ఉగ్ర భూతానికి నిధులిలా..
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రకోరలు చాస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) పారిస్ దాడి ద్వారా పాశ్చాత్యదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. యూరప్ దేశాలన్నీ కనివినీ ఎరుగని రీతిలో తమ దేశాల్లోని పట్టణాల్లో భద్రతాబలగాలను మోహరించాయి. భారత్‌లో కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీఅయ్యాయి. ఇటీవల టర్కీలో సమావేశమైన జీ-20 దేశాలు ఈ ఉగ్రభూతానికి నిధులు అందకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చాయి. ఆర్థికమూలాలపై దెబ్బకొడితే...
ఐఎస్‌ఐఎస్‌ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నాయి. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కాకుండా... ఇతరత్రా మార్గాల్లోనే ఎక్కువగా నిధులను తరలిస్తున్న ఐఎస్‌ఎస్‌ను ఆర్థికంగా దెబ్బతీయడం అంత తేలికేమీ కాదు. ఈ ఉగ్రసంస్థ వనరుల సమీకరణ కూడా చాలా భిన్నంగా ఉంది. సిరియా, ఇరాక్‌లలో దీని అధీనంలో ఉన్న భూభాగంలో 80 లక్షల నుంచి కోటి మంది దాకా నివసిస్తున్నట్లు అంచనా.
ఈ జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు చూడటం, పాఠశాలలు, ఇస్లామిక్ కోర్టులు నడపటం, ఉద్యోగులు, ఐఎస్‌ఐఎస్ తరఫున పోరాడే వారికి జీతాలు... చాలా ఖర్చు ఉంటుంది. అలాగే ఆయుధాలు, వాహనాలు సమకూర్చుకోవడం, అంతర్జాతీయ దాడులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సంస్థకు ప్రచారం చేసుకోవడం, రిక్రూట్‌మెంట్లు... ఇలా చాలా వాటిపై ఐఎస్‌ఐఎస్ భారీగానే ఖర్చుపెడుతోంది. దాదాపు 40,000 మంది సాయుధ సిబ్బంది ఉన్నట్లు అంచనా. భారీగా ఆర్థిక అవసరాలున్న ఐఎస్‌ఐఎస్‌కు నిధులు ఎలా అందుతున్నాయో చూద్దాం...
ఇం‘ధనం’- రూ. 3,650 కోట్లు
ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలోని చమురు బావుల్లో మంచి ఉత్పత్తి జరుగుతోంది. ముడిచమురును చిన్నచిన్న రిఫైనరీల్లో, మొబైల్ రిఫైనరీల్లో శుద్ధిచేసి... టర్కీ సరిహద్దుకు తరలిస్తోంది. ఈ ఉగ్రసంస్థ చమురు అంతా బ్లాక్‌మార్కెట్‌కే తరలుతోంది. అధికారికంగా ఏ దేశమూ వీరి చమురును కొనదు కాబట్టి బ్లాక్‌మార్కెట్‌లో సగం ధరకే ఐఎస్‌ఐఎస్ చమురును అమ్ముతోంది.
టర్కీలోని బ్రోకర్లు ట్యాంకర్లలో వచ్చే చమురును అమ్మిపెడతారు. కువైట్ దినార్లు, సౌదీ అరేబియా రియాళ్లు, స్థానిక కరెన్సీలోనే నగదు చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకుల ప్రమేయం ఉండదు. నగదు తరలింపునకు కూడా నెట్‌వర్క్ ఉంటుంది. అవసరమైతే నగదుకు బదులు ఆయుధాలు, వాహనాల్లాంటివి కూడా స్మగ్లర్లు సమకూర్చుతారు. రోజుకు పది కోట్ల చొప్పున ఏడాదికి 3,650 కోట్ల రూపాయలను చమురు అమ్మకాల ద్వారా ఆర్జిస్తోంది.
* ఈ ఏడాది ఆరంభం వరకు చమురు అమ్మకాల ద్వారా ఐఎస్‌ఐఎస్ ప్రతిరోజు మూడు మిలియన్ డాలర్లు (దాదాపు 20 కోట్ల రూపాయలు)ఆర్జించేది.
* అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు ఇరాక్‌లోని చమురు బావులే లక్ష్యంగా వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో సగం చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐఎస్‌ఐఎస్ కోల్పోయిందని అంచనా.
* మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరల పతనం కూడా వీరి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది.
ఇరాకీ బ్యాంకుల లూటీ 3,300 కోట్లు
మోసుల్, తిక్రిత్ పట్టణాలను స్వాధీనం చేసుకున్నపుడు ఐఎస్‌ఐఎస్ అక్కడి ఇరాకీ బ్యాంకులను లూటీ చేసింది. దాదాపు 50 కోట్ల డాలర్ల (3,300 కోట్ల రూపాయల) విలువైన స్థానిక కరెన్సీని ఈ ఉగ్రసంస్థ బ్యాంకుల నుంచి దోచుకుందని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల అంచనా.
ఆస్తుల అమ్మకం...
అంతర్యుద్ధంలో చనిపోయిన, పారిపోయిన వారి ఆస్తులను ఐఎస్‌ఐఎస్ స్వాధీనం చేసుకుంటోంది. అలాగే ఇరాకీ ప్రభుత్వ యంత్రాగానికి చెందిన అధికారుల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంది. వీటిని అమ్మివేస్తోంది. కొన్నిచోట్ల అద్దెకు ఇస్తోంది. ఇరాక్‌లోనైతే తాము స్వాధీనం చేసుకున్న అమెరికా వాహనాలు, నిర్మాణసామగ్రి, ఫర్నిచర్‌ను అమ్మేసింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రదేశాలకు తరలిపోయిన వారి ఆస్తులనూ తమ అధీనంలోకి తీసుకొంటోంది. ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తోంది.
విరాళాలు... 264 కోట్లు
* సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈలలోని బడా వ్యాపారులు, ధనవంతులు ధార్మిక కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తుంటారు.
* సిరియా అధ్యక్షుడు అసద్‌ను గద్దె దింపాలనే లక్ష్యంతో ఆయన వ్యతిరేకులకు ఆర్థికసాయం చేస్తున్న వారూ ఉన్నారు.
* తీవ్రవాదులకు ఆర్థికసాయంపై అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో సౌదీ అరేబియా 2013లో ఐఎస్‌ఐఎస్‌కు సాయమందించడం నేరంగా పరిగణించే చట్టాన్ని తెచ్చింది. అయితే కువైట్, ఖతార్ బ్యాంకుల నుంచి మాత్రం సిరియాకు నిధుల ప్రవాహం స్వేచ్ఛగా సాగుతోంది.
* ఇస్లామిక్ రాజ్యస్థాపనను కాంక్షిస్తూ దాతలు సాయపడుతున్నారు.
* కనీసం రిజిస్టర్ కూడా చేసుకోని పలు స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళాలు వెళతాయి. తర్వాత ఇవి వాటి ఖాతాల్లోంచి ఐఎస్‌ఐఎస్‌కు చేరతాయి.
* 2013-14లో ఈ సంస్థకు 40 మిలియన్ల డాలర్లు (దాదాపు 264 కోట్ల రూపాయలు) విరాళాల రూపంలో అందినట్లు ఒక అంచనా.
* 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 1,320 కోట్లు ఇలా లెక్కాపత్రం లేకుండా అనామక సంస్థలకు విరాళాల రూపంలో అందినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీసు’ తేల్చింది.
పురాతన వస్తువుల అమ్మకం... రూ.660 కోట్లు
* ఇరాక్, సిరియాల్లో తమ అధీనంలోని మ్యూజియాల ను ఐఎస్‌ఐఎస్ లూటీ చేసింది. ఎన్నో చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేసి అక్కడి వస్తు వులను కొల్లగొట్టింది. పురాతన వస్తువులను తవ్వి వెలికితీసే పని కూడా చేస్తోంది.
* వందలు, వేల ఏళ్ల కిందటి అమూల్యమైన ఈ సంపద... టర్కీ, జోర్డాన్ మీదుగా బ్రోకర్ల చేతులు మారి యూరప్‌కు తరలివెళుతున్నాయి.
* వేలం సంస్థలు వీటిని అమ్మిపెడుతున్నాయి.
* పురాతన వస్తువుల విక్రయం ద్వారా ప్రతియేటా ఐఎస్‌ఐఎస్ 100 మిలియన్ డాలర్లు (దాదాపు 660 కోట్ల రూపాయలు) ఆర్జిస్తున్నట్లు అమెరికా అంచనా.
పంట శిస్తు... రూ.1,300 కోట్లు
సిరియా, ఇరాక్‌లలో అత్యంత సారవంతమైన భూమి ఐఎస్‌ఐఎస్ ఆధీనంలో ఉంది. గోధు మలు, బార్లీ పండుతాయి. రైతులు తమ మొత్తం దిగుబడిలో పదిశాతం శిస్తుగా చెల్లించాలి. ఈ వ్యవసాయ ఉత్పత్తులను బ్లాక్‌మార్కెట్‌లో సగం ధరకు అమ్ముకున్నా 1,300 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఐఎస్‌ఐఎస్‌కు వస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఫాస్పేట్, సల్ఫర్ అమ్మకం... 2,330 కోట్లు
ఐఎస్‌ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలో సహజ వనరులు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి.
* ఫాస్పేట్ అమ్మకం ద్వారా 330 కోట్లు, సల్ఫరిక్ యాసిడ్ అమ్మకం ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ ఉగ్రసంస్థ ఏటా సంపాదిస్తోందని రాయిటర్స్ అంచనా. ఇవి కాకుండా స్థానిక ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు ఎలాగూ ఉంటుంది.
కిడ్నాప్‌లు
బడా వ్యాపార కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఐఎస్‌ఐఎస్ కిడ్నాప్‌లకు పాల్పడుతోంది. భారీ మొత్తాల్లో వసూలు చేసి విడిచిపెడుతోంది. వీరి ఆదాయవనరుల్లో కిడ్నాప్‌లు కూడా ప్రధానమైనవే. ఈ ఏడాది ఇప్పటిదాకా కిడ్నాప్‌ల ద్వారా 130 కోట్లు ఐఎస్‌ఐఎస్ ఆర్జించిందని అమెరికా ఆర్థిక నిఘా విభాగాల అంచనా.
ఆపడం ఎందుకు కష్టమంటే...
టర్కీ సరిహద్దు పట్టణాల్లోని బ్రోకర్లపై తాజాగా అమెరికా నిఘా పెట్టింది. వీరి సమాచారాన్ని టర్కీకి అందజేస్తోంది. ఇరాక్ కూడా ఐఎస్‌ఐఎస్‌తో అక్రమ లావాదేవీలు జరుపుతున్న తమ పౌరులను పలువురిని నిర్భందించింది. ఐఎస్‌ఐఎస్ ఏది అమ్మినా... బ్లాక్‌మార్కెట్‌లోనే, అదీ దాదాపు సగం ధరకే.
కొనుగోళ్లు, చెల్లింపులు అన్నీ గుట్టుగా జరిగిపోతుంటాయి. సగం ధరకే ఐఎస్‌ఐఎస్ దగ్గర కొన్న బ్రోకర్లు వీటిని మార్కెట్ ధరకు అమ్ముకొని భారీగా లాభపడుతున్నారు. కాబట్టే పాశ్చాత్యదేశాలు ఎంతగా ఆర్థికవనరులను కట్టడి చేయడానికి ప్రయత్నించినా ఐఎస్‌ఐఎస్‌కు నిరంతరా యంగా డబ్బు అందుతూనే ఉంది.
- సాక్షి స్పెషల్ డెస్క్