సాక్షి, హైదరాబాద్: కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి వ్యవసాయ పంట ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2019–20తో పోలిస్తే 2020–21లో ఎగుమతులు బాగా పెరిగాయి. 2019–20లో మొత్తం రూ. 2,692.15 కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు వెళ్లగా 2020–21లో రూ. 4,180 కోట్ల మేర ఎగుమతి అయ్యాయి. మొత్తంగా పంట ఉత్పత్తుల ఎగుమతుల్లో చిన్న, పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో 14వ స్థానంలో తెలంగాణ నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
దేశం నుంచి కూడా వ్యవసాయ ఎగుమతులు 2019–20తో పోలిస్తే 2020–21లో 34.86 శాతం పెరిగాయి. 2019–20లో 1.55 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా 2020–21లో ఇవి 2.10 లక్షల కోట్లకు పెరిగాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల 2020లో వ్యవసాయ ఎగుమతులపై ప్రభావం పడింది. కంటైనర్లు అందుబాటులో లేకపోవడం, రవాణా ఖర్చు పెరగడం, లాక్‌డౌన్ వల్ల సరఫరాలో అంతరాయం లాంటి పరిస్థితులు ఎదురైనా ఎగుమతులు పెరగడం విశేషం.
పండ్లు, కూరగాయలు డీలా..
రాష్ట్ర ఎగమతుల్లో సుగంధ ద్రవ్యాలు (స్పైసెస్) ముందున్నాయి. ఇక్కడి పసుపు, మిర్చి తదితర సుగంధ ద్రవ్యాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. 2020–21లో రూ. 1,464 కోట్లు ఇవే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో రాష్ట్రంలో బాగా పండే పత్తి ఉంది. ఇక్కడి నుంచి రూ.1,056 కోట్ల విలువైన పత్తి విదేశాలకు ఎగుమతి అయింది. చైనా వంటి దేశాలకు ఇక్కడి పత్తి వెళ్తుంటుంది. ఆ తర్వాత రూ. 911 కోట్ల విలువైన బియ్యం (బాస్మతి కాకుండా) ఎగుమతి చేశారు.
పండ్ల ఎగుమతి మాత్రం గతంతో పోలిస్తే తగ్గింది. 2019–20లో రూ. 41.99 కోట్ల విలువైనవి ఎగుమతి కాగా, 2020–21లో రూ. 15.67 కోట్లే ఎగుమతి అయ్యాయి. అలాగే 2019–20లో రూ. 33.34 కోట్ల విలువైన కూరగాయలు ఎగుమతి కాగా 2020–21లో రూ. 10.77 కోట్ల విలువైనవే విదేశాలకు వెళ్లాయి. పండ్లు, కూరగాయలు త్వరగా పాడై పోయే గుణం కలిగి ఉండటం, కరోనా కాలంలో రవాణా ఎక్కువ రోజులు తీసుకోవడంతో ఎగుమతులు తగ్గినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment