సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పూలరైతు ముందున్నది పూలబాటేమీ కాదు, ముళ్లబాటే. సిరులు కురిపించాల్సిన విరులు నష్టాలనే మిగిల్చాయి. పడిపోయిన ధరలు పూలరైతును నట్టేట ముంచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ తగ్గడంతో పూలను తోటల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడేమో కానీ, పూలు తెంపిన కూలీలకు చెల్లించాల్సిన కూలీ, వాటిని మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. మార్కెట్‌కు తీసుకెళ్లినా కొనేనాథుడు లేక చెత్తకుప్పల పాలుచేయాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహాది శుభకార్యాలు లేకపోవడం కూడా పూలధరల పతనానికి కారణమవుతోంది. భారీ అంచనాలతో చేపట్టిన పూలసాగు నష్టాలనే మూటగట్టిన పరిస్థితులు, రైతుల దయనీయ దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
రాజధాని అవసరాలకు సరిపడా పూలు రంగారెడ్డి జిల్లాలోనే సాగవుతాయి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, శంషాబాద్, షాబాద్, మండలాల్లో పూలసాగు అధికంగా ఉంది. ఈ మండలాల్లో చామంతి, బంతి, తెల్ల చందమామ, గులాబీ, చాందిని తదితర రకాల పూలతోటలను రైతులు పెంచుతున్నారు. గతేడాది 2 వేల హెక్టార్లలో పూలతోటలు సాగు చేయగా, ఈ ఏడాది ఏకంగా 4,500 హెక్టార్లలో పూదోటలు పెంచారు. దీంతో అవసరాలను మించి పూలఉత్పత్తులు మార్కెట్‌కు పోటెత్తడంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతో పూలదిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఇది కూడా పూలరైతుల నష్టాలకు కారణమైంది.
ధరలు పతనం
పూల ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయి. చామంతి కిలో రూ.15 నుంచి రూ.20, బంతి రూ.4 నుంచి రూ.10, చందమామ పూలు రూ.5 నుంచి రూ.10, చాందిని రూ.5 నుంచి రూ.10, జర్మనీ పూలు రూ.10 నుంచి రూ.20, గులాబీ రూ.25 నుంచి రూ.30 మాత్రమే పలుకుతుండటంతో రైతులకు గిట్టుబాటుకాక విలవిల్లాడుతున్నారు.
కన్నీరే మిగిలింది
పూలసాగుతో నష్టాలే మిగిలాయి. పండించిన పూలకు పెట్టుబడి కూడా రాలేదు. మార్కెట్‌కు తీసుకెళ్తే కిరాయి కూడా రావడం లేదని పొలాల్లోనే పూలను వదిలేస్తున్నాం.
– నాగారం మహేశ్, నదీమ్‌నగర్
కొనేవారు కరువు
డిసెంబర్ వరకు అయ్యప్ప పూజలు, సంక్రాంతి ఉండటంతో పూలధరలు కాస్తాకూస్తో ఉండేవి. ఆ తర్వాత శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో పూలకు గిరాకీ లేదు. దిగుబడి పెరిగినా, కొనేవారు లేరు. నిల్వ ఉంచుకునే వ్యవస్థ కూడా లేదు.
– గుంటం సైపాల్‌రెడ్డి, ఆమ్డాపూర్
మద్దతు ధర కల్పించాలి
రైతులకు అండగా ప్రభుత్వం నిలవాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత సర్కారుదే. పూల సాగుతో ఎదురవుతున్న నష్టాల నుంచి బయటపడేందుకు మద్దతు ధర ప్రకటించాలి. తద్వారా రైతాంగానికి భరోసా కల్పించాలి.
– అంజయ్యగౌడ్, నక్కపల్లి
Comments
Please login to add a commentAdd a comment