జడివాన వెలిశాక గొడుగిస్తారా?
Published Sun, Jan 12 2014 3:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
అమలాపురం, న్యూస్‌లైన్ :కుండపోత వాన అన్నదాత ఆశల్ని ముంచింది. పెనుగాలి అతడి కలలను కల్లలు చేసింది. అయినప్పటికీ- ‘ముం దుంది మరింత మంచి కాలం’ అంటూ గప్పాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం నిండా మునిగిన రైతన్నకు కనీసంగానైనా చేయూతనివ్వడం లేదు. ప్రకృతి చేసిన పుండు నయమయ్యేందుకు తన వంతు సహకారం అందించకుండా.. దానిపై ‘కారం’ రాసినట్టు తాత్సారంతో వ్యవహరిస్తోంది. పెను తుపాను తాకిడికి పంట నష్టపోయిన ఖరీప్ వరి రైతులు.. కనీసం తడిసి, రంగుమారిన ధాన్యం కొనుగోలుకైనా సర్కారు ముందుకు వస్తే కొంతైనా ఊరటగా ఉంటుందని ఆశించారు. అయితే ఓట్ల కోసం రైతు భజన చేసే ప్రభుత్వం నిజంగా ఆదుకోవాల్సినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. హెలెన్ తుపాను దెబ్బకు ఖరీఫ్ వరిచేలు నేలనంటి, నీట మునిగిన విషయం తెలి సిందే.
పోగా దక్కిన ధాన్యం రంగుమారి, నాణ్యత తగ్గింది. ఖరీఫ్‌లో 4 లక్షల టన్ను ల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా వేయగా దానిలో 40 శాతం రంగుమారిన, తాలు తప్పలు ఎక్కువగా వచ్చినదే. ఈ ధాన్యాన్ని క్వింటాల్ రూ.600 నుంచి రూ.700కు కొనుగోలు చేస్తామని ధాన్యం వ్యాపారులు చెప్పడంతో రైతులు అమ్మేం దుకు వెనకడుగు వేసి నాణ్యత తగ్గిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. అలాగేని ప్రభుత్వ పెద్దలు హామీలిచ్చారు కూడా. అయితే తుపాను వచ్చి నెలన్నర దాటుతున్నా ఇప్పటి వరకు కొనుగోలుకు అనుమతి రానేలేదు. రంగుమారిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ ఉన్నతాధికారులు పరిశీలించి కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయింది.
‘నీలం’ నాడే నయం..
గతంలో నీలం తుపాను వల్ల దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 17 శాతం లోపు రంగుమారిన, తేమ ఉన్న ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం అంతకుమించి ఒక్కో శాతం పెరుగుదలకు రూ.10 చొప్పున తగ్గించి కొనుగోలు చేసింది. అంటే ప్రస్తుతం మద్దతు ధర క్వింటాల్ రూ.1,310 వరకు ఉండగా, 18 శాతం దాటి తేమ, రంగుమారిన ధాన్యాన్ని రూ.1,300కు, 19 శాతం ఉన్న ధా న్యాన్ని రూ.1,290కు, 20 శాతం ఉన్న ధాన్యాన్ని 1,280కు కొనేలా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ తాత్సారంతో నిస్పృహ చెందిన చిన్న, సన్నకారు రైతులు రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకున్నారు. కొంతమంది పెద్ద రైతులు మాత్రమే రంగుమారిన ధాన్యాన్ని నిల్వ చేసి ఉంచారు. వారం రోజుల్లో లోపు కొనుగోలుకు అనుమతి ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. అయితే నాణ్యత తగ్గిన ధాన్యంలో 80 శాతం బహిరంగ మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకున్నాక అనుమతి ఇచ్చినా.. ‘జడివాన వెలిశాక గొడుగు చేతపెట్టిన ’ చందమే అని రైతులు పెదవి విరుస్తున్నారు.
Advertisement
Advertisement