కోటితో ఉడాయించిన వ్యాపారి | Businessman Fraud In Warangal | Sakshi
Sakshi News home page

కోటితో ఉడాయించిన వ్యాపారి

Published Mon, Oct 22 2018 11:35 AM | Last Updated on Sat, Oct 27 2018 12:46 PM

Businessman Fraud In Warangal - Sakshi

దుగ్గొండి(నర్సంపేట): గ్రామాల్లో రైతులను నమ్మించి.. పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. కొంతకాలం పాటు సక్రమంగా డబ్బులు చెల్లించాడు. ఆతర్వాత లక్షలాది రూపాయల సరుకులు విక్రయించిన రైతులను ముంచేశాడు. సుమారు వంద మంది రైతులకు చెందిన రూ.కోటితో ఉడాయించిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ఈర్ల స్వామి నాలుగేళ్ల క్రితం టాటాఏఎస్‌ ట్రాలీ నడుపుతూ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేవాడు. ఈ క్రమంలో రైతులతో పరిచయం పెంచుకున్నాడు. మూడేళ్ల క్రితం తానే స్వయంగా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.

పత్తి, మొక్కజొన్న, పసుపు, పల్లికాయను రైతుల ఇంటి వద్దే కొనుగోలు చేశాడు. ఇంటి వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతులు అతడికి అన్ని రకాల సరుకులను విక్రయించేవారు. రెండేళ్లపాటు రైతులకు నమ్మకంగా డబ్బులు చెల్లించాడు. ఇలా అతడి వ్యాపారం దుగ్గొండి, గీసుగొండ, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల పరిధిలో గ్రామాలకు విస్తరించింది. ఈ ఏడాది పత్తి, పసుపు, మొక్కజొన్న, పల్లికాయను మార్కెట్‌లో ఉన్న ధర కంటే ఎక్కువ ధరకు వందలాది మంది రైతుల వద్ద సుమారు రూ.కోటి వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. తీరా డబ్బులు చెల్లించే క్రమంలో అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. పది రోజులుగా ఆయా మండలాలకు చెందిన రైతులు స్వామి ఇంటికి వచ్చి చూడగా అందుబాటులో ఉండటం లేదు.

ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది. ఈ క్రమంలో శనివారం కూడా వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉండటం చూసిన రైతులు గుమస్తాను వెంట పెట్టుకుని అతడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం ఉదయం 87 మంది రైతులను ఈర్ల స్వామి మోసం చేశాడని, రూ.కోటితో ఉడాయించాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు స్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. స్వామి ఉడాయించిన విషయం ఇంకా చాలామంది రైతులకు తెలియదని సుమారుగా రూ.2కోట్లతో ఊడాయించి ఉంటాడని రైతులు చర్చించుకుంటున్నారు.

రూ.3.10 లక్షలు రావాల్సి ఉంది..
నా చేలో పండిన 25 క్వింటాళ్ల పసుపు, 16 క్వింటాళ్ల పల్లికాయ, 16 క్వింటాళ్ల పత్తిని స్వామికి విక్రయించాను. 15 రోజులుగా డబ్బుల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాను. మొదట రేపు, మాపు అంటూ నమ్మించాడు. తీరా బతుకమ్మ, సద్దుల పండుగ నుంచి మనిషి కనబడటం లేదు. రూ.3.10 లక్షలు రావాల్సి ఉంది. ఇంటి ముందుకు వచ్చిన కాంటా కదా అని నమ్మి మోసపోయాను.– సిరిపురం వీరమల్లారెడ్డి, రైతు, నాచినపల్లి 

ఎక్కువ ధర వస్తుందని ఆశ పడ్డ..
నాకు ఒక ఎకరం భూమి ఉంది. మొక్కజొన్న వేసిన. 31 క్వింటాళ్ల మొక్కజొన్నలు పండినవి. పక్క ఊరు కావడంతో స్వామితో కొంత పరిచయం ఉంది. బయట క్వింటాళ్‌కు రూ.1350 ఇస్తున్నరు. ఇక్కడ రూ.1400 పెడుతుండటంతో పాటు ఇంటి వద్దే కాంటా పెట్టిన. 20రోజులైతాంది. రూ.45 వేలు రావాలే..  – గోవిందనాయక్,రైతు, కొమ్మాల, గీసుగొండ మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement