనసాగుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. సరిహద్దు స్థావరాల వద్దకు అదనపు బలగాలను పంపించకూడదని, వీలైనంత త్వరలో మళ్లీ చర్చలు జరపాలని భారత్, చైనాలు ఒక అంగీకారానికి రావడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. టెలికం, ఆర్థిక రంగ షేర్లు పతనమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం 1 పైసా పెరిగి 73.57 వద్దకు చేరింది. డేటా, స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లతో కూడిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను రిలయన్స్ జియో ప్రకటించిన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్ 8 శాతం నష్టంతో రూ.434 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఇక వొడాఫోన్ ఐడియా షేర్ 10%నష్టంతో రూ.9.22 వద్ద ముగిసింది. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు చేరాయి. హెచ్డీఎఫ్సీ 5000 కోట్ల సమీకరణ: భారత ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్‌పై బాండ్లను జారీ చేయనున్నట్లు బుధవారం తెలిపింది. -
ఆగని విలయం!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ల రేట్లను దాదాపు సున్నా స్థాయికి తగ్గించినప్పటికీ, భారత్‌తో పాటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ పతనబాటలోనే సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే రెండో అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. 2,713 పాయింట్లు క్షీణించి 31,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 758 పాయింట్లు పతనమై 9,197 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 7.96 శాతం, నిఫ్టీ 7.61 శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ మూడేళ్లు, సెన్సెక్స్ రెండున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆరంభం నుంచి అదే వరుస.... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టంతో 33,103 పాయింట్ల వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 9,588 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,827 పాయింట్లు, నిఫ్టీ 790 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ నెల 12న సెన్సెక్స్ 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం. సోమవారం రెండో అతి పెద్ద పతనం నమోదైంది. వారం వ్యవధిలో స్టాక్ సూచీలు ఇలా భారీ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం విరామం అనంతరం స్టాక్ మార్కెట్లో నష్టాలు మళ్లీ కొనసాగాయి. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని రంగాల షేర్లు భారీగా పతనమైనప్పటికీ, యస్ బ్యాంక్ షేర్ మాత్రం 45% ఎగసి రూ.37కు చేరింది. యస్ బ్యాంక్‌లో వివిధ బ్యాంక్‌లు రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుండటం, నగదు విత్‌డ్రాయల్ పరిమితులను మరో 2 రోజుల్లో తొలగించనుండటం సానుకూల ప్రభావం చూపాయి. రూ.7.6 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.62 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.121.63 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... కోవిడ్–19 వైరస్ కల్లోలం.... కోవిడ్–19 వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతోంది. సోమవారం తాజాగా 9 కొత్త దేశాలకు పాకింది. మరోవైపు ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసుల సంఖ్య 110కు, మరణాలు రెండుకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 6,500 మందికి పైగా మరణించారు. గణాంకాలతో గజగజ.... చైనా తయారీ రంగ, రిటైల్ అమ్మకాల గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. చైనా తయారీ రంగ సూచీ 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. రిటైల్ అమ్మకాలు కూడా బారీగా తగ్గాయి. కోవిడ్–19 వైరస్ కల్లోలం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే భయాలను ఈ గణాంకాలు మరింతగా పెంచాయి. ప్రపంచ మార్కెట్ల పతనం..... ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోవడం, యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 8 శాతం పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు మరింత పతనం.... ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వినియోగం తగ్గి, డిమాండ్ కూడా తగ్గగలదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు 10 శాతం మేర దిగివచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు @ 0 ఫెడ్ మరో అనూహ్య కోత వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ రెండు వారాల్లోనే రెండోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. అదీ ఏకంగా 1 శాతం తగ్గించేసింది. వెరసి ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు సున్నా (0–0.25 శాతం) స్థాయికి చేరింది. రెండు వారాల్లోనే రేటును ఫెడ్ ఏకంగా 1.5 శాతం తగ్గించడం గమనార్హం. నిజానికి ఈ నెల 17, 18 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని నిర్వహించవలసి ఉంది. అయితే కోవిడ్–19 సృష్టిస్తున్న విలయం కారణంగా రెండు వారాల క్రితం తొలిసారి అత్యవసర ప్రాతిపదికన 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున) వడ్డీ రేట్లను సున్నా స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 700 బిలియన్ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు బాండ్లను కొనుగోలు చేయనుంది. తాజా రేటు కోత నేపథ్యాన్ని పరిశీలిస్తే, కరోనా వైరస్‌తో ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్–19 వైరస్ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థసైతం తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2008 తదుపరి... 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీసిన సబ్‌ప్రైమ్ సంక్షోభ సమయంలో వృద్ధికి ఊతం అందించడానికి అమెరికా ఫెడ్ ఫండ్ రేటును సున్నా స్థాయికి తగ్గించడం జరిగింది. తరువాత కొన్ని సానుకూల ఆర్థిక అంశాలతో ఈ రేటు 2.5 శాతం వరకూ పెరుగుతూ వచ్చింది. అటు తర్వాత గడచిన సంవత్సర కాలంలో వేగంగా తిరిగి సున్నా స్థాయికి చేరింది. తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లలో భారీ కోతలను చేపట్టడంతోపాటు.. బ్యాంకులు నగదు నిల్వలను వినియోగించుకునేందుకు వీలుగా రిజర్వ్ రిక్వైర్మెంట్స్ నిబంధనలు సడలించింది. అధ్యక్షుని ప్రశంసలు... మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ నిర్ణయాలను ప్రశంసించారు. ఫెడ్ చర్యలను ఊహించలేదని..ఇదెంతో సంతోషకర విషయమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కినట్లు విశ్వసించేవరకూ కనీస వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో ఇటీవల ఫెడ్ 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. 500 బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసే చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే. అనుసరించనున్న ఆర్బీఐ! మరోవైపు భారత్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) బాటలో నిలు స్తుందన్న సంకేతాలను ఇచ్చారు గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కరోనా ప్రభావం నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడటానికి ఆర్బీఐ వద్ద తగిన విధానపరమైన సాధనాలు ఉన్నాయి’’ అన్నారు. ఏప్రిల్ 3న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు కోత నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘‘ప్రస్తుత చట్టం ప్రకారం, రేట్ కోత నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ తీసుకుంటుంది. రేటు కోత నిర్ణయాన్ని తోసిపుచ్చలేను. పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటామని దాస్ పేర్కొ న్నారు. కోవిడ్ ఆందోళనలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. రూపాయి, క్రూడ్ క్రాష్ ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతన ధోరణి కొనసాగుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 50 పైసలు పడిపోయి 74.25 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న కోవిడ్–19 భయాలు, ప్రపంచాభివృద్ధిపై దీని ప్రభావం, రేటు కోతతో వృద్ధికి ఊతం ఇవ్వాలని భావించిన అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నిర్ణయం... వెరసి మాంద్యం భయాలు భారత్ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీ భారీ నష్టాలూ ఇక్కడ గమనార్హం. శుక్రవారం రూపాయి ముగింపు 73.75. ట్రేడింగ్ మొత్తంమీద 74.09 గరిష్ట–74.35 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర గురించి చూస్తే ఈ నెల 12, 13తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్, బంగారం ‘బేర్’ మరోవైపు ఈక్విటీ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్లూ కరోనా కాటుకు బలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్ క్రూడ్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం 10.35కు 8.35 శాతం నష్టంలో (2.68 డాలర్లు) 29.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 28.52 డాలర్లనూ చూసింది. బ్రెంట్ బ్యారల్ ధర ఇదే సమయానికి 11.73 శాతం నష్టంతో 29.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 29.55 డాలర్లనూ చూసింది. ఇక పసిడి విషయానికి వస్తే, ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్ల నష్టంతో 1,512 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ యల్లో మెటల్ ధర 1,451 డాలర్లనూ చూడ్డం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దేశీయంగా రూ.40,000 లోపునకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తరాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500కుపైగా నష్టంతో రూ.39,775 వద్ద ట్రేడవుతోంది. ఎస్బీఐ కార్డ్స్‌కు కరోనా సెగ ఎస్బీఐ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్‌పై కోవిడ్–19 వైరస్ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, ఆమోదం తెలిపింది. 13 శాతం నష్టంతో లిస్టింగ్..... ఇష్యూ ధర, రూ.755తో పోల్చితే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ బీఎస్ఈలో 13 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. ఈ షేర్‌కు ఇదే ఇంట్రాడే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఇష్యూ ధర, రూ.755కు ఎగసినప్పటికీ, చివరకు 9.5 శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 41.6 లక్షలు, ఎన్ఎస్ఈలో 6.08 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.57,199 కోట్లకు చేరింది. ఈ నెలలోనే వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 22 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10.000 కోట్ల మేర నిధులు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం.. పేలవంగా లిస్టింగ్ 10% నష్టంతో రూ. 683 వద్ద ముగింపు ఐపీఓలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు) 4.27 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర రూ.755తో పోల్చితే ఈ షేర్ బీఎస్ఈలో రూ.72 నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌కు రూ.72 నష్టం పరంగా చూస్తే, మొత్తం రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం వచ్చింది. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు రూ.174 కోట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రూ.132 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరిన్ని విశేషాలు.... సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 17.5 శాతం క్షీణించి రూ.663 వద్ద ముగిసింది సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. టాటా స్టీల్ 11 శాతం, హెచ్డీఎఫ్సీ 11 శాతం, యాక్సిస్ బ్యాంక్ 10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 10% మేర నష్టపోయాయి. ► యస్ బ్యాంక్ తరహానే త్వరలోనే సంక్షోభంలోకి జారిపోగలదన్న భయాలు చెలరేగడంతో ఆర్బీఎల్ బ్యాంక్ 21% నష్టపోయి రూ.163 వద్ద ముగిసింది. ► వివిధ రాష్ట్రాల్లో సినిమా హాళ్లను ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో మల్టీప్లెక్స్‌లను నిర్వహించే పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు 19 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బంధన్ బ్యాంక్, పీవీఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఇక్రా, పిరామల్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఈ జాబితా కొన్ని. ► 600కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్, ఐఆర్సీటీసీ, ఆఫిల్ ఇండియా, సువెన్ ఫార్మా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అదానీ గ్రీన్ ఎనర్జీ, డీహెచ్ఎఫ్ఎల్, వెల్స్పన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సెన్సెక్స్ 2,700 పాయింట్ల నష్టంలో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్ల వాటాయే దాదాపు నాలుగో వంతుగా ఉంది. ఈ రెండు షేర్లు కలిసి 660 పాయింట్ల మేర సెన్సెక్స్‌కు పడగొట్టాయి. సెన్సెక్స్‌ను....రిలయన్స్ ఇండస్ట్రీస్ 276 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 271 పాయింట్లు, ఇన్ఫోసిస్ 211 పాయింట్ల మేర నష్టపరిచాయి. ఫెడ్ తగ్గించినా... నష్టకష్టాలే! అమెరికా ఫెడరల్ రిజర్వ్ అత్యవసర చర్యల్లో భాగంగా ఆదివారం ఫండ్స్ రేట్‌ను దాదాపు సున్నా స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫండ్స్ రేటు 0–0.25 శాతం రేంజ్లో ఉంది. ఈ రేట్ల ఆధారంగానే బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. అంతే కాకుండా 70,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఒక్క వారంలో ఫండ్స్ రేట్లను ఫెడరల్ రిజర్వ్ తగ్గించడం ఇది రెండోసారి. 2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభం నెలకొన్నప్పుడు కూడా ఇలానే ఫెడ్ రేట్లను తగ్గించింది. సాధారణ పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను తగ్గిస్తే, అదీ సున్నా స్థాయికి వస్తే, ప్రపంచ మార్కెట్లు లాభాలతో ఊగిపోయేవి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయింది. ఆర్థిక సంక్షోభం అంచనాలను మించి ఉంటుందని, ఫెడ్ రేట్లను తగ్గించడం దీనికి సంకేతమన్న భావనతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. పార్క్ హోటల్స్ ఐపీఓ @ రూ.1,000 కోట్లు... పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, జైపూర్, జోధ్‌పూర్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ద పార్క్ బ్రాండ్ హోటళ్లను నిర్వహిస్తోంది. ఐపీఓలు వాయిదా...: కోవిడ్–19 వైరస్ ధాటికి స్టాక్ మార్కెట్ విలవిలలాడుతుండటంతో పలు కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. ఈ నెల 4నే మొదలైనా, ఐపీఓను ఈ నెల 16 వరకూ పొడిగించినప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కంపెనీ తన ఐపీఓను ఉపసంహరించుకుంది. కాగా బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ తన ఐపీఓను వాయిదా వేసుకుందని సమాచారం. ఈ నెలాఖరులో ఐపీఓకు వచ్చి రూ.400 కోట్లు సమీకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. జీడీపీకి కరోనా కాటు! వృద్ధి 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండొచ్చన్న దానిపై రేటింగ్ ఏజెన్సీ కేర్ 150 మంది సీఈవోలు, సీఎఫ్‌వోలు, ఇన్వెస్టర్లు, అనలిస్టులు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వైరస్ ఎక్కువ కాలం పాటు ఉంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జీడీపీ అరశాతం వరకు తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడితే, 22 శాతం మంది అయితే ఒక శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేశారు. రేట్ల కోతతో కీడే ఎక్కువ వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు రేట్లను తగ్గించడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. కోవిడ్ వైరస్ ఆర్థికంగా చూపించే ప్రభావం అంచనాల కంటే అధికంగానే ఉండగలదన్న సంకేతాలను కేంద్ర బ్యాంక్‌ల రేట్ల తగ్గింపు సూచిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ పతనం కొనసాగే అవకాశాలే అధికం దేశీయంగా కోవిడ్–19 వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇది ఎక్కడ దాకా చేరుతుందో అంతూ, దరీ తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఈ పతనం కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్. -
+786 నుంచి –511 వరకూ...
సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించింది. స్టాక్ మార్కెట్ భారీగా లాభపడి, చివరి అరగంటలో ఈ లాభాలన్నింటినీ కోల్పోయి భారీగా నష్టపోయి, మళ్లీ ఈ నష్టాల్లో మూడో వంతు వరకూ రికవరీ చేసుకొని ఓ మోస్తరు నష్టాల్లో ముగిసింది. వేల్యూ బయింగ్‌కు తోడు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. ముడి చమురు ధరలు 2.2 శాతం తగ్గడం, కుంటుపడుతున్న అంతర్జాతీయ వృద్ధిని గాడిన పడేయడానికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు రేట్లను తగ్గిస్తాయని, ఉద్దీపన చర్యలు తీసుకుంటాయనే అంచనాలు...సానుకూల ప్రభావం చూపాయి. అయితే చివరి అరగంటలో సీన్ మారిపోయింది. భారత్‌లో తాజాగా రెండు కోవిడ్–19(కరోనా) వైరస్ కేసులు వెలుగుచూడటంతో ఈ లాభాలన్నీ ఆవిరయ్యాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 153 పాయింట్లు పతనమై 38,144 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పతనమై 11,133 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు ఏడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఆర్థిక, ఉక్కు, ఎఫ్ఎమ్సీజీ షేర్లు భారీగా పడ్డాయి. ఐటీ, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. 1,297 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.. గత ఆరు రోజుల నష్టాల కారణంగా తీవ్రంగా పతనమై ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు (వేల్యూ బయింగ్)జోరుగా జరిగాయి. కోవిడ్–19(కరోనా) వైరస్ ధాటికి విలవిలలాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు తీసుకోగలవన్న అంచనాలు, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు సానుకూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడేలో 786 పాయింట్ల లాభంతో 39,083 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ కూడా 231 పాయింట్ల లాభంతో 11,433 పాయింట్లకు పెరిగింది. అయితే భారత్‌లో తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించడంతో సూచీలు కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 511 పాయింట్ల నష్టంతో 37,786 పాయింట్లకు, నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 11,036 పాయింట్లను తాకాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,297 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్టానికి ఎగసిన భారత తయారీ రంగ వృద్ధి ఫిబ్రవరిలో ఒకింత మందగించినా ఆరంభంలో కొనుగోళ్లు జోరుగానే సాగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ 5.1 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో సూచీలు చెప్పుకోదగ్గ లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు మిశ్రమంగా ముగిశాయి. ► ఎస్బీఐ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఆరంభమైన నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 5% నష్టంతో రూ.287 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంలో మూడో వంతు వాటా (55 పాయింట్లు) ఈ షేర్‌దే. ► 400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, గెయిల్ ఇండియా, హీరో మోటోకార్ప్, హిందాల్కో, హిందుస్తాన్ జింక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యారికో, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వేదాంత, ఏసీసీ, అపోలో టైర్స్, ఆశోక బిల్డ్‌కాన్, జిల్లెట్ ఇండియా, థెర్మాక్స్, లుపిన్, రేమండ్, భెల్, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, టాటా పవర్, విప్రో తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఫిబ్రవరిలో వాహన అమ్మకాలు పుంజుకోవడంతో ఎస్కార్ట్స్ షేర్ 8 శాతం లాభంతో రూ.843 వద్ద ముగిసింది. ► నేడు(మంగళవారం) బోర్డ్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో మిధాని షేర్ ఇంట్రాడేలో 13 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.278ను తాకింది. చివరకు 3 శాతం నష్టంతో రూ.238 వద్ద ముగిసింది. ఈ సమావేశంలో కంపెనీ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. పుల్‌బ్యాక్ ర్యాలీకి బ్రేక్! గత ఆరు రోజులుగా 7 శాతం మేర నష్టపోయిన మార్కెట్లో ఈ వారం పుల్‌బ్యాక్ ర్యాలీ ఉండొచ్చని అంచనాలున్నాయని షేర్‌ఖాన్ బై బీఎన్పీ పారిబా అనలిస్ట్ గౌరవ్ దువా పేర్కొన్నారు. ఈ అంచనాలకనుగుణంగానే పుల్‌బ్యాక్ ర్యాలీ వచ్చినప్పటికీ, కొత్తగా నమోదైన కరోనా కేసులు ఈ పుల్‌బ్యాక్ ర్యాలీని ఆరంభంలోనే నిలువరించాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్లో పతనం తప్పలేదని వివరించారు. ఏడు రోజుల నష్టాల కారణంగా రూ.13 లక్షల కోట్లు మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్‌రూ.13 లక్షల కోట్లు తగ్గి రూ.145.80 లక్షల కోట్లకు పడిపోయింది. -
లాభాల స్వీకరణతో మార్కెట్ పతనం
సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, ముడి చమురు ధరలు భగ్గుమనడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 41,550 పాయింట్లు, నిఫ్టీ 12,250 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభపడినా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి 71.13కు చేరడం (ఇంట్రాడే) ప్రతికూల ప్రభావం చూపాయి. ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ లాభాలన్నింటినీ కోల్పోయి చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్416 పాయింట్లు పతనమై 41,529 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 12,225 పాయింట్ల వద్ద ముగిశాయి. 771 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్: ఆసియా మార్కెట్ల జోరుతో, ఆరంభ కొనుగోళ్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. వెంటనే జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ హైలకు ఎగిశాయి. ఒక దశలో 329 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరో దశలో 442 పాయింట్లు పతనమైంది. రోజంతా 771 పాయింట్ల రేంజ్లో కదిలింది. హాంకాంగ్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శ్రీ భజరంగ్ పవర్ ఐపీఓకు సెబీ ఓకే శ్రీ భజరంగ్ పవర్ కంపెనీ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనున్నది. ఈ నెల 24 నుంచి ఐటీఐ ఎఫ్‌పీఓ ప్రభుత్వ రంగ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(ఐటీఐ) కంపెనీ ఎఫ్‌పీఓ(ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 24 నుంచి మొదలు కానున్నది. ఈ నెల 28న ముగిసే ఈ ఎఫ్‌పీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,600 కోట్లు సమీకరించనున్నది. ప్రైస్‌బ్యాండ్‌ను రేపు(ఈ నెల 22–బుధవారం) వెల్లడించనున్నది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. బీఎస్ఈలో షేర్ స్వల్పంగా నష్టపోయి రూ.103 వద్ద ముగిసింది. -
వీడియోకాన్ నష్టాలు రూ.6,761 కోట్లు
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ నడుస్తున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను ప్రకటించింది. మార్చి, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.6,761 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సంస్థ తెలిపింది. ఆదాయం భారీగా తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.5,264 కోట్లని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,424 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,063 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1,413 కోట్ల రుణాలను రద్దు చేశామని వివరించింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లకు వీడియోకాన్ గ్రూప్ బకాయిలు రూ.90,000 కోట్ల మేర ఉంటాయి. -
యూనియన్ బ్యాంక్ నష్టం రూ.1,194 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.1,194 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.9,438 కోట్ల నుంచి రూ.10,557 కోట్లకు పెరిగిందని పేర్కొంది. తగ్గిన మొండి బకాయిలు...: బ్యాంక్ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో 15.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 8.42 శాతం నుంచి 6.98 శాతానికి చేరాయి. మొండి బకాయిలు తగ్గినా కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. గత క్యూ2లో రూ.1,710 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,328 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు, ఇతరాలకు కలిపి మొత్తం మీద కేటాయింపులు రూ.1,716 కోట్ల నుంచి రూ.3,859 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో షేర్ 0.7 శాతం లాభంతో రూ.52.30 వద్ద ముగిసింది. -
టెల్కోలపై ‘ఏజీఆర్’ పిడుగు
న్యూఢిల్లీ: ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్టెల్ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూ2లో ఎయిర్‌టెల్‌పై భారం 28,450 కోట్లు టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) విషయమై సుప్రీం కోర్ట్ ఇటీవల ఇచ్చిన తీర్పుతో కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో త్రైమాసిక నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో రూ.119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.23,045 కోట్ల నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని ఎయిర్టెల్ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.21,199 కోట్లకు పెరిగిందని పేర్కొంది. కొత్త అకౌంటింగ్ విధానాలను అనుసరించినందువల్ల గత క్యూ2, ఈ క్యూ2 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. సుప్రీంకోర్టు ఏజీఆర్ విషయమై తాజాగా ఇచ్చిన తీర్పు కారణంగా స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు(ఎస్‌యూసీ), లైసెన్స్ ఫీజు తదితర అంశాలకు సంబంధించి ఈ క్యూ2లో ఈ కంపెనీపై రూ.28,450 కోట్ల భారం పడిం ది. దీంతో కంపెనీ నికర నష్టాలు రూ.23,045 కోట్లకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం. ఏజీఆర్ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు రూ.1,123 కోట్లుగా ఉండేవి. నిర్వహణ లాభం రూ. 6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3% పెరిగి రూ.15,361 కోట్లకు చేరింది. ఆఫ్రికా విభాగం ఆదాయం 13% ఎగసింది. వొడాఫోన్ ఐడియాపై పెనుభారం... ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇంత వరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి రూ.11,146 కోట్లకు పెరిగిందని వివరించింది. సుప్రీం తాజా తీర్పు కారణంగా తాము చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్ ఐడియా, ఈ క్యూ2లో రూ.25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఇరు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ప్రతికూల అంచనాలతోనే ఈ రెండు షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎయిర్టెల్ షేర్ బీఎస్ఈలో 1.5% నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా షేర్ 20% క్షీణించి రూ.2.95 వద్దకు చేరింది. మొత్తం బకాయిలు రూ.1.4 లక్షల కోట్లు... టెలికం విభాగం తాజా అంచనాల ప్రకారం... ఏజీఆర్‌కు సంబంధించి ఎయిర్టెల్ రూ.62,187 కోట్లు, (టాటా గ్రూప్ టెలికం కంపెనీలను, టెలినార్‌ను కూడా విలీనం చేసుకున్నందు వల్ల వాటి భారం ఎయిర్టెల్ మీదనే పడింది) వొడాఫోన్ ఐడియాలు రూ.54,184 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగానే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఐడియా రివ్యూ పిటిషన్...!: ఏజీఆర్‌కు సంబంధించి స్పష్టత లేదంటూ గత నెలలోనే వెల్లడించాల్సిన ఆర్థిక ఫలితాలను ఎయిర్టెల్ వాయిదా వేసింది. కాగా టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్‌పై సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా ఎయిర్టెల్ వ్యక్తం చేసింది. మరోవైపు ఏజీఆర్ విషయమై ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోంది. ఏజీఆర్‌కు సంబంధించి సానుకూల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటేనే తమ కంపెనీ కొనసాగగలదని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైననే తమ కంపెనీ మనుగడ ఆధారపడి ఉందని వివరించింది. -
నిఫ్టీ.. పల్టీ!
పన్ను వసూళ్లు బలహీనంగా ఉండటంతో మందగమనం మరింత కాలం కొనసాగుతుందనే భయాందోళనతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. రేట్ల విషయమై ఫెడరల్ రిజర్వ్ కఠినమైన వ్యాఖ్యలు చేయడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ కీలకమైన 10,800, 10,750 పాయింట్ల మద్దతు స్థాయిలను కోల్పోయింది. రోజంతా 626 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 470 పాయింట్లు పతనమై 36,093 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 10,705 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంక్, లోహ, ఆర్థిక, టెక్నాలజీ, ఫార్మా, వాహన, ఐటీ షేర్లు పతనమయ్యాయి. 10,500 పాయింట్ల దిశగా నిఫ్టీ ! ఆరంభ కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ప్రారంభంలోనే 50 పాయింట్లు పెరిగినప్పటికీ, ఆ తర్వాత 576 పాయింట్ల నష్టంతో 35,988 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిను తాకింది. రోజు మొత్తం మీద 626 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. నిఫ్టీ... తదుపరి మద్దతు స్థాయి, 10,500 పాయింట్ల దిశగా కదులుతోందని నిపుణులంటున్నారు. నిఫ్టీ 10,650 పాయింట్ల మద్దతు స్థాయి బుల్స్‌కు చివరి అశ అని ఇండియాబుల్స్ వెంచర్స్ ఎనలిస్ట్ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. పేపర్ షేర్ల రెపరెపలు వివిధ రంగాల షేర్లు పతనబాటలో ఉన్నా, పేపర్, జ్యూట్ ఉత్పత్తుల కంపెనీల షేర్లు రెపరెపలాడాయి. వచ్చే నెల 2వ తేదీ నుంచి ఒక్కసారే ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు దీనికి కారణం. మాలు పేపర్ మిల్స్, లడ్లౌ జ్యూట్ అండ్ స్పెషాల్టీస్, ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్, ఇమామి పేపర్ మిల్స్, వెస్ట్ కోస్ట్ పేపర్, స్టార్ పేపర్ మిల్స్, జేకే పేపర్, శేషసాయి పేపర్అండ్ బోర్డ్స్, షెవ్లట్ కంపెనీ షేర్లు 2–10 శాతం రేంజ్లో ఎగబాకాయి. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 15.5 శాతం నష్టంతో రూ. 54వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆల్టికో కంపెనీ చెల్లింపుల్లో విఫలం కావడంతో రియల్టీ రంగానికి అధికంగా రుణాలిచ్చిన బ్యాంక్‌లకు ప్రతికూలమని మూడీస్ సంస్థ పేర్కొంది. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు రియల్టీ రంగానికి అధికంగా రుణాలిచ్చాయని, వాటి రుణ నాణ్యత కొంత క్షీణించవచ్చని వివరించింది. మరోవైపు యస్ బ్యాంక్ ప్రమోటర్ సంస్థ, ఎమ్‌సీపీఎల్(మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్) ఎన్సీడీల రేటింగ్‌ను కేర్ సంస్థ తగ్గించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో యస్ బ్యాంక్ షేర్ ఈ రేంజ్లో పతనమైంది. ► 31 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ మినహా మిగిలిన 26 సెన్సెక్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► దాదాపు 100కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. యస్‌బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. కాఫీ డే, సీజీ పవర్, హెచ్‌డీఐఎల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► బలహీన మార్కెట్లోనూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ పుంజుకుంది. 0.6 శాతం లాభంతో రూ.1,100కు పెరిగింది. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను ఈ బ్యాంక్ రూ.1 ముఖ విలువ గల రెండు షేర్లుగా విభజించింది. రూ.1.65 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.1.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,65,438 కోట్లు తగ్గి రూ.1,38,54,439 కోట్లకు పెరిగింది. ఈ నష్టాలు ఎందుకంటే.. నిరాశపరిచిన పన్ను వసూళ్లు... ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు 17.5 శాతం పెరగగలవని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. కానీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 17వరకూ, మొదటి ఆరు నెలల్లో పన్ను వసూళ్లు 4.7 శాతం వృద్ధి మాత్రమే చెంది రూ.5.50 లక్షల కోట్లకు పెరిగాయి. డిమాండ్, వృద్ధిలకు సంబంధించిన సంక్షోభం మరింతగా విషమించిందన్నదానికి ఇంత తక్కువ వృద్ధే నిదర్శనమని నిపుణులంటున్నారు. మిగిలిన ఆరు నెలల్లో పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలను అందుకోవడం కష్టమేనని, మందగమనం మరింతగా ముదరనున్నదని వారంటున్నారు. మరోవైపు జీఎస్టీ రేట్ల తగ్గింపు ఆశలు అడియాశలయ్యాయి. దీంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్ కఠిన వైఖరి.... అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పావు శాతం మేర తగ్గించింది. 2008 తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఇది రెండో రేట్ల కోత. అయితే తదుపరి రేట్ల కోత విషయమై ఫెడ్ సానుకూల సంకేతాలు ఇవ్వలేదు. భవిష్యత్తు కోతల విషయమై అప్రమత్త విధానాన్ని అవలంభిస్తామని పేర్కొనడం మనలాంటి వర్థమాన దేశాలకు అశనిపాతమే. మరోవైపు వృద్ధికి సంబంధించి జపాన్ కేంద్ర బ్యాంక్ హెచ్చరికలు జారీ చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. కొనసాగుతున్న విదేశీ అమ్మకాలు... మందగమన భయాలతో నష్టభయం అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గురువారం రూ. 893 కోట్లుతో కలుపుకొని విదేశీ ఇన్వెస్టర్లు ఈ వారంలో మొత్తం రూ. 3,411 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. పెరిగిన చమురు ధరలు.... బుధవారం చల్లబడ్డ ముడిచమురు ధరలు గురువారం మళ్లీ భగ్గుమన్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా విషమిస్తాయనే ఆందోళనతో ఒక పీపా బ్రెంట్ చమురు ధర 2 శాతం మేర పెరిగి 64.81 డాలర్లకు పెరిగింది. రూపాయి పతనం.... డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పతనమై 71.34 వద్ద ముగిసింది. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
లోహ షేర్లు విలవిల..!
డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు * 49 పాయింట్ల నష్టంతో 25,819కు సెన్సెక్స్ * 7 పాయింట్ల నష్టంతో 7,849కు నిఫ్టీ * హిందాల్కో, వేదాంతకు భారీ నష్టాలు... డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో సోమవారం ఆద్యంతం ఊగిసలాటకు గురైన స్టాక్‌మార్కెట్ చివరకు నష్టాల్లో ముగిసింది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం సెలవు కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కావడంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 25,819 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 7,849 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ షేర్లు బాగా నష్టపోయాయి. హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, లుపిన్ షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. ఆచి, తూచి: ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగియడం, డాలర్ బలపడుతుండడం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, రూపాయి పతనం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం.. ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ నుంచి హిందాల్కో, వేదాంత తొలగింపు..: లండన్ మార్కెట్లో రాగి ధరలు ఆరేళ్ల కనిష్టానికి పడిన నేపథ్యంలో లోహ షేర్లు నష్టపోయాయి. వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు 2-4 %మేర పడ్డాయి. సెన్సెక్స్ నుంచి వేదాంత, హిందాల్కో షేర్లను వచ్చే నెల 21 నుంచి తొలగిస్తున్నట్లు బీఎస్ఈ ప్రకటన నేపథ్యంలో హిందాల్కో, వేదాంత షేర్లు బాగా నష్టపోయాయి. హిందాల్కో 3.8% నష్టపోయి రూ.74 వద్ద, వేదాంత 2.9% నష్టపోయి రూ.90 వద్ద ముగిశాయి. ఏడాది కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ వేదాంత కంపెనీది రూ.42,000 కోట్లు, హిందాల్కోది రూ.16,000 కోట్లు చొప్పున హరించుకుపోయాయి. హిందాల్కో, వేదాంత షేర్ల నిష్ర్కమణతో సెన్సెక్స్‌లో ఏకైక లోహ షేర్‌గా టాటా స్టీల్ నిలిచింది. ఈ నెల 13న రూ.282గా ఉన్న గెయిల్ ధర పది రోజుల్లో 23%వృద్ధి చెంది సోమవారం రూ.346 వద్ద ముగిసింది. ఈ కంపెనీకి 49.75 %వాటా ఉన్న మహానగర్ గ్యాస్ సెబీకి ఐపీఓ పత్రాలను సమర్పించిన నేపథ్యంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. హెల్త్‌కేర్ గ్లోబల్ ఐపీఓకు సెబీ అనుమతి న్యూఢిల్లీ: కేన్సర్ కేర్ నెట్వర్క్ సంస్థ హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రెజైస్(హెచ్‌సీజీ) తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది, బెంగళూరు కేంద్రంగా పనిచేసే హెచ్‌సీజీ ఈ ఐపీఓ ద్వారా 1.16 కోట్ల తాజా షేర్లతో పాటు ప్రమోటర్ల 1.95 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయిస్తారు. హెచ్‌సీజీ బ్రాండ్ కింద ఈ కంపెనీ 15 సమగ్రమైన క్యాన్సర్ సెంటర్లను నిర్వహిస్తోంది. -
నెల్లూరులో వర్షాల కారణంగా భారీగా పంట నష్టం
-
25 వేల పాయింట్ల దిగువకు పడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. గడిచిన 14 నెలల్లో ఎప్పుడూ లేనట్లుగా సెన్సెక్స్ ఏకంగా 25 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఒక దశలో 329 పాయింట్లు నష్టపోయి 24,872.58 వద్దకు చేరుకున్నా, తర్వాత కొద్దిగా కోలుకుని.. 308 పాయింట్ల నష్టంతో 24,893.81 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా నష్టాల్లోనే ముగిసింది. 96 పాయింట్లు నష్టపోయి 7558.80 వద్ద ముగిసింది. గత వారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే ట్రేడయిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి మార్కెట్లలో ప్రధానంగా ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీహెచ్ఈఎల్ తదితర షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం తదితర షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. -
హా..ర్టీసీ!
♦ రూ.158.3 కోట్ల నష్టం ♦ ఏడాదిలోనే రూ.వంద కోట్లకు పైగా భారం ♦ 65 శాతానికి పడిపోయిన ఓఆర్ ♦ పెరిగిన నిర్వహణ ఖర్చులు ♦ అస్తవ్యస్త పరిపాలన సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్ ఆర్టీసీపై పిడుగుపాటు. ఏడాది కాలంలోనే భారీ నష్టాలు సంభవించాయి. అనూహ్యంగా పెరిగిన నిర్వహణ ఖర్చు... జీతభత్యాల భారం... బస్సుల నిర్వహణలో వైఫల్యాలు... అధికారుల మధ్య సమన్వయ లోపం... సంస్థ విభజనపై ఏడాదిగానెలకొన్న స్తబ్దత తదితర పరిణామాలు భారీగా దెబ్బతీశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో రూ.158.3 కోట్ల నష్టాలు భరించాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.354 కోట్ల మేరకు నష్టం వస్తే... అందులో సగానికి పైగా ఒక్క గ్రేటర్ ఆర్టీసీకి సంబంధించినవే. కొంతకాలంగా నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీకి ఇది కోలుకోలేని దెబ్బ. మరోవైపు ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు నడపకపోవడం... నిత్యం వేలాది ట్రిప్పులు రద్దు కావడం, సిబ్బంది గైర్హాజరు వంటి అంశాలు కూడా ఆర్టీసీ పుట్టి ముంచాయి. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఏసీ బస్సులు ఈ నష్టాలకు మరింత ఆజ్యం పోశాయి. ఒకప్పుడు 72 శాతం ప్రయాణికులతో కిటకిటలాడిన సిటీ బస్సులు ప్రస్తుతం 65.96 శాతం ఆక్యుపెన్సీతో వెలవెలబోతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం... ఏడాదిగా నెలకొన్న స్తబ్దత కూడా నష్టాల బాటలో నడిపించాయి. ఏడాదిలో రూ.100 కోట్లకు పైగా నష్టం గ్రేటర్ హైదరాబాద్‌లోని 27 డిపోల పరిధిలో 3850 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇవి నిత్యం 42 వేల ట్రిప్పుల వరకు నడుస్తున్నట్లు అంచనా. కానీ సుమారు నాలుగైదు వేల ట్రిప్పులు రద్దవుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాల వైపు చూడాల్సి వస్తోంది. ఆర్టీసీ అంచనా ప్రకారం 35 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సులను వినియోగించుకుంటున్నారు. మరోవైపు రోజూ 5 లక్షల మందికి పైగా సకాలంలో బస్సులు లభించక ఇతర వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. దీంతో సంస్థకు నష్టాలు సంభవిస్తున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.44.15 కోట్లు ఉన్న నష్టాలు కేవలం ఏడాదిలో అంటే 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.158.3 కోట్లకు చేరుకోవడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలోనే రూ.వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రూ.80 కోట్లతో కొనుగోలు చేసి, గత డిసెంబర్లో ప్రవేశపెట్టిన 80 ఏసీ ఓల్వో బస్సులు ఈ నష్టాలను మరింత పెంచాయి. వీటితో పాటు, సీటీ శీతల్, ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ ఏసీ బస్సులన్నింటిపైనా రూ.70 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు అంచనా. -
ఏ యే రోజు.. ఏమేం చేయాలి? పట్టు దిగుబడికి చక్కని చుక్కాని!
చిన్న తప్పులతోనే భారీ నష్టాలు అయితే, క్రమశిక్షణ కలిగిన పట్టు రైతుకు నష్టం వచ్చే ప్రసక్తే లేదంటారు పట్టు పురుగుల పెంపకంపై సుదీర్ఘ అనుభవం గడించడంతోపాటు అనేక యంత్రాలను స్వయంగా రూపొందించిన రైతు శాస్త్రవేత్త గాండ్ల గురుమూర్తి(98491 26223). చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు ఆయన స్వగ్రామం. సునిశితమైన పరిశీలనాసక్తి కలిగిన ఆయన దశాబ్దకాలంగా పట్టు పురుగుల పెంపకంలో నికర లాభాలు ఆర్జిస్తున్నారు. కానీ, ఈ రంగంలోకి అడుగుపెట్టిన రైతులు చాలా మంది నష్టపోతుండడం ఆయనను కలచి వేసింది. ఏ పూట ఏం పని చేయాలో ముందే స్పష్టంగా తెలుసుకొని.. మెలకువలను శ్రద్ధగా పాటించగలిగితే నష్టాల ఊసే ఉండదనేది గురుమూర్తికి గట్టి నమ్మకం. రైతులు, అధికారుల నుంచి సైతం ప్రశంసలందుకున్న ఆయన తనకు తెలిసిన మెలకువలను రైతులందరికీ స్పష్టంగా తెలియజెపితే మేలని భావించారు. పట్టు సేద్యంలో ఏడాది పొడవునా ఏ యే పూట ఏమేం పనులు చేయాలో సూచిస్తూ ఒక టైం టేబుల్‌ను రూపొందించారు. కొత్తగా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులకే కాదు.. తమకు తెలియకుండానే చిన్నా చితకా తప్పులు చేస్తూ భారీగా నష్టపోయే పట్టు రైతులకు కూడా ఈ కాల ప్రణాళిక అపూర్వమైన కరదీపిక వంటిదంటే అతిశయోక్తి కాదు. ఆలస్యం అమృతం విషం.. సమయపాలన, ఆర్థిక ప్రణాళిక, రోజువారీ వ్యవహారాలను సమన్వయం చేస్తూ రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా రూపొందించారు. అతి చిన్న అంశానికి సైతం ఈ ప్రణాళికలో ప్రాముఖ్యత కల్పించడం విశేషం. మల్బరీ సేద్యం ప్రారంభం నంచి పట్టు గూళ్ల అమ్మకం వరకూ చేయవలసిన పనుల వివరాలు ఇందులో ఉన్నాయి. షెడ్లో ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాల విషయంలో అప్రమత్తంగా ఉండటం. ఆకు ఫీడింగ్, నాణ్యత, పనివేళలు, కూలీల సంఖ్య, వర్షం వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సహా పలు వివరాలు ఇందులో ఉన్నాయి. పట్టు పురుగులకు అర గంట ఆలస్యంగా మేత వేసినా పట్టు పురుగులు స్పందించే తీరులో తేడా వస్తుంది. అందుకే ఫలానా సమయానికి ఫలానా పని చేయాలని స్పష్టంగా సూచించారు. ప్రతి దశలో పంటలో వచ్చే మార్పులపై రైతుకు కచ్చితమైన అవగాహన ఉండాలంటారు గురుమూర్తి. మల్బరీ సాగులో తలెత్తే ఇబ్బందులు, నివారణ చర్యలు, కొద్ది పాటి నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలు, పని చేసే క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఆదాయం, ఖర్చు, మిగులు.. తదితర అంశాలను నియమిత క్రమంలో ఈ కాల ప్రణాళికలో పేర్కొన్నారు. రాబోయే వారం రోజుల్లో చేయవలసిన పనుల వివరాలు తెలుసుకొని వనరులను సర్దుబాటు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. హడావిడి లేకుండా నిర్ణీత సమయానికి స్థిమితంగా పని పూర్తిచేయటం వీలవుతుంది. తద్వారా నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తి జరుగుతుంది. దిగుబడి పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే రైతు పనిలో అనుకోని అవాంతరాలెదురైనా ఎదుర్కోగలుగుతాడంటారు గురుమూర్తి. పంట తీత పూర్తయ్యాక.. మొత్తం ఖర్చెంత? ఆదాయం ఎంత? నికరంగా మిగిలిందెంత? అనేది రైతుకు అవగాహన కలిగించేలా ప్రణాళికను రూపొందించారు. రైతులు ఎదుర్కొనే అన్ని సమస్యలకూ పరిష్కారాలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయి ఆచరణ మాత్రం రైతుకు వల్ల పడటం లేదు. అందువల్లే నష్టపోతున్నాడు. అన్ని పంటలకు సంబంధించీ ఇలాంటి కాల ప్రణాళికలు తయారుచేయడం అవసరం. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ పని చేయగలిగితే రైతులకు మేలు చేసినవాళ్లవుతారని గురుమూర్తి అంటున్నారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
నష్టాల బాటలో ఇన్ఫ్రా...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 617... 267... 172... ఇవి క్రికెట్ స్కోర్లు కావు. మూడు నెలల్లో రాష్ట్ర ఇన్ఫ్రా కంపెనీలు మూటకట్టుకున్న కోట్ల నష్టాలు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ల్యాంకో, జీవీకే, ఐవీఆర్సీఎల్ కంపెనీలు శుక్రవారంనాడు వరుసగా ప్రకటించిన నష్టాలివి. ఇంతటి భారీ నష్టాలు రావడానికి కారణం ఈ కంపెనీలు ఈ మూడు నెలల కాలంలో రుణాలపై వరుసగా రూ.744 కోట్లు, రూ.352 కోట్లు, రూ.159 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి రావటమే. దీనికి తోడు జీవీకే, ల్యాంకో ఇన్‌ఫ్రాలు గ్యాస్ కొరతతో విద్యుదుత్పత్తి చేయకపోవటం వల్ల నష్టాలు మరింత పెరిగాయి. ఐవీఆర్సీఎల్ నష్టం రూ. 172 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా ఆదాయంతో పాటు నష్టాలు తగ్గాయి. ఆదాయం రూ. 956 కోట్ల నుంచి రూ. 645 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 178 కోట్ల నుంచి రూ. 172 కోట్లకు తగ్గాయి. 9 నెలల కాలంలో కంపెనీ రూ. 2,090 కోట్ల ఆదాయంపై రూ.517 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ చేతిలో రూ.17,135 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. శుక్రవారం ఐవీఆర్సీఎల్ షేరు స్వల్ప నష్టాలతో రూ.16.65 వద్ద ముగిసింది. మరింత పెరిగిన జీవీకే నష్టాలు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 209 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ నష్టాలు రూ.45 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ.735 కోట్ల నుంచి రూ.792 కోట్లకు పెరిగింది. గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వడ్డీ భారం కారణంగా నష్టాలు భారీగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. జీవీకే వరుసగా 13 త్రైమాసికాల నుంచి నష్టాలను ప్రకటిస్తోంది. ఎయిర్పోర్ట్ విభాగంలో ఆదాయం రూ. 547 కోట్ల నుంచి రూ.602 కోట్లకు చేరింది. శుక్రవారం జీవీకే ఇన్ ఫ్రా షేరు 4% నష్టాలతో రూ. 9.90 వద్ద ముగిసింది. ల్యాంకో నష్టం రూ. 617 కోట్లు క్యూ3లో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ. 617 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి రూ. 530 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,588 కోట్ల నుంచి రూ. 2,253 కోట్లకు తగ్గింది. గ్యాస్ కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయలేకపోవడం, వడ్డీ భారం, కొత్త ప్రాజెక్టుల జారీలో ఆలస్యం వంటివి నష్టాలు పెరగడానికి కారణంగా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ల్యాంకో చేతిలో రూ. 29,464 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. శుక్రవారం ల్యాంకో ఇన్ఫ్రా షేరు 1% నష్టంతో రూ. 6 వద్ద ముగిసింది. -
మునిగిపోతున్నాం.. ఆదుకోండి: స్పైస్ జెట్
దాదాపు 2 వేల కోట్ల నష్టాల్లో మునిగిపోయిన స్పైస్ జెట్.. తమ విమానాలు ఎగరాలంటే అత్యవసరంగా ఆర్థికసాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పౌర విమానయానశాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మను కలిసిన స్పైస్ జెట్ ఉన్నతాధికారులు.. తమకు అత్యవసరంగా ఆర్థికసాయం చేయాలని విన్నవించారు. అయితే, అలాంటి నిర్ణయాలు ఏవైనా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలోనే తీసుకోవాల్సి ఉంటుందని వారికి మంత్రి చెప్పారు. వాళ్ల విజ్ఞప్తిని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖల వద్ద పెడతానని మాత్రం తెలిపారు. వాళ్లకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అంతకుముందు స్పైస్ జెట్ అధికారులు డీజీసీఏ చీఫ్ ప్రభాత్ కుమార్‌ను కలిసి, తమ పరిస్థితి వివరించారు. ఉద్యోగులకు పెండింగులో ఉన్న జీతాలు చెల్లించేందుకు స్పైస్ జెట్ సంస్థకు డీజీసీఏ సోమవారం వరకే గడువు ఇచ్చింది. అలాగే 1600 కోట్ల మేర చేయాల్సిన చెల్లింపుల విషయం కూడా చెప్పాలంది. నెల రోజుల్లోనే దాదాపు 1800 ట్రిప్పులను రద్దు చేయడంతో సంస్థ భారీగా నష్టపోయింది. -
చివరిలో చినుకుపోటు
డోన్, న్యూస్‌లైన్ : చివరి దశలో ఉన్న పంటలపై అకాల వర్షం ప్రతాపం చూపి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రధానంగా మామిడి, అరటి, వరి, మిరప పంటలకు నష్టం తీవ్రత అధికంగా ఉంది. డోన్ డివిజన్లో శనివారం రాత్రి సంభవించిన గాలి, వాన కారణంగా జలదుర్గం, కొమ్మెమర్రి, కన్నపుకుంట, ఊటకొండ, ఎంబాయి, కొత్తకోట తదితర గ్రామాల పరిధిలో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోటి రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచన. వరి, అరటి పంట నేలవాలగా మామిడి చెట్లపై పూత, పిందె రాలిపోయింది. గాలి కారణంగా గుడిసెల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గిపోయాయి. కరెంటు లేకపోవడంతో ఆయా గ్రామాల వాసులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. గాలుల కారణంగా 40ఎకరాల్లో అరటి పంట నాశనమైంది. మరో పది, పదిహేను రోజుల్లో కోత కోసేందుకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలడంతో సుమారు రూ.20లక్షలు నష్టపోయినట్లు జీవనమూర్తి అనే రైతు వాపోయాడు. డోన్,వెల్దుర్తి, ప్యాపిలి మండలాల పరిధిలో మామిడి పంటకు అపార నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు. అన్నదాతకు తీవ్ర నష్టం కొలిమిగుండ్ల : అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. మండల పరిధిలోని కోటపాడు, నందిపాడు, నాగిశెట్టిపల్లె, బి.ప్పులూరు తదితర గ్రామాల్లో కల్లాల్లో ఎండబోసిన మిరప కాయలు తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడి సిన కారణంగా మిరప కాయలు రంగు మారి ధర ఎక్కువగా పలకవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మండల పరిధిలో సాగు చేసిన ఉల్లి పంట పుప్పోడి కట్టే సమయంలో వర్షం రావడంతో నష్టం జరిగింది. అలాగే పెనుగాలి కారణంగా పెట్నికోటలోని రెండు నాపరాళ్ల పాలీష్ ప్యాక్టరీలకు చెందిన రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. బెలుం సమీపంలో రెండు విద్యుత్ స్తంభాలు పడిపోగా కొలిమిగుండ్ల రామసుబ్బారెడ్డి ఆసుపత్రి ఆవరణలో రెండు వృక్షాలు నేలకూలాయి. -
‘హెలెన్’ ధాటికి రైతన్న విలవిల
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: పైలీన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే జిల్లా రైతాంగాన్ని హెలెన్ తుపాను భారీగా దెబ్బతీసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షం పత్తి, వరి, మొక్కజొన్నతో పాటు ఉల్లి పంటలకు భారీ నష్టాన్ని కలిగించింది. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. సోమవారంలోగా పంట నష్టంపై ప్రాథమికంగా వివరాలు సేకరించేందుకు వ్యవసాయ, రెవెన్యూ విభాగాలు సన్నద్ధమవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో జిల్లాలో 2.71 సెం.మీ వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా సదాశివపేట మండలంలో 14 సెం.మీ. వర్షం కురిసింది. పొరుగునే ఉన్న కర్ణాటకతో పాటు రంగారెడ్డి జిల్లాలో అధిక వర్షం కురవడంతో సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, పంటలు నీట మునిగాయి. నారాయణఖేడ్ మండలం హన్మం తరావుపేట మత్తడి వాగు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాపూర్‌లో పెద్ద చెరువు అలుగుతో సంజీవన్‌రావుపేట, పోతన్‌పల్లి, ర్యాకల్, తుర్కపల్లి గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మనూరు మండలం కమలాపూర్ చెరువు కట్ట తెగటంతో పంట పొలాల్లోని వరి నీటి పాలైంది. కంగ్టి మండలం వాసర్ ఊరవాగు, వంగ్దల్, రాంతీర్థ్(నల్లవాగు)లు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రేగోడ్‌లో చెరువు వాగుకట్ట తెగటంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి, రేగోడ్-చౌదరిపల్లి కల్వర్టు పైనుంచి నీరు ప్రవహించడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయా యి. కొండాపూర్ మండలం హరిదాస్పూర్ శివారులోని వంతెన పొంగిపొర్లడంతో చుట్టుపక్కల పొలాలలోని పంటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటల నష్టం హెలెన్ తుపానుతో నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. సదాశివపేట మండలంలో సుమారు ఏడు వేల ఎకరాల్లో పత్తి, వరి, కొండాపూర్ మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా మనూరు మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో వరి, రెండు వేల ఎకరాల్లో కంది, 250 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా. కంగ్టిలో సుమారు 15 వేల ఎకరాలు, కల్హేర్‌లో 500 ఎకరాలు, నారాయణఖేడ్‌లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. మనూరు మండలం కమలాపూర్ వాగు తెగటంతో 250 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రేగోడ్లోని చెరువుకట్ట తెగటంతో 400 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మండలంలో వర్షం కారణంగా 400 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. -
మరో24 గంటలు!
విజయనగరం కలెక్టరేట్/ఫోర్ట్ న్యూస్‌లైన్: రైతుల కళ్లలో సుడులు రేపుతున్న హెలెన్ ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటినా శనివారం సాయంత్రానికి దీని ప్రభావం తగ్గుతుందని వారు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతన్న వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే 220 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే వేయి ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పార్వతీపురం డివిజన్లో కోసిన వరి పనలు నీళ్లలో తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కురి సిన వర్షంతో పొలాల్లో నీరు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, పాచిపెంట మండలాల్లో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. పనలపై ఉన్న వరి పంటను చక్కబెట్టుకోవటానికి రైతులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 24గంటల పాటు ప్రభావం.... హెలెన్ తుఫాన్ శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటింది. దీంతో కొంత వరకూ ముప్పు తప్పింది. అయితే మరో 24 గంటల పాటూ ఉంటుందని, ఆ తరువాత పూర్తిస్థాయిలో గండం గట్టెక్కినట్టేనని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా మత్స్యకారులు సముద్రంపైకి వేటకకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్లో 1077 టోల్‌ఫ్రీ నంబర్ కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పస్తులతో మత్స్యకార కుటుంబాలు హెలెన్ కారణంగా నాలుగు రోజులుగా చేపలవేట లేకపోవడంతో తీరంలో మత్స్యకార కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారు వేటకు వెళ్లడంలేదు. పడవలను తీరంలో లంగరు వేశారు. బోట్లు, వలలు పాడవకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాలులు, వర్షాల కారణంగా భోగాపురం మండలం లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఉన్నదీ పాయె!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులు గత నెలలో ప్రకృతి విపత్తులను తట్టుకుని మిగిలిన కొద్దిపాటి పంటలను సైతం ముంచేసి, రైతులను ఆశలను కూల్చేశాయి. వేట లేక మత్స్యకారులకు పూట గడవని దుస్థితి ఏర్పడింది. ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన మాసేన్ అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి బోటు తిరగబడటంతో మృత్యువాత పడ్డాడు. అతనితోపాటు వెళ్లిన మరో ఆరుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పై-లీన్, భారీ వర్షాల కారణంగా జిల్లాలో లక్షన్నర ఎకరాలకుపైగా వరి పంట పూర్తిగా దెబ్బతింది. 20వేలకుపైగా ఎకరాల్లో కొబ్బరి, జీడి, ఇతర పంటలు నాశనమైన విష యం తెలిసిందే. కాగా కొన్ని చోట్ల సగం కంకులతో, మరికొన్ని చోట్ల విపత్తులను తట్టుకొని నిలబడిన పంటను ప్రస్తుత వర్షాలు దెబ్బతీశాయి. హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వీటికితోడు గురువారం ఈదురుగాలులు వీయటం తో ఆహార, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. గతనెలలో సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా చాలా పంటలు దెబ్బతినగా.. సగం విరిగిన కంకులతో మిగిలిన పంటలనైనా దక్కించుకునేం దుకు గత నెలరోజులుగా రైతులు తీవ్రంగా శ్రమిం చారు. ప్రస్తుతం వరి కోతలు కోసి చేనును ఇంటికి తరలించేందుకు సిద్ధం చేశారు. అదంతా ఇంకా పొలాల్లోనే ఉంది. ఇంతలోనే హెలెన్ తుపాను రూపంలో ప్రకృతి మరోసారి దాడి చేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోనే ఉన్న వరి ఓవులు మునిగి, నానిపోతున్నాయి. తడిసి ముద్దయిపోయిన వీటిని దక్కించుకునేందుకు ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా మబ్బులు, వర్షపు జల్లులు ఏమాత్రం సహకరించడం లేదు. శుక్రవారం ఈదురుగాలులు లేకపోవడం మాత్రం కొంత ఊరట కలిగించింది. అయితే మరో 24 గంటలపాటు వర్షాలు పడతాయని, అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావారణ శాఖ ప్రకటించడం రైతుల ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వేలాది రూపాయలు మదుపు పెట్టి పండించిన పంట పోయిందని, ఇప్పుడు ఈ కాస్త కూడా దక్కకపోతే.. తిండిగింజలకూ తిప్పలు తప్పవని వారు ఆవేదన చెందుతున్నారు. వీటితోపాటు అరటి, బొప్పాయి, మునగ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నందిగాం మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జలుమూరు మండలంలో ఐదెకరాల్లో పెసర, మినప విత్తనాలు నీటమునిగాయి శ్రీకాకుళం మండలంలో సుమారు ఏడు వేల ఎకరాల్లోని వరి ఓవులు పొలాల్లోనే ఉన్నాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో ధాన్యం రంగు మారిపోవడంతోపాటు మొలకలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. రణస్థలం మండలంలో సుమారు 4500 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట అంతా కోత దశలో ఉండగా, కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా కోతలు జరుగుతున్నాయి. వర్షాలతో కోసిన పంటం తా తడిసిపోయింది. సుమారు 500 ఎకరాల్లో వేసిన ఉల్లి పంట కూడా నీరు నిల్వ కారణంగా కుళ్లిపోతోందని రైతులు విలపిస్తున్నారు. జి.సిగడాం మండలంలో మడ్డువలస కుడి కాలువ పరిధిలోని పలు గ్రామాల్లో కోసిన వరి పంట పొలాల్లోనే ఉంది. వర్షాలకు ఇది దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 15.7 మి.మీ. సగటు వర్షం గత 24 గంటల్లో జిల్లాలో 15.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శ్రీకాకుళంలో 38.2 మి.మీ., ఎల్‌ఎన్‌పేటలో 32.2, రణస్థలంలో 30, వజ్రపుకొత్తూరులో 27.2, జలుమూరులో 27, లావేరులో 26.6, కోటబొమ్మాళిలో 26.2, సారవకోటలో 24.6, కవిటిలో 23.2. పలాసలో 22.4, పోలాకిలో 22.4. నరసన్నపేటలో 20.7 మి.మీ. వర్షం కురిసింది. -
కంటి తుడుపే
ఒంగోలు కలెక్టరేట్, పర్చూరు, న్యూస్‌లైన్: గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. నెలరోజుల సగటు వర్షం నాలుగు రోజుల్లోనే నమోదైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. పొలాలు చెరువులయ్యాయి. రోడ్లు వాగులుగా మారాయి. కాలనీలు మునిగిపోయాయి. తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. రూ 850 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. విపత్తు జరిగిన 26 రోజుల తరువాత ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నష్టం అంచనాల కోసం జిల్లాలో నేడు కాలుమోపనుంది. అది కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు పర్యటించి తిరిగి హైదరాబాద్ వెళ్లనుంది. భారీ వర్షాల వల్ల అపార నష్టం జరిగినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించలేదు. నష్టం జరిగిన తరువాత కేంద్ర బృందం తీరికగా జిల్లాకు రావడంపై ప్రజలతోపాటు జిల్లా యంత్రాంగం కూడా పెదవి విరుస్తోంది. కాలువలు, కల్వర్టులకే బృందం పరిమితం కానుంది. వందల కోట్ల నష్టం.. అక్టోబర్‌లో 206.5 మిల్లీమీటర్ల సగటు వర్షానికిగాను ఆ నెల 22 నుంచి 25వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు 246.9 మిల్లీమీటర్లు నమోదైంది. మూడు మండలాల్లో 400పైగా, 13 మండలాల్లో 300-400, 20 మండలాల్లో 200-300, మరో 20 మండలాల్లో 200 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖకు రూ 120 కోట్లకు పైగా నష్టం జరిగింది. ఉద్యాన, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమ శాఖలకు సంబంధించి దాదాపు రూ 7 కోట్ల మేర నష్టం జరిగింది. ఆర్అండ్బీ రోడ్లకు రూ 290 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ 250 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. మేజర్ ఇరిగేషన్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించి దాదాపు రూ 14 కోట్లు, ప్రాజెక్టులకు సంబంధించి రూ 20 కోట్ల వరకు నష్టం జరిగింది. మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి రూ 30 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఒంగోలు నగరంతోపాటు మిగిలిన మునిసిపాలిటీల్లో రూ 90 కోట్లకు పైగా నష్టం జరిగింది. భారీ వర్షాలు 350కి పైగా గ్రామాలపై ప్రభావం చూపాయి. 650కి పైగా ఇళ్లు పూర్తిగా, 700కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మత్స్యకారులు, చేనేత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని గంటలు, కొన్ని ప్రాంతాలు... శంభూసింగ్, ఆర్పీసింగ్, కృష్ణప్రసాద్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం జిల్లాలో కొన్ని గంటలు మాత్రమే పర్యటించనుంది. అదికూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కానుంది. కేంద్ర బృందం పర్యటించనున్న ప్రాంతాల్లో కారంచేడు, స్వర్ణ గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో పంటలన్నీ తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు తిరిగి సాగు చేపట్టారు. పొగాకు పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. పొగాకు పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి పొగనారు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి ఏం తేలుస్తుందో వారికే తెలియాలి. భారీ వర్షాల కారణంగా నష్టం జరిగిన మొదటి మూడు నాలుగు రోజుల్లో పర్యటిస్తే ఎంత నష్టం జరిగిందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. 26 రోజుల తరువాత వస్తే నష్టం ఆనవాళ్లు కూడా కనిపించవు. కేంద్ర బృందం పర్యటించే ప్రాంతాల్లో పంటలకంటే కల్వర్టులు, కాల్వలనే ఎక్కువగా పెట్టారు. కనీసం వాటిని చూసైనా నష్టం అంచనా తెలుసుకుంటారేమో! గత బీభత్సాలకు పరిహారమేదీ.. గతంలో లైలా, జల్ వంటి తుపాన్లు జిల్లాను వణికించాయి. అప్పుడు కూడా అపార నష్టం సంభవించింది. కేంద్ర బృందాలు వచ్చి వెళ్లడం తప్పితే పూర్తి స్థాయిలో పరిహారం అందించిన దాఖలాల్లేవు. శాఖల వారీగా కొన్నింటికి మాత్రం పరిహారం అందించి ప్రభుత్వం సరిపెట్టుకొంది. దాంతో నష్టం ఏ మేరకు అందించాలన్న వివరాలు లేవు. తాజాగా రానున్న కేంద్ర బృందం కూడా గతంలో మాదిరిగానే రావడం, చూడటం, వెళ్లడం వరకే పరిమితం కానున్నట్లు వారి పర్యటన షెడ్యూల్‌ను చూస్తే స్పష్టమవుతోంది. జిల్లాలో జరిగిన భారీ వర్షాల నష్టంపై యంత్రాంగం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. కనీసం దానిని చూసైనా కేంద్ర బృందం స్పందిస్తుందో లేక మొక్కుబడి పర్యటనతో ముగిస్తుందో వేచి చూడాలి. కొమ్మమూరు కాలువపై 60 చోట్ల గండ్లు.. కొమ్మమూరు కాలువపై జిల్లాలో సుమారు 60 చోట్ల గండ్లు పడ్డాయి. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోని 29 చోట్ల గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల రైతులే స్వచ్ఛందంగా గండ్లు పూడ్చుకుంటున్నారు. గండ్లకు పూర్తిగా మరమ్మతులు చేస్తేనే కొమ్మమూరు కాలువలకు సక్రమంగా నీటి సరఫరా అవుతుంది. వెంటనే గండ్లు పూడ్చాల్సి ఉంది. తడిసిన పత్తిని, వరిని కొనుగోలు చేయాలి... వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తిపైరు చాలాచోట్ల పీకేశారు. వేరే పైరు సాగుచేయలేని రైతులు పత్తిపైరును అలానే ఉంచారు. తడిసిన కాయల నుంచి తీసిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానాతంటాలు పడాల్సి ఉంటుంది. తడిసిన పత్తిని నిబంధనలు పక్కనపెట్టి సీసీఐ, నాఫెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించాలి. తడిసిన పత్తిని క్వింటా రూ 4 వేలు, నాణ్యమైన పత్తిని క్వింటా రూ 6వేలకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంది. ఇదే విధంగా వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో పంటనష్టం కేంద్ర బృందానికి వివరిస్తాం: జేడీఏ దొరసాని భారీవర్షాల కారణంగా జిల్లాకు జరిగిన పంట నష్టాన్ని కేంద్రబృందానికి విన్నవించనున్నట్లు వ్యవసాయశాఖ జిల్లా జేడీఏ ఎస్.దొరసాని పేర్కొన్నారు. కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్చూరు వచ్చిన ఆమె మంగళవారం స్థానిక ఏడీఏ కార్యాలయంలో విలేకరుతో మాట్లాడారు. కేంద్ర బృందం బుధవారం పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. వర్షాలకు దెబ్బతిన్న పైర్లను పరిశీలిస్తారని చెప్పారు. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో పత్తిపైర్లను, కారంచేడు మండలం కుంకలమర్రులో వరిపైరును, ఇంకొల్లు మండలం వంకాయలపాడులో మిర్చిపైరును పరిశీలిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో పంటనష్టం వివరాలు సేకరించామని ప్రస్తుతం ఆన్లైన్లో ఉంచుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ కూడా 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులు పాసుపుస్తకాల జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాల నంబర్లు వెంటనే సంబంధిత వీఆర్వోలకు అందజేయాలని కోరారు. కేంద్ర బృందం నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం ఒంగోల్లో ఫొటోఎగ్జిబిషన్, పవర్‌పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా కేంద్ర బృందానికి నష్టానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వివరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో దెబ్బతిన్న పత్తిపైరును పీకివేసి ప్రస్తుతం దాని స్థానంలో పొగాకు, శనగ సాగుచేస్తున్నట్లు తెలిపారు. రాయితీ శనగలు త్వరలోనే అందజేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆమె వెంట ఏడీఏలు జి.రత్నప్రసాద్, సీహెచ్ గణేష్‌బాబు, ఏవో బీ. గౌతమ్‌ప్రసన్న ఉన్నారు. -
వర్షం మిగిల్చిన నష్టమిదీ..
యద్దనపూడి (మార్టూరు), న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి. మండలంలో ఏ రైతును కదిలించినా..కంట నీరు తప్ప నోట మాట రావడం లేదు. పత్తి, పొగాకు రైతులు ఎక్కువగా నష్టపోయారు. మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన నాగయ్య ఎకరాకు రూ 16 వేలు పెట్టి 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికి ఎకరానికి రూ 40 వేల వరకు ఖర్చయింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వాగు పొంగి చేనుమీద పడింది. చేనంతా నీటిపాలై ఉరకెత్తి ఎండిపోసాగింది. దీంతో చేసేదేమీ లేక చేను పీకేశాడు. అదేవిధంగా మండలంలోని చిమటావారిపాలెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి అనిల్ కుమార్ ఎకరాకు రూ 15 వేలు చొప్పున రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇప్పటికే ఎకరానికి రూ 25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాలకు చేలో నీరు పారి, వేసిన పొగతోట కొట్టుకుపోయింది. మళ్లీ రూ 10 వేలు ఖర్చుపెట్టి నారు కొనుగోలు చేసి పంట సాగు చేసేందుకు సమాయత్తమయ్యాడు. ఇలా ఆ ఇద్దరు రైతులే కాదు..మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. -
వర్షం దెబ్బ
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా రైతులు 62,300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. మంచి ధర పలకడం, స్వల్పకాలిక పంటకావడంతో రైతులు మొగ్గు చూపారు. జిల్లాలోని ఇంద్రవెల్లి, జైనథ్, కెరమెరి, గుడిహత్నూర్, ఉట్నూర్, సిర్పూర్(యు), బజార్హత్నూర్, నార్నూర్, జైనూర్, బోథ్, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో టమాటా సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రవెల్లి మండలం టమాటా సాగులో పేరు గాంచింది. ఇక్కడ ఈసారి దాదాపు 5 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. టమాటాకు మంచి ధర పలకడంతో ఆశించిన లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ వర్షాలు, వరదలు నట్టేట ముంచాయి. నిండాముంచిన వర్షాలు.. పొగమంచు.. వర్షాలు, వరదలు టమాటా రైతులను నిండా ముంచాయి. పది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పై-లీన్ తుపాన్ ప్రభావంలో టమాటా సాగుపై పండింది. అధిక వర్షాలతో చేలలో నీరు నిల్వ ఉండటంతో మొక్కల వేర్లు మురిగిపోయాయి. దీనికి తోడు టమాటా కాయలు బురదలో వేలాడటంతో మురిగిపోయాయి. రైతులు చేలలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బ్యాక్టిరియా సోకి కాయలకు నల్లమచ్చలు ఏర్పడ్డాయి. ఇటువంటి టమాటాలను ఏరివేస్తున్నా ఫలితం ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. టమాటా దిగుబడి పెరగాలంటే పొగమంచు అదుపులో ఉండాలి. కానీ, ఆకాల వర్షాలు తగ్గినప్పటి నుంచి వేకువజామున పొగమంచు విపరీతంగా కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు పెరగడంతో కాత, పూత రాలడం.. కాయ ఎదుగుదల లేకుండా పోయి దిగుబడి తగ్గుతోంది. పొగమంచు తగ్గుముఖం పడితే గాని దిగుబడి పెరిగే అవకాశం లేదని రైతులు తెలుపుతున్నారు. టమాటా సీజన్ కావడంతో సాధారణంగా ఈ సీజన్లో కిలో టమాటా ధర రూ. 10 నుంచి రూ.20 మధ్య ఉంటుంది. కానీ, వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.40పైగా పలుకుతోంది. మార్కెట్లో ధర ఉండటం, పంట దిగుబడి లేక రైతులు అల్లాడుతున్నారు. నష్టాల ఊబిలో రైతులు ఎకరం టమాటా పంట సాగు చేయాలంటే రైతుకు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడికి ఖర్చవుతుంది. ఎకరం సాగులో వారానికి 20 క్యారెట్ల టామాటాను మార్కెకు తరలిస్తే రైతులకు లాభాలు వస్తాయి. ఈసారి వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గి ఎకరం చేనులో వారానికి మూడు లేదా నాలుగు క్యారెట్ల టమాటా కూడా మార్కెట్‌కు తరలించడం లేదు. కానీ, గతేడాది దిగుమతి పెరిగి.. ధర లేక నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. ఈ మూడు, నాలుగు క్యారెట్ల టమాటా కాయలపై కూడా నల్లమచ్చలు ఉండటంతో ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం క్యారెట్ ధర రూ.700 నుంచి రూ.1,300 వరకు పలుకుతుంది. ఈ సమయంలో టమాటా దిగుబడి ఆశించిన విధంగా ఉంటే లాభాలు వచ్చేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గుండె జారిన రైతు
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్: కంటిమీద కునుకులేకుండా చేసిన వర్షం సోమవారం శాంతించింది. వారం రోజుల తరువాత సూర్యుడు దర్శనమిచ్చాడు. అయితే బాధితులు కోలుకోలేనిస్థితిలో ఉన్నారు. కష్టం, పెట్టుబడి అన్నీ వర్షార్పణం అవడంతో అన్నదాత గుండెలవి సేలా రోదిస్తున్నాడు. సమస్తం కోల్పోయిన చాలా కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమని గడుపుతున్నాయి. చాలా ఊళ్లు నీళ్లలో తేలుతున్నాయి. నానిపోవడంతో ఎప్పుడు ఏ గోడ కూలిపోతుందో, ఏ ఇల్లు పడిపోతోందనని గ్రామీణులు భీతిల్లుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో పూసపాటిరేగ, భోగాపురం, బొబ్బిలి నియోజకవర్గంలో రామభద్రపురం, ఎస్.కోట నియోజకవర్గంలో జామి, కొత్తవలస మండలాలకు భారీగా నష్టం ఏర్పడింది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భోగాపురంలో 19.8, కొమరాడలో 13, పార్వతీపురంలో 6.9, కురుపాంలో 6.6, పూసపాటిరేగలో 5.2, గుమ్మలక్ష్మీపురంలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో నామమాత్రపు వర్షపాతం నమోదైంది. జిల్లాకు రూ 113 కోట్లు నష్టం అల్పపీడన వర్షాలు భారీనష్టాన్ని మిగిల్చాయి. పత్తి, మొక్కజొ న్న, ఉద్యాన రైతులకు తేరుకోలేని నష్టం ఏర్పడింది. అక్టోబర్ నెలలో సాధారణ వర్షపాతం 167.9 మిల్లీమీటర్లు కాగా, 304 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల వల్ల రూ. 113 కోట్ల 60 లక్షల నష్టం వాటిల్లింది. వీటిలో పంటలు నష్టం రూ.24.11 కో ట్లు కాగా, రోడ్లు, మంచినీటి పథకాలు, చెరువులు, భవనాలు, ఇళ్లు కూలడంతో రూ.89.59 కోట్లమేర నష్టం వాటిల్లింది. వరి 7,470 ఎకరాలు, మొక్కజొన్న 3,737, పత్తి 18,979, చెరకు 191, పెసర 680, మినుము 475, వేరుశనగ 471, మిరప 60, రాగి 8, కొర్ర 2.5,కూరగాయలు 1368 ఎకరాలు, అరటి 75, ఉల్లి 57, బొప్పాయి 583 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అధికారుల ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలకుగాను 10.10 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖాధికారులు అంచనావేశారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా నగదు రూపంలో నష్టాన్ని అంచనా వేయలేదు. వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు వంటి ఖరీఫ్ పంటలకు 13.90 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. పశుసంవర్థక శాఖకు సంబంధించి ఆరు మేకలు, ఒక గేదె చనిపోవడంతో వాటికి గాను 25వేలు, సెరీకల్చర్‌కు సంబంధించి మల్బరి తోటలు, పట్టుపురుగుల గుడ్లు పాడవడంతో రూ. లక్షా 25వేలు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మత్స్యశాఖకు సంబంధించి 81 వలలు దెబ్బతిన్నాయి, 30 టన్నులు చేపలు మృతి చెందాయి, 14 చెరువులకు గండ్లు పడడంతో రూ. 58 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేశారు. గ్రామీణనీటి సరఫరా విభాగానికి సంబంధించి దెబ్బతిన్న ట్యాంకులను మరమ్మతుచేయడానికి 28 లక్షల 40 వేలు అవసరమవుతుందని గుర్తించారు. ఆర్ అండ్‌బీకి సంబంధించి విజయనగరం డివిజన్లో 177 కిలోమీటర్ల మేర పాడైన రోడ్లకు గాను 42.83 లక్షలు, ఐటీడీఏ పరిధిలో 36 కిలోమీటర్లకు సుమారు రూ 3 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే మీడియం, మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి మరమ్మతులు చేపట్టడానికి 10 కోట్ల 63 లక్షలు, నేలమట్టమైన ఇళ్ళకు నష్టపరిహారంగా అందించేందుకు రూ 37,95,000 అవసరమని అంచనావేశారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తం గా రోడ్లు, ఇతర పనులుకు గాను 20 కోట్ల రూపాయలు, విజయనగరం మున్సిపాలిటీకీ ఆరు కోట్లు, బొబ్బిలి మున్సిపాలిటీకి 40 లక్షలు, సాలూరు మున్సిపాలిటీకి పది లక్షలు చొప్పు న నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖకు 13.13 లక్షలు నష్టం ఏర్పడింది. 14 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 16 వె నుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల భవనాలు దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించి అంచనాలు రూపొందించవలసి ఉంది. -
విధ్వంసమే..!
సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఐదు రోజుల పాటు కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఊహకందని విధ్వంసాన్ని సృష్టించాయి. శనివారం కూడా కొన్ని మండలాల్లో వర్షాలు పడడంతో పంటలు దెబ్బతిని నష్టం మరింత పెరిగింది. కనీవిని ఎరుగని రీతిలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా న ష్టం కలిగించింది. అన్ని శాఖల పరిధిలో రూ 1075.72 కోట్ల నష్టం సంభవించినట్టు రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వర్షాలు అధికంగా ఉండి తీవ్రంగా నష్టం జరిగిన 37 మండలాల్లోని 679 గ్రామాలకు చెందిన గణాంకాలు మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లు, కొట్టుకుపోయిన వ్యవసాయ మోటార్లు, పైపుల విలువ లెక్కిస్తే నష్టం మరింత పెరగనుంది. కోలుకోలేని దెబ్బ.... అన్నదాతల రెక్కల కష్టం నీటిపాలైంది. ఆశలు పెట్టుకున్న పంటలు జల సమాధి అయ్యాయి. జిల్లాలో మొత్తం 5.43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. ఇంత పెద్ద ఎత్తున పంటలు నాశనం కావడం ఇదే మొదటిసారి. ఇందులో అత్యధిక విస్తీర్ణంలో పత్తి చేలు చేతికి రాకుండా పోయాయి. కాయల్లోనే పత్తి గింజలు మొలకె త్తడం నష్టం తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ధాన్యంది కూడా ఇదే పరిస్థితి. 4.35 లక్షల ఎకరాల్లో పత్తి చేతికి రాకుండా పోయింది. వరి 1.03 లక్షల ఎకరాల్లో నీట మునిగిందని పేర్కొన్నారు. మరో ఐదు వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అంతేగాక 880 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. ఈ పంటల మొత్తం విలువ రూ 878.35 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. వాస్తవంగా ఒక్కో ఎకరా సాగుకు సగటున రూ 10 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అప్పు తెచ్చి మరీ సాగుకు ఉపక్రమించారు. తీరా పంటలు చేతికొచ్చే సమయంలో ఉపద్రవం ముంచుకొచ్చి అపార నష్టాన్ని కలిగించింది. దీంతో రైతులు ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి దాపురించింది. అంతేగాక వెయ్యికిపైగా వ్యవసాయ మోటార్లు, పైపులు వరదల్లో కొట్టుకపోయాయి. ఇవన్నీ లెక్కగడితే నష్టం విలువ మరింత పెరగనుంది. గూడు చెదిరింది... జిల్లావ్యాప్తంగా 12,045 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తేల్చారు. నష్టం విలువ అంచనా వేయలేదు. ఆర్అండ్బీ రోడ్లు, భవనాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరదలు పొంగిపొర్లడంతో రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. మరికొన్ని చోట్ల ఎద్దఎత్తున గోతులు ఏర్పడ్డాయి. వీటి ద్వారా ఆ శాఖకు రూ 143 కోట్ల నష్టం వాటిల్లింది. 907 పంచాయతీ రోడ్లు చెడిపోయాయి. 385 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. దీనిద్వారా నీటి పారుదల శాఖకు రూ 34.01కోట్ల నష్టం వాటిల్లింది. 121 గ్రామీణ తాగునీటి పథకాలు చెడిపోగా.. రూ 24.8కోట్ల నష్టం ఏర్పడింది. దీంతో వందల గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అంతేగాక మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, పైప్లైన్లు ధ్వంసమయ్యాయి. వీటిద్వారా రూ 10 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. దాదాపు రూ 2 కోట్ల విలువ చేసే 1771 విద్యుత్ స్తంభాలు, 85 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. ఉపాధి పోయింది.. వృత్తిదారులకూ తీరని నష్టం మిగిలింది. 808 మూగజీవాలు వరదల బారినపడి చనిపోయాయి. 1257బోట్లు, చేపల వలలు గల్లంతయ్యాయి. అంతేగాక 172 పవర్‌లూమ్స్ నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఈ మొత్తం నష్టం విలువ *2.60 కోట్లు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి 14 క్యాంపులు ఏర్పాటు చేశారు. 1934 మందికి పునరావాసం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.