
ఫిబ్రవరి 13 నాటి భారత ప్రధాని యూఎస్ పర్యటన: మోదీ, ట్రంప్
విశ్లేషణ
దౌత్య కెమిస్ట్రీ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు ఒక నిర్మాణాత్మక వాతావరణాన్ని అందిస్తుంది. ఇలాంటి సంబంధం ఉద్రిక్తతలను తగ్గిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దౌత్యం అనేది పూర్తిగా నాయకత్వ స్థాయి కెమిస్ట్రీ పైనే ఆధారపడదు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు అదృష్టవ శాత్తూ పరస్పర ప్రయోజనం, ప్రజా మద్దతుకు చెందిన దృఢమైన చట్రంపై ఆధారపడి ఉన్నాయి. జాతీయ ప్రయోజనాలకు సంబంధించి, బహుళ రంగాలలో అనేక సంవత్సరాల పరిణామ క్రమంపై కూడా ఇవి నిర్మితమై ఉన్నాయి. అయితే మనం జీవిస్తున్నది విచ్ఛిన్న మవుతున్న ప్రపంచం. దీంట్లో ఆత్మసంతృప్తికి కాలం చెల్లిపోయింది.
మారిన సవాళ్లు
నేడు మనం ఎదుర్కొంటున్న వాస్తవాలు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలానికి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచ దౌత్య చలనశీలత మారిపోయింది. యుద్ధం– సంఘర్షణ, కొల్లగొట్టే పోటీ, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచీకరణకు చెందిన క్షీణిస్తున్న ఆకర్షణలు భౌగోళిక రాజకీయాలను నిర్వచిస్తున్నాయి. ట్రంప్ తన ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదా నికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అమెరికన్ రాజకీయాల్లో జన రంజక, స్థానికవాదపు ఉప్పెనపై ఆయన స్వారీ చేస్తున్నారు.
మోదీ అమెరికా పర్యటన ఫలితాలను మీడియా మొత్తంగా విశ్లే షించింది. ఇప్పుడు భారతదేశంపై ట్రంప్ ప్రాపంచిక దృక్పథం చూపిన ప్రభావం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ట్రంప్ విలువ ఇవ్వలేదని కాదు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గగనతలం, భూమి, సముద్రం, అంతరిక్షం, సైబర్‌స్పేస్‌తో సహా వివిధ రంగాలను ఉన్నతీకరించడానికి, సైనిక సహకారాన్ని పెంచడానికి ఇరు పక్షాలూ ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టమైంది. ఎఫ్–35 జెట్‌ల వంటి అధు నాతన విమానయాన వ్యవస్థల అమ్మకాలకూ, సహ ఉత్పత్తికీ ప్రణాళి కలు ఉన్నాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్ వాణిజ్యం, వలసల కోసం ఉమ్మడి వ్యూహాత్మక దృష్టి కూడా ఉంది. ఇవి మరింత సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయి.
అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ‘ప్రతీకార’ సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ప్రాథమికంగా దెబ్బతీస్తాయి, వ్యాపార అనిశ్చితులు పెరుగుతాయి, భౌగోళిక రాజకీయ అంతరాలు తీవ్రమ వుతాయి. దేశాలు అమెరికాతో తమ వాణిజ్య సంబంధాలను తిరిగి అంచనా వేయవలసి ఉంటుంది. ఇప్పటికే ఏర్పర్చిన సరఫరా గొలు సులు, అలాగే ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కూడా ప్రభావితం కావచ్చు. అమెరికా సుంకాలను విధించడం వల్ల ఉత్పత్తి ఖర్చులు ప్రభావిత మవుతాయి.
ఇది వినియోగదారులను దెబ్బతీస్తుంది. అధిక ద్రవ్యో ల్బణానికి దోహదం చేస్తుంది. వాస్తవానికి, చైనాకు దూరం జరు గుతూ, తన సరఫరా గొలుసులను అమెరికా వైవిధ్యపరిచినందు వలన, మన వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంతో ఆర్థిక సంబంధాలపై ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానం భారత్‌కు సవాళ్లను కలిగిస్తుంది. వాటిని తక్కువ అంచనా వేయకూడదు.
బ్రిక్స్ దేశాలకు బెదిరింపు
అమెరికాతో మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవడానికి జాగ్రత్తగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రతీకార సుంకాల విధానం భారత్ తన సొంత సుంకాలను హేతుబద్ధీకరించుకోవడా నికి తోడ్పడుతుంది. ఈ సంవత్సరం చివరిలోపు రెండు దేశాలు కుదుర్చుకోవాలనుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. అటువంటి ఒప్పందాన్ని చేరుకోవడం మన చర్చల నైపుణ్యాలకు నిజమైన పరీక్ష అవుతుంది.
వలసల విషయానికి వస్తే, సంకెళ్లలో బంధించి మరీ, భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరిస్తున్న విధానం చాలా మందికి రుచించలేదు. ఇంతవరకూ అనుసరించిన బహిష్కరణ విధా నాలు తీవ్రమైన వివాదానికి దారితీశాయి. మన జాతీయులతో అమా నుషంగా ప్రవర్తించారనే భావన దేశీయుల్లో ఉంది. విదేశాలలోని మన పౌరులను రక్షించడంలో వైఫల్యంగా దీన్ని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా తన పౌరులను రక్షించుకోగల సామర్థ్యం స్మార్ట్ పవర్‌లో ఒక భాగం. చట్టపరమైన వలసలను, హెచ్–1బీ వీసా సమస్యలను రెండు దేశాలు నిస్సందేహంగా దీటుగా ఎదుర్కోగలవు. కానీ మానవ అక్రమ రవాణా పరిశ్రమను మన ఏజెన్సీలు ఎలా సమర్థంగా అణచివేయగలవనేదే మన సమస్య.
బ్రిక్స్ దేశాలకు ట్రంప్ చేసిన హెచ్చరిక మరొక ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికన్ డాలర్ శక్తి ఆధారంగా ట్రంప్ ప్రపంచ ఆధిప త్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని నిరోధించే ప్రత్యా మ్నాయ ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ దేశాలు అనుసరిస్తే బ్రిక్స్‌కు మరణ శాసనం లిఖిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. బ్రిక్స్ సభ్యదేశమైన దక్షిణాఫ్రికా, శ్వేత ఆఫ్రికనర్ మైనారిటీని ప్రభావితం చేసే భూ విధా నాల కారణంగా చిక్కుల్లో పడింది.
దీనిని ఎలాన్ మస్క్ ‘జాత్యహంకార యాజమాన్య చట్టాలు’గా ఎత్తి చూపారు. మస్క్ దక్షిణాఫ్రికాలో తన స్టార్‌లింక్ ప్రాజెక్ట్ కోసం సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఫలి తంగా దక్షిణాఫ్రికాకు తాను అందించే అన్ని ఆర్థిక సహాయాలనూ అమెరికా నిలిపివేసింది. పైగా జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విధాన ‘సూత్రాల’కు నష్టం కలుగుతున్నట్లు కనిపిస్తే దౌత్య సంబంధాలను త్యాగం చేయడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఇది చెబుతోంది.
బహుళ ధ్రువ ప్రపంచం
బహుళ ధ్రువ ప్రపంచం గురించి నేడు చాలా చర్చ జరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ఇంట ర్వ్యూలో ‘ప్రపంచానికి ఏక ధ్రువ శక్తి ఉండటం సాధారణం కాదు’ అని అంగీకరించారు. ఇది ఓదార్పునిచ్చే మాటగా అనిపించవచ్చు. కానీ ‘అమెరికా ఫస్ట్’ అనే ప్రాపంచిక దృక్పథం అమెరికా ప్రాధాన్యం గురించిన అంతర్లీన అంచనాలను కలిగి ఉంది. పైగా బ్రిక్స్‌కు హెచ్చ రిక బహుళ పక్ష సమూహాలకు కూడా మేల్కొలుపు కానుంది: గట్టిగా కోరుకుంటే ఉనికిలో ఉండండి, కానీ అమెరికన్ నియమాల ప్రకారం ఆడండి. అందుకే కొందరు ట్రంప్ కొత్త అధ్యక్ష పదవిని తనదైన ’సామ్రాజ్యవాదం’ అని పిలుస్తున్నారు.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ ఇటీవల మాట్లాడిన ‘స్పష్ట మైన వ్యూహాత్మక వాస్తవాలు’ యూరప్ రక్షణ నుండి అమెరికా వైదొలగుతుందనీ, ఈ బాధ్యతను యూరోపియన్లకు వదిలివేస్తుందనీ సూచిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ వివాదంలో శాంతి అంటే రష్యా బలమైన పక్షం అని, ఉక్రెయిన్ ‘నాటో’లో భాగం కాలేదని లేదా రష్యా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పొందాలని అది కోరు కోలేదని ఆయన మాటలు సూచిస్తున్నాయి. విజేత అన్నింటినీ ఆక్ర మించగలదని భావించే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఛాంపియన్ కాబట్టి పాలస్తీనియన్లు సర్వం కోల్పోయారని పీట్ మాటలు చెబుతున్నాయి.
చైనా విషయానికొస్తే, వాణిజ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఇతర రంగాలలో సహకారాన్ని విస్తరించ డానికి లేదా కనీసం ఆయనతో ఒక నిలకడైన పద్ధతిలో వ్యవహరించ డానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుత సంద ర్భంలో స్నేహితులు, శత్రువులు ఎవరూ లేరు. కేవలం లావాదేవీలు జరపాలి, ఒప్పందాలు కుదుర్చుకోవాలి. భారతదేశం తదనుగుణంగా తన దౌత్య దిక్సూచిని నిర్దేశించుకోవాలి.
నిరుపమా రావు
వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment