రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం
ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మార్కెట్ క్రెడిట్ లింకేజ్
2020లోనే లక్ష్యాలను నిర్ధేశించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
నాబార్డు, ఎన్‌సీడీసీ, నాఫెడ్, ఎస్‌ఎఫ్‌ఏసీ భాగస్వామ్యంతో ఏర్పాటు
కంపెనీల చట్టం కింద ఎఫ్‌పీవోల ఏర్పాటుకు చర్యలు
ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.25 లక్షల ఆర్థిక చేయూత
సాక్షి, అమరావతి: అన్నదాతలను ఎగుమతిదారులుగా తీర్చిదిద్దే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ కార్యరూపం దాలుస్తోంది. తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రపంచంలో ఎక్కడికైనా నేరుగా ఎగుమతి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పంటల ఆధారంగా రైతు ఉత్పత్తి దారుల సంఘాల (ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఎఫ్‌పీవోల ఏర్పాటుకు గతంలోనే శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో 200కు పైగా ఎఫ్‌పీవోలుండగా, వాటిలో 80 శాతం ఎఫ్‌పీవోలు తగిన ప్రోత్సాహం లేక నామమాత్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీటిని బలోపేతం చేయడంతో పాటు డివిజన్‌కొకటి చొప్పున కొత్తగా ఎఫ్‌పీవోలను కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
4 ఏజెన్సీల ద్వారా మార్కెటింగ్, క్రెడిట్ లింకేజ్
రైతులు పండించిన పంటలను ఎగుమతిదారులతో ప్రమేయం లేకుండా ప్రపంచంలో తమకు గిట్టుబాటు ధర లభించే ఏ దేశానికైనా నేరుగా ఎగుమతి చేసుకునేలా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం 2020లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. కంపెనీల చట్టం కింద ఏర్పాటయ్యే ఈ ఎఫ్‌పీవోలకు గరిష్టంగా ఐదేళ్ల పాటు రూ.25 లక్షల వరకు ఆర్థిక చేయూతనిచ్చేలా ప్రణాళిక రూపొందించారు.
వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మార్కెట్, క్రెడిట్ లింకేజ్ కల్పించేందుకు ఎస్‌ఎఫ్‌ఏసీ (చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కన్సార్టియం), నాబార్డు (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్), ఎన్‌సీడీసీ (జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్), ఎన్‌ఎఫ్‌ఈడీ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య)లను భాగస్వామ్యం చేశారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ సారథ్యంలో రాష్ట్రస్థాయి, కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఏ ఏ ఉత్పత్తులకు ఏ దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. మంచి ధర రావాలంటే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ఎగుమతి కోసంæ ఎలాంటి అనుమతులు అవసరం వంటి అంశాలపై అవసరమైన సహకారం అందిస్తున్నారు.
కంపెనీలుగా 450 ఎఫ్‌పీవోలు ఏర్పాటు..
కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో కంపెనీల చట్టం కింద 450 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఆమేరకు 100 శాతం ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా మరో 811 ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేశారు.
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన స్టేట్ నోడల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఎన్‌టీఐ) ద్వారా ఎఫ్‌పీవోల్లోని రైతులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఇన్‌పుట్ లైసెన్సులు, మండి, జీఎస్టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు జారీ చేస్తారు.
450 ఎఫ్‌పీవోల్లో ఇప్పటికే 75 ఎఫ్‌పీవోలకు సీడ్ లైసెన్స్,100 ఎఫ్‌పీవోలకు ఫెర్టిలైజర్స్ లైసెన్సులు, 103 ఎఫ్‌పీవోలకు పురుగుల మందుల లైసెన్సులు జారీ చేశారు. మరొక వైపు పొలంబడులు, ఉద్యాన, పట్టు, మత్స్య సాగు బడులతో దిగుబడుల్లో నాణ్యత పెంచడంతో పాటు వాటికి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (గ్యాప్), ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేస్తూ ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు.
పురోగతిని వేగవంతం చేయండి..
కేంద్రప్రాయోజిత పథకమైన ఎఫ్‌పీవోల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు వాటికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఆదేశించారు. సంఘాల ఏర్పాటు, పురోగతిపై 8వ ఎస్‌ఎల్‌సీసీ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం మంగళగిరిలో మంగళవారం జరిగింది.
ఇక నుంచి నోడల్ అధికారిగా మార్క్‌ఫెడ్ ఎండీ వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. ఎఫ్‌పీవోలకు ఎరువులు, పురుగుల మందుల వ్యాపారం నిర్వహణలో జరుగుతున్న జాప్యం నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment