
కైరో: కిరాతక ఉగ్రసంస్థ ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బగ్దాదీ మరోసారి ప్రపంచం ముందుకొచ్చాడు. శత్రువులందరిని తగులబెట్టేయాలనీ, మీడియా సంస్థలపై దాడులు నిర్వహించాలనీ ఓ ఆడియో సందేశంలో ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. ఐసిస్ నేతృత్వంలోని అల్ ఫుర్కాన్ విభాగం 46 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోను విడుదల చేసింది. ఇందులో బగ్దాదీ ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు ఖలీఫత్ సైనికులు, ఇస్లామ్ హీరోలు. మీ శత్రువులపై ప్రతిచోటా దాడులకు తెగబడండి. సైద్ధాంతిక యుద్ధానికి ప్రధాన కార్యాలయాలుగా మారిన అవిశ్వాసుల మీడియా సంస్థలపై విరుచుకుపడండి’ అని పిలుపునిచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా మీ సోదరుల హత్యలు, వారిపై దమనకాండ జరుగుతుంటే, మతభ్రష్టులు సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నారని బగ్దాదీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యుద్ధంలో అమరత్వం పొందిన వారికి స్వర్గంలో 72 మంది భార్యలు లభిస్తారని గుర్తు చేశాడు. సిరియా అధ్యక్షుడు అసద్‌కు చెందిన అలావతి జాతి(షియాలో భాగం)తో పాటు టర్కీ, రష్యా, ఇరాన్ దేశాల కుతంత్రాలపై జాగ్రత్తగా ఉండాలని సిరియా సున్నీలను బగ్దాదీ హెచ్చరించాడు. అమెరికా, రష్యా వైమానిక దళాల సాయం లేకుండా సంకీర్ణ సేనలు తమముందు ఒక్క గంట కూడా నిలబడలేవని విమర్శించాడు. మోసుల్ నగరంపై తాము చేసిన వైమానిక దాడిలో బగ్దాదీ చనిపోయి ఉండొచ్చని జూన్‌లో రష్యా ప్రకటించిన కొన్ని నెలల అనంతరం ఆయన మాట్లాడిన ఆడియో సందేశం బయటకురావడం గమనార్హం.