ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయమొద్దు | Terrorism, financial crimes pose biggest threats to world | Sakshi
Sakshi News home page

ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయమొద్దు

Published Sun, Dec 2 2018 4:07 AM | Last Updated on Sun, Dec 2 2018 4:13 AM

Terrorism, financial crimes pose biggest threats to world - Sakshi

బ్యూనస్‌ ఎయిర్స్‌లో అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిషియో మాక్రితో మోదీ

బ్యూనోస్‌ ఎయిర్స్‌: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల కేసుల్లో జీ–20 (గ్రూప్‌ ఆఫ్‌ 20) దేశాల మధ్య బలమైన, చురుకైన సహకారం ఉండాలని భారత్‌ కోరింది. దీనికి సంబంధించి 9 అంశాలతో కూడిన ఎజెండాను ప్రధాని మోదీ శుక్రవారం జీ–20 సదస్సులో ప్రవేశపెట్టారు. రెండ్రోజుల జీ–20 సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జరుగుతుండటం తెలిసిందే. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను త్వరగా స్వదేశాలకు అప్పగించడం, ఇతర న్యాయపరమైన విషయాల్లో జీ–20 సభ్యదేశాల మధ్య సహకారం ఉండాలని ఈ ఎజెండాలో భారత్‌ పేర్కొంది. స్వదేశాల్లో భారీ ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఇతర దేశాల్లో నివసించేందుకు ఆయా దేశాలు అనుమతి ఇవ్వకుండా చూసేలా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంది.

వివిధ దేశాల ఆర్థిక నిఘా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల మధ్య అత్యంత వేగంగా సమాచార మార్పిడి కోసం ఆర్థిక కార్యాచరణ దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌)ను సహాయం తీసుకోవాలని సూచించింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను గుర్తించేందుకు, న్యాయప్రక్రియను పూర్తి చేసేందుకు, ఇతర దేశాలకు అప్పగించేందుకు ఓ నిర్దిష్టమైన ఉమ్మడి ప్రణాళిను ఎఫ్‌ఏటీఎఫ్‌ రూపొందించాలని కూడా భారత్‌ కోరింది. ఇతర దేశాలకు పారిపోయిన నేరగాళ్ల ఆస్తులు ఏ దేశంలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకునేలా ఓ వ్యవస్థ ఉండాలని కూడా భారత్‌ అభిప్రాయపడింది. హవాలా, ఉగ్రవాద సంస్థలకు నిధులు తదితర ఆర్థిక నేరాల కేసుల పరిష్కారం కోసం ఎఫ్‌ఏటీఎఫ్‌ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటుచేశారు.

12 ఏళ్ల తర్వాత తొలిసారి
రష్యా, భారత్, చైనాల మధ్య 12 ఏళ్లలో తొలి, మొత్తంగా రెండో త్రైపాక్షిక సమావేశం శుక్రవారం జరిగింది. మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతోనూ భేటీ అయ్యారు. ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్థసహా పలు బహుళపక్ష సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు. వివిధ రంగాల్లో మూడు దేశాల మధ్య సహకారంపై వారు చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై పుతిన్, మోదీ, జిన్‌పింగ్‌లు చర్చించారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రనకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిపాలనను సరైన దిశలో నడిపించేందుకు, ప్రాంతీయంగా శాంతిని పరిరక్షించేందుకు కలిసి పనిచేయాలని మూడు దేశాలు నిర్ణయించాయి.

‘వుహన్‌’ తర్వాత పురోగతి
జిన్‌పింగ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో మోదీ చైనాలోని వుహన్‌ నగరంలో అనధికారిక భేటీలో పాల్గొనడం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మంచి పురోగతి నమోదవుతోందని ఇరుదేశాధినేతలు తెలిపారు. వుహన్‌ భేటీ తర్వాత సంబంధాలు బాగున్నాయనీ, 2019లో మరింత బలపడే అవకాశాలున్నాయని  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీరు కలవడం ఇది నాలుగోసారి. అంతకుముందు ఎస్‌సీవో సదస్సు కోసం చైనాలోని చింగ్‌డావ్‌లో, బ్రిక్స్‌ సదస్సు సమయంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో వీరిద్దరూ కలిశారు. వచ్చే ఏడాది భారత్‌కు రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను మోదీ తాజాగా ఆహ్వానించారు. ఇలా తరచూ కలుస్తూ ఉండటం వల్ల సంబంధాలు చెడిపోకుండా ఉంటాయని ఆయన తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement