
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ) మినిస్టీరియల్ సమావేశాలకు హైదరాబాద్ సిద్ధం అయ్యింది. గురువారం నుంచి ఈ నెల 17 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జీ20 సభ్య దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో వివిధ దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీ య సంస్థల డైరెక్టర్ జనరల్స్ పాల్గొంటారు.
కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మొదటిరోజు ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ఇందులో ప్రదర్శిస్తారు. అనంతరం వ్యవసాయ డిప్యూటీస్ మీటింగ్ (ఏడీఎం) జరుగనుంది. ద్వితీయార్ధంలో అగ్రిబిజినెస్ ఫర్ ప్రాఫిట్, పీపుల్ అండ్ ప్లానెట్ నిర్వహణ, ‘డిజిటల్లీ డిస్కనెక్ట్: వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకోవడం’ కార్యక్రమాలు జరుగుతాయి.
జీ–20 సమావేశంలో పాల్గొనే మంత్రులు, ఇతర ప్రతినిధి బృందాల నాయకులకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్వాగతం పలకడంతో రెండవరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, సుస్థిర జీవవైవిధ్యం, వాతావరణ సమస్యల పరిష్కారాలపై మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల చర్చలు మూడు సమాంతర సెషన్లలో జరుగుతా యి.
మూడవ రోజు భారత్ అధ్యక్షతన అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్, జీ–20 ఫలితాలను ఆమోదించడంతో మంత్రుల సమావేశం ముగుస్తుంది. అనంతరం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ –ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)కు సాంకేతిక విజ్ఞాన యాత్రకు ప్రతినిధి బృందం వెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment