సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో భారతదేశం స్వయంసమృద్ధి సాధించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. వ్యవసాయంలోని వివిధ రంగాలలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి జీ–20 దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో మూడు రోజుల పాటు జరగనున్న జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశం గురువారం ప్రారంభమైంది.
జీ–20 సభ్య దేశాలు, ఆహా్వన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు, మంత్రులు, డైరెక్టర్ జనరల్‌లు సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రదర్శనను ప్రారంభించడంతో సమావేశాలు ప్రారంభమయ్యా యి. ఎగ్జిబిటర్లు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రదర్శించారు. అనంత రం మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు.
భారతదేశం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయి లో ఉందన్నారు. వాతావరణ మార్పులు, పంటల వైవిధ్యంపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు, నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయని, వీటి అమలు కోసం ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఖర్చు చేశామన్నారు.
వాతావరణ మార్పుల వల్ల జరిగే పంట నష్టాలను తగ్గించేందుకు భారతదేశం వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేస్తోందని తోమర్ అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రపంచ ప్రయోజనాల కోసం మన జ్ఞానాన్ని, అనుభవాన్ని జీ–20 దేశాలతో పంచుకుంటామన్నారు. అనేక వ్యవసాయోత్పత్తులలో భారతదేశం ప్రపంచంలో మొదటి లేదా రెండో స్థానంలో ఉందన్నారు. శుక్రవారం వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో ప్రారంభ సెషన్ జరగనుంది. ముగింపు రోజు శనివారం జీ–20 వ్యవసాయ మంత్రులు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనతో పాటు రోడ్ మ్యాప్‌ను విడుదల చేస్తారని తోమర్ తెలిపారు.
ఎగ్జిబిషన్లలో స్టాళ్లు...
ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో వేస్ట్ టు వెల్త్ మేనేజ్‌మెంట్, పోస్ట్ హార్వెస్ట్, స్మార్ట్ అండర్ ప్రెసిషన్ అగ్రికల్చర్, అగ్రి ఇన్నోవేషన్స్, వాల్యూ చైన్ మేనేజ్‌మెంట్ మొదలైన రంగాల్లో 71 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో 15 స్టాళ్లను ఐకార్ ఏర్పాటు చేసింది. ఏడు స్టాళ్లను ఇతర మంత్రిత్వ శాఖలు ప్రదర్శించాయి. 9 స్టాల్స్‌ను ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేశాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు ఏడు స్టాల్స్‌ను కేటాయించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, సభ్య దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వ్యవసాయ డిప్యూటీల సమావేశానికి, ఆ తర్వాత ప్యానెల్ చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment