Crop products
-
పంట ‘లాస్’ చాలా ఎక్కువే..
సాక్షి, అమరావతి: మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ వంటి సౌకర్యాల కొరత కారణంగా దేశంలో పంట కోత అనంతరం భారీ నష్టం కలుగుతోంది. ఈ నష్టం విలువ 2022లో ఏకంగా సుమారు రూ.1,57,787 కోట్లుగా నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పశు ఉత్పత్తుల్లో ఎక్కువ నష్టం కలుగుతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. అత్యధికంగా పశు ఉత్పత్తుల్లో నష్టం వస్తుండగా, ఆ తరువాత పండ్లు, కూరగాయలు ఎక్కువగా పాడైపోయి నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక పేర్కొంది. తృణ ధాన్యాల ఏడాది సగటు ఉత్పత్తి 281.28 మిలియన్ టన్నులు ఉండగా.. కోత అనంతరం 12.49 మిలియన్ టన్నులు నష్టపోతున్నట్లు చెప్పింది. అదే విధంగా కూరగాయల సగటు ఉత్పత్తి 164.74 మిలియన్ టన్నులకుగాను 11.97 మిలియన్ టన్నులు వృథా అవుతున్నట్లు వివరించింది. అత్యధికంగా పశువుల ఉత్పత్తుల (డెయిరీ, మాంసం, ఫిష్ తదితరమైనవి) నష్టం విలువ రూ. 29,871 కోట్లు అని పేర్కొంది. ఈ నష్టాలను తగ్గించేందుకు అవసరమైన మౌలిక, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. తద్వారా పంటల విలువను పెంచడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ – సంరక్షణ సామర్ధ్యాల విస్తరణవిస్తరణ, ఆపరేషన్ గ్రీన్స్ సదుపాయాల కల్పనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో క్రెడిట్ లింక్ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఆహార ప్రాసెసింగ్, సంరక్షణకు, హార్వెస్ట్ నష్టాలను తగ్గించడానికి కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంకేఎస్‌వై కింద 1,187 ప్రాజెక్ట్‌లు ఆమోదించినట్లు వివరించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నిధి ద్వారా శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా పంట వృధాను తగ్గించడం, విలువ పెంచడం లక్ష్యమని తెలిపింది. -
రైతులే ఎగుమతి దారులు! పంట ఎగుమతిలో రైతన్నలకు స్వేచ్ఛ!
సాక్షి, అమరావతి: అన్నదాతలను ఎగుమతిదారులుగా తీర్చిదిద్దే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ కార్యరూపం దాలుస్తోంది. తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రపంచంలో ఎక్కడికైనా నేరుగా ఎగుమతి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పంటల ఆధారంగా రైతు ఉత్పత్తి దారుల సంఘాల (ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఎఫ్‌పీవోల ఏర్పాటుకు గతంలోనే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 200కు పైగా ఎఫ్పీవోలుండగా, వాటిలో 80 శాతం ఎఫ్‌పీవోలు తగిన ప్రోత్సాహం లేక నామమాత్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీటిని బలోపేతం చేయడంతో పాటు డివిజన్కొకటి చొప్పున కొత్తగా ఎఫ్‌పీవోలను కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేయాలని సంకల్పించారు.4 ఏజెన్సీల ద్వారా మార్కెటింగ్, క్రెడిట్ లింకేజ్రైతులు పండించిన పంటలను ఎగుమతిదారులతో ప్రమేయం లేకుండా ప్రపంచంలో తమకు గిట్టుబాటు ధర లభించే ఏ దేశానికైనా నేరుగా ఎగుమతి చేసుకునేలా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం 2020లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. కంపెనీల చట్టం కింద ఏర్పాటయ్యే ఈ ఎఫ్‌పీవోలకు గరిష్టంగా ఐదేళ్ల పాటు రూ.25 లక్షల వరకు ఆర్థిక చేయూతనిచ్చేలా ప్రణాళిక రూపొందించారు.వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మార్కెట్, క్రెడిట్ లింకేజ్ కల్పించేందుకు ఎస్‌ఎఫ్‌ఏసీ (చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కన్సార్టియం), నాబార్డు (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్), ఎన్సీడీసీ (జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్), ఎన్‌ఎఫ్‌ఈడీ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య)లను భాగస్వామ్యం చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సారథ్యంలో రాష్ట్రస్థాయి, కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఏ ఏ ఉత్పత్తులకు ఏ దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. మంచి ధర రావాలంటే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ఎగుమతి కోసంæ ఎలాంటి అనుమతులు అవసరం వంటి అంశాలపై అవసరమైన సహకారం అందిస్తున్నారు.కంపెనీలుగా 450 ఎఫ్‌పీవోలు ఏర్పాటు..కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో కంపెనీల చట్టం కింద 450 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఆమేరకు 100 శాతం ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా మరో 811 ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేశారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన స్టేట్ నోడల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఎన్టీఐ) ద్వారా ఎఫ్‌పీవోల్లోని రైతులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఇన్పుట్ లైసెన్సులు, మండి, జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు జారీ చేస్తారు. 450 ఎఫ్‌పీవోల్లో ఇప్పటికే 75 ఎఫ్‌పీవోలకు సీడ్ లైసెన్స్,100 ఎఫ్‌పీవోలకు ఫెర్టిలైజర్స్ లైసెన్సులు, 103 ఎఫ్‌పీవోలకు పురుగుల మందుల లైసెన్సులు జారీ చేశారు. మరొక వైపు పొలంబడులు, ఉద్యాన, పట్టు, మత్స్య సాగు బడులతో దిగుబడుల్లో నాణ్యత పెంచడంతో పాటు వాటికి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (గ్యాప్), ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేస్తూ ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు.పురోగతిని వేగవంతం చేయండి..కేంద్రప్రాయోజిత పథకమైన ఎఫ్‌పీవోల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు వాటికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఆదేశించారు. సంఘాల ఏర్పాటు, పురోగతిపై 8వ ఎస్ఎల్సీసీ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం మంగళగిరిలో మంగళవారం జరిగింది.ఇక నుంచి నోడల్ అధికారిగా మార్క్‌ఫెడ్ ఎండీ వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. ఎఫ్‌పీవోలకు ఎరువులు, పురుగుల మందుల వ్యాపారం నిర్వహణలో జరుగుతున్న జాప్యం నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. -
దిగుబడులు పెంచుతున్న రైతు‘బడులు’
సాక్షి, అమరావతి: నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు పొలం బడులు.. పట్టు దిగుబడులు పెంచేందుకు పట్టుబడులు, ఉద్యాన రైతుల కోసం తోట బడులు, ఆక్వా రైతుల కోసం మత్స్య సాగు బడులు, పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తోంది. ‘ఈ–ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్’ ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు ఉత్పత్తుల్లో నాణ్యతతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన విషపూరిత రసాయనాలు (యాంటీìబయోటిక్స్) వినియోగానికి బ్రేకులు పడ్డాయి. పాల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో సుమారు 10 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వగలిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో.. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు క్షేత్ర ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సమగ్ర సస్యరక్షణ, పోషక, నీటి, కలుపు యాజమాన్య పద్ధతులతోపాటు కూలీల ఖర్చును తగ్గించుకునేలా అవగాహన కలి్పస్తున్నారు. సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా కాగా.. 9 నుంచి 20 శాతం మేర దిగుబడులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎకరాకు వరిలో 275 కేజీలు, మొక్కజొన్నలో 300 కేజీలు, పత్తిలో 45 కేజీలు, వేరుశనగలో 169 కేజీలు, అపరాల్లో 100 కేజీల అదనపు దిగుబడులు సాధించారు. అలాగే పట్టు సాగుబడుల ద్వారా పట్టుగూళ్ల ఉత్పాదకత ప్రతి వంద గుడ్లకు 60 కేజీల నుంచి 77 కేజీలకు పెరిగింది. ఆక్వా ఉత్పత్తుల్లో తగ్గిన యాంటీబయోటిక్స్ వినియోగం సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో అప్సడా, సీడ్, పీడ్ యాక్టుల్ని తీసుకురావడంతోపాటు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచి్చంది. నాణ్యమైన ఆక్వా దిగుబడులు సాధించడం ద్వారా యాంటీబయోటిక్స్ వినియోగాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలిస్తున్నాయి.మితిమీరిన యాంటీబయోటిక్స్ వినియోగం వల్ల అమెరికా, చైనా సహా యూరప్, మధ్య ఆసియా దేశాలు గతంలో మన ఆక్వా ఉత్పత్తులను తిరస్కరించేవి. మత్స్య సాగుబడుల ద్వారా ఇస్తున్న శిక్షణ ఫలితంగా యాంటీబయోటిక్స్ శాతం గణనీయంగా తగ్గించగలిగారు. గతంలో 37.5 శాతం నమోదైన యాంటీబయోటిక్స్ అవశేషాలు ప్రస్తుతం 5–10 శాతం లోపే ఉంటున్నాయని చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడంతోపాటు దిగుబడులు సైతం 10–15 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు. గడచిన ఐదేళ్లలో ఏపీ నుంచి రొయ్యల కన్సైన్మెంట్లను తిప్పిపంపిన ఘటనలు చోటుచేసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. పశువుల్లో తగ్గిన వ్యాధులు మరోపక్క ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పశు విజ్ఞాన బడుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనలో మూగ, సన్న జీవాలకు సీజన్లో వచ్చే వ్యాధులు 20–30 శాతం మేర తగ్గాయని గుర్తించారు. ఈనిన 3 నెలలకే ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించడం వల్ల ఏడాదికో దూడను పొంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతున్నారు. దూడలు పుట్టుక మధ్య కాలం తగ్గడంతో లీటరున్నరకు పైగా పాల దిగుబడి (15–20 శాతం) పెరిగిందని, ఆ మేరకు రైతుల ఆదాయం పెరిగిందని గుర్తించారు. దూడ పుట్టిన నాటినుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని వాటిని అవలంబించడం ద్వారా దూడల్లో మరణాల రేటు 15 శాతం, సకాలంలో పశు వైద్య సేవలందించడం వల్ల 10 శాతం మేర పశువుల మరణాలు ‡తగ్గినట్టు గుర్తించారు. హెక్టార్‌కు 4 టన్నుల దిగుబడి నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్ వేశా. మత్స్య సాగుబడుల్లో చెప్పిన సాగు విధానాలు పాటించా. సిఫార్సు చేసిన ప్రోబయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు పెడితే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు మించి ఖర్చవలేదు. గతంలో హెక్టార్‌కు 3నుంచి 3.2 టన్నుల దిగుబడి రాగా.. ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనపు ఆదాయం వచి్చంది. –పి.లక్ష్మీపతిరాజు, కరప, తూర్పు గోదావరి జిల్లాపశువిజ్ఞాన బడులతో ఎంతో మేలు మా గ్రామంలో 26 మంది రైతులు 3,600 గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రోగాలొస్తే తప్ప పశువైద్యుల దగ్గరకు వాటిని తీసుకెళ్లే వాళ్లం కాదు. తరచూ వ్యాధుల బారిన పడుతూ మృత్యువు పాలయ్యేవి. తగిన బరువు తూగక ఆరి్థకంగా నష్టపోయే వాళ్లం. పశువిజ్ఞాన బడుల వల్ల క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తుండటంతో వ్యాధులు, మరణాల రేటు తగ్గింది. సబ్సిడీపై ఇస్తున్న పచి్చమేత, సమీకృత దాణాను తీసుకోగలుగుతున్నాం. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక బరువును పొంది అధిక లాభాలను ఆర్జిస్తున్నాం. – బమ్మిడి అప్పలరాజు, తొడగువానిపాలెం, విశాఖ జిల్లా -
11 ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా వాటికి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు మంగళవారం ఉదయం వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం, ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఆర్భీకేల ద్వారా రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు కూడా కనీస మద్దతు ధర ఇస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.3వేల కోట్లు కేటాయిస్తున్నాం. ధర్మవరంలో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మిల్లెట్స్‌కు ఎంఎస్పీ అందించాం. మిల్లెట్స్‌లో 13 సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి’’ అని సీఎం చెప్పారు. ఏటా 3.14 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుండగా.. 40,307 మంది రైతులకు మేలు జరగనుంది. వీటితోపాటు ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్‌ను ముఖ్యమంత్రి రైతులకు అంకితం చేశారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం అవసరమైన ముడిసరుకును రైతుల నుంచి సేకరించే సందర్భంగా వారికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు, ఒక మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ► ఆపరేషన్ గ్రీన్స్ కింద ఒక్కొక్కటి రూ.5.5 కోట్లతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం తుమ్మగుంటపల్లి, చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి, సోమల మండలం కామిరెడ్డివారిపల్లెల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం ఏడాదికి 3,600 టన్నులు. ఒక్కో యూనిట్లో 15 మంది చొప్పున నాలుగు యూనిట్ల ద్వారా 60 మందికి ఉపాధికి లభిస్తుంది. 2,414 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. ► విజయనగరంలో రూ.4 కోట్లతో నిర్మించిన ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఏటా 7,600 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా రాగిపిండి, మిల్లెట్ చిక్కీలు, బిస్కెట్లు, సేమ్యా తయారు చేస్తారు. 20 మందికి ఉపాధికి లభిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ యూనిట్ నిర్వహణ కోసం వెయ్యిమంది రైతులతో ఏర్పడిన ఆరోగ్య మహిళా రైతు ఉత్పత్తిదారుల్లో సభ్యులంతా మహిళలే. యూనిట్‌ను నిర్వహించేది, పనిచేసేది అందరూ మహిళలే. ► కర్నూలు జిల్లాలో ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఒక్కో యూనిట్ రూ.లక్ష చొప్పున రూ.కోటితో 100 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ ఆరుటన్నుల చొప్పున ఏటా మొత్తం ఆరువేల టన్నుల ఉల్లిని ప్రాసెస్‌చేసే సామర్థ్యం ఈ యూనిట్లకు ఉంది. సీఎం ప్రారంభించనున్న వీటిద్వారా 100 మందికి ఉపాధి లభించనుండగా 500 మంది ఉల్లి రైతులకు లబ్ధిచేకూరనుంది. భారీ చాక్లెట్స్ పరిశ్రమ సహా ఐదింటికి భూమిపూజ మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. వీటిలో చాక్లెట్ల కంపెనీ, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్, మూడు టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిద్వారా 745 మందికి ఉపాధి లభించనుండగా, 36,588 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► వీటిలో ప్రధానమైది మాండలిజ్ చాక్లెట్ కంపెనీ యూనిట్. బిస్కెట్లు, చాక్లెట్ల తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటైన మాండలిజ్ కంపెనీ రూ.1,600 కోట్లతో శ్రీసిటీలో అతిపెద్ద చాక్సెట్ల తయారీ కంపెనీ నిర్మిస్తోంది. ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవా ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుంది. 18 వేలమంది రైతులకు లబ్ధి కలుగుతుంది. ► సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామం వద్ద 11 ఎకరాల్లో రూ.75 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వేరుశనగ నూనె, పీనట్ బటర్, చిక్కీ, రోస్టర్డ్ సాల్టెడ్ పీనట్స్ తయారు చేస్తారు. ఏటా 55,620 టన్నుల వేరుశనగను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభిస్తుంది. 15వేల మందికి రైతులకు లబ్ధి చేకూరుతుంది. ► ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్‌లో భాగంగా ఒక్కొక్కటి రూ.5.5 కోట్ల అంచనాతో అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం, కుందుర్పి, సత్యసాయి జిల్లాలో చెన్నేకొత్తపల్లిల్లో టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం ఏటా 3600 టన్నులు. వీటి ద్వారా 45 మందికి ఉపాధి లభిస్తుంది. 3,588 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. ఉద్యాన రైతులకు అంకితం ఉద్యానపంట ఉత్పత్తుల నిల్వ, గ్రేడింగ్ కోసం గ్రామస్థాయిలో రూ.63.15 కోట్లతో నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, రూ.5.37 కోట్లతో నిర్మించిన 43 కోల్డ్ రూమ్స్‌ను సీఎం వైఎస్ జగన్ రైతులకు అంకితం చేశారు. 1,912 ఆర్బీకేలకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ కలెక్షన్ సెంటర్ల సామర్థ్యం ఒక్కొక్కటి వందటన్నుల వంతున మొత్తం 42,100 టన్నులు. ఈ సెంటర్ల ద్వారా 1.80 లక్షలమంది రైతులకు మేలు జరగనుంది. అలాగే 194 ఆర్బీకేలకు అనుబంధంగా ఒక్కొక్కటి 10 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన 43 కోల్డ్ రూమ్స్ ద్వారా 26,420 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. -
TS: క్వింటాల్ పత్తి రూ.8 వేలు!.. వరి, కంది ధరలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమవుతోంది. త్వరలో రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సీజన్లో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక పంట వేసి నష్టపోతుంటారు. కొందరు సరైన అవగాహన, ప్రణాళికతో మంచి లాభాలు పొందుతుంటారు. కోతలు ముగిసే సమయానికి ఏ పంటకు ఎంత ధర ఉండే అవకాశం ఉందో ముందుగా అంచనా వేయగలిగితే.. రైతులు ఆ ప్రకారం పంటలు సాగు చేసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో 15 నుంచి 21 ఏళ్ల నెలవారీ ధరలను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఫలితాలు, మార్కెట్ సర్వేలను పరిశీలించి 2023–24 వానాకాలం (ఖరీఫ్) పంటల ధరలు ఏ విధంగా ఉండవచ్చో అంచనా వేసింది. వరంగల్ ప్రధాన మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,550 నుంచి రూ.8,000 వరకు ఉంటుందని తెలిపింది. దీనితో పాటు వరి, మిర్చి, కంది తదితర పంటల ధరలను కూడా అంచనా వేసింది. అయితే పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితులపై ఆధారపడి అంచనా ధరల్లో మార్పు ఉండొచ్చని పేర్కొంది. కాగా వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అంచనాల ప్రకారం..ఏయే పంటలు వేయాలో నిర్ణ యం తీసుకుని రైతులు సాగుకు సన్నద్ధం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవ సాయ విశ్వవిద్యాలయం సూచించింది. మద్దతు ధరల కంటే ఎక్కువే.. ఈ ఏడాది రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు రైతులకు సూచిస్తున్నారు. ఆ తర్వాత వరి ఎలాగూ భారీగానే సాగవుతుంది. కాబట్టి పత్తి తర్వాత కంది సాగును కూడా పెంచాలనేది సర్కారు ఉద్దేశం. కాగా ఖరీఫ్‌లో పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధరకంటే ఎక్కువ ధరలే లభిస్తాయని వ్యవసాయ మార్కెట్ ఇంటిలిజెన్స్ కేంద్రం అంచనా వేయడం గమనార్హం. పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,380గా ఉంది. అయితే 2021–22 వానాకాలం సీజన్లో పత్తి ధర మార్కెట్లో ఏకంగా రూ.12 వేల వరకు పలికింది. దీంతో రైతులు గత సీజన్లో అంత ధర వస్తుందని భావించారు. కానీ రూ. 7–8 వేలకు మించలేదు. దీంతో చాలామంది రైతులు మంచి ధర కోసం ఎదురుచూస్తూ పత్తిని ఇళ్లల్లోనే దాచుకున్నారు. అందులో చాలావరకు పాడైపోయింది. ఇక ఈసారి కూడా పత్తి ధర రూ.8 వేల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రకటించడంతో రైతులు పత్తి సాగుకు ఏ మేరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: నైరుతి రాక.. జూన్ రెండో వారం నుంచి వానలు! -
పత్తి పంట కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రత్యేక బ్రాండ్
ముంబై: పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ (జీఏవీఎల్) తాజాగా పత్తికి సంబంధించి ’పయ్నా’ పేరిట ప్రత్యేక బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హిట్వీడ్, హిట్వీడ్ మాక్స్, మాక్స్కాట్ అనే మూడు కలుపు నిర్వహణ ఉత్పత్తులను ఈ బ్రాండ్ కింద విక్రయించనున్నట్లు సంస్థ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ విభాగం సీఈవో రాజవేలు ఎన్కే తెలిపారు. ఇవి కలుపు మొక్కల సమస్యను తగ్గించి, ప్రారంభ దశల్లో పత్తి పంట ఏపుగా ఎదిగేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. తద్వారా అధిక దిగుబడులను పొందేందుకు తోడ్పడగలవని వివరించారు. -
సాగు ఎగుమతుల్లో ఎదిగాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి వ్యవసాయ పంట ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2019–20తో పోలిస్తే 2020–21లో ఎగుమతులు బాగా పెరిగాయి. 2019–20లో మొత్తం రూ. 2,692.15 కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు వెళ్లగా 2020–21లో రూ. 4,180 కోట్ల మేర ఎగుమతి అయ్యాయి. మొత్తంగా పంట ఉత్పత్తుల ఎగుమతుల్లో చిన్న, పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో 14వ స్థానంలో తెలంగాణ నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దేశం నుంచి కూడా వ్యవసాయ ఎగుమతులు 2019–20తో పోలిస్తే 2020–21లో 34.86 శాతం పెరిగాయి. 2019–20లో 1.55 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా 2020–21లో ఇవి 2.10 లక్షల కోట్లకు పెరిగాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల 2020లో వ్యవసాయ ఎగుమతులపై ప్రభావం పడింది. కంటైనర్లు అందుబాటులో లేకపోవడం, రవాణా ఖర్చు పెరగడం, లాక్డౌన్ వల్ల సరఫరాలో అంతరాయం లాంటి పరిస్థితులు ఎదురైనా ఎగుమతులు పెరగడం విశేషం. పండ్లు, కూరగాయలు డీలా.. రాష్ట్ర ఎగమతుల్లో సుగంధ ద్రవ్యాలు (స్పైసెస్) ముందున్నాయి. ఇక్కడి పసుపు, మిర్చి తదితర సుగంధ ద్రవ్యాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. 2020–21లో రూ. 1,464 కోట్లు ఇవే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో రాష్ట్రంలో బాగా పండే పత్తి ఉంది. ఇక్కడి నుంచి రూ.1,056 కోట్ల విలువైన పత్తి విదేశాలకు ఎగుమతి అయింది. చైనా వంటి దేశాలకు ఇక్కడి పత్తి వెళ్తుంటుంది. ఆ తర్వాత రూ. 911 కోట్ల విలువైన బియ్యం (బాస్మతి కాకుండా) ఎగుమతి చేశారు. పండ్ల ఎగుమతి మాత్రం గతంతో పోలిస్తే తగ్గింది. 2019–20లో రూ. 41.99 కోట్ల విలువైనవి ఎగుమతి కాగా, 2020–21లో రూ. 15.67 కోట్లే ఎగుమతి అయ్యాయి. అలాగే 2019–20లో రూ. 33.34 కోట్ల విలువైన కూరగాయలు ఎగుమతి కాగా 2020–21లో రూ. 10.77 కోట్ల విలువైనవే విదేశాలకు వెళ్లాయి. పండ్లు, కూరగాయలు త్వరగా పాడై పోయే గుణం కలిగి ఉండటం, కరోనా కాలంలో రవాణా ఎక్కువ రోజులు తీసుకోవడంతో ఎగుమతులు తగ్గినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. -
ఒబెరాయ్ రియల్టీ జూమ్- ర్యాలీస్ డౌన్
వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్‌చేసి 40,669ను తాకింది. నిఫ్టీ 56 పాయింట్లు ఎగసి 11,929 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై మెరుగైన పనితీరు ప్రదర్శించనుందన్న అంచనాలు ఒబెరాయ్ రియల్టీ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెస్టెంబర్) ఫలితాలు నిరాశపరచడంతో ర్యాలీస్ ఇండియా కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఒబెరాయ్ రియల్టీ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ర్యాలీస్ ఇండియా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఒబెరాయ్ రియల్టీ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఒబెరాయ్ రియల్టీ నిర్వహణ లాభం(ఇబిటా) 12 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 36 శాతం నీరసించి రూ. 316 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు భారీగా జంప్‌చేసి 59 శాతాన్ని తాకాయి. పండుగల సీజన్ నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి కంపెనీ పనితీరు జోరందుకునే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. థానే తదితర ప్రాంతాలలో ప్రాజెక్టులు ఇందుకు సహకరించగలవని అంచనా వేసింది. దీంతో ఎన్ఎస్ఈలో ఒబెరాయ్ రియల్టీ షేరు తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 446ను తాకింది. ప్రస్తుతం 13 శాతం లాభంతో రూ. 440 వద్ద ట్రేడవుతోంది. ర్యాలీస్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ర్యాలీస్ ఇండియా నికర లాభం 2 శాతం తగ్గి రూ. 83 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 725 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16.1 శాతం వద్ద స్థిరత్వాన్ని చూపాయి. అమ్మకాలలో దేశీయంగా సస్యరక్షణ విభాగం 8 శాతం, విత్తనాల బిజినెస్ 29 శాతం పుంజుకున్నప్పటికీ.. ఎగుమతులు 29 శాతం క్షీణించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీస్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5.5 శాతం పతనమై రూ. 259 దిగువకు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 263 వద్ద ట్రేడవుతోంది. -
కోటితో ఉడాయించిన వ్యాపారి
దుగ్గొండి(నర్సంపేట): గ్రామాల్లో రైతులను నమ్మించి.. పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. కొంతకాలం పాటు సక్రమంగా డబ్బులు చెల్లించాడు. ఆతర్వాత లక్షలాది రూపాయల సరుకులు విక్రయించిన రైతులను ముంచేశాడు. సుమారు వంద మంది రైతులకు చెందిన రూ.కోటితో ఉడాయించిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ఈర్ల స్వామి నాలుగేళ్ల క్రితం టాటాఏఎస్ ట్రాలీ నడుపుతూ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేవాడు. ఈ క్రమంలో రైతులతో పరిచయం పెంచుకున్నాడు. మూడేళ్ల క్రితం తానే స్వయంగా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. పత్తి, మొక్కజొన్న, పసుపు, పల్లికాయను రైతుల ఇంటి వద్దే కొనుగోలు చేశాడు. ఇంటి వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతులు అతడికి అన్ని రకాల సరుకులను విక్రయించేవారు. రెండేళ్లపాటు రైతులకు నమ్మకంగా డబ్బులు చెల్లించాడు. ఇలా అతడి వ్యాపారం దుగ్గొండి, గీసుగొండ, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల పరిధిలో గ్రామాలకు విస్తరించింది. ఈ ఏడాది పత్తి, పసుపు, మొక్కజొన్న, పల్లికాయను మార్కెట్లో ఉన్న ధర కంటే ఎక్కువ ధరకు వందలాది మంది రైతుల వద్ద సుమారు రూ.కోటి వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. తీరా డబ్బులు చెల్లించే క్రమంలో అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. పది రోజులుగా ఆయా మండలాలకు చెందిన రైతులు స్వామి ఇంటికి వచ్చి చూడగా అందుబాటులో ఉండటం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఈ క్రమంలో శనివారం కూడా వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉండటం చూసిన రైతులు గుమస్తాను వెంట పెట్టుకుని అతడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం ఉదయం 87 మంది రైతులను ఈర్ల స్వామి మోసం చేశాడని, రూ.కోటితో ఉడాయించాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు స్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. స్వామి ఉడాయించిన విషయం ఇంకా చాలామంది రైతులకు తెలియదని సుమారుగా రూ.2కోట్లతో ఊడాయించి ఉంటాడని రైతులు చర్చించుకుంటున్నారు. రూ.3.10 లక్షలు రావాల్సి ఉంది.. నా చేలో పండిన 25 క్వింటాళ్ల పసుపు, 16 క్వింటాళ్ల పల్లికాయ, 16 క్వింటాళ్ల పత్తిని స్వామికి విక్రయించాను. 15 రోజులుగా డబ్బుల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాను. మొదట రేపు, మాపు అంటూ నమ్మించాడు. తీరా బతుకమ్మ, సద్దుల పండుగ నుంచి మనిషి కనబడటం లేదు. రూ.3.10 లక్షలు రావాల్సి ఉంది. ఇంటి ముందుకు వచ్చిన కాంటా కదా అని నమ్మి మోసపోయాను.– సిరిపురం వీరమల్లారెడ్డి, రైతు, నాచినపల్లి ఎక్కువ ధర వస్తుందని ఆశ పడ్డ.. నాకు ఒక ఎకరం భూమి ఉంది. మొక్కజొన్న వేసిన. 31 క్వింటాళ్ల మొక్కజొన్నలు పండినవి. పక్క ఊరు కావడంతో స్వామితో కొంత పరిచయం ఉంది. బయట క్వింటాళ్‌కు రూ.1350 ఇస్తున్నరు. ఇక్కడ రూ.1400 పెడుతుండటంతో పాటు ఇంటి వద్దే కాంటా పెట్టిన. 20రోజులైతాంది. రూ.45 వేలు రావాలే.. – గోవిందనాయక్,రైతు, కొమ్మాల, గీసుగొండ మండలం -
పంట కొనుగోలు సక్రమంగా జరగాలి: గుత్తా
సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తుల కొనుగోలును సక్రమంగా సకాలంలో జరిగేలా చూడాలని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. జిల్లా రైతు సమితి సమన్వయకర్తలతో గురు వారం ఆయన తొలిసారిగా సమావేశ మ య్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లా డుతూ.. త్వరలో జిల్లా, మండల స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులకు ఏడు విడతలలో రెండ్రోజుల చొప్పున శిక్షణ కార్య క్రమం ఉంటుందన్నారు. రైతు వేదికల నిర్మాణానికి భూములను గుర్తించాలన్నారు. మరోవైపు కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. -
పూలబాట కాదు...ముళ్లబాటే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పూలరైతు ముందున్నది పూలబాటేమీ కాదు, ముళ్లబాటే. సిరులు కురిపించాల్సిన విరులు నష్టాలనే మిగిల్చాయి. పడిపోయిన ధరలు పూలరైతును నట్టేట ముంచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ తగ్గడంతో పూలను తోటల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడేమో కానీ, పూలు తెంపిన కూలీలకు చెల్లించాల్సిన కూలీ, వాటిని మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. మార్కెట్‌కు తీసుకెళ్లినా కొనేనాథుడు లేక చెత్తకుప్పల పాలుచేయాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహాది శుభకార్యాలు లేకపోవడం కూడా పూలధరల పతనానికి కారణమవుతోంది. భారీ అంచనాలతో చేపట్టిన పూలసాగు నష్టాలనే మూటగట్టిన పరిస్థితులు, రైతుల దయనీయ దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రాజధాని అవసరాలకు సరిపడా పూలు రంగారెడ్డి జిల్లాలోనే సాగవుతాయి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్, షాబాద్, మండలాల్లో పూలసాగు అధికంగా ఉంది. ఈ మండలాల్లో చామంతి, బంతి, తెల్ల చందమామ, గులాబీ, చాందిని తదితర రకాల పూలతోటలను రైతులు పెంచుతున్నారు. గతేడాది 2 వేల హెక్టార్లలో పూలతోటలు సాగు చేయగా, ఈ ఏడాది ఏకంగా 4,500 హెక్టార్లలో పూదోటలు పెంచారు. దీంతో అవసరాలను మించి పూలఉత్పత్తులు మార్కెట్‌కు పోటెత్తడంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతో పూలదిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఇది కూడా పూలరైతుల నష్టాలకు కారణమైంది. ధరలు పతనం పూల ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయి. చామంతి కిలో రూ.15 నుంచి రూ.20, బంతి రూ.4 నుంచి రూ.10, చందమామ పూలు రూ.5 నుంచి రూ.10, చాందిని రూ.5 నుంచి రూ.10, జర్మనీ పూలు రూ.10 నుంచి రూ.20, గులాబీ రూ.25 నుంచి రూ.30 మాత్రమే పలుకుతుండటంతో రైతులకు గిట్టుబాటుకాక విలవిల్లాడుతున్నారు. కన్నీరే మిగిలింది పూలసాగుతో నష్టాలే మిగిలాయి. పండించిన పూలకు పెట్టుబడి కూడా రాలేదు. మార్కెట్‌కు తీసుకెళ్తే కిరాయి కూడా రావడం లేదని పొలాల్లోనే పూలను వదిలేస్తున్నాం. – నాగారం మహేశ్, నదీమ్‌నగర్ కొనేవారు కరువు డిసెంబర్ వరకు అయ్యప్ప పూజలు, సంక్రాంతి ఉండటంతో పూలధరలు కాస్తాకూస్తో ఉండేవి. ఆ తర్వాత శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో పూలకు గిరాకీ లేదు. దిగుబడి పెరిగినా, కొనేవారు లేరు. నిల్వ ఉంచుకునే వ్యవస్థ కూడా లేదు. – గుంటం సైపాల్‌రెడ్డి, ఆమ్డాపూర్ మద్దతు ధర కల్పించాలి రైతులకు అండగా ప్రభుత్వం నిలవాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత సర్కారుదే. పూల సాగుతో ఎదురవుతున్న నష్టాల నుంచి బయటపడేందుకు మద్దతు ధర ప్రకటించాలి. తద్వారా రైతాంగానికి భరోసా కల్పించాలి. – అంజయ్యగౌడ్, నక్కపల్లి -
‘నామ్’ అమలు.. అందరి బాధ్యత
మార్కెట్ వ్యాపారులు, అధికారులకు డీడీఎం సూచన వరంగల్ సిటీ : దేశంలో పంట ఉత్పత్తులకు మంచి ధర దక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవస్థ(నామ్) అమలు బాధ్యత అందరిదని వరంగల్ రీజినల్ మార్కెటింగ్ డిప్యూటీ డెరైక్టర్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మార్కెట్ కార్యదర్శి అజ్మీరా రాజు అధ్యక్షతన అడ్తి, వ్యాపారులతో సమావేశం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నామ్ అమలు తీరు, విధివిధానాలు, వ్యాపారులు, అధికారులు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. మొదట చాంబర్ ముఖ్యప్రతినిధులు, ప్రముఖ వ్యాపారులతో సమావేశం నామ్ అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర వివరించారు. క్రయ విక్రయూలు సింగిల్ లెసైన్స్డ్ విధానంతో పారదర్శకంగా ఆన్లైన్లో జరుగుతాయని, ఇది కూడా ఎన్‌సీడీఎక్స్ (ఈ మార్కెటింగ్) లాంటిదేనని తెలిపారు. దీంతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దేశం మొత్తం ఒకే ధర అమలు కావడం వల్ల రైతులకు మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని, మోసాలు ఉండవని చెప్పారు. దేశంలో 21 మార్కెట్లలో నామ్ అమలవుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఐదు మార్కెట్లలో మాత్రమే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చెప్పారు. ఈమేరకు వరంగల్ మార్కెట్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఛాంబర్ అధ్యక్షుడు కటకం పెంటయ్యతో పాటు ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. కాగా సమావేశం తర్వాత మార్కెట్లోని అన్ని హోదాల అధికారులతో సమావేశం నిర్వహించి నామ్ అమలుకు సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. సీజన్‌కు ముందు మార్కెట్లో ఈ మార్కెటింగ్ ప్రవేశపెట్టినప్పుడు వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి అమలు కాకుండా చేసిన విషయూన్ని సిబ్బంది గుర్తుచేశారు. ఎట్టిపరిస్థితుల్లో నామ్‌ను అమలు చేయూలని ఆయన సూచించారు. మార్కెట్ అధికారులు వేముల వెంకటేశ్వర్లు, పి.అశోక్, శ్రీధర్, ఓని కుమారస్వామి, ప్రభాకర్, రమేష్, ఎస్.రమేష్, లక్ష్మీనారాయణ, చక్రబహుదూర్, రాజేందర్, అంజిత్‌రావు, బీయాబాని, వేణుగోపాల్, మందవేణు పాల్గొన్నారు. -
కొనుగోళ్లపై విస్తృత ప్రచారం
సిద్దిపేట జోన్ : ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల పరిధిలోని గ్రామాల్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని గత నెల 13న ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ప్రతీ గ్రామానికి రూ.200 చొప్పున ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ బడ్జెట్ మిసిలేనియస్ పద్దు నుంచి ఖర్చు చేయవచ్చంటూ అధికారాన్ని అప్పగించింది. వివరాల్లోకి వె ళితే.. జిల్లాలో మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జహీరాబాద్, నర్సాపూర్, అందోల్, సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 18 మార్కెట్ కమిటీలున్నాయి. వీటి పరిధి కింద ఉన్న ఆయా గ్రామాల్లో 2014-15 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి రైతు పంట ఉత్పత్తులు పత్తి, మొక్కజొన్న, వరిలకు మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. అందుకు అగుణంగానే పత్తి, మొక్కజొన్న, వివిధ రకాల ఉత్పత్తులు కొనుగోళ్లకు సంబంధించి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కమిషనర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం కోసం, రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కరపత్రాలు, గోడ, పత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించి అతికించాలని అదే విధంగా దండోరా ద్వారా రైతులకు ఎంఎస్‌పీపైన అవగాహన కల్పించాలని సీజన్‌కు ముందే స్పష్టమైన ఆదేశాలు అందాయి. కానీ వాటి నిర్వహణ ఖర్చు బాధ్యత విషయంలో సందిగ్ధత నెలకొనడం, సీజన్లో ఆయా గ్రామాల్లో సాధ్యమైనంత రీతిలో ప్రచారాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే సంబంధిత ప్రచార ఖర్చును మార్కెట్ కమిటీకి సంబంధించిన బడ్జెట్ మిసిలేనియస్ పద్దు నుంచి ఖర్చు చేసుకోవచ్చంటూ కార్యదర్శులకు పూర్తి అధికారాలను అప్పగించారు. దీనికి సంబంధించి ప్రతి గ్రామానికి ప్రచార నిమిత్తం రూ. 200లను గ్రామ సేవలకు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని, అట్టి నిధుల వివరాలను గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ నిబంధనలను కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఖరీఫ్ ధాన్యం, కొనుగోళ్ల సీజన్ పూర్తి కావస్తున్న క్రమంలో ప్రచార నిర్వహణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నామంటూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనరేట్ నుంచి ఈ నెల 3న జిల్లాలోని మార్కెట్ కమిటీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకస్మిక తనిఖీల్లో ప్రచారంపై అలసత్వం బహిర్గతమైతే క్రమశిక్షణ చర్యలను సైతం తీసుకుంటామంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒక వైపు ప్రచార నిర్వహణ ఖర్చుపై సందిగ్ధంలో ఉన్న మార్కెట్ కమిటీ అధికారులకు పరిష్కార మార్గం చూపిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామంటూ శ్రీ ముఖాల జారీకి సిద్ధం కావడం అధికారులను అయోమయానికి గురి చేస్తుంది. ఏదేమైనా ప్రభుత్వం మద్ధతు ధర విషయాన్ని క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత పరిచేందుకు నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయమేనంటూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పారదర్శకత కోసమే ఈ-బిడ్డింగ్
ఖమ్మం వ్యవసాయం : రైతులు పండించిన పంట ఉత్పత్తుల విక్రయంలో పారదర్శకత కోసమే ఎలక్రానిక్ బిడ్డింగ్‌ను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం.ఎ.జావీద్ అన్నారు. ఈ-బిడ్డింగ్‌పై స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా రైతు సంఘాల నేతలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఆధునిక పద్ధతుల్లో క్రయ విక్రయాలు, తూకాలు, రైతులకు తక్‌పట్టీల జారీ, మార్కెట్లకు సమాచారం అందించడం కోసం కంప్యూటరైజేషన్, ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రైతులకు తమ సరుకు మార్కెట్ యార్డులోనికి వచ్చింది మొదలు అమ్ముకుని తక్‌పట్టీ పొందే వరకూ పారదర్శకత ఉంటుందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోకెల్లా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ప్రథమంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యార్డులకు సరుకు వచ్చినప్పుడు గేటు వద్ద రైతు వివరాలు, సరుకు వివరాలు కంప్యూటర్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలతో కూడిన పత్రం (టోకెన్) మార్కెటింగ్ శాఖ రైతుకు జారీ చేస్తుందన్నారు. రైతు సెల్‌కు కమీషన్ ఏజెంట్ సెల్‌కు మెసేజ్ వస్తుందని తెలిపారు. ఈ విధానం ద్వారా సరుకు గుర్తింపు, భద్రత ఉంటుందని తెలిపారు. ఈ-బిడ్డింగ్ విధానంతో ఎక్కువ మంది ఖరీదుదారులు ధర కోట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ విధానంతో రైతులకు పోటీ ధర లభిస్తుందని పేర్కొన్నారు. రైతు సరుకు బిడ్ అయిన వెంటనే రైతు సెల్‌కు మెసేజ్ వెళ్తుందని, బిడ్డింగ్లోని అధిక ధర, ఖరీదుదారుల పేరు, అమ్మకందారుడి పేరు, వివరాలు, పట్టికలు, ఖరీదుదారు, కమీషన్ ఏజెంట్లకు జారీ అవుతాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల ద్వారా కాంటాలు వేసి, తూకం వివరాలు రైతు సమక్షంలోనే నమోదు చేస్తామని, కాంటా చిట్టా జారీ చేస్తామని వివరించారు. కంప్యూటర్ కౌంటర్ నుంచి రైతులకు తక్‌పట్టీ జారీ అవుతుందని, ఇందులో రైతుకు రావాల్సిన డబ్బు, చెల్లించాల్సిన చార్జీల వివరాలు ఉంటాయని తెలిపారు. ఈ-బిడ్డింగ్ విధానంతో రైతులు తక్కువ సమయంలో సరుకు అమ్ముకుని వెళ్లే వీలుంటుందని చెప్పారు. మార్కెట్ రేట్ల సమాచారం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకుడు వి.బి.భాస్కర్‌రావు మాట్లాడుతూ ఈ-బిడ్డింగ్ విధానం అమలుకు రైతులు, వ్యాపారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మార్కెట్‌కు వచ్చే సరుకును నాణ్యతను బట్టి గ్రేడింగ్ చేయించి అమ్మకాలు జరిపితే తగిన రేటు రైతుకు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలని కోరారు. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానం రైతులతోపాటు వ్యాపారులకు కూడా మంచిదని, పారదర్శకతతో ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మార్కెట్‌యార్డులోని రైతు విశ్రాంతి భవనం అధ్వానంగా ఉందని, దీనికి మరమ్మత్తులు చేయించాలని కోరారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ జిల్లా సహాయ సంచాలకుడు కేసీ రెడ్డి, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుడు జినుగు మరియన్న, సీపీఐ (ఎంఎల్)-న్యూడెమోక్రసీ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అనుబంధ రైతుసంఘాల జిల్లా నాయకులు గుర్రం అచ్చయ్య, సామినేని రమేష్, పిన్ని కోటేశ్వరరావు, ఆళ్ల వెంకటరెడ్డి, యర్వకుంట్ల గోవర్ధన్, పరుచూరి శేషగిరి, మద్దినేని రమేష్, రామకోటయ్య, లక్ష్మయ్య, మూలా నాగిరెడ్డి, కన్నేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.