Helen storm
-
జడివాన వెలిశాక గొడుగిస్తారా?
అమలాపురం, న్యూస్‌లైన్ :కుండపోత వాన అన్నదాత ఆశల్ని ముంచింది. పెనుగాలి అతడి కలలను కల్లలు చేసింది. అయినప్పటికీ- ‘ముం దుంది మరింత మంచి కాలం’ అంటూ గప్పాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం నిండా మునిగిన రైతన్నకు కనీసంగానైనా చేయూతనివ్వడం లేదు. ప్రకృతి చేసిన పుండు నయమయ్యేందుకు తన వంతు సహకారం అందించకుండా.. దానిపై ‘కారం’ రాసినట్టు తాత్సారంతో వ్యవహరిస్తోంది. పెను తుపాను తాకిడికి పంట నష్టపోయిన ఖరీప్ వరి రైతులు.. కనీసం తడిసి, రంగుమారిన ధాన్యం కొనుగోలుకైనా సర్కారు ముందుకు వస్తే కొంతైనా ఊరటగా ఉంటుందని ఆశించారు. అయితే ఓట్ల కోసం రైతు భజన చేసే ప్రభుత్వం నిజంగా ఆదుకోవాల్సినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. హెలెన్ తుపాను దెబ్బకు ఖరీఫ్ వరిచేలు నేలనంటి, నీట మునిగిన విషయం తెలి సిందే. పోగా దక్కిన ధాన్యం రంగుమారి, నాణ్యత తగ్గింది. ఖరీఫ్‌లో 4 లక్షల టన్ను ల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా వేయగా దానిలో 40 శాతం రంగుమారిన, తాలు తప్పలు ఎక్కువగా వచ్చినదే. ఈ ధాన్యాన్ని క్వింటాల్ రూ.600 నుంచి రూ.700కు కొనుగోలు చేస్తామని ధాన్యం వ్యాపారులు చెప్పడంతో రైతులు అమ్మేం దుకు వెనకడుగు వేసి నాణ్యత తగ్గిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. అలాగేని ప్రభుత్వ పెద్దలు హామీలిచ్చారు కూడా. అయితే తుపాను వచ్చి నెలన్నర దాటుతున్నా ఇప్పటి వరకు కొనుగోలుకు అనుమతి రానేలేదు. రంగుమారిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ ఉన్నతాధికారులు పరిశీలించి కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయింది. ‘నీలం’ నాడే నయం.. గతంలో నీలం తుపాను వల్ల దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 17 శాతం లోపు రంగుమారిన, తేమ ఉన్న ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం అంతకుమించి ఒక్కో శాతం పెరుగుదలకు రూ.10 చొప్పున తగ్గించి కొనుగోలు చేసింది. అంటే ప్రస్తుతం మద్దతు ధర క్వింటాల్ రూ.1,310 వరకు ఉండగా, 18 శాతం దాటి తేమ, రంగుమారిన ధాన్యాన్ని రూ.1,300కు, 19 శాతం ఉన్న ధా న్యాన్ని రూ.1,290కు, 20 శాతం ఉన్న ధాన్యాన్ని 1,280కు కొనేలా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ తాత్సారంతో నిస్పృహ చెందిన చిన్న, సన్నకారు రైతులు రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకున్నారు. కొంతమంది పెద్ద రైతులు మాత్రమే రంగుమారిన ధాన్యాన్ని నిల్వ చేసి ఉంచారు. వారం రోజుల్లో లోపు కొనుగోలుకు అనుమతి ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. అయితే నాణ్యత తగ్గిన ధాన్యంలో 80 శాతం బహిరంగ మార్కెట్లో అయినకాడికి అమ్ముకున్నాక అనుమతి ఇచ్చినా.. ‘జడివాన వెలిశాక గొడుగు చేతపెట్టిన ’ చందమే అని రైతులు పెదవి విరుస్తున్నారు. -
అన్నదాతకు ‘మద్దతు’ ఏదీ?
తెనాలిటౌన్, న్యూస్‌లైన్: తుపానులు, తెగుళ్ల బారి నుంచి తప్పించుకున్న వరి రైతులు మార్కెట్లో ధాన్యానికి ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఖరీఫ్ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా లేక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఫ్రభుత్వం 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రకటించిన మద్దుతు ధర రూ.1150లు కూడా దక్కేలా లేదు. ఖరీఫ్ సీజన్లో సంభవించిన హెలెన్ తుపాను దాటికి నేలకొరిగి, నీట మునిగిన వరి పంటను ఒబ్బిడి చేసుకున్న రైతులు యంత్రాల సాయంతో నూర్పిళ్లు చేశారు. తీరా ధాన్యం ఇంటికి చేరేసరికి ధర లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం బస్తా రూ.1275-1300 మించి ధర పలకడం లేదు. అయితే ధాన్యం తడిసిందనే సాకు చూపుతూ వ్యాపారులు రైతులతో బేరమాడుతున్నారు. రూ.900-1000కి మించి ధర చెల్లించలేమని చెబుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 5.71 లక్షల ఎకరాల్లో అధిక సంఖ్యలో రైతులు బీపీటీ 5204 రకం వరి సాగు చేశారు. గుంటూరు జిల్లాలో 4.91 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలో 80 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇక తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్లో 93,750 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత ఏడాది నవంబర్ 21,22 తేదీల్లో వచ్చిన హెలెన్ తుపాను ధాటికి డివిజన్లో 50 వేల ఎకరాలు, జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. పంట దెబ్బతినడంతో తడిసిని ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. నూర్పిళ్ల అనంతరం ఎకరాకు 20-25 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదని రైతులు చెబుతున్నారు. కొల్లిపరలో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతు చెంచాల రామిరెడ్డి ఎకరాకు కేవలం 20 బస్తాలే చేతికొచ్చాయని చెప్పారు. 20 బస్తాల చొప్పున కౌలుకు తీసుకున్న రైతు వుయ్యూరు వేమారెడ్డి తన పొలంలో వచ్చిన దిగుబడి కౌలు చెల్లించేందుకు సరిపోయిందన్నారు. చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. తుపాను కారణంగా సగటున ఎకరాకు 7-8 బస్తాల ధాన్యాన్ని కోల్పోయారు. మద్దతు ధర కరువు.. చేతికొచ్చిన ధాన్యానికి మార్కెట్లో మద్దతు ధర కరువైంది. 75 కిలోల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1150 వుం డగా, తడిసి నాణ్యత తగ్గిందన్న సాకుతో రూ.900-1000 లకు వ్యాపారులు అడుగుతున్నారు. ఇంటికొచ్చిన ధాన్యాన్ని అమ్మితే కౌల ు చెల్లింపులకే సరిపోతోంది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అలాగే ఉండిపోతున్నాయి. సొంత భూమి కలిగిన రైతులకు వచ్చిన దిగుబడులు పెట్టుబడి ఖర్చులకు సరిపోతుందని చెబుతున్నారు. పంట తడిసిన కారణంగా వరిగడ్డి దెబ్బతిని అటు పశుగ్రాసానికీ ఇబ్బంది ఏర్పడే ఆస్కారముంది. కౌలు కూడా రాలేదు... మూడు ఎకరాలు కౌలుకు చేశాను. దోమ పోటు వల్ల కొంత, వర్షం వల్ల మరి కొంతపంట దెబ్బతింది. ఎకరాకు 20 బస్తాలు మాత్రమే చేతికి వచ్చాయి. 21 బస్తాలకు కౌలుకు తీసుకున్నా. - ఔతు బసివిరెడ్డి, కౌలు రైతు, కొల్లిపర మద్ధతు ధర ఇవ్వాలి రెండు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. గత ఏడాది ఎకరానికి 38 బస్తాలు దిగు బడులు వచ్చాయి. ఈ ఏడాది ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వం బస్తాకు రూ.1800లు మద్దతు ధర ప్రకటించాలి. - ఉప్పాల పెద్ద శివయ్య, కౌలు రైతు, కొల్లిపర -
రైతుల కష్టం కన్నీటి పాలు
మునిపంపుల(రామన్నపేట),న్యూస్‌లైన్: అన్నదాతకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. హెలెన్ తుపాను ప్రభావంతో అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నగా, ఈ రబీలోనైనా అప్పులు తీరుతాయనే వరిసాగు చేసిన రైతుల ఆశలు ఆది లోనే ఆవిరయ్యాయి. సమాచారం లే కుండా ఆసిఫ్ నహర్ కాలువకు సోమవారం రాత్రి నీళ్లు వదలడంతో అప్పటికే కాల్వకు పడిన గండ్ల నుంచి వరద నీరు నారుమళ్లలోకి చేరి సుమారు 100ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. దీంతో మునిపంపుల రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు ఆసిఫ్ నహర్ కాలువకు మునిపంపుల లో మూడుచోట్ల, కక్కిరేణిలో ఒకచోట గండిపడింది. అధికారులు గండ్లను పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలువ నీటికోసం ఎదురుచూడకుండా గ్రామ రైతులు బావులు, బోర్లకింద రైతులు రబీసాగును ఆరంభించారు. నార్లుపోసి నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఐబీ అధికారులు ఇంద్రపాలనగరం పెద్దచెరువు, శోభనాద్రిపురం, నీర్నెముల చెరువులను నింపారు. నీర్నెం ల చెరువు అలుగు నీళ్లతో పొలాలు మునుగుతాయని భావి ంచిన చెరువు దిగువన ఉన్న రైతులు సోమవారంరాత్రి గే ట్లు లేపడంతో నీరు దిగువకు పారింది. పెద్ద ఎత్తున వచ్చిన కాలువనీరు గతంలో పడిన గండ్ల గుండాపోయి పొలాలు మునిగాయి. దెబ్బతిన్న రోడ్లు వరద నీటి ఉధృతికి మునిపంపుల-ఇస్కిళ్ల గ్రామాల మధ్య వేసిన రోడ్డు తెగింది. గత వర్షాలకు తెగిన రోడ్డుకు ఇటీవలే మరమ్మతులు చేపట్టారు. మా మిండ్ల శేషాద్రి, కూనూరు రాములు, పాండు, గంగాధరి గోపాల్, డోగిపర్తి జానకిరాములు, సప్పిడి భాస్కర్‌రెడ్డి, భగవంతరెడ్డి, సోమవీరనర్స య్య, సద్దుల మల్లేశం, మిర్యాల రవిలకు చెందిన సుమారు 40 ఎకరాల పొలం, నారు మడులు నీటమునిగి ఇసుక మేట వేసింది. దీంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. తహసీల్దార్ బండఅరుణారెడ్డి, ఎంపీడీఓ కె.సునీత, ఏఈలు జి.కొండయ్య, సదానందం, సర్పంచ్ కూనూరు రాముల మ్మ, పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులు చంద్రశేఖర్, అం జయ్యలు దెబ్బతిన్న పొలాలు, రహదారులను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. -
అన్నదాతకు ఆసరా
సాక్షి, ఏలూరు : ఈ ఏడాది వరుసగా విరుచుకుపడిన తుపాన్లు, అధిక వర్షాల వల్ల అన్నదాత కష్టాల పాలయ్యాడు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని స్థితికి చేరారు. రబీ పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో కష్టాలు ఎదుర్కొం టున్న రైతులను ఆదుకోవాలని జిల్లా బ్యాంకర్లు నిర్ణయించారు. వచ్చే కొత్త ఏడాది కానుకగా తుపాను, వర్షాల బాధిత రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు. నవంబర్‌లో సంభవించిన హెలెన్ తుపాను, అధిక వర్షాలకు జిల్లాలో 2,46,250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు తేల్చారు. దాదాపు 1.82 లక్షల మంది రైతులను బాధితులుగా గుర్తించారు. వీరంతా ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.443.25 కోట్ల రుణాలు బ్యాంకుల నుంచి పొందారు. బాధిత రైతులు తహసిల్దార్ నుంచి అణావారీ ధ్రువీకరణ పత్రం తీసుకుని బ్యాంకులకు సమర్పిస్తే పంట రీ షెడ్యూల్‌ను వర్తింపచేస్తారు. మూడేళ్ల గడువు.. వడ్డీ రారుుతీకి మంగళం ఏటా జిల్లాలో దాదాపు 2 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.80 వేల వరకూ రుణం పొందుతుంటారు. ఎకరాకు రూ.18 వేల చొప్పున తీసుకున్న రుణాలను ప్రస్తుతానికి తిరిగి చెల్లించనవసరం లేకుండా రీషెడ్యూల్ చేయనున్నారు. ఆ మొత్తాలను మూడేళ్లలోపు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలావుండగా, స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్పు చేయడం వల్ల రైతులు రాయితీలను కోల్పోతారు. పంట రుణంపై సాధారణంగా వడ్డీ ఉండదు. రీ షెడ్యూల్ వల్ల రుణం చెల్లించేంతవరకూ అసలుపై 10 శాతం వడ్డీ చెల్లించాలి. అయినా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చుకుని అధిక వడ్డీలు చెల్లించేకంటే ఇదే మంచిదని రైతులు పేర్కొంటున్నారు. ఎక్కువ మందికి రుణాలివ్వాలని నిర్ణయం ఈ ఏడాది రబీ ఆశాజనకంగా ఉంటడంతో బ్యాంకులు లక్ష్యాన్ని మించి పంట రుణాలు మంజూరు చేసేందుకు ముందుకొస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ.4,374 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ రూ.4,250 కోట్లు ఇచ్చేశారు. ఇంకా మూడు నెలలు అంటే వచ్చే మార్చి వరకూ రబీ రుణాలు పొందే అవకాశం ఉంది. అప్పటికి మరో రూ.500 కోట్లు రుణాలుగా ఇస్తామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. దీని ప్రకారం చూస్తే ఈ ఏడాది రుణ లక్ష్యం దాటి రూ.376కోట్లు రైతులకు అదనంగా అందనున్నాయి. -
అమ్మబోతే అశనిపాతమే..
అమలాపురం, న్యూస్‌లైన్ :వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి భారీగా పడిపోతే ..మార్కెట్లో వాటికి డిమాండ్ పెరగడం సర్వసాధారణం. ఇటీవల వరదలు, తుపానులు కారణంగా కాయగూరల దిగుబడి తగ్గడంతో వాటి ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే రైతు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రకృతి విపత్తులతో ఖరీఫ్‌లో మూడొంతుల దిగుబడి పడిపోయినా ధాన్యం ధర మాత్రం పెరగకపోవడం వెనుక అటు దళారుల దోపిడీతోపాటు ఇటు రైతుల తక్షణ అవసరాలు, వారిని ఆదుకోవలసిన ప్రభుత్వంలో క్షమార్హం కాని అలసత్వం కారణంగా నిలిచాయి. ఖరీఫ్‌లో అధికారుల అంచనా ప్రకారం 12 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, హెలెన్ తుపాను వల్ల దిగుబడి 4 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే అంచనా వేసిన దాన్లో మూడోవంతు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆ ధాన్యం కూడా సగానికి పైగా రంగుమారిన, మొలకలు, తాలుతప్పలతో ఉంది. సుమారు రెండులక్షల టన్నుల ధాన్యం మాత్రమే నాణ్యమైన దిగుబడిగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. మొత్తం సాగులో 85 శాతం స్వర్ణరకాన్నే రైతులు పండించారు. దిగుబడి ఇంత గణనీయంగా పడిపోయిన సమయంలో ధాన్యానికి మంచి ధర రావాల్సి ఉంది. అయితే 24 క్యారట్ల పసిడి వంటి పసిమి వన్నె ధాన్యమైనా బహిరంగ మార్కెట్లో బస్తా (75 కేజీలు) ధర రూ.1,020 మాత్రమే పలుకుతోంది. దీని ప్రకారం క్వింటాల్ ధర రూ.1,360 కావడం గమనార్హం. క్వింటాల్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,310 కన్నా కేవలం రూ.50 మాత్రమే ఎక్కువ వస్తోంది. దిగుబడి తగ్గినా ధర పెరగకపోవడానికి దళారులు, ప్రభుత్వం కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. నిల్వ చేసుకోలేని నిస్సహాయులు రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వారిని నిలువునా ముంచేయడంలో సిద్ధహస్తులైన ధాన్యం దళారుల పంట మరోసారి పండుతోంది. నాణ్యమైన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.50 అదనంగా ఇచ్చి కొంటున్నా రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని మాత్రం కేవలం రూ.600 నుంచి రూ.700 మధ్య కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నారు. రైతుల్లో చాలామంది దళారుల వద్ద అప్పులు చేసి ఖరీఫ్ పెట్టుబడులు పెట్టిన వారే. దిగుబడి తగ్గినందున కొద్దిపాటి ధాన్యాన్ని నిల్వ చేసుకోగలిగితే ముందుముందు మంచి ధర లభించే అవకాశం ఉంది. అయితే అప్పులిచ్చిన దళారులు రైతులపై ఒత్తిడి తెచ్చి ధాన్యం అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కోతలు పూర్తవుతున్న సమయంలోనే తూర్పు, మధ్యడెల్టాల్లో తీరప్రాంతాల్లో రబీసాగు ప్రారంభమైంది. నీటి లభ్యత తక్కువగా ఉండడంతో నారుమళ్లు పోయాలని అధికారులు ఒత్తిడి తేవడంతో రైతులు నూర్పులు పక్కనబెట్టి రబీపనుల్లో తలమునకలయ్యారు. ఈ కారణంగా కూలీల కొరత ఏర్పడి నూర్పులు లేక వరిపనలు కళ్లాల్లోనే ఉండిపోయాయి. వర్షాల కారణంగా కంబైండ్ హార్వెస్టర్ వంటి పెద్ద యంత్రాలతో ఒకేసారి కోతలు, నూర్పులు చేసే అవకాశం లేకపోయింది. కేవలం నూర్పులు చేసే యంత్రాలు తక్కువగా ఉండడంతో పంటలో చాలావరకు కళ్లాలకే పరిమితమైంది. ‘రైతు బంధు’ ఉన్నా విధి లేక.. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అన్నదాత విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. రంగుమారిన, నాణ్యతలేని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అధికారుల బృందం ధాన్యం నాణ్యతను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలుకు అనుమతివ్వలేదు. దీంతో దళారులు తాము ‘నిర్ణయించిందే నాణ్యత.. ఇచ్చిందే ధర’ అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్‌యార్డుల్లో ‘రైతు బంధు’ పథకంలో ధాన్యాన్ని నిల్వ చేసుకుని మార్కెట్లో ధర పెరిగినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంది. నిల్వ చేసిన ధాన్యం విలువలో 75 శాతం మార్కెట్ యార్డు రుణంగా కూడా అందిస్తుంది. ఇలా లక్ష రూపాయల వరకు రుణం పొందే అవకాశమున్నా రైతులకు దీనిపై అవగాహన లేకపోవడం, అవరాలు తరుముకు రావడం, దళారుల ఒత్తిడి కారణంగా అయినకాడికి అమ్ముకోక తప్పడం లేదు. -
జిల్లాలో హెలెన్ తుపాను నష్టం రూ.88 కోట్లు
సాక్షి, ఏలూరు : అల్పపీడనం నేపథ్యంలో కురి సిన అధిక వర్షాలు, హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లాలో ఏర్పడిన పంట నష్టాల్ని వ్యవసాయ శాఖ లెక్క తేల్చింది. ఈ రెండు ఉపద్రవాల వల్ల రూ.107.59 కోట్లమేర పంట నష్టం వాటిల్లినట్టు ఆ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. భారీ వర్షాలకు రూ.19.59 కోట్ల నష్టం వా టిల్లినట్లు ఇప్పటికే నివేదించిన అధికారులు ‘హెలెన్’ కారణంగా రూ.88 కోట్ల నష్టం ఏర్పడినట్టు తాజాగా నివేదిక పంపారు. నరసాపురం డివిజన్లో8 మండలాల్లోని 37 గ్రామాల్లో హెలెన్ తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. తుపాను ధాటికి 2 లక్షల 74 వేల 082.5 ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతానికి పైగా పాడైన పంటనే నష్టం జరిగినట్టు లెక్కలోకి తీసుకుంటారు. ఆ విధంగా జిల్లాలో 2 లక్షల 20 వేల ఎకరాలు హెలెన్ తుపాను నష్టం జాబితాలో చేర్చారు. అంతకుముందు వచ్చిన అధిక వర్షాలకు 50 శాతానికి మించి నష్టం జరిగిన పంట ను 50 వేల ఎకరాలుగా గుర్తించారు. పంట నష్ట పరిహారం త్వరగా మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ తెలిపారు. అయితే ఈ పంట నష్టం లెక్కలపై రైతులు మండిపడుతున్నారు. అధిక వర్షాలు, హెలెన్ తుపానుకు పాడైన పంట వ్యవసాయ శాఖ లెక్కల కంటే రెట్టింపు ఉంటుందని చెబుతున్నారు. -
వెన్నులో వణుకు
చీరాల, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు.. అకాల వర్షాలకు అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కోటి ఆశలతో మొదలైన సాగు ఏటా కళ్ల ముందే తుడిచి పెట్టుకుపోతుండటంతో రైతులు కుదేలవుతున్నారు. ఈ పాటికే జల్, లైలా, నీలం వంటి తుపాన్ల ధాటిని తట్టుకోలేక సర్వం కోల్పోయారు. వ్యవసాయం కోసం తెచ్చిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే గత నెలలో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని 90 శాతం వ్యవసాయ పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం పై-లీన్ తుపాను నుంచి బయట పడినప్పటికీ లెహర్ తుపాను ప్రభావం ఎటువంటి విపత్తును మిగులుస్తుందోనని రైతులు వణికిపోతున్నారు. లెహర్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వరి, వేరుశనగ, పత్తి, పొగాకు, మరికొన్ని పంటలు సాగవుతున్నాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వరి, మొక్కజొన్న, పొగాకు, కంది, వేరుశనగ, మినుముతో పాటు సుమారు 1.96.200 హెక్టార్ల పంటలు దెబ్బ తిన్నాయి. ప్రభుత్వం నుంచి విత్తన సాయం కూడా అందలేదు. వ్యవసాయం వదులు కోవడం ఇష్టం లేక రైతులు మళ్లీ సాగు మొదలు పెట్టారు. కొన్నిచోట్ల దెబ్బతిన్న పత్తిని పీకేసి మళ్లీ నాటారు. మరికొన్ని చోట్ల దెబ్బతిన్న పత్తిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు పత్తికి * 30 నుంచి * 35 వేల వరకు ఖర్చు చేశారు. గత నెలలో కురిసిన వర్షాలకు వరి పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా ప్రస్తుతం మళ్లీ నార్లు పోశారు. చీరాల వ్యవసాయ సబ్ డివిజన్లో ఉన్న చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వరి 4185 హెక్టార్లు, మొక్కజొన్న 1566 హెక్టార్లు, వేరుశనగ 177 హెక్టార్లు, మిరప 380 హెక్టార్లు, పొగాకు 1500 హెక్టార్లు, శనగ 300 హెక్టార్లలో సాగు చేశారు. ఇవి కాక కూరగాయలను 35 హెక్టార్లలో సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరానికి * 9 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం వైట్‌బర్లీ సాగు చేస్తున్నారు. పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లో పొగాకు సాగులో ఉంది. ఎకరాకు * 10 వేల వరకు ఖర్చయింది. మరికొన్ని పంటలు కూడా సాగవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని రైతులు బెంబేలెత్తుతున్నారు. ఏటా వరుసగా ఎదురవుతున్న నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు లెహర్ ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఏమి జరుగుతుందో, వేసిన పంటలు ఏమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు ఇక్కడితో ఆగితే పంటలకు పెద్దగా నష్టం ఉండదు. మరో రోజు కొనసాగినా, అధిక వర్షాలు కురిసినా పొలాలు మళ్లీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. సర్కార్‌పై నమ్మకం వదులుకున్న అన్నదాతలు ఏటా ఎదురవుతున్న విపత్తులతో సర్వం కోల్పోయి అప్పుల పాలవుతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదు. నష్ట పరిహారం పంపిణీ చేస్తుందన్న ఆశ అన్నదాతలకు లేదు. గతంలో సంభవించిన నీలం, జల్ తుపానుకు సంబంధించిన నష్టపరిహారం పూర్తిగా రైతులకు చేరలేదు. బ్యాంక్ ఖాతాలతో పాటు అనేక ఆంక్షలతో పరిహారం రైతుల చేతికి పూర్తిగా అందలేదు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీతో పాటు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే హామీ ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు. 50 శాతంపైగా పంటలు దెబ్బతింటేనా పరిహారం జాబితాలో పేర్లు నమోదు చేస్తామని, లేకుంటే నష్టపోయినట్లుగా లెక్కల్లో పరిగణనలోకి తీసుకోమంటూ కిరణ్ స ర్కార్ మొండికేస్తోంది. ఒకవేళ ఏదైనా ఉపద్ర వం ముంచుకొచ్చి నష్టం జరిగినా మిగిలేది మొండిచెయ్యే కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశ రైతులు వదిలేశారు. -
ఫైలీన్ పరిహారం అందేదెన్నడో?
జహీరాబాద్, న్యూస్‌లైన్: నియోజకవర్గంలో అక్టోబర్ నెల చివరి వారంలో వచ్చిన ఫైలీన్ తుఫాన్ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు హెలిన్ తుఫాన్ రూపంలో మరో దెబ్బ పడింది. దీంతో అన్నదాతలు పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో 12,927 హెక్టార్లలో రైతు లు పత్తి పంటను సాగు చేసుకున్నారు. ఎకరా పత్తి పంట సాగు కోసం సుమారు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేశారు. పంట బాగా వస్తే ఎకరాలకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే పత్తి పంట సాగు సమయంలో అంటే జూన్‌లో వర్షాలు విరివిగా పడ్డాయి. దీంతో పంట ఎదుగుదల కొంత మేర దెబ్బతింది. దీం తో తరువాత అకాల వర్షాలు కూడా పంటను దెబ్బతీశాయి. దీనికి తోడు అక్టోబరు నెల చివరి వారంలో ఫైలీన్ తుఫాన్ దెబ్బకు పంట దాదాపు దెబ్బతింది. దీంతో ఎకరాలకు పత్తి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మొక్కకు ఐదు కాయలకు మించి కాత లేని పరిస్థితి కూడా ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. అయితే రెండు రోజుల క్రితం కురిసిన హెలిన్ తుఫాన్ కారణంగా పూత మొత్తం రాలిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి పంటపై పెట్టిన పెట్టుబడులు ఒక్క పైసా కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. కాత కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం, అధికారులు ఎందుకు పరిగణలోకి ఎందుకు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధిక వర్షాల కారణంగా పత్తి పంట ఎదగకుండా పోయిందని, చివరి దశలో ఉన్న వర్షాలు కూడా ఉన్న కొద్ది పంటను కూడా దెబ్బ తీశాయని అన్నదాత లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలో వచ్చిన వర్షాలు పంటలో అంతర కృషి చేసేందుకు వీలు లేకుండా చేసిందని వారు పేర్కొంటున్నారు. దీంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిని అప్పుల ఊబిలోకి నెట్టిందని వాపోతున్నారు. అయినా పరిహారం కిందకు పత్తిపంటను తీసుకోక పోవడంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంపై సీఎం వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీరు పరిహాసం పత్తి పంటను సాగు చేసుకున్న రైతాంగం విషయంలో ప్రభుత్వం తీరును పలువురు తప్పుపడుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట దెబ్బతింటేనే పరిహారం అంటూ మెలికలు పెట్టడం పత్తి రైతులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫైలీన్ తుపాన్ ప్రభావంతో 70 శాతానికి పైగా పత్తి పంట పూత నేల రాలింది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పత్తిపంట నలుపు రంగు మారింది. మరి ఇది నష్టం కిందకు ఎందుకు రాదో చెప్పాలని రైతాంగం ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మేధావులను ప్రశ్నిస్తోంది. పత్తి పంటను నష్టం కింద గుర్తించకుండా ప్రభుత్వం తమతో పరిహాసం ఆడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేడు జననేత వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో హెలెన్ తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. పంట పొలాలను చూసి బాధిత రైతులను పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఆయన నరసాపురం చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు నరసాపురంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభిస్తారు. నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న వరి తదితర పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. పర్యటన షెడ్యూల్ ఇదీ.. నరసాపురం నియోజకవర్గంలో.. సారవ : దెబ్బతిన్న వరి పొలాల పరిశీలిస్తారు. పెదమైనవానిలంక : సముద్రపు కోతకు గురైన ప్రాంతం పరిశీలిస్తారు. మత్స్యకారులను పరామర్శిస్తారు. రామన్నపాలెం : దెబ్బతిన్న కూరగాయల తోటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులకు పరామర్శిస్తారు. పాలకొల్లు నియోజకవర్గంలో.. దిగమర్రు: దెబ్బతిన్న వరి పొలాల పరిశీలిస్తారు. జిన్నూరు : పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శిస్తారు. వేడంగి : అరటి తోటలు, వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. -
వరి మునిగి..కొబ్బరి ఒరిగి..
అమలాపురం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపానుకు వరి పంట నష్టపోయిన రైతులు కొంతమంది అయితే.. కొబ్బరి పంట నష్టపోయింది మరికొందరు. కాని తీర ప్రాంత మండలాల్లో వందల మంది రైతులు అటు వరి, ఇటు కొబ్బరి పంటలు సైతం ఒకేసారి దెబ్బతినడంతో రెండువిధాల నష్టపోయి లబోదిబోమంటున్నారు. జిల్లాలో కోనసీమతోపాటు తీర ప్రాంత మండల్లాలో వరి రైతులు తమ పొలాల వద్ద ఉండే కమతాలు, నూర్పిడులు చేసే కళ్లాలు, చేలగట్ల మీద కొబ్బరి చెట్లను పెంచుకుంటారు. ఇలా పెంచిన చెట్ల నుంచి వచ్చే ఆదాయం రైతులకు ‘వేడి నీళ్లకు చన్నీళ్లుగా’ ఉండేది. ఎకరా కొబ్బరి తోటలో 60 నుంచి 80 చెట్లు వేయగా, ఎకరా వరి చేను చుట్టూ సుమారు 40 నుంచి 50 చెట్ల వరకూ వేస్తూంటారు. తోటల్లో మాదిరిగా ఎనిమిది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల పొడవుకు ఒకటి చొప్పున కాకుండా గట్ల మీద చెట్లు పక్కపక్కనే వేస్తూంటారు. కొబ్బరి తోటలు తక్కువగా ఉండే తీర ప్రాంత మండలాల్లోని వరి పొలాల్లో తప్పనిసరిగా గట్ల మీద చెట్లు పెంచుతూంటారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న తాళ్లరేవు, కాకినాడ రూరల్, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, తుని, తొండంగి, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి, అమలాపురం మండలాల్లో వరి చేల చుట్టూ కొబ్బరి చెట్లను పెంచుతూంటారు. సుమారు 1.20 లక్షల ఎకరాల వరి చేల చుట్టూ, కమతాల చుట్టూ కొబ్బరి సాగు చేస్తున్నారని అంచనా. ఎకరాకు 40 నుంచి 50కి తక్కువ కాకుండా చెట్లు ఉండే అవకాశమున్నందున రైతుకు సాలీనా మూడు వేలకు తక్కువ కాకుండా కొబ్బరి కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరికాయ సగటున రూ.4 ధర కడితే రైతుకు ఏడాదికి రూ.12 వేల వరకూ వచ్చేది. వరి రైతులకు ఇది అదనపు ఆదాయంగా ఉండేది. గడచిన ఐదేళ్ల కాలంలో నాలుగుసార్లు ఖరీఫ్ దెబ్బతిన్నా రైతులకు కొబ్బరిపై వచ్చే ఆదాయంతో కనీసం ఇల్లు గడిచేది. ఖరీఫ్ నష్టం రబీలో పూడ్చగా, మూడో పంట అపరాలు లేకపోవడంతో రైతులకు కొబ్బరి ఆదాయమే మిగిలేది. కౌలుదారులకు కొబ్బరి ఆదాయం చేయూతనిస్తుంది. హెలెన్ తుపానువల్ల గట్ల మీద చెట్లకు ఎక్కువ నష్టం వాటిల్లింది. తోటలతో పోల్చుకుంటే గట్ల మీద చెట్లే ఎక్కువగా దెబ్బతిన్నాయి. తోటల్లో చెట్లు గుబురుగా ఉండడం వల్ల గాలుల తీవ్రత నేరుగా పడని కారణంగా నష్టం తక్కువగా ఉంది. పొలాల గట్ల మీద చెట్లకు పెనుగాలులు నేరుగా తగలడంతో ఎక్కువ చెట్లు విరిగిపోయాయి. పైగా తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీరప్రాంత మండలాల్లో పెద్ద సంఖ్యలో గట్ల మీద పెంచిన చెట్లకు ఎక్కువ నష్టం వాటిల్లింది. తీరాన్ని ఆనుకుని చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులు సైతం కొబ్బరి చెట్లను ఎక్కువగా పెంచుతుంటారు. ఇటువంటిచోట్ల కూడా చెట్లు పడిపోయాయి. కొబ్బరి తోటల్లో ఎకరాకు మూడు చెట్ల వరకూ పడిపోగా, పొలంగట్ల మీద ఎకరాకు ఐదు చెట్లు పడిపోయినట్టు అంచనా. జిల్లాలో తుపాను ప్రభావంతో 80 వేల కొబ్బరి చెట్లు పడిపోయాయని అంచనా కాగా, దీనిలో 50 వేల వరకూ చెట్లు గట్లు, కళ్లాల్లోవి కావడం గమనార్హం. పెనుగాలులకు కొబ్బరి చెట్లు మొవ్వులు విరగడం, ఆకులు, పిందెలు, బొండాలు రాలిపోవడం వల్ల దిగుబడిపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కురిసిన భారీ వర్షాలకు అటు వరి పంట మొత్తం పోగా, ఇటు కొబ్బరి చెట్లు నేలకొరిగి వచ్చే అదనపు ఆదాయం కూడా పోవడంతో తీర ప్రాంత మండలాల రైతులు రెండు విధాలుగా నష్టపోయినట్టయింది. -
కన్నీరు తుడిచి..తోడుగ నిలిచి
సాక్షి, కాకినాడ : అన్నదాతల్లో మనోధైర్యం నింపుతూ..ఆపన్నులకు భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. నేలకొరిగిన పంటపొలాలను మోకాలు లోతు బురదలో దిగి స్వయంగా పరిశీలించారు. నేలనంటిన అరటితోటల్లోకి వెళ్లి రైతుల గోడు విన్నారు. తలతెగిన మొండి కొబ్బరిచెట్లను చూసి రైతన్నల వెతలు విన్నారు. హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకున్న జగన్ రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల మీదుగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వద్దకు వచ్చేసరికి వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. ఏడాదిన్నర తరువాత బెయిల్‌పై బయటకొచ్చాక తొలిసారిగా కోనసీమలో అడుగుపెట్టిన జగన్‌తో పాటు బాధితులను పరామర్శించేందుకు పార్టీ నేతలతో పాటు వేలాదిగా పార్టీ శ్రేణులు జనసైన్యంలా కదిలివచ్చాయి. పుట్టెడు కష్టాల్లోఉన్నప్పటికీ జననేతను చూసేందుకు..తమ గోడు చెప్పుకునేందుకు కోనసీమ వాసులు కూడా అడుగుడుగునా రహదారికి ఇరువైపులా బారులు తీరారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన నియోజకవర్గంలో హెలెన్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని జగన్‌కు వివరించారు. రావులపాలెం నుంచి కొత్తపేట మీదుగా వెలిశెట్టివారిపాలెంకు చేరుకున్న జగన్ నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించి అరటి రైతులతో మాట్లాడారు. రూ.70వేల నుంచి 80వేల వరకు పెట్టుబడులు పెట్టామని.. రూ.30 వేలు శిస్తు చెల్లించాల్సి ఉందని తీరా పంట చేతికందే సమయంలో హెలెన్ విరుచుకుపడడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం* అంటూ అరటి రైతులు గోడు చెప్పుకోగానే జగన్ చలించిపోయారు. ఈ ప్రభుత్వానికి మనసులేదు..మనసున్న వారు పాలకులుగా లేకపోవడం వల్లనే రైతులకీ దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి దారిపొడవునా బాధితులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు..యువకులు బారులు తీరడంతో కోనసీమ పర్యటన ఆద్యంతం సుమారు ఐదుగంటలకు పైగా ఆలస్యంగా కొనసాగింది. ఎక్కడికక్కడ బాధితులు బారులు తీరి కాన్వాయ్‌కు అడ్డపడడంతో ఆయన పర్యటన ముందుకు సాగడం కష్టమైంది. దారిలో నేలనంటిన పొలాలను చూపిస్తూ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌లు కోనసీమలో నూరు శాతం వరిపంట నాశనమైందని..వే లాది కొబ్బరిచెట్లు నేలకొరిగాయని, 10వేలకు పైగా ఎకరాల్లో అరటితోటలు పడిపోయాయని వివరించారు. ముక్కామల, నేదునూరిచినపాలెం, మొసలపల్లి, పాలగుమ్మి, నడిపూడి మీదుగా ఈదరపల్లి వంతెన వరకు కాలువగట్టు... బాధితులతో కిక్కిరిసిపోయింది. అడుగడుగునా వీరు జగన్‌కు ఎదురేగి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ కూడా ఓపిగ్గా బాధితులున్న ప్రతిచోటా ఆగి వారి వెతలు వింటూ సమస్యల పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. ఇళ్లు కూలిపోయాయి..కనీసం కేజీ బియ్యం కూడా ఇవ్వలేదు అంటూ ఎన్.చినపాలెం వద్ద లక్ష్మీనరసమ్మ అనే వృద్ధురాలు జగన్ వద్ద వాపోయింది. పాలగుమ్మి, నడిపూడి లాకుల వద్ద వృద్ధులను పలుకరించి ఁతుపాను సాయం అందిందా* అంటూ ఆరా తీయగా వారం రోజులవుతున్నా కనీసం ఎలాంటి సాయం అందలేదని వారు చెప్పారు. మంచిరోజులొస్తాయి.. ధైర్యంగా ఉండండి అమలాపురం మీదుగా ముమ్మిడివరం మండలం చెయ్యేరు అగ్రహారం చేరుకున్న జగన్ నేలకొరిగిన పంటపొలాల్లోకి దిగి పరిశీలించారు. రైతులు వారిస్తున్నా మోకాలు లోతు బురదలోకి దిగి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. నేను మూడు ఎకరాలు కౌలుకు చేశాను..నాకు ఇద్దరు పిల్లలు.. ఇల్లు..వాకిలి చివరకు మా ఆవిడ పుస్తెలతో సహా తాకట్టు పెట్టి సాగు చేశాను.. తీరా పంటచేతికొచ్చే సమయంలో ఇలా జరిగింది..నాకు చావు తప్ప మరోగత్యంతరం లేదంటూ గాలిదేవర పేరయ్యనాయుడు పురుగు మందు డబ్బా చూపిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయగా, జగన్‌తో సహా అక్కడున్న వారంతా వారించి త్వరలోనే మీ అందరికి మంచిరోజులొస్తాయి ధైర్యంగా ఉండమని చెప్పారు. చెయ్యేరు వద్ద బర్ల చినవ్బైయి తాను మూడెకరాలు సాగు చేశాను. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు కనీసం ఎకరాకు బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు..రాజన్న పోయిన తర్వాత రైతుల బతుకులు అధ్వానంగా తయారయ్యాయంటూ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నీలం తుపాను సాయం అందిందా అని ఆరా తీయగా ఇప్పటి వరకు రాలేదని చెప్పాడు. తుపాను ప్రభావానికి గురైన రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. మీ తరఫున పోరాడతానని రైతులకు భరోసా ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమకారుడి కుటుంబానికి పరామర్శ అనంతరం ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో మృతిచెందిన కాట్రేనికోన మండల వైఎస్సార్ సీపీ సేవాదళ్ కన్వీనర్ గిడ్డి దివాకర్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో దివాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దీక్షలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తుల సాయి జగన్‌కు వివరించారు. తాను కూడా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నానని, మీకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ఆ కుటుంబానికి జగన్ భరోసానిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకే కాట్రేనికోన చేరుకోవాల్సి ఉన్నప్పటికీ రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నప్పటికీ వందలాది మంది బాధితులు, మహిళలు కాట్రేనికోన సెంటర్లో ఆయన రాకకోసం సుమారు ఐదుగంటల పాటు వేచి ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను జగన్‌కు వివరించారు. మత్స్యకారులు పట్టుబట్టడంతో కాట్రేనికోన సెంటర్లో ప్రసంగిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.. రైతులు.. బాధితులు గోడు చెబుతుంటే గుండె తరుక్కు పోయింది ..ఇలాంటి ప్రభుత్వ పాలనలో నేను ఈ రాష్ర్టంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. కానీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎంకు సిగ్గులేకపోవడం బాధాకర మన్నారు. ఐదురోజులుగా వర్షాలు కురిసినా కనీసం ఏం జరిగిందని అడిగే నాధుడే లేరు.. కనీసం కేజీ బియ్యం కానీ. లీటర్ కిరసనాయిలు కానీ ఇవ్వలేదంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలలు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది.. మిమ్మల్నందర్ని ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాదరావు ఇంటికి వెళ్లి ఆయన్ని పలుకరించి మోకా ఆనందసాగర్తో మాట్లాడారు. కొవ్వొత్తులు, బుడ్డిదీపాలతో ఎదురుచూపులు కోనసీమ అంతా అంధకారం అలముకున్నప్పటికీ తమ గోడు వినేందుకు వస్తున్న జగన్‌ను చూసేందుకు బాధితులు, మహిళలు బుడ్డిదీపాలు, కొవ్వొత్తులతో రోడ్డుపక్కనే నిలబడి ఎదురుచూశారు. జగన్ రాగానే వారి ఆవేదనను వెళ్లగక్కుకొని కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 10.35 గంటల సమయంలో ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ తనకోసం వందలాదిగా వేచి ఉన్న బాధితులు, మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
లెహర్ వణుకు
అమలాపురం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను చడీచప్పుడు లేకుండా వచ్చి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తే... ఇంకా రాకుండానే జిల్లావాసులను ‘లెహర్’ తుపాను వణికిస్తోంది. 1996లో కోనసీమను చావుదెబ్బ తీసిన పెను తుపానును మించి లెహర్ విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం ఒకవైపు చాటింపు వేస్తూ... మరోవైపు తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఆరంభించింది. నేటి నుంచి ప్రభావం లెహర్ తుపాను జిల్లాపై బుధవారం నుంచి ప్రభావం చూపుతుందని సమాచారం. దీనివల్ల బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముంది. లెహర్ తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షం కురిసే అవకాశముంది. ఈ తుపాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని, ఇదే జరిగితే 1996లో కోనసీమను తాకిన పెను తుపాను కన్నా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నది జిల్లావాసులను, ముఖ్యంగా కోనసీమ వాసులను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ తుపాను వల్ల కలిగిన నష్టం కళ్లముందుండగానే మరో విపత్తును ఎదుర్కోవాల్సి రావడం వారిని వణికిస్తోంది. జిల్లాలోని తీరప్రాంత మండలాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నా.. కోనసీమ మరోసారి భారీగా నష్టపోయే అవకాశముంది. వణికిపోతున్న కొబ్బరి రైతు 1996 తుపానుకు 30 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. అంతకన్నా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశముందని తెలియడంతో కొబ్బరి రైతులు నిలువునా వణికిపోతున్నారు. ఇప్పటికే హెలెన్ తుపాను వల్ల వరితో పాటు, కొబ్బరి పంట ఎక్కువగా దెబ్బతింది. చెట్లు బతికినా జీవచ్ఛవాలుగా ఉన్నాయి. ఈ సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తే చెట్లు నిలువునా కూలిపోతాయని రైతులు వాపోతున్నారు. ‘తుపాను తీవ్రతకు పంటలు పోతే పోయాయి. కనీసం ప్రాణాలతో మిగిలితే చాలు’ అనుకునే స్థాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క తుపాను విద్యుత్ శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించే పనిని ఇప్పటికీ సగం పూర్తి చేయని సిబ్బంది లెహర్ వల్ల కలిగే నష్టాన్ని ఊహించుకుని ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు 1996 తుపాను వల్ల అపారంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఈసారి తుపానుకు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాటింపు, మైకు ప్రచారాలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. పూరిపాకలు, గుడిసెలు, పాత భవనాల్లో ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తక్షణం తరలివెళ్లాలని హెచ్చరిస్తున్నారు. తుపాను సమయంలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని చెబుతున్నారు. కోనసీమ తుపాను వల్ల తీరంలో మత్స్యకారులు ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వారిని తరలించేందుకు అధికారులు చర్యలు ఆరంభించారు. కోనసీమలో 74,513 మందిని తరలించాలన్న అంచనాకు వచ్చారు. కాట్రేనికోన మండలంలో అత్యధికంగా 22,654 మందిని తరలించాలని గుర్తించారు. ఇప్పటికే మగసానితిప్ప నుంచి 140 మందిని మంగళవారం బలుసుతిప్పలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ రెండుసార్లు ఈ మండలంలో ఇప్పటికే పర్యటించగా, తాజాగా జేసీ ఎం.ముత్యాలరాజు ఇక్కడే ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాలవారిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో తుపానుపై అవగాహన కల్పించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌కు చెందిన ఏడు బృందాలు కోనసీమకు చేరుకున్నాయి. 40 మంది సభ్యులుగా ఉండే ఈ బృందాల్లో రెండు కాట్రేనికోన మండలంలోను, మరో రెండు ఐ.పోలవరం మండలంలోను, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉంచారు. పెనుగాలులకు బస్సులు బోల్తా పడవచ్చని, చెట్లు బస్సులపై పడవచ్చని, అందువల్ల గురువారం ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
చంద్రబాబు జిల్లా పర్యటన ఇలా
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం పర్యటించనున్నారు. ముంపు ప్రాంత నియోజకవర్గాలైన పాలకొల్లు, నరసాపురం, భీమవరంలలో 65 కి.మీ మేర ఆయన పర్యటించనున్నారు. ఉద యం 9 గంటలకు దిండి రిసార్ట్నుంచి బయలుదేరి యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిమీదుగా జిల్లాలో ప్రవేశిస్తారని పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. యలమంచిలిలో పొలాలను చంద్రబాబు పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం ఊటాడ-కాజతూర్పుమీదుగా బ్రిడ్జివరకు చేరుకుని అక్కడ పొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత పెదమామిడిపల్లి మీదుగా దిగమర్రు, నరసాపురం-మత్స్యపురిరోడ్డు బ్రిడ్జిమీదుగా చినమామిడిపల్లి, శరపల్లి, లిఖితపూడిమీదుగా కొప్పర్రు, భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి, తుందుర్రు ప్రాంతాల్లో పొలాలను పరిశీలించి పంట స్థితిగతులపై రైతులను చంద్రబాబు అడిగి తెలుసుకుంటారు. అనంతరం భీమవరం టౌన్ నుంచి ఉండి, చెరుకువాడ, ఆకివీడు మీదుగా ఉప్పటేరు బ్రిడ్జి నుంచి చంద్రబాబు కృష్ణాజిల్లాలో ప్రవేశిస్తారని ఆమె వివరించారు. -
‘హెలెన్’ నష్టం రూ.501.22 కోట్లు
సాక్షి, ఏలూరు : హెలెన్ తుపాను నష్టాలను అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో మొత్తంగా రూ.501.22 కోట్ల మేర పంట, ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొంటూ నివేదిక రూపొందించారు. దానిని సోమవారం ప్రభుత్వానికి పంపించారు. తీరానికి సమీపంలో ఉన్న నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలపై హెలెన్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని తేల్చారు. బియ్యపుతిప్ప, మర్రితిప్ప, దర్భరేవు, పీఎం లంక, లక్ష్మణేశ్వరం, కేపీ పాలెం, లోసరి, దొంగపిండి, నాగిడిపాలెం, వెదుర్లంక, వేముల దీవి, వైవీ పాలెం గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. అధికారిక గణాంకాల ప్రకారం..హెలెన్తుపాను ధాటికి జిల్లాలో 2,74,082.5 ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 6,472 ఎకరాల్లో అరటి, కొబ్బరి, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. 200కు పైగా కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. మరో 200 కొబ్బరి చెట్లు మొవ్వు విరిగిపోవడంతో బతికే అవకాశాలు లేవు. 1,389 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఓ ఇల్లు, 66 కచ్చా ఇళ్లు పూర్తిగా పడిపోయాయి. పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లు 34 కాగా, పాక్షికంగా దెబ్బతిన్న కచ్చా ఇళ్లు 121. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు 995, గుడిసెలు 212 కాగా, మొత్తం నష్టం రూ.34.46 లక్షలుగా అంచనా వేశారు. ఇదిలావుండగా 62 వృక్షాలు నేలకూలాయి. ఈ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పంచాయతీరాజ్‌కు చెందిన 94 రోడ్లు 116.1 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. దీనివల్ల రూ.40.74 కోట్లు నష్టం వాటిల్లింది. 110 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతినడంతో రూ.20 లక్షల నష్టం కలిగింది. మునిసిపాలిటీల్లో 19.98 కిలోమీటర్ల మేర రోడ్లు, 9.50 కిలోమీటర్ల మేర డ్రెరుున్లు దెబ్బతిన్నాయి. 205 వీధిలైట్లు పాడయ్యాయి. 6 భవనాలు ధ్వంసమయ్యూరుు. ప్రత్యేక పారిశుధ్య పనులకు రూ.25వేలు ఖర్చయ్యింది. మునిసిపాలిటీలకు వాటిల్లిన మొత్తం నష్టం రూ.10.38 కోట్లుగా తేల్చారు. మైనర్ ఇరిగేషన్ వనరులు 15 దెబ్బతినగా, రూ.1.50 కోట్లు నష్టం కలిగింది. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి రూ.15.7లక్షల విలువైన పైపులు పాడయ్యాయి. మత్స్య శాఖకు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 97 వైద్యశిబిరాలు నిర్వహించి, రూ.57 లక్షలను ఖర్చు చేశారు. 3 పవర్ మగ్గాలు దెబ్బతినగా, రూ.15 వేల నష్టం ఏర్పడింది. ఒక పశువు మృతి చెందడంతో రూ.16,400 నష్టం వాటిల్లింది. అవి తుపాను మరణాలు కాదట! హెలెన్ తుపాను బీభత్సాన్ని చూసేందుకు కారులో వెళుతున్న పెనుమంట్ర తహసిల్దార్ దంగేటి సత్యనారాయణ భట్లమగుటూరు వద్ద ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌కు చెందిన పోతినేని భాస్కరరావు అనే రైతు పొలంలోకి వెళ్లి వస్తుండగా, చెట్టు విరిగిపడి మరణిం చారు. అత్తిలి మండలం ఉనికిలిలో వంట గది గోడ కూలడంతో గాయపడిన బుద్దా మంగమ్మ చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఈ మరణాలేవీ తుపాను ఖాతాలోకి చేరలేదు. -
మూడు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావానికి గురైన నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సోమవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఆయన నరసాపురం చేరుకుని బస చేస్తారని తెలిపారు. మూడు నియోజకవర్గాల్లో తీవ్రంగా దెబ్బతిన్న వరి పొలాలు, ఉప్పు మడులు, కొబ్బరి, అరటి తోటలను బుధవారం పరిశీలించి, బాధిత రైతులను పరామర్శిస్తారని వివరించారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ పయనమై వెళతారని చెప్పారు. -
అమ్మో.. లెహర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావం నుంచి ‘పశ్చిమ’ ఇంకా తేరుకోలేదు. ఈలోగానే ముంచుకొస్తున్న లెహర్ తుపాను ప్రజలను హడలెత్తిస్తోంది. పెనుగాలులతో బెంబేలెత్తించిన హెలెన్ కంటే లెహర్ తుపాను ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అంతటా భయూందోళనలు నెలకొన్నారుు. హెలెన్ తుపాను ప్రభావానికి తీర ప్రాంతంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోగాలులు వీయడంతో సముద్రంతో సహవాసం చేసే గంగపుత్రులు సైతం వణికిపోయారు. ఇప్పుడు లెహర్ తుపాను ప్రభావంతో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయనే సమాచారం బెంబేలెత్తిస్తోంది. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు కొబ్బరి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వరి దుబ్బులు నేలకొరిగి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇక 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే మిగిలిన కాస్త పంటలు కూడా కొట్టుకుపోతారుు. గత నెలలో పై-లీన్ తుపా ను, అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డెల్టాలోని 1.36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా హెలెన్ తుపాను 2,74,082 ఎకరాల్లో పంటలను మింగేసింది. జిల్లాలో మొత్తం ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా, ఇప్పటికే వచ్చిన రెండు తుపాన్లు, అల్పపీడనం వల్ల నాలుగు లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. మిగిలిన రెండు లక్షల ఎకరాల పంటను లెహర్ మింగేస్తుందేమోనని రైతులు వణికిపోతున్నారు. హెలెన్ ధాటికి మునిగిన పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. పంటను బయటకు తెచ్చే పనిలో ఉండగానే, మరో తుపాను ముంచుకురావడం రైతుల్ని కుదేలు చేస్తోంది. వణుకుతున్న తీరం గతంలో ఎన్నో తుపానులను చూసి.. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా నిబ్బరంగా తట్టుకోగలిగిన తీరప్రాంత వాసులు ప్రస్తుత వరుస తుపానుల దెబ్బకు వణికిపోతున్నారు. హెలెన్ ధాటికి నరసాపురం నియోజకవర్గంలో రెండురోజులపాటు కరెంటు లేక ప్రజలు అవస్థలు పడ్డారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలింది. పునరుద్ధరణ పనులు చేస్తుండగానే, మరో తుపాను మరింత భీకర రూపంలో ముంచుకొస్తోందనే వార్త తీర ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తోంది. మరోవైపు సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారులు ఏం జరుగుతుం దోనని ఆందోళనలో మునిగిపోయారు. మొన్నటి తుపాను ధాటికి నరసాపురం మండలంలోని చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు అర కిలోమీటరు మేర కోత కు గురయ్యాయి. లెహర్ దెబ్బకు ఊరు కొట్టుకుపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. మిగిలిన 35 తీర ప్రాంతాల మత్స్యకారులు ఇప్పటికే బోట్లు, వలలు దెబ్బతిని నష్టాల పాలయ్యారు. కొద్దిరోజుల నుంచి వారి ఉపాధికి గండిపడింది. మళ్లీ పెను తుపాను వస్తుండడంతో ఇక తమకేమీ మిగలదని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. యంత్రాంగం బెంబేలు జిల్లాలో నెలకొన్న విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికార యంత్రాం గం హైరానా పడుతోంది. అల్పపీడనం, పై-లీన్ తుపానుల వల్ల జరిగిన నష్టం అంచనాలను ఇంకా రూపొందించలేదు. హెలెన్ తుపాను సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే, లెహర్ విరుచుకుపతుందనే సమాచారం యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. లెహర్‌ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలతో మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ ఎవరికీ కంటిమీద కునుకు లేకుండాపోయింది. వరుస విపత్తులతో ఏంచేయాలో తెలియని అయోమయం వారిని వెంటాడుతోంది. అక్టోబర్, నవంబర్ నెలలు జిల్లాకు అగ్నిపరీక్షగా మారాయి. -
అటు హెలెన్ తుపాను ....ఇటు లెహర్ తుపాను
అమలాపురం, న్యూస్‌లైన్ : నేలకొరిగిన వరి చేలు ముంపులోనే ఉన్నాయి. తోటల్లో విరిగిపడిన కొబ్బరి చెట్లు అలానే ఉన్నాయి. ఇప్పటీ విద్యుత్ సౌకర్యం లేక వందల ఊళ్లు అంధకారంలోనే ఉన్నాయి. ఈ సమయంలోనే ‘లెహర్’ పేరుతో మరో విపత్తు ముంచుకురావడం జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో హెలెన్ తుపాను బాధితులకు కనీసం సహాయ సహకారాలు అందికపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కడుపు నింపేందుకు గుప్పెడు బియ్యం కూడా ఇవ్వని ప్రభుత్వ తీరును బాధితులు దుయ్యపడుతున్నారు. హెలెన్ కోనసీమను తాకి నాలుగు రోజులు కావస్తున్నా సాధారణ పరిస్థితులు ఇంకా నెలకొనలేదు. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. శివారు గ్రామాల్లో తాగునీటి సరఫరా ఆరంభం కాలేదు. వర్షాలకు బావులు, చేతి పంపుల ద్వారా వచ్చే తాగునీరు కలుషితమవడంతో అంటు రోగాల బారిన పడతామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. బాధితులకు రెండు రోజుల పాటు పునరావాస కేంద్రా లు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇళ్లు నష్టపోయిన వారు తలదాచుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఏదైనా ఉపద్రవం వస్తే ఏ ప్రభుత్వమైనా తక్షణ సాయంగా ఇచ్చేది బియ్యం, కిరోసిన్. రాష్ర్ట ప్రభుత్వం ఈ బాధ్యతను కూడా విస్మరిస్తోంది. తుపానుకు వలలు నష్టపోవడం వల్ల మత్స్యకారులకు, పూర్తిస్థాయిలో పనులు లేక వ్యవసాయ కూలీలు, ఇళ్లు నష్టపోయి పనులకు వెళ్లలేనివారు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమయంలో కనీసం ఆపన్న హస్తం కూడా అందించకపోవడంపై బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో వారం రోజుల పాటు కుంభవృష్టి కురిసినప్పుడు సైతం ప్రభుత్వం తక్షణం స్పందించి బాధితులకు బియ్యం, కిరోసిన్ అందించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈనెల 18న ఆదేశాలు జారీ చేయగా, తుపాను రావడంతో అదికాస్తా పూర్తిగా అందకుండా పోయింది. ఇక తాజా తుపానుకు ఇవ్వాల్సిన బియ్యం, కిరోసిన్ ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా నష్టపోయిన రైతులు హడావిడిగా పనలను తరలించి నూర్పులు చేసే పనిలో తలమునకలై ఉన్నారు. కాకినాడలో ఐదు కంట్రోల్ రూంలు కాకినాడ : తుపాను నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఐదు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు కమిషనర్ వి.రవికుమార్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో 2373136, అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో 2375987, రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో 2376300, విద్యుత్ కార్యాలయంలో 2366265, కలెక్టరేట్లో 1077(టోల్‌ఫ్రీ) నంబర్లతో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశామన్నారు. -
తట్టుకోలేని నష్టాలతో తల్లడిల్లుతున్న రైతులు
అమలాపురం, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలతో గడిచిన ఐదేళ్లలో జిల్లా రైతులు నాలుగుసార్లు ఖరీఫ్ పంట ను కోల్పోయారు. ఒక్క 2011లో మాత్రమే ఖరీఫ్సాగు పండగా ఆ ఏడాది సాగు సమ్మె చేయడం వల్ల కోనసీమలో 13 మండలాల్లో 90 వేల ఎకరాల్లో సాగు చేయక రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయారు. మిగిలిన నాలుగేళ్లు అక్టోబరు, నవంబరు నెలల్లో వస్తున్న భారీ వర్షాలు, తుపానుల వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా రాబట్టుకోలేక పోతున్నారు. తాజాగా ఈ ఏడాది హెలెన్ తుపాను వల్ల 2.80 లక్షల ఎకరాల్లో, అంతకుముందు భారీ వర్షాల వల్ల 1.60 లక్షల ఎకరాల్లో వెరసి జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినడంతో రైతులు అంచనాలకు అందని రీతిలో నష్టపోయారు. వరుస ఖరీఫ్ నష్టాలతో కుదేలైన రైతులకు ప్రభుత్వ పరిహారం సైతం అందడంలేదు. గత ఏడాది నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఏడాది తర్వాత హెలెన్ తుపాను విరుచుకుపడే సమయానికి సైతం పూర్తిగా చెల్లించకపోవడం వారిపై ప్రభుత్వానికున్న దారుణమైన నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. నీలం నష్ట పరిహారంగా మూడున్నర లక్షల మంది రైతులకు రూ.167 కోట్ల పెట్టుబడి రాయితీ అందాల్సి ఉండగా ఇప్పటివరకు వందకోట్లు మాత్రమే విడుదల చేశారు. మరో రూ.30 కోట్లు త్వరలో విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. నష్టం నమోదుకు సవాలక్ష నిబంధనలు, పరిహారం పంపిణీకి నెలలపాటు ముఖం వాచేలా ఎదురు చూసేలా చేస్తున్న కిరణ్ సర్కారు తీరు రైతుల సహనానికి అగ్నిపరీక్షలా మారింది. మళ్లీ మళ్లీ చావుదెబ్బలు ఇదే నేపథ్యంలో హెలెన్ విరుచుకుపడి, మరోసారి అన్నదాతను చావుదెబ్బ కొట్టింది. పంట దక్కలేదన్న నిరాశ, ప్రకృతిని ఎదురించలేని నిస్సహాయత, ప్రభుత్వ సహకారం లేదనే ఆక్రోశం.. వెరసి రైతుల గుండెల్లో సుడిగుండాలు రేగుతున్నాయి. ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ‘అడుక్కునే వాళ్లలా కనిపిస్తున్నామా?’ అని అధికారులపై విరుచుకుపడే వారు కొందరైతే.. చేతులారా పెంచిన చేలను కోయకుండానే దున్నించేస్తున్న వారు కొందరు. కరప, ఉప్పలగుప్తంలలో ఆది, సోమవారాల్లో జరిగిన సంఘటనలే హెలెన్ తుపాను రైతులను ఎంతగా కలచి వేసిందో, వారి దిటవుగుండెలను ఎంతగా అవిసిపోయేలా చేసిందో నిదర్శనం. తీరప్రాంత మండలాల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ముంపునీరు దిగే అవకాశంలేకపోవడం, పంటకోత కోసినా కూలీల ఖర్చులు కూడా చేతికి వచ్చే అవకాశం లేదనే ఆక్రోశంతో కరప గ్రామానికి చెందిన కౌలు రైతు మేడిశెట్టి రామచంద్రరావు ఆదివారం తన వరి చేనును ట్రాక్టర్‌తో దున్నించేశాడు. ప్రకృతిని వికృతంగా చేస్తున్న దాడిని ఎదిరించలేని అసహాయత, ప్రభుత్వం ఆదుకోదనే నిస్పృహతోనే ఆ రైతు ఈ చర్యకు దిగాడు. ప్రతి కంకినీ కంటికి రెప్పలా చూసుకునే రైతే.. ఏకంగా చేనునే దున్నించేశాడంటే జిల్లాలో అన్నదాతల అంతరంగాల్లో చెలరేగుతున్న బాధల తుపాను ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ‘ముష్టివాళ్లమనుకుంటున్నారా..?’ ఇక ప్రభుత్వం తమ పట్ల కనబరుస్తున్న ఉపేక్ష కూడా రైతులను కోపోద్రిక్తులను చేస్తోంది. ఉప్పలగుప్తానికి చెందిన సుమారు 300 మంది రైతులు సోమవారం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని నీలం నష్ట పరిహారమే ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ఇవ్వలేదని విరుచుకు పడ్డారు. హెలెన్‌తో కలిగిన నష్టానికి పరిహారం ఎప్పుడిచ్చేదీ స్పష్టం చేయాలని పట్టుబట్టారు. ఆగ్రహంతో పాటు ఆవేదన తన్నుకు రాగా ‘పరిహారం అడిగితే బిచ్చగాళ్ల కంటే హీనంగా కనిపిస్తున్నామా?’ అని గద్గద స్వరాలతో ఆక్రోశించారు. తహశీల్దారు జె.సింహాద్రి వారిని అనునయించారు. ఆకలి తీర్చే రైతులు శోకిస్తే ఏ రాజ్యానికీ శ్రేయస్కరం కాదని పాలకులు గుర్తించాలి. అన్నదాతల కృషి కాలయమునితో చెలగాటంగా మారిపోవడం యావత్తు సమాజానికీ చేటని గుర్తించాలి. వారిని ఆదుకోవడానికి సమస్త శక్తియుక్తులూ వినియోగించాలి. లేదంటే వారి కన్నీరే ఉప్పెనై.. ఆ ఉప్పెనలో వ్యవసాయమనే వృత్తే కొట్టుకుపోయే ముప్పు ఉంది. అదే జరిగితే మన మాగాణాలు బీళ్లవుతాయి. మనం ప్రతి గింజనూ దిగుమతి చేసుకోవలసిన ‘పరాన్నజీవుల’మవుతాం. -
నేడు జననేత జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : హెలెన్ తుపాను విలయ తాండవానికి జిల్లా తల్లడిల్లింది. పచ్చని కోనసీమ కకావికలమైంది. ఎటుచూసినా హృదయ విదారకమైన దృశ్యాలే. కన్నకొడుకుల్లా పెంచుకున్న వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. సిరులు కురిపించే బంగారుపంట నేలనంటింది. నిలువనీడనిచ్చే గూడు సుడిగాలికి ఎగిరిపోయింది. రైతులు, మత్స్యకారులు, నేతన్నలు, కూలీలు ఇలా ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రకోపానికి గురై గుండెలవిసేలా రోదిస్తున్నారు. జిల్లావాసులకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘నేనున్నా’నంటూ అందరికంటే ముందుగా స్పందించే జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పేందుకు మంగళవారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకుని, రావులపాలెం మీదుగా వెళ్లి కోనసీమలో పర్యటించనున్నారు. ఇదే రీతిలో గతంలో కూడా జిల్లా రైతులు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందే స్పందించేవారు. మూడేళ్ల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలతో చేతికొచ్చిన పంటలు కోల్పోయిన మెట్టరైతులకు అండగా నిలిచేందుకు జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత సాగుసమ్మె సమయంలోనూ వచ్చి అన్నదాతల్లో మనోధైర్యం నింపారు. వారి కోసం ఢిల్లీ వరకు పోరు సల్పారు. పోలవరం సాధన కోసం హరితయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత భారీ అగ్నిప్రమాదంలో సర్వస్వం బుగ్గిపాలై కట్టుబట్టలతో మిగిలిన పల్లం గ్రామవాసులను కూడా ఇదే రీతిలో పరామర్శించి అండగా నిలిచారు. పార్టీ తరపున ఆర్థికంగా ఆదుకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో జననేత జైలుపాలైన సమయంలో జిల్లావాసులు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ జగన్ తరఫున జిల్లాలో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారు. సొంతజిల్లా కడప తర్వాత మహానేత వైఎస్ మాదిరిగానే తూర్పు గోదావరి వాసులపై జగన్ ప్రత్యేకాభిమానం చూపిస్తున్నారు. ఈ కారణంగానే జిల్లా ప్రజలు ఆది నుంచి వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రూట్ పరిశీలించిన జిల్లా నేతలు అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజక వర్గాల్లో జగన్మోహన్రెడ్డి పర్యటించనున్న ప్రాంతాలను పార్టీ ముఖ్య నేతలు పరిశీలించారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు తదితరులు పాల్గొన్నారు. -
తుపాన్లతో పంటలకు తీవ్ర నష్టం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమ రైతాంగాన్ని ప్రతియేటా ప్రకృతి విపత్తులు దెబ్బతీస్తున్నాయి. 2011 ఏప్రిల్ మొదలుకుని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఎనిమిది పర్యాయాలు వర్షాలు, వడగండ్ల వల్ల రైతులు కోట్లాది రూపాయల పంట నష్టపోయారు. ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఐదు పర్యాయాలు ప్రకృతి కన్నెర్ర చేయడంతో రూ.30 కోట్లకు పైగా పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 22 నుంచి 26 తేదీ నడుమ పైలీన్ తుపాను సృష్టించిన నష్టం రూ.26 కోట్లకు పైనే ఉంటుందని వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిగ్గు తేల్చాయి. నష్టం జరిగిన ప్రతిసారి అధికార యంత్రాంగం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తోంది. అయితే నష్టం అంచనాలో శాస్త్రీయత పాటించడం లేదని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు నిబంధనలు సాకుగా చూపుతున్నారు. మండలంలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే పరిహారం చెల్లింపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నూర్పిళ్లు జరిగి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యానికి నష్టం జరిగినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగాలు నివేదికలు రూపొందిస్తున్నట్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించడం లేదు. పైలీన్, హెలెన్ నష్టాన్ని మినహాయిస్తే 2011 ఏప్రిల్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ఆరు పర్యాయాల్లో జరిగిన నష్టానికి రూ.11.48 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. పరిహారం కోసం రైతాంగం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నయా పైసా విదల్చడం లేదు. అరకొర లెక్కలు... ఆత్మహత్యలు పైలీన్ తుపాను వల్ల జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగిందని రైతు సంఘాల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి లేఖ సమర్పించారు. అయితే ప్రభుత్వం రూ.2.60 కోట్లకు మించి పరిహారం విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయంలో ఎదురవుతున్న నష్టాలను భరించలేక మెదక్ జిల్లాలో ఈ యేడాది 93 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారులు మాత్రం కేవలం పది మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నట్లు నివేదికలు సిద్ధం చేశారు. నష్టపోయిన రైతులకు ఉదారంగా పరిహారం ఇస్తే తప్ప తిరిగి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. -
హడలెత్తించిన హెలెన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను జిల్లా రైతులను హడలెత్తించి వెళ్లిపోయినప్పటికీ.. మళ్లీ వర్షసూచనలు, కమ్ముకున్న మబ్బులు అన్నదాతలను వెంటాడుతున్నాయి. శనివారం జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురవడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 5.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం హెలెన్ ప్రభావం లేదని తెలుసుకుని ఊరట చెందిన రైతులు త్వరలో మరో తుపాను పొంచివుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో కలవరపడుతున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకునే ఉండడంతో రైతులు భయపడుతున్నారు. వాతావారణంలో మార్పుల నేపథ్యంలో మార్కెట్ యార్డులకు సెలవు ప్రకటించడంతో కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలో ఆలస్యంగా నాటుకున్న వరిపంట 55 శాతం కోతలు కాలేదు. వర్ష సూచన నేపథ్యంలో రైతులు హడావుడిగా వరికోతలకు సిద్ధమవుతున్నారు. పొలాలు తడిగా ఉండడంతో హార్వెస్టర్లు తిరిగే పరిస్థితి లేదు. చైన్ హార్వెస్టర్లే వరికోతలకు అనువుగా ఉన్నా.. వాటికి కొరత ఏర్పడింది. కొందరు రైతులు కోసిన వరిని కల్లాల వద్దనే ఆరబెట్టుకుంటున్నారు. మరికొందరు మళ్లీ వర్షం పడితే చేతికొచ్చిన పంట దెబ్బతింటుందని నేరుగా మార్కెట్ యార్డులకు, కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు దగా చేస్తున్నారు. మొన్నటి వర్షాలతోనే నష్టాలు చవిచూసిన పత్తిరైతుకు మళ్లీ కష్టాలే మిగలనున్నాయి, పత్తి ఏరే క్రమంలో వర్షాలకు దెబ్బతింటే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. 39 మండలాల్లో వర్షం శనివారం జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 గంటల సగటున 5.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెట్పల్లి మండలంలో 22.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ మండలంలో 10.6, తిమ్మాపూర్ 9.8, బెజ్జంకి 10.6, కోహెడ 10.4, జగిత్యాల 15.4, మల్యాల 12.2, చందుర్తి 18.2, కొడిమ్యాల 10, మేడిపల్లి 10.4, కథలాపూర్ 10.4, గంభీరావుపేట 12, ముస్తాబాద్ 11, బోయినిపల్లి 12.6, సుల్తానాబాద్ 13.2, జూలపల్లి 12.2, ఎలిగేడు 15.6 మిల్లీమీటర్ల వర్షం కురసింది. మిగతా మండలంలో ఓ మోస్తరు జల్లులుపడ్డాయి. 18 మండలాల్లో వర్షం లేదు. -
ముంచుకొస్తున్న ‘లెహెర్’
సాక్షి, ఏలూరు : హెలెన్ తుపాను చేసిన గాయాలు ఇంకా తడారలేదు. మరో తుపాను ‘లెహెర్’ ముంచుకొస్తోంది. ఈ ఖరీఫ్‌లో 6 లక్షల ఎకరాల్లో పం టలు పండించగా, 4 లక్షల ఎకరాలు ఇప్పటికే తుపాన్లు, అల్పపీడనం ప్రభావానికి దెబ్బ తిన్నాయి. ఇంకా 2 లక్షల ఎకరాల్లో మాత్రమే కొద్దోగొప్పో పంట మిగిలి ఉంది. గురువారం నాటికి కోస్తా తీరంలోకి లెహెర్ తుపాను. తీవ్రస్థారుులో చొచ్చుకువచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారుు. 2 లక్షల ఎకరాల్లో మిగిలివున్న కొద్దిపాటి పంటను కూడా లెహెర్ తుపానుకు సమర్పించుకోక తప్పదేమోనని తల్లడిల్లిపోతున్నారు. గతేడాది నీలం తుపానుకు పంటలు పోవడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు విడిచారు. మళ్లీ ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. చరిత్రలో తొలిసారిగా నరసాపురం సమీపంలో కేంద్రీకృతమై హెలెన్ తుపాను భారీ నష్టాల్ని మిగిల్చింది. జిల్లా ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో తీరం వెంబడి గంటకు 120నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. జనం ఇళ్లనుంచి బయటకు రావడానికే భయపడ్డారు. విద్యుత్ వ్యవస్థ అతలాకుతల మైంది. రెండు రోజులు గడిచినా కొన్ని తీర గ్రామాల్లో ఆదివారం రాత్రికి కూడా ప్రజలు చీకట్లోనే మగ్గారు. ఈ భయాన్ని జనం మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జనం గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. లెహెర్ తుపాను కూడా కోస్తా తీరంలోనే కేంద్రీకృతమతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈసారి ఏకంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. అదే జరిగితే సంభవించే ప్రళయాన్ని ఊహించడానికే జనం భయపడుతున్నారు. -
‘హెలెన్’ ధాటికి రైతన్న విలవిల
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: పైలీన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే జిల్లా రైతాంగాన్ని హెలెన్ తుపాను భారీగా దెబ్బతీసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షం పత్తి, వరి, మొక్కజొన్నతో పాటు ఉల్లి పంటలకు భారీ నష్టాన్ని కలిగించింది. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. సోమవారంలోగా పంట నష్టంపై ప్రాథమికంగా వివరాలు సేకరించేందుకు వ్యవసాయ, రెవెన్యూ విభాగాలు సన్నద్ధమవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో జిల్లాలో 2.71 సెం.మీ వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా సదాశివపేట మండలంలో 14 సెం.మీ. వర్షం కురిసింది. పొరుగునే ఉన్న కర్ణాటకతో పాటు రంగారెడ్డి జిల్లాలో అధిక వర్షం కురవడంతో సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, పంటలు నీట మునిగాయి. నారాయణఖేడ్ మండలం హన్మం తరావుపేట మత్తడి వాగు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాపూర్‌లో పెద్ద చెరువు అలుగుతో సంజీవన్‌రావుపేట, పోతన్‌పల్లి, ర్యాకల్, తుర్కపల్లి గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మనూరు మండలం కమలాపూర్ చెరువు కట్ట తెగటంతో పంట పొలాల్లోని వరి నీటి పాలైంది. కంగ్టి మండలం వాసర్ ఊరవాగు, వంగ్దల్, రాంతీర్థ్(నల్లవాగు)లు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రేగోడ్‌లో చెరువు వాగుకట్ట తెగటంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి, రేగోడ్-చౌదరిపల్లి కల్వర్టు పైనుంచి నీరు ప్రవహించడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయా యి. కొండాపూర్ మండలం హరిదాస్పూర్ శివారులోని వంతెన పొంగిపొర్లడంతో చుట్టుపక్కల పొలాలలోని పంటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటల నష్టం హెలెన్ తుపానుతో నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. సదాశివపేట మండలంలో సుమారు ఏడు వేల ఎకరాల్లో పత్తి, వరి, కొండాపూర్ మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా మనూరు మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో వరి, రెండు వేల ఎకరాల్లో కంది, 250 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా. కంగ్టిలో సుమారు 15 వేల ఎకరాలు, కల్హేర్‌లో 500 ఎకరాలు, నారాయణఖేడ్‌లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. మనూరు మండలం కమలాపూర్ వాగు తెగటంతో 250 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రేగోడ్లోని చెరువుకట్ట తెగటంతో 400 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మండలంలో వర్షం కారణంగా 400 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. -
ఉప్పొంగిన మూసీ
శంకర్పల్లి, న్యూస్‌లైన్: మండలంలోని ఫత్తేపూర్ వద్ద మూసీ వాగు ఉప్పొంగి ప్రవహించింది. ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున సుమారు 12 గంటల పాటు ప్రవహించడం ఇదే మొదటిసారి. ఏకధాటిగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలలు పూర్తిగా నిలిచిపోయాయి. హెలెన్ తుపాన్ ప్రభావంతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మూసీవాగు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వంతెనపై నుంచి ప్రవాహం ప్రారంభమైంది. ఉద్ధృతి క్రమంగా పెరిగి ఉదయం 6 గంటల తర్వాత నీటి ప్రవాహం మరింత పెరుగుతూ వచ్చింది. వరద నీరు వికారాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఉద్ధృతంగా రావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ వరద ప్రవాహం కొనసాగింది. ఆ తర్వాత వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు కొనసాగాయి. ఫత్తేపూర్ మూసీ నుంచి అర కిలోమీటర్ మేర వాగు ప్రవహించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సుమారు 12 గంటల పాటు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు చందిప్ప వరకే.. కంది-షాద్‌నగర్ లింకు రోడ్డు కావడంతో శంకర్పల్లి మీదుగా ప్రతి నిత్యం వందల లారీలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఆదివారం మూసీ వాగు ధాటికి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిం ది.పోలీసులు ముందు జాగ్రత్తగా లారీ లను పట్టణంలోకి రానీయకుండా కిలో మీటర్ దూరంలోనే నిలిపివేశారు. సుమారు 12 గంటల పాటు వందల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చేవెళ్ల నుంచి శంకర్‌పల్లికి వచ్చే ఆర్టీసీ బస్సులు చందిప్ప వరకే రానిచ్చారు. మూసీవాగు ప్రవాహంతో అవతలి వైపు గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు.కూరగాయలు,పాలు తీసుకువచ్చే రై తులు సుమారు 10 కిలో మీటర్ల దూరం పొద్దుటూర్ మీదుగా శంకర్‌పల్లికి చేరుకున్నారు.కాగా మూసీవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలు తిల కించడానికి ఫత్తేపూర్ వాగు వద్దకు వచ్చారు. -
రైతును దెబ్బతీసిన ‘హెలెన్’ వర్షాలు
శంషాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరుకునే సమయానికి వరదపాలైంది.కోతకు వచ్చిన వరి పంటలు, కల్లాల్లోని గింజలు తడిసి మండలంలోని కెబి.దొడ్డి, సుల్తాన్‌పల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. హెలెన్ తుపాను కారణంగా శని వారం ఎగువ భాగంలో భారీ వర్షం కురిసిం ది. దీంతో ఈసీవాగులోకి ఆదివారం తెల్లవారుజామున వరద నీరు చేరి చుట్టు పక్కల పొలాలను ముంచెత్తాయి. ధాన్యపు గింజలు, పంట మెద ళ్లు కొట్టుకుపోయాయి. కాశింబౌలికి చెందిన రైతు నవీన్‌రెడ్డి పొలంలోని 65 బస్తాల ధాన్యం, కె.బి.దొడ్డి రైతులు రుక్కమ్మ, విక్రమ్ మరి కొందరి పొలాల్లోని ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. రెండు గ్రామాల్లో 50 మందికి రైతులకు చెందిన సుమారు 50 ఎకరాల వరి, 15 ఎకరాల క్యారెట్, పూల పంటలు నీటమునిగాయి. వరి కోతల తర్వాత ధాన్యం బస్తాలను కొం దరు రైతులు పొలాల్లో భద్రపర్చారు. నీరు చేరడంతో బస్తాలు తడిసిపోయాయి. నవాబుపేట: హెలెన్ తుపాను రైతులను కోలు కోని స్థితిలోకి నెట్టింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు పంటపొలాల్లో పూర్తిగా నీళ్లు చేరాయి. శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మూసీ వాగు పొంగిపొర్లింది. వందల ఎకరాల్లో పంటలను ముంచేసింది. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు దగ్గర పొలాల్లో ఉన్న వ్యవసాయ పరికరాలు, కరెంటు మోటార్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. టమాట, ఉల్లి, ఇతర కూరగాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలో సుమారు 500 ఎకరాలకుపైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. చేవెళ్ల: హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం ఉదయం నుంచి నిరంతరాయంగా కురిసిన వర్షానికి మండలంలో పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చి పంటను తీసే దశలో ఉన్న పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. పైలిన్ తుపానుతో చాలా వరకు నల్లబడిన పత్తిపంట ఈ తుపానుతో మరింత నష్టానికి గురైంది. ఇప్పటికే ధరరాక దిగులుగా ఉన్న రైతన్నకు కంటతడిపెట్టిస్తోంది. క్వింటాలుకు రూ.4వేల మద్దతు ధర కూడా రాక ఇబ్బందిపడుతున్న రైతన్నకు పత్తి నల్లబారడంతో మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. క్యారెట్, టమాట పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి కాసిన టమాటాలు నేలరాలిపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో కురిసిన వడగళ్లవాన, నెలరోజుల క్రితం వచ్చిన పైలిన్ తుపాను, మరోసారి పడగ విప్పిన హెలెన్ తుపానుతో ఈ సంవత్సరమంతా నష్టాలతోనే గడిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘లెహర్’ గండం
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ట్రం మీద అంతంత మాత్రంగానే ఉన్నా, తుపానుల రూపంలో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. తాజాగా, అండమాన్ సమీపంలో కేంద్రీకృతమైన లెహర్ తుపాను ఆంధ్ర వైపుగా పయనించి తీరం దాటనున్నది. తీరం దాటే సమయంలో ఏర్పడే తీవ్రత రాష్ట్రం మీద ఉండబోదు. అయితే, ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత: లెహర్ ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి విల్లుపురం, కడలూరు, నాగపట్నం, తంజావూరు, నీలగిరి, కన్యాకుమారి జిల్లాల్ని వర్షం ముంచెత్తింది. కడలూరులోని నెల్లి కుప్పుం, మాదవ నగర్, తాలం కులం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. విల్లుపురం జిల్లా ఊలందూరు పేట, తిరువన్నై, మైలంలో కుండపోత వర్షానికి రోడ్లు నదుల్ని తలపించాయి. తంజావూరు జిల్లా కుంబకోణం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కల్లనై, పెన్నారుల్లో నీటి ఉధృతి పెరగడంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయూయి. నీలగిరి జిల్లాలో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఊటీ -మెట్టుపాళయం మార్గంలోని వంతెన కొట్టుకుపోవడంతో కోతగిరి మీదుగా రాకపోకలను మళ్లించారు. ఊటీ రైలు మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో మూడు రోజులపాటుగా రైళ్లను రద్దు చేశారు. కన్యాకుమారిలో గోదై నది, పేచ్చి పారై, తిరువట్టారు పరిసర గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కాయి. గోదై నది పరవళ్లు తొక్కుతుండగా, తిరుప్పరపు జలపాతం పొంగి పొర్లుతోంది. శనివారం అర్ధరాత్రి కాంచీపురం, చెన్నై శివారుల్లో మోస్తారుగా వర్షం కురిసింది. ప్రమాద హెచ్చరిక: ఆదివారం అర్ధరాత్రికి అండమాన్ సమీపంలోని ఫోర్ట్ బ్లేయర్ దీవుల్ని లెహర్ దాటనున్నది. గంటకు 110 కి.మీ వేగంతో వాయువ్య దిశలో ఇది పయనిస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో సముద్ర తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున, కడలిలోకి వెళ్లొదని సూచిస్తున్నారు. చెన్నై ఎన్నూరు, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, కన్యాకుమారి, పంబన్, పుదుచ్చేరి హార్బర్లలో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. -
మరోగండం....రైతును వణికిస్తున్న ‘హెలెన్’
ఖమ్మం, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను రూపంలో మరో ముప్పు పొంచి ఉండడంతో రైతులలో ఆందోళన నెలకొంది. నష్టాలమీద నష్టాలను చవిచూస్తున్న రైతులు ఈ గండం ఎలా గట్టెక్కుతుందో అని కలవరపడుతున్నారు. శుక్ర, శని వారాల్లో జిల్లాలో మేఘాలు కమ్ముకు రావడం, చిరుజల్లులు పడటంతో పంటల పరిస్థితిపై తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న అన్నదాతపై ప్రకృతి కూడా పగపడుతోంది. గత సంవత్సరం నీలం తుపానుతో పండిన పంటలు నీటమునిగాయి. ఇటీవల వచ్చిన పైలీన్ తుపానుతో పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశన, మిర్చి పంటలు నాశనమయ్యాయి. ఆ గాయం నుంచి కొలుకునే ప్రయత్నంలో రైతులు ఉన్న పంటలను కంటికి రెప్పలా కాపాడు కున్నారు. అయితే రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం జిల్లాపై కూడా పడడంతో జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉన్న కొద్దిపాటి పంటలు కూడా వర్షార్పణం అవుతాయా..అనే భయం వెంటాడుతోంది. నష్టం జరగకముందే వరి కోతలు, పత్తితీత కోసం రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. చేతికొచ్చిన పంట చెయ్యిజారి పోతుందా..? ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 1.34లక్షల హెక్టార్లలో వరి, 1.68హెక్టార్లలో పత్తి, 23వేల హెక్టార్లలో మొక్కజొన్న, 19వేల హెక్టార్లలో మిర్చి పంటలతోపాటు కూరగాయలు,, ఇతర పంటలను సాగుచేశారు. అయితే ఏపుగా పెరిగిన పత్తి మొదటి విడత తీసేదశకు రాగా గత నెల మొదటి వారంలో తుపాను మూలంగా లక్షల ఎకరాల్లో పత్తి తడిసి పోయింది. తెల్లబంగారం నల్లబారి పోయింది. పింజలు మొలకెత్తాయి. కాయలు రాలిపోయాయి. అదేవిధంగా వరి నేలవాలింది. మిర్చి పంటకు ఊటబారి పోయాయి. దీనికి తోడు తుపాను అనంతరం వైరస్, పేనుబంక, అగ్గితెగులు, వేరు కుళ్లు తుగులు మొదలైనవి ఆశించాయి. వీటి నివారణకు నానా ఇబ్బంది పడ్డారు. నీట మునుగగా ఉన్న పంటల్లో పత్తి రెండో విడత ఏరే దశకు వచ్చింది. వరి చేలు కోతలు మొదలయ్యాయి. మిర్చి కాపు దశకు వచ్చింది. నష్టం జరిగిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఎప్పుడు ఇస్తుందో అర్థం కాక ఉన్న పంటలతో చేసిన అప్పులకు మిత్తీలైనా కట్టవచ్చని భావించారు. ఇటువంటి తరుణంలో మళ్లీ వర్షాల సంకేతాలు రావడం.. వాతావరణం చల్లబడి, ఆకాశంలో మబ్బులు రావడంలో అన్నదాత గుబులు చెందుతున్నాడు. పంటలు చేతికి వస్తాయో రావో.. అని భయం మొదలైంది. హుటా హుటిన పత్తిని ఏరించడం, వరి పనలను దగ్గరకు వేసేపనిలో మునిగిపోయాడు. -
హెలెన్ తుపాన్‌తో రైతులకు కష్టాలు
కందుకూరు, న్యూస్‌లైన్: హెలెన్ తుపాన్ కారణంగా మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ముసురు వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఎండబెట్టిన మొక్కజొన్న, వరి పంటను తడవకుండా కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం వర్షంలోనే బస్తాల్లో నింపిన గింజల్ని ఆయా గ్రామాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడకు చేర్చి దక్కించుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు రైతులు. దేవాలయాలు, కమ్యూనిటీ భవనాలు వంటి వాటిల్లో నిల్వ చేసుకుంటున్నారు. స్థలం అందుబాటులో లేని రైతులు వర్షానికి తడవకుండా పట్టలు కప్పి ఉంచారు. మరోరోజు ఇలాగే ముసురు కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పట్టలు కప్పి ఉంచడంతో పూర్తిగా ఎండని మక్కలకు ఫంగస్ వచ్చే అవకాశం ఉండటం, కోతకు వచ్చిన వరి పైరు పొలంలోనే మొలకె త్తేలా ఉండటం, పత్తి నల్లగా మార నుండటం, కూరగాయ పంటలు దెబ్బతినే అవకాశం ఉందని వాపోతున్నారు. మరోవైపు చేతికొచ్చిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక ఆవేదన చెందుతున్నారు. డిమాండ్ మేర మార్క్‌ఫెడ్ నుంచి రోజూ పది లారీలు పంపాల్సి ఉండగా ప్రస్తుతం వారం నుంచి అడపాదడపా ఒక్కటి, రెండు లారీలు మాత్రమే పంపిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు కేవలం 7 లారీలు మాత్రమే పంపించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది. దీంతో పీఏసీఎస్ గోదాంలతో పాటు గ్రామాల్లో మక్కల నిల్వలు పేరుకుపోయాయి. బయటి మార్కెట్లో విక్రయిద్దామన్నా వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించడంతో పాటు డబ్బును నెల తర్వాత ఇస్తామనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసి ముద్దయిన పత్తి పూడూరు: హెలెన్ తుపాన్ ప్రభావంతో పత్తి తడిసి ముద్దయింది. మండలంలో శనివారం మధ్యాహ్నం పూడూరు, రాకంచర్ల, మంచన్‌పల్లి, కంకల్, పెద్ద ఉమ్మెంతాల గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. తెంపేందుకు సిద్ధంగా ఉన్న పత్తి పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన పత్తి నేలకు జారి మట్టిపాలైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న పంటలు పోయినా కనీసం పత్తిలోలైనా లాభాలు వస్తాయనుకుంటే ఈ పంట కూడా హెలెన్ తుపాన్ ప్రభావం ముంచేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని వారు కోరుతున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి... 23, 24 తేదీల్లో భారీ వర్షాలు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో ఈ నెల 23, 24 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నద ని, ఆ రోజుల్లో మండల, జిల్లా స్థాయి అధికారులంతా విధుల్లో ఉండాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. తుపాను పట్ల అప్రమత్తం చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని ప్రజ్ఞసమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను నష్టాన్ని కనిష్టస్థాయికి పరిమితం చేసేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవసాయాధికారులు మండల కేంద్రాల్లో ఉండి రైతులకు తగు సూచనలు, సలహాలు అందించాలని చెప్పారు. నీటి పారుదలశాఖ అధికారులు ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం డివిజన్లలో చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా తగు చర్యలు తీసుకొని వరద ముంపునుంచి పంటలను కాపాడాలన్నారు. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండి వాటిని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్లలో అత్యవసర మందులు సమృద్ధిగా నిల్వ చేసుకోవాల ని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గం టలు అందుబాటులో ఉండాలని అన్నారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సివిల్‌సప్లయీస్ డీఎంకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు నిరంతరాయంగా నడిపించేందుకు అన్నిరకాల సామగ్రి ని ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి తగు సమాచారం వెంటనే తెలపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఏసీ బాబురావు, డీఆర్వో శివశ్రీనివాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
తుపాను ప్రభావంపై సీఎం ఆరా
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు ఫోన్ చేసిన ఆయన ఇక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీరప్రాంత గ్రామాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయూలని, తుపాను బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని ఆదేశిం చారు. మత్స్యకా రులను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులతోపాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సహాయక చర్యలపై సీఎంకు వివరించామన్నారు. పునరావాస కేంద్రాల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పామని తెలిపారు. అధికారులతో సమీక్ష సహాయక చర్యల విషయమై కలెక్టర్ సిద్ధార్థజైన్ మునిసిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. బియ్యపుతిప్ప ఏటిగట్టు పటిష్టతకు 500 ఇసుక బస్తాలను తక్షణం ఏర్పాటు చేయాలని కన్జర్వెన్సీ అధికారులను ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల్లో వైద్య బృందాలు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోడ్లపై కూలిన చెట్లను తక్షణమే తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బీ ఇంజినీర్లకు సూచించారు. ఉదయం నుంచి పొక్లెరుున్లతో కూలిన చెట్లను తొలగించే పనిని అధికారులు చేపట్టారు. సాయంత్రానికల్లా నేలకూలిన విద్యుత్ స్తంభాలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
హెలెన్ బీభత్సం
సాక్షి, ఏలూరు : భీకర గాలులు వీచాయి. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలించాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. కల్లోల సాగరం ప్రజలను గజగజ వణికించింది. శుక్రవారం జిల్లాలో హెలెన్ తుపాను సృష్టిం చిన భీతావహ దృశ్యాలివి. వాయుగుండం పెను తుపానుగా మారి ‘పశ్చిమ’ వైపు దూసుకువచ్చి ప్రజాజీవనాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. తుపాను నష్టాలను చూసేందుకు కారులో బయలుదేరిన పెనుమంట్ర తహసిల్దార్ దంగేటి సత్యనారాయణ భట్లమగుటూరు వద్ద గాలుల ప్రభావానికి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌కు చెందిన పోతినేని భాస్కరరావు (62)అనే రైతు పొలంలోకి వెళ్లి వస్తుండగా, చెట్టు విరిగి మీదపడటంతో మరణించాడు. నాలుగో బోట్లలో బయలుదేరిన కాకినాడ ప్రాంతానికి చెందిన 31 మంది మత్స్యకారులు దారితప్పి నరసాపురం మండలం చినమైనివానిలంక వద్ద నడిసముద్రంలో చిక్కుకుపోయారు. రాత్రివరకూ వారిని అధికారులు ఒడ్డుకు తీసుకురాలేదు. అనూహ్య అలజడి ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా పశ్చిమ తీరంలోని నరసాపురం సమీపంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో తీర గ్రామాల్లో అలజడి రేగింది. శుక్రవారం వేకువజాము నుంచి మొగల్తూరు, నరసాపురం మండలాలతో పాటు భీమవరం, యలమంచిలి, కాళ్ల, ఆచంట, వీరవాసరం, పాలకొల్లు తదితర మండలాల్లో 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. 8మండలాల్లో 37 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య మచిలీపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో తుపాను తీరం దాటిందని తెలుసుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2004లో సంభవించిన సునామి ధాటికి చినమైనవానిలంక తీరప్రాంతంలో ఆరుగురు మృతిచెందగా, అప్పట్లో తీరప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తర్వాత 2011లో వచ్చిన థానే తుపాను అలజడి సృష్టించి తీరప్రాంతానికి కోత మిగిల్చింది. రెండేళ్ల తర్వాత తిరిగి హెలెన్ తుపాను తీర ప్రాంతవాసులను సునామీ స్థాయిలో వణికించింది. అపార నష్టం హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 223 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో 14 ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. మూడిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 80 కచ్చా ఇళ్లు, 35 గుడిసెలు, మరో 80 ఆవాసాలు చెల్లాచెదురయ్యాయి. వందలాది కొబ్బరి చెట్లు, తాటిచెట్లతోపాటు 62 భారీ వృక్షాలు పూర్తిగా నేలకొరిగాయి. వేలాది చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. 2.25 లక్షల ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. పనలు, కుప్పలపై ఉన్న 25 వేల ఎకరాల్లో పంట తడిసి ముద్దయ్యింది. 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4,908 మందిని తరలించారు. 40 విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దికి సహాయక చర్యలు ప్రారంభించారుు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ భోజనం, 12,730వాటర్ ప్యాకెట్లతో తాగునీటి సదుపాయం కల్పించారు. 71 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణులకు, తుపాను బాధితులకు సేవలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 250 విద్యుత్ స్తంభాలు పడిపోడవంతో 14 కిలోమీటర్ల మేర లైన్లు తెగిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి 130 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి సరఫరా నిలిపివేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా సరఫరా పునరుద్ధరించడం ప్రారంభించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీర గ్రామాల్లో అంధకారం అలముకుంది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ మధ్యాహ్నం వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏటిగట్లు కోతకు గురయ్యాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి. -
హెలెన్... హై ఎలర్ట్
సాక్షి, కాకినాడ : ఊహించనిరీతిలో విరుచుకుపడిన ‘హెలెన్’తుపాను విలయతాండవం చేసింది. జిల్లాలో ఆరుగుర్ని పొట్టనపెట్టుకుని అపారనష్టాన్ని మిగిల్చిన దీని తీవ్రతను జిల్లా యంత్రాంగం ముందుగానే అంచనా వేయగలిగింది. కచ్చితంగా ఉభయగోదావరి జిల్లాల మధ్య ఇది తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ రెండు జిల్లాలను హై ఎలర్ట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. అయితే దీని తీవ్రతను పూర్తి స్థాయిలో అంచనా వేయలేక పోయింది. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఒ, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అప్రమత్తం చేయడంతో కొంతవరకు నష్ట తీవ్రతను అరికట్టగలిగారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై మాటపడే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు, పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం మండలానికి లక్షరూపాయల చొప్పున కలెక్టర్ నీతూ ప్రసాద్ గురువారమే విడుదల చేశారు. తీరంలోని 14 మండలాల్లో తుపాను ప్రభావం చూపింది. కాగా జిల్లాలో 5931 మందిని 40 కేంద్రాలకు తరలించారు. జిల్లావ్యాప్తంగా ఆరుగురు మృత్యువాతపడగా, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వీటికి సంబంధించిన సమాచారం మాత్రం శుక్రవారం రాత్రి వరకు జిల్లా కేంద్రానికి చేరలేదు. కలెక్టర్ విజ్ఞప్తితో జాతీయ విపత్తు నివారణ సంస్థ నుంచి రెండు రెస్క్యూ టీమ్‌లు రాగా ఒక టీమ్‌ను అమలాపురం, మరొక టీమ్ ను రాజోలుకు పంపారు. కోనసీమలోనే మకాం కలెక్టర్ అమలాపురం ఆర్డీఒ కార్యాలయంలోనే మకాం వేసి తుపాను పునరావాస చర్యల్ని సమీక్షించారు. జేసీ ఆర్. ముత్యాలరాజు రాజోలులోనూ, ఏజేసీ మార్కండేయులు భైరవపాలెంలోనూ మకాం వేసి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను తీరానికి చేర్చేందుకు శ్రమించారు. మత్స్యకారులంతా క్షేమం వేటకు వెళ్లిన వివిధ ప్రాంతాల మత్స్యకారులు 57 మంది హెలెన్ ప్రభావంతో సముద్రంలో చిక్కుకున్నారు. కాకినాడ పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు నిజాంపట్నం వద్ద , తొండంగి మండలం కె.పెరుమాళ్లపురానికి చెందిన 13 మంది ఓడలరేవు వద్ద శుక్రవారం రాత్రికి తీరానికి చేరుకున్నారు. కాకినాడఏటిమొగ, కొండబాబు కాలనీ, ఆటోనగర్, సూర్యారావుపేటలకు చెందిన మరో 38 మంది సముద్రంలో చిక్కుకున్నారు. మెరైన్, కోస్టుగార్డు సిబ్బందితో పాటు విశాఖపట్నం నుంచి కోస్టుగార్డు గస్తీనౌక, హెలికాప్టర్ల సాయంతో వీరిని గుర్తించారు. సముద్రం కల్లోలంగా ఉండడంతో వీరిని తీరానికి తీసుకొచ్చేందుకు శుక్రవారం రాత్రి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరంతా ఫోన్లో టచ్‌లో ఉన్నారని శనివారం ఉదయం ఒడ్డుకు తీసుకొస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు. 48 గంటల పాటు భారీ వర్షాలు రానున్న 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేయడంతో మత్స్య కారులను వేటకు వెళ్లవద్దని కలెక్టర్ హెచ్చరించారు. పల్లపుప్రాంతప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు. కోనసీమలో 216 జాతీయ రహదారిపై నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. జిల్లా వ్యాప్తంగా 11కేవి హైటెన్షన్ పోల్స్ 526, 33 కేవీ లోటెన్షన్ పోల్స్ కూలడంతో రాజమండ్రి, కాకినాడ నగరాలు, ప్రధాన పట్టణాలతో పాటు 900 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా శుక్రవారం రాత్రికి 80 శాతం గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించారు. జిలా లో 179 పూరిళ్లు, 4 పక్కా ఇళ్లు పూర్తిగా ధ్వసమయ్యాయి. నేడు రవిచంద్ర సమీక్ష పునరావాస చర్యల పర్యవేక్షణకు జిల్లా ప్రత్యేకాధికారిగా నియమితులైన ఎం. రవిచంద్ర శనివారం రానున్నారు. ఉదయం 10 గంటలకు కాకినాడలో అధికారులతో సమీక్షిస్తారు. కేంద్ర మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు, రాష్ర్ట మంత్రి తోట నరసింహం పాల్గొంటారు. కాగా శనివారం జరగాల్సిన జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని, డయల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని రద్దు చేశారు. -
హెలెన్ విలయం
అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో హెలెన్ తుపాను అల్లకల్లోలం సృష్టించింది. పెనుగాలులు, భారీ వర్షం తీరప్రాంత మండలాలను అతలాకుతలం చేసింది. పచ్చని కోనసీమను చిన్నాభిన్నం చేసి1996 నాటి పెను విలయాన్ని గుర్తు చేసింది. మరణమృదంగం మోగించి ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. లక్షల ఎకరాల్లో పంటను కబళించింది. వేలాది కొబ్బరి చెట్లను, వందలాది విద్యుత్ స్తంభాలను నేలకూల్చింది. సముద్రాన్ని తీరంపైకి ఉసిగొలిపి అలల అస్త్రాలతో ఛిద్రం చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులను నడికడలిలో బంధించి, వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను ఒంగోలు వద్ద తీరం దాటుతుందని, జిల్లాపై పెద్దగా ప్రభావం ఉండదని జిల్లా యంత్రాంగంతోపాటు ప్రజలు కూడా ఆశించారు. అయితే చివరికి మచిలీపట్నం వద్ద తీరం దాటి, జిల్లాను చిగురాకులా వణికించింది. తీర ప్రాంత మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు విధ్వంసాన్ని సృష్టించాయి. గాలులకు వర్షం తోడై అపారంగా ఆస్తి నష్టాన్ని కలిగించింది. జిల్లాలో ఇళ్లు, చెట్లు కూలిన ఘటనలతో పాటు ప్రకృతి దాల్చిన వికృతరూపాన్ని చూసి తట్టుకోలేక గుండెలు ఆగి.. మొత్తం ఏడుగురు మరణించారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని వాడపర్రు ఇందిరా కాలనీకి చెందిన ఎలిపే అంకాలు (35), అమలాపురం మండలం వన్నెచింతలపూడి స్తంభం గొయ్యికి చెందిన గుబ్బల శేషమ్మ (65), కొత్తపేట మండలం గంటికి చెందిన నక్కా లక్ష్మి (68), కాట్రేనికోన మండలం నడవపల్లికి చెందిన మల్లాడి వెంకాయమ్మ (65), దొంతుకుర్రుకు చెందిన తాడి కస్తూరి (75), ఐ.పోలవరం మండలం కొత్తమురమళ్లకు చెందిన సవరపు సుబ్బారావు (60)లు మృత్యువాతపడ్డారు. ఉప్పాడ శివారు నాయకర్ కాలనీకి చెందిన కారే జగన్నాధం (35) వేటకు వెళ్లి కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో కానూరిమొగ వద్ద విద్యుత్ స్తంభం విరిగి మీద పడడంతో మరణించాడు. జిల్లాలో 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో 5931 మందికి ఆశ్రయం కల్పించినట్టు అధికారులు చెపుతున్నారు. తుపాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఐదారడుగుల ఎత్తున ఎగసిపడంతో పాటు తీరం పైకి చొచ్చుకు వచ్చాయి. ఈ కారణంగా ఉప్పాడ, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప, మగసాని తిప్ప, అల్లవరం మండలం బెండమూర్లంక, సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద తీరం కోతకు గురైంది. ఉప్పాడ వద్దఅలలు పది అడుగుల ఎత్తున విరుచుకుపడడంతో బీచ్ రోడ్డు మరోసారి ఛిద్రమైంది. పిడికిట ప్రాణాలతో..నడికడలిలో.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారులు తుపాను కల్లోలంతో సముద్రంలో చిక్కుకున్నారు. వారిలో కాకినాడ పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్య కారులు శుక్రవారం రాత్రి నిజాంపట్నం రేవు వద్ద, పెరుమాళ్లపురానికి చెందిన 13 మంది ఓడలరేవు వద్ద తీరానికి చేరుకున్నారు. మిగిలిన 38 మంది నడికడలిలో చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాకినాడ సూర్యారావుపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు మామిడికుదురు మండలం కరవాక వద్ద, కాకినాడ ఏటిమొగ, కొండబాబు కాలనీ, ఆటోనగర్లతో పాటు ఉప్పలంకకు చెందిన మరో 31 మంది నరసాపురం వద్ద సముద్రంలో చిక్కుకున్నట్టు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారిని తీరానికి చేర్చేందుకు కోస్టుగార్డు, మెరైన్ పోలీసులు, విశాఖపట్నం నుంచి ప్రత్యేక కోస్టు గార్డు గస్తీఓడతో పాటు హెలికాప్టర్ సాయంతో ప్రయ వారిని తీరానికి చేర్చేందుకు కోస్టుగార్డు, మెరైన్ పోలీసులు, విశాఖపట్నం నుంచి ప్రత్యేక కోస్టు గార్డు గస్తీఓడతో పాటు హెలికాప్టర్ సాయంతో ప్రయత్నిస్తున్నారు. ఈదురుగాలులకు తీరాన్ని ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పూరిపాకలు నేలకూలాయి. కోనసీమలోని మిగిలిన మండలాల్లో సైతం వందలాది ఇల్లు, పశువులపాకలు నేలమట్టమయ్యాయి. కాట్రేనికోన మండలంలో తుపాను ప్రభావం అధికంగా చూపింది. మగసాని తిప్ప వద్ద సముద్రం చొచ్చుకురావడంతో మత్స్యకారులు భయాందోళనలకు గురయ్యారు. పల్లం, బలుసుతిప్ప వద్ద పడవలు బోల్తా కొట్టి నీటమునిగాయి. జిల్లాలో 179 పూరిళ్లు, 4 పక్కా ఇళ్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెపుతున్నా.. వాస్తవానికి ఆ సంఖ్య మరిన్ని రెట్లు ఉంటుందని అంచనా. -
‘హెలెన్’ ముప్పు ఉంది.. అప్రమత్తంగా ఉండండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు హెలెన్ తుపాన్ వచ్చే ప్రమాదం ఉందని, జిల్లావాసులను అప్రమత్తం చేయాల్సిందిగా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు హెలెన్ ముప్పు ఉందని వాతావరణ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన రెవెన్యూ, పంచాయతీ రాజ్, మెడికల్, విద్యుత్, నీటిపారుదల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కంటే అతి భారీ వ ర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలుల వల్ల చెట్లు కూలి రహదారులపై పడి ట్రాఫిక్ అంతరాయం కలగవచ్చని, అలాంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పూరి గుడిసెలు, పాత ఇండ్లు ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. పాత భవనాలు ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. రోడ్లపై ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని రైతులు వెంటనే ఇళ్లలోకి తీసుకెళ్లేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలావరకు జిల్లాలో చెరువులు నీటితో సమృద్ధిగా ఉన్నాయని, ఇప్పుడు వర్షాలు పడితే అవి పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అవసరమయ్యే మందులు సిద్ధం చేసుకుని, ప్రజలకు సకాలంలో అందించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలితే, ప్రాణనష్టం జరగకుండా విద్యుత్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశామని, దానికి 08542-245377నంబర్ని కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యలుంటే ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కి తెలియ జేస్తూ, సమస్యను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మణ్, డీఆర్వో రాంకి షన్, డీపీఓ రవీందర్, ఆర్డీఓ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు. -
మరో24 గంటలు!
విజయనగరం కలెక్టరేట్/ఫోర్ట్ న్యూస్‌లైన్: రైతుల కళ్లలో సుడులు రేపుతున్న హెలెన్ ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటినా శనివారం సాయంత్రానికి దీని ప్రభావం తగ్గుతుందని వారు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతన్న వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే 220 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే వేయి ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పార్వతీపురం డివిజన్లో కోసిన వరి పనలు నీళ్లలో తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కురి సిన వర్షంతో పొలాల్లో నీరు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, పాచిపెంట మండలాల్లో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. పనలపై ఉన్న వరి పంటను చక్కబెట్టుకోవటానికి రైతులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 24గంటల పాటు ప్రభావం.... హెలెన్ తుఫాన్ శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటింది. దీంతో కొంత వరకూ ముప్పు తప్పింది. అయితే మరో 24 గంటల పాటూ ఉంటుందని, ఆ తరువాత పూర్తిస్థాయిలో గండం గట్టెక్కినట్టేనని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా మత్స్యకారులు సముద్రంపైకి వేటకకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్లో 1077 టోల్‌ఫ్రీ నంబర్ కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పస్తులతో మత్స్యకార కుటుంబాలు హెలెన్ కారణంగా నాలుగు రోజులుగా చేపలవేట లేకపోవడంతో తీరంలో మత్స్యకార కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారు వేటకు వెళ్లడంలేదు. పడవలను తీరంలో లంగరు వేశారు. బోట్లు, వలలు పాడవకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాలులు, వర్షాల కారణంగా భోగాపురం మండలం లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఉన్నదీ పాయె!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులు గత నెలలో ప్రకృతి విపత్తులను తట్టుకుని మిగిలిన కొద్దిపాటి పంటలను సైతం ముంచేసి, రైతులను ఆశలను కూల్చేశాయి. వేట లేక మత్స్యకారులకు పూట గడవని దుస్థితి ఏర్పడింది. ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన మాసేన్ అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి బోటు తిరగబడటంతో మృత్యువాత పడ్డాడు. అతనితోపాటు వెళ్లిన మరో ఆరుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పై-లీన్, భారీ వర్షాల కారణంగా జిల్లాలో లక్షన్నర ఎకరాలకుపైగా వరి పంట పూర్తిగా దెబ్బతింది. 20వేలకుపైగా ఎకరాల్లో కొబ్బరి, జీడి, ఇతర పంటలు నాశనమైన విష యం తెలిసిందే. కాగా కొన్ని చోట్ల సగం కంకులతో, మరికొన్ని చోట్ల విపత్తులను తట్టుకొని నిలబడిన పంటను ప్రస్తుత వర్షాలు దెబ్బతీశాయి. హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వీటికితోడు గురువారం ఈదురుగాలులు వీయటం తో ఆహార, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. గతనెలలో సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా చాలా పంటలు దెబ్బతినగా.. సగం విరిగిన కంకులతో మిగిలిన పంటలనైనా దక్కించుకునేం దుకు గత నెలరోజులుగా రైతులు తీవ్రంగా శ్రమిం చారు. ప్రస్తుతం వరి కోతలు కోసి చేనును ఇంటికి తరలించేందుకు సిద్ధం చేశారు. అదంతా ఇంకా పొలాల్లోనే ఉంది. ఇంతలోనే హెలెన్ తుపాను రూపంలో ప్రకృతి మరోసారి దాడి చేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోనే ఉన్న వరి ఓవులు మునిగి, నానిపోతున్నాయి. తడిసి ముద్దయిపోయిన వీటిని దక్కించుకునేందుకు ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా మబ్బులు, వర్షపు జల్లులు ఏమాత్రం సహకరించడం లేదు. శుక్రవారం ఈదురుగాలులు లేకపోవడం మాత్రం కొంత ఊరట కలిగించింది. అయితే మరో 24 గంటలపాటు వర్షాలు పడతాయని, అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావారణ శాఖ ప్రకటించడం రైతుల ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వేలాది రూపాయలు మదుపు పెట్టి పండించిన పంట పోయిందని, ఇప్పుడు ఈ కాస్త కూడా దక్కకపోతే.. తిండిగింజలకూ తిప్పలు తప్పవని వారు ఆవేదన చెందుతున్నారు. వీటితోపాటు అరటి, బొప్పాయి, మునగ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నందిగాం మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జలుమూరు మండలంలో ఐదెకరాల్లో పెసర, మినప విత్తనాలు నీటమునిగాయి శ్రీకాకుళం మండలంలో సుమారు ఏడు వేల ఎకరాల్లోని వరి ఓవులు పొలాల్లోనే ఉన్నాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో ధాన్యం రంగు మారిపోవడంతోపాటు మొలకలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. రణస్థలం మండలంలో సుమారు 4500 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట అంతా కోత దశలో ఉండగా, కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా కోతలు జరుగుతున్నాయి. వర్షాలతో కోసిన పంటం తా తడిసిపోయింది. సుమారు 500 ఎకరాల్లో వేసిన ఉల్లి పంట కూడా నీరు నిల్వ కారణంగా కుళ్లిపోతోందని రైతులు విలపిస్తున్నారు. జి.సిగడాం మండలంలో మడ్డువలస కుడి కాలువ పరిధిలోని పలు గ్రామాల్లో కోసిన వరి పంట పొలాల్లోనే ఉంది. వర్షాలకు ఇది దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 15.7 మి.మీ. సగటు వర్షం గత 24 గంటల్లో జిల్లాలో 15.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శ్రీకాకుళంలో 38.2 మి.మీ., ఎల్‌ఎన్‌పేటలో 32.2, రణస్థలంలో 30, వజ్రపుకొత్తూరులో 27.2, జలుమూరులో 27, లావేరులో 26.6, కోటబొమ్మాళిలో 26.2, సారవకోటలో 24.6, కవిటిలో 23.2. పలాసలో 22.4, పోలాకిలో 22.4. నరసన్నపేటలో 20.7 మి.మీ. వర్షం కురిసింది. -
హెలెన్ పడగ
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. బుధవారం అర్ధరాత్రి 8 మండలాల్లో వర్షాలు పడగా గురువారం ఉదయం నుంచి 38 మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయానికి 8 మండలాల్లో 3.3 సెంటీమీటర్ల వర్షం పడగా సాయంత్రానికి జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు నమోదైంది. పొలాకి, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, శ్రీకాకుళం, భామిని, గార మండలాల్లో వర్షం ఎక్కువగా కురిసింది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగనుండటంతో వరి, అరటి, బొప్పాయి, మునగ, ఇతర పంట లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంచనా. మత్స్యకారులకు మళ్లీ కష్టాలు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించటంతో మత్స్యకారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గతంలో పై-లీన్ తుపాను తీవ్రతకు వలలు, పడవలు దెబ్బతినటంతో వారు పూర్తిగా నష్టపోయారు. అప్పటి నష్టానికి పరిహారం ఇప్పటికీ అందలేదు. ఇంతలోనే హెలెన్ తుపాను ముంచుకురావటంతో ఉపాధి లేక విల విల్లాడుతున్నారు. -
దూసుకొస్తున్న హెల్న్
=అప్రమత్తమైన యంత్రాంగం =తీర మండలాలకు ప్రత్యేకాధికారులు =పునరావాస కేంద్రాలు సిద్ధం =తీవ్రత మేరకు తరలింపునకు చర్యలు =వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని పిలుపు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను బీభత్సాన్ని మరిచిపోనే లేదు. ఇంతలో జిల్లాపై హెలెన్ తుపాను పడగెత్తింది. శరవేగంగా దూసుకొస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. తీరప్రాంత గ్రామాలు, లోతట్టు, ముంపు ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇటీవల అల్పపీడనం వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నష్ట తీవ్రతను తగ్గించేందుకు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందబాటులో ఉంచారు. ప్రతీ మండల కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించారు. వారు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.తీరమండలాల్లోని ప్రత్యేకాధికారులు ఆయా ప్రాంతాల్లో మకాం వేశారు. తుపాను ప్రభావం తగ్గేంత వరకు వారు మండలాల్లోనే ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించారు. 66 గ్రామాలపై దృష్టి తీర ప్రాంతంలోని 66 గ్రామాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం వద్ద తుపాను కేంద్రీకృతమైనందున తూర్పుగోదావరి జిల్లా వరకు ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరం మేరకు జిల్లాకు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలు సిద్ధం జిల్లాలో పునరావాస కేంద్రాలు మరోసారి తెరుచుకున్నాయి. గ్రామీణంలో 110 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. సక్రమంగా ఉన్న వాటిని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తరలింపునకు వాహన సదుపాయం కల్పిస్తున్నారు. తరలించిన వారికి ఆహారం, వైద్యం, ఇతర సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. జలాశయాలపై దృష్టి భారీ వర్షాలు కురిస్తే జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరే అవకాశముంది. దీంతో అధికారులు జలాశయాల నీటి మట్టాలపై దృష్టి సారించారు. ఇటీవల భారీ వర్షాలప్పుడు మాదిరి చర్యలు చేపడుతున్నారు. జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో ఏమేరకు ఉంటే అదే స్థాయిలో అవుట్‌ఫ్లో ఉండేలా చూడాలని నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు నీటి మట్టాలను పరిశీలించాలని, గేట్లు ఎత్తడానికి ఆరు గంటల ముందుగా కింది గ్రామాలకు సమాచారం అందించాలని సూచించారు. -
అప్రమత్తం
=హెలెన్ తుపానుపై ముందస్తు చర్యలు =కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ =తీర మండలాల్లోనే ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం =పోర్టులో 2వ నంబర్ ప్రమాద సూచిక విశాఖ రూరల్: హెలెన్ ముప్పుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలకు సమాయత్తమవుతోంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి ఈ తుపాను గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఒంగోలు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల వచ్చిన అల్పపీడనం మాదిరిగానే దీని గమనం కూడా అంచనాలకు అందడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఓడరేవులో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వెంటనే మండల ప్రత్యేకాధికారులకు, తహశీల్దార్లకు బుధవారం సాయంత్రం ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతంలోని పది మండలాల్లో ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తహశీల్దార్లు కూడా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితులను గమనించాలన్నారు. రాత్రి నుంచే అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్ సూచించా రు. అలలు ఎగసిపడతాయని, తీరంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. వేటకు వెళ్లిన వారు కూడా వెనక్కి తిరిగి రావాలన్నారు. బోట్లను, వలలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
రైతు గుండె జారెన్!
=భయం గుప్పెట్లో తీరప్రాంతాలు =జిల్లాకు ఏడు రెస్క్యూ బోట్లు, ప్రత్యేక బృందం రాక =కంట్రోల్ రూంల ఏర్పాటు =ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులు = కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077 తుపాను పేరెత్తితే చాలు అంతా హడలిపోతున్నారు. మరీ ముఖ్యంగా అన్నదాతల గుండెలు జారిపోతున్నాయి. గత నెలలో ఫై-లీన్ తుపాను, ఆ తర్వాత వాయుగుండం ఏర్పడి కుండపోతగా కురిసిన భారీవర్షాలకు రైతులు అతలాకుతలమయ్యారు. తీవ్ర పంట నష్టాలను చవిచూశారు. మళ్లీ ఇప్పుడు తాజాగా హెలెన్ తుపాను వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరిపంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో వస్తున్న తుపాను వార్త అన్నదాతలను గజగజ వణికిస్తోంది. సాక్షి, మచిలీపట్నం/న్యూస్‌లైన్, చల్లపల్లి : హెలెన్ తుపాను ప్రభావం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనే అధికారుల హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వరి పంట చేతికొచ్చిన తరుణంలో తుపాను వల్ల ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సివస్తుందోనని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో 23 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో 1.94 లక్షల ఎకరాల్లో పంట నష్టాలు జరిగినట్టు ఇటీవల అధికారులు నివేదికలు తయారుచేశారు. రూ.683 కోట్ల మేర జరిగిన నష్టాన్ని తలచుకుని గుండెలు బాదుకుంటున్నారు. ఆ భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న జిల్లా రైతాంగం ఈ హెలెన్ తుపాను ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తుందోనని భయపడిపోతున్నారు. పంట చేతికొచ్చేనా.. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తుపానుగా మారింది. దీనికి అధికారులు హెలెన్ అని పేరుపెట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు చేస్తున్న హెచ్చరికలు రైతులను వణికిస్త్తున్నాయి. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 6.43 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. మరో నాలుగు రోజుల్లో ముమ్మరమవుతాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది సాగు తలకుమించిన భారమైంది. ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు చేశారు. ఈదురుగాలులు వీస్తే కోతకొచ్చిన పంట పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనిక, పాలుపోసుకునే దశలో ఉన్న పంట దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక.. ఇప్పటికే తీరప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. మచిలీపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. నాగాయలంక మండలం సొర్లగొందిలో మూడురోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వస్తుండగా బోట్లలో ఆయిల్ అయిపోవడంతో మూడు గంటలు సముద్రంలో వారు నరకం చవిచూశారు. ప్రస్తుతం నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లోని తీరప్రాంతాల్లో సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని తీరప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అంతటా అప్రమత్తం : డీఆర్వో జాతీయ విపత్తుల కమిషన్ ఇచ్చిన సమాచారం మేరకు హెలెన్ తుపానుపై జిల్లాలో అప్రమత్తమైనట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్ బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాల మేరకు తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్డీవో, తహశీల్దార్, గ్రామస్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 127 తుపాను షెల్టర్లు సిద్ధం చేసి వాటిని ఆయా ప్రాంతాల్లోని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏడు రెస్క్యూబోట్లను సిద్ధం చేసి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్(ఎన్టీఆర్ఎఫ్) టీంకు చెందిన 40 మందిని గురువారం ఉదయానికి జిల్లాకు రప్పిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కిరావాలని, ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077ను ఏర్పాటు చేశారు. కాగా ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. డిస్కమ్ పరిధిలో.. తుపాను ప్రభా వం జిల్లాల్లో విద్యుత్ వినియోగదారులకు అత్యవసర సేవలు అందించేందుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు ఏపీఎస్పీడీసీఎల్ (డిస్కమ్) సీఎండీ హెచ్‌వై దొర ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూంల వివరాలను ఎస్ఈ మోహన్‌కృష్ణ సాక్షికి తెలిపారు. విజయవాడ సర్కిల్ ఆఫీసు, విజయవాడ టౌన్, రూరల్, గుణదల ప్రాంతాలకు 0866-2575620, 9440817561, నూజివీడు డివిజన్‌కు 08656-232746, 9490615606, గుడివాడ డివిజన్‌కు 08674-242703, 9440817573, మచిలీపట్నం డివిజన్‌కు 08672-222294, 9440812104, ఉయ్యూరు డివిజన్‌కు 08676-233718, 9491054708 కంట్రోల్ రూం నంబర్లు అందుబాటులో ఉంటాయి.