మౌలిక వసతుల్లేక వృథాగా పోతున్న పంట ఉత్పత్తులు
ధాన్యం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల నష్టాలు రూ.1,57,787 కోట్లు
అత్యధికంగా పశువుల ఉత్పత్తుల్లో నష్టం రూ.29,871 కోట్లు
పండ్లలో రూ.29,545 కోట్లు,కూరగాయల్లో రూ.27,459 కోట్లు నష్టం
నష్టాల నివారణకు ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పన
పీఎంకెఎస్‌వై కింద 1,187 ప్రాజెక్టులు మంజూరు
లోక్‌సభలో ఆహార శుద్ధి పరిశ్రమలమంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ వంటి సౌకర్యాల కొరత కారణంగా దేశంలో పంట కోత అనంతరం భారీ నష్టం కలుగుతోంది. ఈ నష్టం విలువ 2022లో ఏకంగా సుమారు రూ.1,57,787 కోట్లుగా నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పశు ఉత్పత్తుల్లో ఎక్కువ నష్టం కలుగుతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది.
అత్యధికంగా పశు ఉత్పత్తుల్లో నష్టం వస్తుండగా, ఆ తరువాత పండ్లు, కూరగాయలు ఎక్కువగా పాడైపోయి నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక పేర్కొంది. తృణ ధాన్యాల ఏడాది సగటు ఉత్పత్తి 281.28 మిలియన్ టన్నులు ఉండగా.. కోత అనంతరం 12.49 మిలియన్ టన్నులు నష్టపోతున్నట్లు చెప్పింది. అదే విధంగా కూరగాయల సగటు ఉత్పత్తి 164.74 మిలియన్ టన్నులకుగాను 11.97 మిలియన్ టన్నులు వృథా అవుతున్నట్లు వివరించింది. అత్యధికంగా పశువుల ఉత్పత్తుల (డెయిరీ, మాంసం, ఫిష్ తదితరమైనవి) నష్టం విలువ రూ. 29,871 కోట్లు అని పేర్కొంది.
ఈ నష్టాలను తగ్గించేందుకు అవసరమైన మౌలిక, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. తద్వారా పంటల విలువను పెంచడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ – సంరక్షణ సామర్ధ్యాల విస్తరణవిస్తరణ, ఆపరేషన్ గ్రీన్స్ సదుపాయాల కల్పనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో క్రెడిట్ లింక్ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఆహార ప్రాసెసింగ్, సంరక్షణకు, హార్వెస్ట్ నష్టాలను తగ్గించడానికి కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంకేఎస్‌వై కింద 1,187 ప్రాజెక్ట్‌లు ఆమోదించినట్లు వివరించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నిధి ద్వారా శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా పంట వృధాను తగ్గించడం, విలువ పెంచడం లక్ష్యమని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment