G-20 countries
-
G20 Anti-Corruption Meet: నేరగాళ్ల ఆస్తులను జప్తు చేద్దాం
కోల్‌కతా: అవినీతిపై ఉమ్మడిగా పోరాడదామని జీ 20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థిక తదితర నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకునే ఘరానా వ్యక్తుల ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. శనివారం కోల్‌కతాలో జరిగిన జీ 20 అవినీతి నిరోధక మంత్రుల స్థాయి భేటీని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అలాంటి నేరగాళ్లు విదేశాల్లో కూడబెట్టిన, పోగేసిన అక్రమాస్తులను, చేసిన అక్రమాలను సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నేరగాళ్లను వీలైనంత త్వరగా మాతృ దేశానికి అప్పగించడం కూడా సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతి వల్ల అందరి కంటే ఎక్కువ నష్టపోయేది నిరుపేదలేనని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. -
వ్యవసాయంలో దేశం స్వయం సమృద్ధి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో భారతదేశం స్వయంసమృద్ధి సాధించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. వ్యవసాయంలోని వివిధ రంగాలలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి జీ–20 దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో మూడు రోజుల పాటు జరగనున్న జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశం గురువారం ప్రారంభమైంది. జీ–20 సభ్య దేశాలు, ఆహా్వన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు, మంత్రులు, డైరెక్టర్ జనరల్‌లు సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రదర్శనను ప్రారంభించడంతో సమావేశాలు ప్రారంభమయ్యా యి. ఎగ్జిబిటర్లు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రదర్శించారు. అనంత రం మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. భారతదేశం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయి లో ఉందన్నారు. వాతావరణ మార్పులు, పంటల వైవిధ్యంపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు, నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయని, వీటి అమలు కోసం ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఖర్చు చేశామన్నారు. వాతావరణ మార్పుల వల్ల జరిగే పంట నష్టాలను తగ్గించేందుకు భారతదేశం వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేస్తోందని తోమర్ అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రపంచ ప్రయోజనాల కోసం మన జ్ఞానాన్ని, అనుభవాన్ని జీ–20 దేశాలతో పంచుకుంటామన్నారు. అనేక వ్యవసాయోత్పత్తులలో భారతదేశం ప్రపంచంలో మొదటి లేదా రెండో స్థానంలో ఉందన్నారు. శుక్రవారం వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో ప్రారంభ సెషన్ జరగనుంది. ముగింపు రోజు శనివారం జీ–20 వ్యవసాయ మంత్రులు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనతో పాటు రోడ్ మ్యాప్‌ను విడుదల చేస్తారని తోమర్ తెలిపారు. ఎగ్జిబిషన్లలో స్టాళ్లు... ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో వేస్ట్ టు వెల్త్ మేనేజ్మెంట్, పోస్ట్ హార్వెస్ట్, స్మార్ట్ అండర్ ప్రెసిషన్ అగ్రికల్చర్, అగ్రి ఇన్నోవేషన్స్, వాల్యూ చైన్ మేనేజ్మెంట్ మొదలైన రంగాల్లో 71 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో 15 స్టాళ్లను ఐకార్ ఏర్పాటు చేసింది. ఏడు స్టాళ్లను ఇతర మంత్రిత్వ శాఖలు ప్రదర్శించాయి. 9 స్టాల్స్‌ను ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు ఏడు స్టాల్స్‌ను కేటాయించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, సభ్య దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వ్యవసాయ డిప్యూటీల సమావేశానికి, ఆ తర్వాత ప్యానెల్ చర్చలు జరిగాయి. -
జి–20 సదస్సుకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఇటలీలోని రోమ్‌లో ఈ నెల 30న ప్రారంభం కానున్న జి–20 దేశాల అధినేతల 16వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రధాని ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీదాకా ఇటలీతోపాటు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పర్యటిస్తారని తెలియజేసింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–26 ప్రపంచ దేశాల అధినేతల సదస్సులోనూ ఆయన పాల్గొంటారని పేర్కొంది. జి–20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈ నెల 30, 31న.. రోమ్‌లో రెండో రోజులపాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గానిస్తాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై జి–20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. 1999 నుంచి జి–20 సదస్సును ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. కాప్–26 సదస్సు ఈ నెల 31 నుంచి నవంబర్ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది. -
ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయమొద్దు
బ్యూనోస్ ఎయిర్స్: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల కేసుల్లో జీ–20 (గ్రూప్ ఆఫ్ 20) దేశాల మధ్య బలమైన, చురుకైన సహకారం ఉండాలని భారత్ కోరింది. దీనికి సంబంధించి 9 అంశాలతో కూడిన ఎజెండాను ప్రధాని మోదీ శుక్రవారం జీ–20 సదస్సులో ప్రవేశపెట్టారు. రెండ్రోజుల జీ–20 సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్లో జరుగుతుండటం తెలిసిందే. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను త్వరగా స్వదేశాలకు అప్పగించడం, ఇతర న్యాయపరమైన విషయాల్లో జీ–20 సభ్యదేశాల మధ్య సహకారం ఉండాలని ఈ ఎజెండాలో భారత్ పేర్కొంది. స్వదేశాల్లో భారీ ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఇతర దేశాల్లో నివసించేందుకు ఆయా దేశాలు అనుమతి ఇవ్వకుండా చూసేలా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంది. వివిధ దేశాల ఆర్థిక నిఘా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల మధ్య అత్యంత వేగంగా సమాచార మార్పిడి కోసం ఆర్థిక కార్యాచరణ దళం (ఎఫ్ఏటీఎఫ్)ను సహాయం తీసుకోవాలని సూచించింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను గుర్తించేందుకు, న్యాయప్రక్రియను పూర్తి చేసేందుకు, ఇతర దేశాలకు అప్పగించేందుకు ఓ నిర్దిష్టమైన ఉమ్మడి ప్రణాళిను ఎఫ్ఏటీఎఫ్ రూపొందించాలని కూడా భారత్ కోరింది. ఇతర దేశాలకు పారిపోయిన నేరగాళ్ల ఆస్తులు ఏ దేశంలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకునేలా ఓ వ్యవస్థ ఉండాలని కూడా భారత్ అభిప్రాయపడింది. హవాలా, ఉగ్రవాద సంస్థలకు నిధులు తదితర ఆర్థిక నేరాల కేసుల పరిష్కారం కోసం ఎఫ్ఏటీఎఫ్ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటుచేశారు. 12 ఏళ్ల తర్వాత తొలిసారి రష్యా, భారత్, చైనాల మధ్య 12 ఏళ్లలో తొలి, మొత్తంగా రెండో త్రైపాక్షిక సమావేశం శుక్రవారం జరిగింది. మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతోనూ భేటీ అయ్యారు. ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్థసహా పలు బహుళపక్ష సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో మూడు దేశాల మధ్య సహకారంపై వారు చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై పుతిన్, మోదీ, జిన్‌పింగ్‌లు చర్చించారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రనకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిపాలనను సరైన దిశలో నడిపించేందుకు, ప్రాంతీయంగా శాంతిని పరిరక్షించేందుకు కలిసి పనిచేయాలని మూడు దేశాలు నిర్ణయించాయి. ‘వుహన్’ తర్వాత పురోగతి జిన్‌పింగ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో మోదీ చైనాలోని వుహన్ నగరంలో అనధికారిక భేటీలో పాల్గొనడం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మంచి పురోగతి నమోదవుతోందని ఇరుదేశాధినేతలు తెలిపారు. వుహన్ భేటీ తర్వాత సంబంధాలు బాగున్నాయనీ, 2019లో మరింత బలపడే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీరు కలవడం ఇది నాలుగోసారి. అంతకుముందు ఎస్సీవో సదస్సు కోసం చైనాలోని చింగ్డావ్లో, బ్రిక్స్ సదస్సు సమయంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో వీరిద్దరూ కలిశారు. వచ్చే ఏడాది భారత్‌కు రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను మోదీ తాజాగా ఆహ్వానించారు. ఇలా తరచూ కలుస్తూ ఉండటం వల్ల సంబంధాలు చెడిపోకుండా ఉంటాయని ఆయన తెలిపారు. -
ఉగ్ర భూతానికి నిధులిలా..
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రకోరలు చాస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) పారిస్ దాడి ద్వారా పాశ్చాత్యదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. యూరప్ దేశాలన్నీ కనివినీ ఎరుగని రీతిలో తమ దేశాల్లోని పట్టణాల్లో భద్రతాబలగాలను మోహరించాయి. భారత్‌లో కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీఅయ్యాయి. ఇటీవల టర్కీలో సమావేశమైన జీ-20 దేశాలు ఈ ఉగ్రభూతానికి నిధులు అందకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చాయి. ఆర్థికమూలాలపై దెబ్బకొడితే... ఐఎస్ఐఎస్ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నాయి. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కాకుండా... ఇతరత్రా మార్గాల్లోనే ఎక్కువగా నిధులను తరలిస్తున్న ఐఎస్ఎస్ను ఆర్థికంగా దెబ్బతీయడం అంత తేలికేమీ కాదు. ఈ ఉగ్రసంస్థ వనరుల సమీకరణ కూడా చాలా భిన్నంగా ఉంది. సిరియా, ఇరాక్లలో దీని అధీనంలో ఉన్న భూభాగంలో 80 లక్షల నుంచి కోటి మంది దాకా నివసిస్తున్నట్లు అంచనా. ఈ జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు చూడటం, పాఠశాలలు, ఇస్లామిక్ కోర్టులు నడపటం, ఉద్యోగులు, ఐఎస్ఐఎస్ తరఫున పోరాడే వారికి జీతాలు... చాలా ఖర్చు ఉంటుంది. అలాగే ఆయుధాలు, వాహనాలు సమకూర్చుకోవడం, అంతర్జాతీయ దాడులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సంస్థకు ప్రచారం చేసుకోవడం, రిక్రూట్మెంట్లు... ఇలా చాలా వాటిపై ఐఎస్ఐఎస్ భారీగానే ఖర్చుపెడుతోంది. దాదాపు 40,000 మంది సాయుధ సిబ్బంది ఉన్నట్లు అంచనా. భారీగా ఆర్థిక అవసరాలున్న ఐఎస్ఐఎస్కు నిధులు ఎలా అందుతున్నాయో చూద్దాం... ఇం‘ధనం’- రూ. 3,650 కోట్లు ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలోని చమురు బావుల్లో మంచి ఉత్పత్తి జరుగుతోంది. ముడిచమురును చిన్నచిన్న రిఫైనరీల్లో, మొబైల్ రిఫైనరీల్లో శుద్ధిచేసి... టర్కీ సరిహద్దుకు తరలిస్తోంది. ఈ ఉగ్రసంస్థ చమురు అంతా బ్లాక్మార్కెట్కే తరలుతోంది. అధికారికంగా ఏ దేశమూ వీరి చమురును కొనదు కాబట్టి బ్లాక్మార్కెట్లో సగం ధరకే ఐఎస్ఐఎస్ చమురును అమ్ముతోంది. టర్కీలోని బ్రోకర్లు ట్యాంకర్లలో వచ్చే చమురును అమ్మిపెడతారు. కువైట్ దినార్లు, సౌదీ అరేబియా రియాళ్లు, స్థానిక కరెన్సీలోనే నగదు చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకుల ప్రమేయం ఉండదు. నగదు తరలింపునకు కూడా నెట్వర్క్ ఉంటుంది. అవసరమైతే నగదుకు బదులు ఆయుధాలు, వాహనాల్లాంటివి కూడా స్మగ్లర్లు సమకూర్చుతారు. రోజుకు పది కోట్ల చొప్పున ఏడాదికి 3,650 కోట్ల రూపాయలను చమురు అమ్మకాల ద్వారా ఆర్జిస్తోంది. * ఈ ఏడాది ఆరంభం వరకు చమురు అమ్మకాల ద్వారా ఐఎస్ఐఎస్ ప్రతిరోజు మూడు మిలియన్ డాలర్లు (దాదాపు 20 కోట్ల రూపాయలు)ఆర్జించేది. * అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు ఇరాక్‌లోని చమురు బావులే లక్ష్యంగా వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో సగం చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐఎస్ఐఎస్ కోల్పోయిందని అంచనా. * మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరల పతనం కూడా వీరి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాకీ బ్యాంకుల లూటీ 3,300 కోట్లు మోసుల్, తిక్రిత్ పట్టణాలను స్వాధీనం చేసుకున్నపుడు ఐఎస్ఐఎస్ అక్కడి ఇరాకీ బ్యాంకులను లూటీ చేసింది. దాదాపు 50 కోట్ల డాలర్ల (3,300 కోట్ల రూపాయల) విలువైన స్థానిక కరెన్సీని ఈ ఉగ్రసంస్థ బ్యాంకుల నుంచి దోచుకుందని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల అంచనా. ఆస్తుల అమ్మకం... అంతర్యుద్ధంలో చనిపోయిన, పారిపోయిన వారి ఆస్తులను ఐఎస్ఐఎస్ స్వాధీనం చేసుకుంటోంది. అలాగే ఇరాకీ ప్రభుత్వ యంత్రాగానికి చెందిన అధికారుల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంది. వీటిని అమ్మివేస్తోంది. కొన్నిచోట్ల అద్దెకు ఇస్తోంది. ఇరాక్లోనైతే తాము స్వాధీనం చేసుకున్న అమెరికా వాహనాలు, నిర్మాణసామగ్రి, ఫర్నిచర్‌ను అమ్మేసింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రదేశాలకు తరలిపోయిన వారి ఆస్తులనూ తమ అధీనంలోకి తీసుకొంటోంది. ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తోంది. విరాళాలు... 264 కోట్లు * సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈలలోని బడా వ్యాపారులు, ధనవంతులు ధార్మిక కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తుంటారు. * సిరియా అధ్యక్షుడు అసద్‌ను గద్దె దింపాలనే లక్ష్యంతో ఆయన వ్యతిరేకులకు ఆర్థికసాయం చేస్తున్న వారూ ఉన్నారు. * తీవ్రవాదులకు ఆర్థికసాయంపై అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో సౌదీ అరేబియా 2013లో ఐఎస్ఐఎస్కు సాయమందించడం నేరంగా పరిగణించే చట్టాన్ని తెచ్చింది. అయితే కువైట్, ఖతార్ బ్యాంకుల నుంచి మాత్రం సిరియాకు నిధుల ప్రవాహం స్వేచ్ఛగా సాగుతోంది. * ఇస్లామిక్ రాజ్యస్థాపనను కాంక్షిస్తూ దాతలు సాయపడుతున్నారు. * కనీసం రిజిస్టర్ కూడా చేసుకోని పలు స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళాలు వెళతాయి. తర్వాత ఇవి వాటి ఖాతాల్లోంచి ఐఎస్ఐఎస్కు చేరతాయి. * 2013-14లో ఈ సంస్థకు 40 మిలియన్ల డాలర్లు (దాదాపు 264 కోట్ల రూపాయలు) విరాళాల రూపంలో అందినట్లు ఒక అంచనా. * 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 1,320 కోట్లు ఇలా లెక్కాపత్రం లేకుండా అనామక సంస్థలకు విరాళాల రూపంలో అందినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీసు’ తేల్చింది. పురాతన వస్తువుల అమ్మకం... రూ.660 కోట్లు * ఇరాక్, సిరియాల్లో తమ అధీనంలోని మ్యూజియాల ను ఐఎస్ఐఎస్ లూటీ చేసింది. ఎన్నో చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేసి అక్కడి వస్తు వులను కొల్లగొట్టింది. పురాతన వస్తువులను తవ్వి వెలికితీసే పని కూడా చేస్తోంది. * వందలు, వేల ఏళ్ల కిందటి అమూల్యమైన ఈ సంపద... టర్కీ, జోర్డాన్ మీదుగా బ్రోకర్ల చేతులు మారి యూరప్‌కు తరలివెళుతున్నాయి. * వేలం సంస్థలు వీటిని అమ్మిపెడుతున్నాయి. * పురాతన వస్తువుల విక్రయం ద్వారా ప్రతియేటా ఐఎస్ఐఎస్ 100 మిలియన్ డాలర్లు (దాదాపు 660 కోట్ల రూపాయలు) ఆర్జిస్తున్నట్లు అమెరికా అంచనా. పంట శిస్తు... రూ.1,300 కోట్లు సిరియా, ఇరాక్లలో అత్యంత సారవంతమైన భూమి ఐఎస్ఐఎస్ ఆధీనంలో ఉంది. గోధు మలు, బార్లీ పండుతాయి. రైతులు తమ మొత్తం దిగుబడిలో పదిశాతం శిస్తుగా చెల్లించాలి. ఈ వ్యవసాయ ఉత్పత్తులను బ్లాక్మార్కెట్లో సగం ధరకు అమ్ముకున్నా 1,300 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఐఎస్ఐఎస్కు వస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఫాస్పేట్, సల్ఫర్ అమ్మకం... 2,330 కోట్లు ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలో సహజ వనరులు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. * ఫాస్పేట్ అమ్మకం ద్వారా 330 కోట్లు, సల్ఫరిక్ యాసిడ్ అమ్మకం ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ ఉగ్రసంస్థ ఏటా సంపాదిస్తోందని రాయిటర్స్ అంచనా. ఇవి కాకుండా స్థానిక ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు ఎలాగూ ఉంటుంది. కిడ్నాప్‌లు బడా వ్యాపార కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఐఎస్ఐఎస్ కిడ్నాప్‌లకు పాల్పడుతోంది. భారీ మొత్తాల్లో వసూలు చేసి విడిచిపెడుతోంది. వీరి ఆదాయవనరుల్లో కిడ్నాప్‌లు కూడా ప్రధానమైనవే. ఈ ఏడాది ఇప్పటిదాకా కిడ్నాప్‌ల ద్వారా 130 కోట్లు ఐఎస్ఐఎస్ ఆర్జించిందని అమెరికా ఆర్థిక నిఘా విభాగాల అంచనా. ఆపడం ఎందుకు కష్టమంటే... టర్కీ సరిహద్దు పట్టణాల్లోని బ్రోకర్లపై తాజాగా అమెరికా నిఘా పెట్టింది. వీరి సమాచారాన్ని టర్కీకి అందజేస్తోంది. ఇరాక్ కూడా ఐఎస్ఐఎస్తో అక్రమ లావాదేవీలు జరుపుతున్న తమ పౌరులను పలువురిని నిర్భందించింది. ఐఎస్ఐఎస్ ఏది అమ్మినా... బ్లాక్మార్కెట్లోనే, అదీ దాదాపు సగం ధరకే. కొనుగోళ్లు, చెల్లింపులు అన్నీ గుట్టుగా జరిగిపోతుంటాయి. సగం ధరకే ఐఎస్ఐఎస్ దగ్గర కొన్న బ్రోకర్లు వీటిని మార్కెట్ ధరకు అమ్ముకొని భారీగా లాభపడుతున్నారు. కాబట్టే పాశ్చాత్యదేశాలు ఎంతగా ఆర్థికవనరులను కట్టడి చేయడానికి ప్రయత్నించినా ఐఎస్ఐఎస్కు నిరంతరా యంగా డబ్బు అందుతూనే ఉంది. - సాక్షి స్పెషల్ డెస్క్