
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ మేరకు హెచ్‌ఐసీసీలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాల్లో జీ–20లో భాగమైన ఇండోనేసియా, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్‌ఏ, ఇండియాలతోపాటు సదస్సుకు ఆహ్వానించిన 10 దేశాలు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, ఒమన్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాంల వ్యవసాయ మంత్రులు.. ఇక్రిశాట్, ఓఈసీడీ, ఏడీబీ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ బ్యాంకు తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. మొత్తంగా 30 దేశాలకు చెందిన 180 మంది ప్రతినిధులు రానున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి.
నాలుగో వ్యవసాయ సదస్సు
జీ–20 దేశాల సదస్సులో భాగంగా ఇప్పటివరకు మూడు వ్యవసాయ సంబంధిత సమావేశాలు జరిగాయి. ఇప్పుడు నాలుగో వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనిలో మంత్రులు పాల్గొననున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరిస్తారు. ఆధునిక, వినూత్న సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన ఉండనుంది.