=అప్రమత్తమైన యంత్రాంగం
=తీర మండలాలకు ప్రత్యేకాధికారులు
=పునరావాస కేంద్రాలు సిద్ధం
=తీవ్రత మేరకు తరలింపునకు చర్యలు
=వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని పిలుపు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను బీభత్సాన్ని మరిచిపోనే లేదు. ఇంతలో జిల్లాపై హెలెన్ తుపాను పడగెత్తింది. శరవేగంగా దూసుకొస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. తీరప్రాంత గ్రామాలు, లోతట్టు, ముంపు ప్రాంతాలపై దృష్టి సారించారు.
ఇటీవల అల్పపీడనం వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నష్ట తీవ్రతను తగ్గించేందుకు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందబాటులో ఉంచారు. ప్రతీ మండల కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించారు. వారు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.తీరమండలాల్లోని ప్రత్యేకాధికారులు ఆయా ప్రాంతాల్లో మకాం వేశారు. తుపాను ప్రభావం తగ్గేంత వరకు వారు మండలాల్లోనే ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించారు.
66 గ్రామాలపై దృష్టి
తీర ప్రాంతంలోని 66 గ్రామాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం వద్ద తుపాను కేంద్రీకృతమైనందున తూర్పుగోదావరి జిల్లా వరకు ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అవసరం మేరకు జిల్లాకు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పునరావాస కేంద్రాలు సిద్ధం
జిల్లాలో పునరావాస కేంద్రాలు మరోసారి తెరుచుకున్నాయి. గ్రామీణంలో 110 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. సక్రమంగా ఉన్న వాటిని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తరలింపునకు వాహన సదుపాయం కల్పిస్తున్నారు. తరలించిన వారికి ఆహారం, వైద్యం, ఇతర సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జలాశయాలపై దృష్టి
భారీ వర్షాలు కురిస్తే జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరే అవకాశముంది. దీంతో అధికారులు జలాశయాల నీటి మట్టాలపై దృష్టి సారించారు. ఇటీవల భారీ వర్షాలప్పుడు మాదిరి చర్యలు చేపడుతున్నారు. జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో ఏమేరకు ఉంటే అదే స్థాయిలో అవుట్‌ఫ్లో ఉండేలా చూడాలని నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు నీటి మట్టాలను పరిశీలించాలని, గేట్లు ఎత్తడానికి ఆరు గంటల ముందుగా కింది గ్రామాలకు సమాచారం అందించాలని సూచించారు.
దూసుకొస్తున్న హెల్‌న్
Published Fri, Nov 22 2013 1:21 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement
Advertisement