
అదే లక్ష్యంతో ముందుకెళ్దాం
ద్వైపాక్షిక చర్చల్లో భారత్, ఖతార్ సంయుక్త నిర్ణయం
ప్రధాని మోదీతో భేటీ అయిన ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని భారత్, ఖతార్ నిర్దేశించుకున్నాయి. ప్రస్తుతం 14 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 28 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్–థానీ(Qatar Emir Sheikh Tamim bin Hamad Al Thani) మధ్య మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
ఐదు ఒడంబడికలపై సంతకాలు
ఆర్థిక భాగస్వామ్యం, సహకారం, యువజన వ్యవహారాలు, క్రీడలు, పురాతన వస్తువుల నిర్వహణ తదితర అంశాల్లో ఐదు ఒడంబడికలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వంద్వ పన్నుల విధానం నివారణ ఒప్పందం పొడిగింపుపైనా సంతకాలు జరిగాయి. ‘‘ ఖతార్‌తో ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాం. వాణిజ్యం, ఇంధన భద్రత, పెట్టుబడులు, సాంకేతికత, ఇరు దేశస్తుల మధ్య సత్సంబంధాలు తదితర అంశాల్లో పరస్పర భాగస్వామ్య ధోరణిని ఇక మీదటా కొనసాగిస్తాం’’ అని ఇరు దేశాల మధ్య చర్చల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్ ఛటర్జీ తర్వాత మీడియాకు చెప్పారు.
‘‘ వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ముఖ్యంగా భద్రత సంబంధ అంశం తలెత్తినప్పుడు ప్రత్యేకంగా దీనిపై రెండు దేశాలు ఉమ్మడి ఎజెండా రూపొందిస్తాయి’’ అని ఛటర్జీ చెప్పారు. విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ, అమీర్ తమీమ్‌లు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ‘‘ సీమాంతర ఉగ్రవాదం సహా అంతర్జాతీయంగా అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దాం. విభేదాలను ద్వైపాక్షిక చర్చలు, బహుముఖ మార్గాల ద్వారా సామరస్యంతో రూపుమాపుదాం’’ అని ఆ ప్రకటనలో భారత్, ఖతార్ పేర్కొన్నాయి.
పెరగనున్న పెట్టుబడులు
ఒప్పందంలో భాగంగా భారత్‌లో మౌలిక వసతులు, నౌకాశ్ర యాలు, నౌకల నిర్మాణం, ఇంధనం, పునరు త్పాదక ఇంధన రంగం, స్మార్ట్ సిటీ లు, ఫుడ్ పార్క్‌లు, అంకుర సంస్థలతోపాటు కృత్రిమ మేథ, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతికత రంగాల్లో ఖతార్ పెట్టుబడుల ప్రాధికార సంస్థ పెట్టుబడులను మరింత పెంచుతుంది. అంతర్జాతీయ వివాదా లకు శాంతియుత పరిష్కారాలను చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సాధించగలమని ఇరు దేశాలు వ్యాఖ్యానించాయి.
గత ఏడాది మోదీ ఖతార్‌లో పర్యటించినప్పుడు ఏకంగా 78 బిలియన్ డాలర్ల ద్రవరూప సహజ వాయువు దిగుమతిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. 2048 ఏడాదిదాకా మార్కెట్ ధరల కంటే తక్కువకే భారత్‌కు ఖతార్ నుంచి ఏటా 75 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతి అయ్యేలా ఒప్పందం కుదుర్చు కున్నారు. ఫిబ్రవరి 17 నుంచి రెండ్రోజుల పర్యటన కోసం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ భారత్‌కు విచ్చేసిన విషయం తెల్సిందే. తమీమ్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015లో ఆయన భారత్‌కు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment