ఉన్నదీ పాయె! | Heavy losses due to Helen Storm | Sakshi
Sakshi News home page

ఉన్నదీ పాయె!

Published Sat, Nov 23 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

Heavy losses due to Helen Storm

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:  హెలెన్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులు గత నెలలో ప్రకృతి విపత్తులను తట్టుకుని మిగిలిన కొద్దిపాటి పంటలను సైతం ముంచేసి, రైతులను ఆశలను కూల్చేశాయి. వేట లేక మత్స్యకారులకు పూట గడవని దుస్థితి ఏర్పడింది. ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన మాసేన్ అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి బోటు తిరగబడటంతో మృత్యువాత పడ్డాడు. అతనితోపాటు వెళ్లిన మరో ఆరుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పై-లీన్, భారీ వర్షాల కారణంగా జిల్లాలో  లక్షన్నర ఎకరాలకుపైగా వరి పంట పూర్తిగా దెబ్బతింది. 20వేలకుపైగా ఎకరాల్లో కొబ్బరి, జీడి, ఇతర పంటలు నాశనమైన విష యం తెలిసిందే. కాగా కొన్ని చోట్ల సగం కంకులతో, మరికొన్ని చోట్ల విపత్తులను తట్టుకొని  నిలబడిన పంటను ప్రస్తుత వర్షాలు దెబ్బతీశాయి.

హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వీటికితోడు గురువారం ఈదురుగాలులు వీయటం తో ఆహార, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. గతనెలలో సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా చాలా పంటలు దెబ్బతినగా.. సగం విరిగిన కంకులతో మిగిలిన పంటలనైనా దక్కించుకునేం దుకు గత నెలరోజులుగా రైతులు తీవ్రంగా శ్రమిం చారు. ప్రస్తుతం వరి కోతలు కోసి చేనును ఇంటికి తరలించేందుకు సిద్ధం చేశారు. అదంతా ఇంకా పొలాల్లోనే ఉంది. ఇంతలోనే హెలెన్ తుపాను రూపంలో ప్రకృతి మరోసారి దాడి చేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోనే ఉన్న వరి ఓవులు మునిగి, నానిపోతున్నాయి. తడిసి ముద్దయిపోయిన వీటిని దక్కించుకునేందుకు ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా మబ్బులు, వర్షపు జల్లులు ఏమాత్రం సహకరించడం లేదు.

 శుక్రవారం ఈదురుగాలులు లేకపోవడం మాత్రం కొంత ఊరట కలిగించింది. అయితే మరో 24 గంటలపాటు వర్షాలు పడతాయని, అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావారణ శాఖ ప్రకటించడం రైతుల ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వేలాది రూపాయలు మదుపు పెట్టి పండించిన పంట పోయిందని, ఇప్పుడు ఈ కాస్త కూడా దక్కకపోతే.. తిండిగింజలకూ తిప్పలు తప్పవని వారు ఆవేదన చెందుతున్నారు. వీటితోపాటు అరటి, బొప్పాయి, మునగ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
    నందిగాం మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.
    జలుమూరు మండలంలో ఐదెకరాల్లో పెసర, మినప విత్తనాలు నీటమునిగాయి
   శ్రీకాకుళం మండలంలో సుమారు ఏడు వేల ఎకరాల్లోని వరి ఓవులు పొలాల్లోనే ఉన్నాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో ధాన్యం రంగు మారిపోవడంతోపాటు మొలకలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
    రణస్థలం మండలంలో సుమారు 4500 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట అంతా కోత దశలో ఉండగా, కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా కోతలు జరుగుతున్నాయి. వర్షాలతో కోసిన పంటం తా తడిసిపోయింది. సుమారు 500 ఎకరాల్లో వేసిన ఉల్లి పంట కూడా నీరు నిల్వ కారణంగా కుళ్లిపోతోందని రైతులు విలపిస్తున్నారు.
    జి.సిగడాం మండలంలో మడ్డువలస కుడి కాలువ పరిధిలోని పలు గ్రామాల్లో కోసిన వరి పంట పొలాల్లోనే ఉంది. వర్షాలకు ఇది దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 15.7 మి.మీ. సగటు వర్షం
 గత 24 గంటల్లో జిల్లాలో 15.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శ్రీకాకుళంలో 38.2 మి.మీ., ఎల్‌ఎన్‌పేటలో 32.2, రణస్థలంలో 30, వజ్రపుకొత్తూరులో 27.2, జలుమూరులో 27, లావేరులో 26.6, కోటబొమ్మాళిలో 26.2, సారవకోటలో 24.6, కవిటిలో 23.2. పలాసలో 22.4, పోలాకిలో 22.4. నరసన్నపేటలో 20.7 మి.మీ. వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement