సాక్షి, హైదరాబాద్: రైతులకు విత్తనాలు... ప్రభుత్వ శాఖలకు అవసరమైన స్టేషనరీ, అన్ని రకాల వస్తువులను సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) దేశవ్యాప్త వ్యాపారంలోకి ప్రవేశించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రూ.వందల కోట్లున్న దాని టర్నోవర్‌ను వేల కోట్ల రూపాయలకు విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వేసే టెండర్లలోనూ పాల్గొంటుంది. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలతోనూ ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించింది. తక్కువ కమీషన్‌తోనే భారీగా వ్యాపారం చేయాలన్నది ఉద్దేశం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల టెండర్లలోనూ పాల్గొంటుంది. అందుకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి కూడా హాకా లేఖ రాసింది.
రూ. 35 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం...
రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ప్రభుత్వశాఖలకు అవసరమైన ఏసీలు, ఫ్యాన్లు, కాగితాలు, జిరాక్స్ మిషన్లు, ప్రింటర్లు, సెల్‌ఫోన్లు, ల్యాండ్‌లైన్ ఫోన్లు, టేబుళ్లు, కుర్చీలు ఇలా వివిధ రకాల మెటీరియల్ మొత్తాన్ని అందించే ఉద్దేశంతో హాకా ఏర్పాటైన సంగతి తెలిసిందే. హాకా నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, పప్పును కూడా సరఫరా చేస్తుంది. ప్రతీ ఏడాది దీపావళికి టపాకాయలను కూడా హాకా ద్వారానే ప్రభుత్వం వినియోగదారులకు విక్రయిస్తుంది. ప్రభుత్వశాఖలు దీని ద్వారానే వస్తువులను కొనుగోలు చేస్తుంటాయి. మరోవైపు రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేయాలి. కానీ ఇటీవల ఆ వ్యాపారం చేయడంలేదు. ప్రస్తుతం ఏడాదికి కేవలం రూ.300 కోట్లకు మించి టర్నోవర్ దాటడం లేదు. దీనివల్ల వచ్చే కమీషన్ అత్యంత తక్కువగా ఉంటోంది. ఫలితంగా హాకాలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, రోజు వారీ ఖర్చులకు మాత్రమే ఆ సొమ్ము సరిపోతోంది. దీంతో వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించారు.
మచ్చా సారధ్యంలో ముందుకు
ప్రభుత్వం ఇటీవల హాకాకు చైర్మన్‌గా మచ్చా శ్రీనివాసరావును నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 2023–24లో 35 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు హాకా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ధా న్యం కొనుగోలు వ్యవహారం మొత్తాన్ని ఎఫ్ సీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పత్తిని సీసీఐ, ఇతర పంటలను రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ నిర్వహిస్తూ వస్తోంది. ఇకపై ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం, పత్తిని కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించడం, వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే క్రయ విక్రయాల్లోనూ పాల్గొనడం చేయాలన్నది హాకా ఉద్దేశం.
ఇతర రాష్ట్రాల్లో చేసే వ్యాపారం ఇలా...
♦ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ శాఖలకు అవసరమైన స్టేషనరీని సరఫరా చేయాలి. తక్కువ కమీషన్‌కే టెండర్‌ను దక్కించుకోవాలి.
♦వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సరఫరా చేసే గోధుమలు, బియ్యం, పప్పు వంటి వాటిని కూడా హాకా ద్వారానే సరఫరా చేయాలి.
♦ ఇతర రాష్ట్రాల్లో చేపట్టే వివిధ రకాల పంటల కొనుగోళ్లలో పాల్గొనాలి.
సాధారణ వినియోగదారులకు అవసరమయ్యే సరుకులను కూడా సరఫరా చేయాలి. తక్కువ ధర, నాణ్యత ఆధారంగా వారిని ఆకట్టుకోవాలి.
♦ ప్రభుత్వ శాఖలకు ఫర్నీచర్‌ను సరఫరాచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment