విజయనగరం కలెక్టరేట్/ఫోర్ట్ న్యూస్‌లైన్: రైతుల కళ్లలో సుడులు రేపుతున్న హెలెన్ ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటినా శనివారం సాయంత్రానికి దీని ప్రభావం తగ్గుతుందని వారు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతన్న వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే 220 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే వేయి ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పార్వతీపురం డివిజన్‌లో కోసిన వరి పనలు నీళ్లలో తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కురి సిన వర్షంతో పొలాల్లో నీరు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, పాచిపెంట మండలాల్లో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. పనలపై ఉన్న వరి పంటను చక్కబెట్టుకోవటానికి రైతులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
24గంటల పాటు ప్రభావం....
హెలెన్ తుఫాన్ శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటింది. దీంతో కొంత వరకూ ముప్పు తప్పింది. అయితే మరో 24 గంటల పాటూ ఉంటుందని, ఆ తరువాత పూర్తిస్థాయిలో గండం గట్టెక్కినట్టేనని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా మత్స్యకారులు సముద్రంపైకి వేటకకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో 1077 టోల్‌ఫ్రీ నంబర్ కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పస్తులతో మత్స్యకార కుటుంబాలు
హెలెన్ కారణంగా నాలుగు రోజులుగా చేపలవేట లేకపోవడంతో తీరంలో మత్స్యకార కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారు వేటకు వెళ్లడంలేదు. పడవలను తీరంలో లంగరు వేశారు. బోట్లు, వలలు పాడవకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాలులు, వర్షాల కారణంగా భోగాపురం మండలం లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మరో24 గంటలు!
Published Sat, Nov 23 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement