విశ్లేషణ
ట్రంప్ విజయ ప్రసంగం చేసిన తర్వాత కూడా కొన్ని అమెరికా ఉదారవాద పత్రికలు అధ్యక్షుడిగా ఆయన గెలుపును ఒప్పుకోలేకపోయాయి. జార్జియా లాంటి నల్లజాతి ప్రజలున్న ప్రాంతాలు కూడా దాదాపుగా ట్రంప్ వైపు మారాయి. గత 40 ఏళ్లలో ఇతర ఏ రిపబ్లికన్ అభ్యర్థి కన్నా శ్వేతజాతీయేతర ఓట్లను ట్రంప్ అధికంగా గెలుచుకున్నారు. ఆయన దోషే కావొచ్చు, కానీ దేనికీ గట్టిగా నిలబడలేదు కాబట్టే కమలా హ్యారిస్ ఓడిపోయారు. ఇది వాస్తవం. భారతదేశంలోనూ మోదీ విజయం పట్ల ఇదే తరహా స్పందన కనబడింది. ప్రజలు నిజంగా ఏమి చెబుతున్నారో చూడటానికి, వినడానికి నిరాకరిస్తున్నామా? వారి ఆలోచనలు, కోరికలు, ఆత్రుతలను సరిగ్గా పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.
డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కి తిరిగి రావడం అనేది నేటి అమెరికాలో... నరేంద్ర మోదీ గత దశాబ్దంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ భారతదేశం అనుభవించిన భావోద్వేగ తీవ్రతను రేకెత్తిస్తోంది. ‘లిబరల్ ప్రెస్’ అని పిలవ బడుతున్న మీడియా దీన్ని ఒక అంధకారయుతమైన, వినాశకర దినానికి సంబంధించిన దృష్టాంతంగా చిత్రించడానికి ఆపసోపాలు పడింది. అదే సమయంలో ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ నేతృత్వంలోని ‘సంప్రదాయవాద మీడియా’... కష్టకాలంలో, ప్రమాదకరమైన పరి స్థితి నుంచి అమెరికాను బయటపడేసిన వీరుడిగా ట్రంప్‌ను అభివర్ణించడంలో పోటీపడుతోంది.
మోదీకి వ్యతిరేకంగా భారత ప్రజల భావోద్వేగ మిశ్రమాను భూతి... ట్రంప్ పట్ల అమెరికన్ల ప్రతిస్పందనలతో సమానంగా ఉండటం అసాధారణం. 2014, 2019, 2024లో మోదీ గెలిచిన మూడు ఎన్నికలలోనూ ఎన్నికల పారవశ్యం వర్సెస్ తీవ్ర ఆగ్రహం ప్రధాన లక్షణంగా ఉండింది. కచ్చితంగా, అమెరికాలో లాగానే భారత దేశంలోనూ మధ్యస్థులుగా ఉండేవాళ్లు ట్రంప్, మోదీ లాంటి విభజిత వ్యక్తిత్వాల బరువుతో చాలావరకు కనుమరుగయ్యారు. పెద్ద ప్రశ్న ఏమిటంటే, మీడియా కానీ, రెండు దేశాల్లోని పోల్ నిపుణులు కానీ ఎక్కడ పొరబడుతున్నారు? మోదీ, ట్రంప్‌ను ద్వేషించడాన్ని మనం ఎంతగానో ఇష్టపడుతున్నామా? ప్రజల ఆలోచనలు, కోరికలు, ఆత్రు తలను పట్టించుకుంటున్నాం అనుకుంటున్నప్పటికీ, వారు నిజంగా ఏమి చెబుతున్నారో చూడటానికి, వినడానికి నిరాకరిస్తున్నామా?
ట్రంప్ ఫ్లోరిడాలో తన విజయ ప్రసంగం చేసిన తర్వాత కూడా, ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి గౌరవప్రదమైన వార్తాపత్రికలు ట్రంప్ గెలిచినట్లు అంగీకరించడానికే నిరాకరించాయి. భారతదేశంలో కూడా, 2014, 2019 ఎన్నికల్లో నమ్మశక్యం కాని విధంగా మన బుద్ధిని కాకుండా మన హృదయం చెప్పిందానికి తలూపాం. భారతీయులు సంపూర్ణ ఆమోదంతో మోదీకి ఓటు వేస్తున్నారని నమ్మలేకపోయాం. 2022లో యోగీ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను కైవసం చేసుకున్నారని నమ్మడానికి నిరాకరించాం. కోవిడ్ –19 సమయంలో సంభవించిన వేలాది మంది మరణాలు దేవుడే ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు రుజువు అని చెప్పుకున్నాం. 2024లో, అదే ఉత్తరప్రదేశ్ బీజేపీకి పూర్తిగా ఓట్లను బట్వాడా చేయడానికి నిరాకరించినప్పుడు కూడా మనం సమానంగా షాక్ అయ్యాము.
ఈ అన్ని సందర్భాల్లోనూ క్షేత్ర వాస్తవికతను పట్టించుకోకుండానే మనం కథలో చాలా లోతుగా మునిగిపోయాం. ప్రజా తీర్పు మన ముందుకు వచ్చిన తర్వాత కూడా, దాన్ని అంగీకరించడానికి నిరాక రించాం. మోదీ, ట్రంప్‌లలో ఏదో తప్పు ఉందని నొక్కిచెప్పాం. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు. మరింత అధ్వాన్నంగా, రాహుల్ గాంధీకి లేదా కమలా హ్యారిస్‌కు అదే కఠినమైన ప్రమాణాలను వర్తింప జేయడానికి నిరాకరించాం.
కాబట్టి ఈ రోజు వాస్తవాలను ఎదుర్కొందాం. ఏ వైపూ స్థిరంగా నిలబడలేదు కాబట్టే హ్యారిస్ ఓడిపోయారు. ట్రంప్ దోషి, స్త్రీ లోలుడు, ఇంకో ఘోరం వలసలను ఆపి (భారతదేశానికి మంచిది కాదు) అమెరికాకు ఉద్యోగాలు తెస్తానని వాగ్దానం చేశారు. రాహుల్ విషయానికొస్తే, నాలాంటి వ్యక్తులు డిన్నర్ టేబుల్ వద్ద ఆయన అనేక ఆలోచనలతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తారు. కానీ ఆయన దేని కోసం గట్టిగా నిలబడతారో అర్థం చేసుకోవడం ఇబ్బందికరంగానే ఉంటోంది.
అమెరికా, భారతదేశం వంటి గజిబిజి ప్రజాస్వామ్యాలు ట్రంప్, మోదీలనే ఎన్నుకుంటాయి. ఎందుకంటే వారు క్షీణతలో లేదా పరి వర్తనలో సమాజాల ద్వారా ఏర్పడే గందరగోళాన్ని సరళీకృతం చేయగలరు. 2021 జనవరి 6న అమెరికన్ క్యాపిటల్‌పై దాడి, 2002 గుజరాత్ అల్లర్లలో చాలామంది మరణించడం లాంటివి ఉన్నప్పటికీ మనం ఎన్నుకున్న నాయకుల జీవితాల్లోని చీకటి కోణాలను విస్మ రిస్తాము. ఎందుకంటే ఈ రోజు మన కష్టతరమైన జీవితాలను మెరుగుపరుస్తారని వారు హామీ ఇచ్చారు. వారి ప్రస్తుత హామీలు మనకు ఓదార్పునిస్తాయి. వారు మనతో సింపుల్‌గా మాట్లాడతారు. మనం వారి ప్రత్యర్థులను నమ్మినదానికంటే, వీరి పట్ల తక్కువ అప నమ్మకం చూపుతాం.
డెమోక్రాట్ అనుకూల దక్షిణ యూఎస్ రాష్ట్రం జార్జియాలోని నల్లజాతి ప్రజలున్న జిల్లాలు దాదాపు పూర్తిగా ట్రంప్ వైపు మారాయి. అలాగే ఆయన లాటిన్ అమెరికన్ల ఓటును 14 శాతం మెరుగు పరుచుకున్నారు. ట్రంప్‌కు ఎందుకు ఓటు వేశారని అడిగితే వాళ్లు చెప్పిన ఒక కారణం: ఎటూ వేస్తారని డెమోక్రాట్లు వారి ఓటును తేలిగ్గా తీసుకోవడం. ఇది విన్నట్టు అనిపిస్తోందా?
హ్యారిస్‌ను శిక్షించినట్టుగానే హరియాణాలో భూపీందర్ సింగ్ హుడాను ఓటర్లు శిక్షించారు. కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా, రావ్ బీరేందర్ సింగ్ వంటి పార్టీలోని తిరుగుబాటుదారులను తన వెంట తీసుకోవడానికి హుడా నిరాకరించారు. హరియాణాలోని ప్రతి నియోజక వర్గంలోనూ జాట్‌యేతర ఓట్లపై బీజేపీ సూక్ష్మ దృష్టి పెట్టినట్టుగానే, గత 40 ఏళ్లలో ఇతర ఏ రిపబ్లికన్ అభ్యర్థి కన్నా శ్వేతజాతీయేతర ఓట్లను ట్రంప్ అధికంగా గెలుచుకున్నట్లు డేటా చూపిస్తోంది.
విచిత్రంగా, యూపీలో బీజేపీ 29 స్థానాలను కోల్పోయినప్పుడు దాని మెజారిటీ తగ్గిందని కాంగ్రెస్ హర్షధ్వానాలు చేయకుండా ఉండ లేకపోయింది. మరో వైపున మోదీకి ఈ ప్రపంచంలో సగం గర్భం రావడం అనేది ఉండదని తెలుసు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటిలాగానే ప్రధానమంత్రిగా తాను చేయాల్సిన పనుల్ని చేయగలరు. పైగా అధి కారాన్ని సంఘటితం చేసుకోవడానికీ, యూపీలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికీ రాబోయే శాసనసభ ఎన్నికలలో గెలవడమే మార్గం. హరియాణా. మహారాష్ట్ర. జార్ఖండ్.
కాకపోతే మోదీపై తిరగబడి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని బలవంతం చేసిన పంజాబ్‌కు భిన్నమైన నియమాలు వర్తింపజేయబడుతున్నాయి. గత కొన్ని వారాలుగా వరి సేకరణలో ఉన్న అపారమైన కష్టాల గురించి చాలా ప్రశ్నలు రేగు తున్నాయి. పంజాబ్ సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా ఉండి వ్యవ సాయంపై గణనీయంగా ఆధారపడి ఉన్నందున దీనిని నివారించ లేమా? పంజాబ్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు వరి తరలింపులో కేంద్రం మరింత అవగాహన చూపలేదా? తడిసిన బియ్యాన్ని అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటకకు పంజాబ్ విక్రయించినట్లు ఈ ఏడాదే ఎఫ్‌సీఐ ఎందుకు గుర్తించింది?
బహుశా, వీటిలో కొన్ని వైరల్ అయిన కుట్ర సిద్ధాంతాల్లా అనిపిస్తాయి. ఈ చిక్కుముడి ప్రశ్నలకు సమాధానం కావాలంటే – మోదీ, చెప్పాలంటే ట్రంప్ కూడా అధికార స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఆ రాజకీయం కిట్టీ పార్టీ కాదు, ఎన్జీవో కాదు. ఓటర్లు నిర్దిష్ట సంఖ్యకు మించి మీకు ఓటు వేయకపోతే అప్పుడు ఇతర చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు 2024 లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో బీజేపీకి వచ్చినవి 18.3 శాతం ఓట్లు. అప్పుడు విభజించు పాలించు అనే పురాతన నియమం ఉండనే ఉంది.
ఇప్పుడు ట్రంప్ అమెరికాను గెలుచుకున్నందున, స్వదేశంపై మనం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. మహారాష్ట్రతో పాటు, నవంబర్ 20న మొదలయ్యే పంజాబ్‌లోని నాలుగు నియోజకవర్గాల ఉప ఎన్నికలతో ఆట ప్రారంభిద్దాం.
జ్యోతి మల్హోత్రా
వ్యాసకర్త సీనియర్ సంపాదకురాలు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment