financial crime
-
1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం - కారణం ఇదే..
డిజిటల్ మోసాలను నియంత్రించేందుకు, ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.4 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ 'వివేక్ జోషి' శుక్రవారం 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్' (CFCFRMS) ప్లాట్‌ఫారమ్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్‌బోర్డింగ్‌తో సైబర్ దాడులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. CFCFRMS ప్లాట్‌ఫారమ్‌ను నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)తో అనుసంధానం చేయడం కోసం పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య సమర్థవంతమైన సహకారాన్ని అందించడం, సరైన సమయంలో పర్యవేక్షించడం, మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం వంటి విషయాలను కూడా చర్చించినట్లు సమాచారం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణ 10 అంకెల సంఖ్యల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని TRAI సూచించిన విధంగా వాణిజ్య లేదా ప్రచార కార్యకలాపాల కోసం ప్రత్యేకించిన నెంబర్ సిరీస్‌లను ఉపయోగించాలని చర్చించుకున్నారు. అంతే కాకుండా నకిలీ డాక్యుమెంట్లతో తీసుకున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు టెలికామ్ శాఖ ఏఐ టెక్నాలజీ తీసుకురానుంది. ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.40 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిన సంస్థల మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 3.08 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసిన కేంద్రం, ఈ నేరాలకు పాల్పడుతున్న 500 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే.. సైబర్ మోసాలకు గురైన ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం, మోసపోయిన డబ్బును మోస పూరిత ఖాతాల నుంచి తిరిగి ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళికలు చేపడుతున్నారు. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే.. రాబోయే రోజుల్లో సైబర్ దాడుల నుంచి ప్రజలను విముక్తి లభిస్తుంది. -
‘స్కిల్’ స్కామ్ సామాజిక, ఆర్థిక నేరం
సాక్షి, అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ను భారీ కుట్రకు సంబంధించిన సామాజిక, ఆర్థిక నేరంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ప్రత్యేక దృష్టి కోణంలో చూడాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్‌లో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలని తెలిపింది. ఈ స్కామ్‌లో రూ.371 కోట్ల ప్రజాధనం ముడి పడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది. ఈ స్కిల్ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చారు. షెల్ కంపెనీల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను దర్యాపు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలన్నీ తుది ట్రయల్‌లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. షెల్ కంపెనీల కొనుగోలు జరిగిన తీరును గమనించింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. రిమాండ్ తిరస్కరణ సరికాదు.. ఇదే కుంభకోణంలో కీలక నిందితుడి రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. రిమాండ్ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్ సమయంలో మినీ ట్రయిల్ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణకు స్వీకరించదగ్గదా.. కాదా.. అన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదంది. 41ఏ సీఆర్పీసీ కిందకు రాని నేరాలకు కూడా 41ఏ ఇవ్వాలని చెప్పడం సరికాదంది. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120బి ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. -
మొదట్లో భూకబ్జాలు..సెటిల్మెంట్లు ఆపై మోసాలు...బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది. ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు. నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి.. నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి.. ఎన్నారై మహిళలను టార్గెట్‌గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్‌మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్‌పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్‌మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్‌పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 18 మంది కోసం వేట ముమ్మరం వెంకట్‌తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్‌డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్‌తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు. వీరి కస్టమర్లు రామ్‌చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్రెడ్డి, సురే ష్, రామ్‌కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్‌అ జామ్, అమ్‌జద్‌ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. -
కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో 3 అపార్ట్మెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మండావలి జైలులో గడుపుతున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కాంట్రాక్టర్ నుంచి 2020లో అందిన ముడుపులతో వీటిని కొనుగోలు చేశారని ఆరోపించాడు. ఈ మేరకు మండావలి జైలు నుంచి మీడియాకు సుఖేష్ తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా తాజాగా మరో లేఖను విడుదల చేశారు. దుబాయ్‌లోని జుమైరా పామ్స్‌లోని మూడు అపార్ట్మెంట్లను అత్యవసరంగా 65 మిలియన్ దిర్హామ్స్ (ఏఈడీ)కు అమ్మాలని వారం క్రితం దుబాయ్‌లోని తన సహచరుడు మనోజ్ జైన్‌ను కేజ్రీవాల్ కోరారని సుఖేశ్ ఆ లేఖలో ఆరోపించాడు. తనకు, సత్యేందర్ జైన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లో దుబాయ్‌లో మూడు అపార్ట్మెంట్ల కొనుగోలు లావాదేవీల వివరాలున్నాయని, ఆ చాట్‌ను విడుదల చేస్తానని సుఖేశ్ పేర్కొన్నాడు. వారం రోజుల్లో ఈడీ, అవినీతి నిరోధక విజిలెన్స్‌కి ఆధారాలు పంపిస్తానని కూడా వెల్లడించాడు. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే హతమారుస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. త్వరలో కేజ్రీవాల్ తిహార్ జైలుకు చేరుతారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. -
HYD: పబ్లిక్ వైఫై వాడాడు.. పైసలు పొగొట్టుకున్నాడు!
కుమార్.. (పేరు మార్చాం) చదువు పూర్తి చేసుకుని గ్రూప్స్ కోచింగ్ కోసం నగరానికి వచ్చాడు. కోచింగ్ కోసం ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరేందుకు ఇంట్లోవాళ్లు డబ్బులు పంపించారు. బయటకు వెళ్లిన కుమార్.. ఓ షాపింగ్ మాల్ బయట ఫ్రీ వైఫైను ఉపయోగించుకునేందుకు యత్నించాడు. ఓటీపీతో లాగిన్ అయ్యి.. మెరుపు వేగంతో వస్తున్న ఇంటర్నెట్ నుంచి ఆశ్చర్యపోయాడు. అలా నెట్‌ను వాడుకున్న కాసేపటికే.. అతని మొబైల్‌కు మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న 50 వేలు కొంచెం కొంచెంగా మాయం అయ్యాయి. భయాందోళనతో.. షాపింగ్ మాల్ వాళ్లను నిలదీశాడు. అసలు తమ మాల్‌కు ఫ్రీ వైఫై యాక్సెస్ లేదని చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లు.. మినిమమ్ 1 జీబీకి తక్కువ కాకుండా ఇంటర్నెట్ప్యాక్లు ఉపయోగిస్తున్నారు. అయితే అవసరానికి పబ్లిక్ వైఫైలు వాడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా. నెట్‌తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ చదువుల మొదలు.. ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి ఈ–మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం, ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే.. మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉచిత వైఫై వాడాల్సి వస్తే.. అది అధికారికమేనా? సురక్షితమేనా? అనేది క్రాస్ చెక్ చేస్కోవాలి. అలాగే నమ్మదగిన వీపీఎన్‌ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
‘స్కిల్’ స్కామ్‌లో షెల్.. షా
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నిధుల కుంభకోణం కేసులో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు గత సర్కారు పెద్దలు ఏకంగా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్తుడు శిరీష్ చంద్రకాంత్ షాను రంగంలోకి దించినట్లు తాజాగా వెల్లడైంది. ఏకంగా 212 షెల్ కంపెనీలను సృష్టించి రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డ శిరీష్‌ను అరెస్టు చేసేందుకు 2017లో స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుంది. ఘరానా మోసగాడిని భాగస్వామిగా చేసుకుని టీడీపీ పెద్దలు 2015లో ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టారంటే ఎంత పక్కాగా పన్నాగం పన్నారో స్పష్టమవుతోంది. 24 వరకు రిమాండ్.. మచిలీపట్నం జైలుకు తరలింపు ఈ కేసులో తాజాగా సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఆర్థిక నేరగాడు శిరీష్‌చంద్ర షాను ముంబైలో అరెస్టు చేశారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచగా ఈనెల 24వరకు రిమాండ్ విధించడంతో మచిలీపట్నంలోని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. షెల్ కంపెనీల డాన్... శిరీష్ శిరీష్ చంద్రకాంత్ షా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్తుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 212 షెల్ కంపెనీలను సృష్టించి నల్లధనాన్ని దారి మళ్లించిన ఘనుడు. ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, సెబీ తదితర సంస్థలన్నీ శిరీష్ చంద్రకాంత్ షా కోసం రంగంలోకి దిగాయంటే ఎంత ఘరానా నేరస్తుడో అర్థమవుతోంది. షెల్ కంపెనీలతో దేశ ఆర్థిక వ్యవస్థకే సవాల్‌గా మారిన అతడి ఆట కట్టించేందుకు కేంద్ర ఆదాయపన్ను శాఖ ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సహకారాన్ని కోరాల్సి వచ్చింది. పీఎంవో ఆధ్వర్యంలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ద్వారా అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. ‘స్కిల్’ కుంభకోణంలో కింగ్‌పిన్.. టీడీపీ పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు శిరీష్ చంద్రకాంత్ షాను పావుగా వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.371 కోట్లను డిజైన్‌టెక్ కంపెనీ ద్వారా స్కిల్లర్ అనే షెల్ కంపెనీకి చెల్లించారు. ఆ కాంట్రాక్టు కింద హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సరఫరా చేసిందంటూ ఏసీఐ అనే మరో షెల్ కంపెనీని తెరపైకి తెచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ నుంచి పొందిన రూ.371 కోట్లలో రూ.242 కోట్లను స్కిల్లర్ కంపెనీ ఏసీఐకి చెల్లించింది. ఏసీఐ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి కథ నడిపించింది. అనంతరం రూ.242 కోట్లను తిరిగి టీడీపీ పెద్దలకు చెందిన డిజైన్‌టెక్‌కు చెల్లించింది. ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దొడ్డిదారిలో టీడీపీ పెద్దలకు కట్టబెట్టేందుకు సాధనంగా ఉపయోగపడిన షెల్ కంపెనీ ఏసీఐని శిరీష్ చంద్రకాంతే సృష్టించాడు. అతడు సృష్టించిన 212 షెల్ కంపెనీల్లో ఏసీఐ కూడా ఉందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. శిరీష్ చంద్రకాంత్ షా 212 షెల్ కంపెనీల ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల మేర నల్లధనాన్ని మళ్లించినట్లు ఆదాయపన్ను శాఖ 2017లోనే వెల్లడించింది. అందులో 2015–16లో ఏపీఎస్ఎస్డీసీ ద్వారా టీడీపీ సర్కారు చెల్లించిన నిధులు కూడా ఉన్నట్లు తాజాగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఈ ఒక్క కుంభకోణంలోనే కాదు 2014–19 మధ్య రాష్ట్రంలో పలు కుంభకోణాలకు సంబంధించి నిధులు మళ్లించేందుకు శిరీష్ చంద్రకాంత్ షాను టీడీపీ పెద్దలు వాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరిపితే భారీ స్థాయిలో కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఆర్థిక నేరాల కట్టడికి ‘ఆధార్’ టెక్నాలజీ
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలను గుర్తించేందుకు ఆధార్ ఆధారిత టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ దిలీప్ అస్బే తెలిపారు. రాబోయే మూడు–నాలుగేళ్లలో ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రాగలదని ఆధార్ 2.0 వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముందే గుర్తించే వీలు విశిష్ట గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ ఎంతో విలువైనదని, కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని దిలీప్ అభిప్రాయపడ్డారు. ‘మన దేశంలో పన్నులు ఎగ్గొట్టడమనేది పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రస్తుతం పాన్‌ను, ఆధార్‌ను అనుసంధానించడం వల్ల, ఒక వ్యక్తికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. అన్నీ కూడా ఆధార్‌కు లింక్ అయి ఉంటాయి. అనుమానాస్పద కేసుల్లో ఈ డేటాను మరింత లోతుగా పరిశీలించడం ద్వారా పన్ను ఎగవేత సందర్భాలను కూడా గుర్తించవచ్చు‘ అని దిలీప్ చెప్పారు. ఎవరైనా కస్టమర్ ఆర్థిక మోసానికి పాల్పడితే .. పలు సంస్థలపై దాని ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. ‘ఇలాంటి మోసాలను ఎవ్వరూ ఆపలేకపోవచ్చు. అయితే, ఆధార్‌లాంటి విశిష్టమైన పత్రంతో మోసాలకు సంబంధించిన ఒక రిపాజిటరీని తయారు చేయొచ్చు. ఒక వ్యక్తి మోసం చేస్తే వారికి సిమ్ కార్డ్ మొదలుకుని బ్యాంక్ ఖాతా, వాలెట్ లాంటివి ఏవీ మళ్లీ లభించకుండా చేయొచ్చు. ఈ విధంగా మోసగాళ్లను ఆదిలోనే గుర్తించి, వారికి అడ్డుకట్ట వేయొచ్చు’ అని అన్నారు. చదవండి:‘ఆధార్‌పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’ -
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా నీరవ్ మోదీ
ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు 2 బిలియన్ డాలర్ల టోకరా వేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీని ’పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి’గా (ఎఫ్ఈవో) ముంబై కోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది. దీంతో మోదీ ఆస్తుల జప్తునకు మార్గం సుగమమైంది. 2018లో ఎఫ్ఈవో చట్టం వచ్చిన తర్వాత.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా తర్వాత పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి ముద్ర పడినది నీరవ్ మోదీకే. పీఎన్బీ స్కామ్ వెలుగులోకి రావడానికి ముందే 2018 జనవరిలో నీరవ్ మోదీ దేశం విడిచి వెళ్లిపోయారు. 2019 మార్చిలో లండన్‌లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం తనను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోంది. -
కోటి రూపాయలకు కుచ్చుటోపి
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : అధిక వడ్డీలకు ఆశచూపి మోసం చేయడం, అవసరానికి అక్కరకు వస్తుందని దాచుకున్న చిట్టీల సొమ్ముతో ఉడాయించడం... ఇలా పొదుపుదారులకు ఆర్థిక నేరగాళ్లు గుండెపోటు తెప్పిస్తున్నారు. తాజాగా మండలంలోని పైడిభీమవరం పంచాయతీ వరిసాం గ్రామానికి చెందిన అత్మకూరు కామేశ్వరరావు కోటి రూపాయలతో ఉడాయించాడు. గ్రామంతోపాటు చుట్టు్ట పక్కల గ్రామాల ప్రజల నుంచి చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరిట కోటి రూపాయలకుపైగా వసూలు చేశాడు. ఈ మొత్తంతో పరారవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వరిసాం గ్రామానికి చెందిన పీవీ సత్యనారాయణ, పెద్దినాగభూషన్, కొన లక్ష్మణరావు, పీ నాగేశ్వరరావు, మునకాల రమణ, బీ రాము, జీరు రమణ, ఎం అప్పలనరసయ్య, కే బోగష్, ఎం దుర్గారావు, జీరు కుర్మారావుతోపాటు మరో 15 మంది బుధవారం జేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్మకూరు కామేశ్వరరావు ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష నుంచి రూ. 5లక్షల వరకూ పెద్ద మొత్తంలో వేసిన చిట్టీలను తిరిగి ఇవ్వకుండా పరారైనట్లు బోరుమన్నారు. -
విలాసాలకు మారుపేరు
బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగ్గొట్టి్ట లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లభించింది. రాజ ప్రాసాదాలను తలపించే భవంతులు, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఎస్టేట్లు, సకల సౌకర్యాలున్న విమానాలు, విలాసవంతమైన నౌకలు, రేసు కార్లు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాల్యాకున్న ఆస్తులు కోకొల్లలు. మాల్యా స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఈడీ ఒక జాబితా రూపొందించింది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, భవంతులను గుర్తించింది. ఈడీ జప్తు చేయడానికి రూపొందించిన జాబితా ఇదే.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల విలువ చేసే భూము లు, ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. మొత్తం 3.09 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది. కర్ణాటక: బెంగళూరులో మాల్స్, మరో నాలుగు గ్రామాల్లో భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.1,937.5 కోట్లుగా ఉంది. బెంగళూరులో యూబీ సిటీ మాల్ విలువ రూ.713 కోట్ల వరకు ఉంటుంది. అలాగే రూ.962 కోట్లతో కింగ్‌ఫిషర్ టవర్ నిర్మాణంలో ఉంది. మహారాష్ట్ర: ముంబై, ఆలిబాగ్లో ఫామ్ హౌస్‌లున్నాయి. వాటి ఖరీదు రూ.28.02 కోట్లకుపైమాటే. తమిళనాడు: వెల్లూరు జిల్లాలో భూముల విలువ రూ. 1.14 కోట్ల వరకూ ఉంటుంది. ఇవే కాక వివిధ కంపెనీల్లో మాల్యాకు షేర్లు ఉన్నాయి. యూబీఎల్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువరూ. 8,758 కోట్లు కాగా, యూఎస్‌ఎల్‌లో రూ.1,692 కోట్లు, యూబీహెచ్ఎల్ రూ.27 కోట్లు, మెక్‌డొవెల్ రూ.10 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఈడీ జాబితాలో తెలిపింది. ఈడీ జాబితాలో లేనివి మరికొన్ని.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకు ఎస్టేట్లు, భవనాలు మొత్తం రెండు డజన్లకుపైగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో 11వేల చ.అ.విస్తీర్ణంలో ఎస్టేట్ ఉంది. దీని విలువ 12 లక్షల డాలర్లు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాతిగాంచిన ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్, దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ సమీపంలో 12,000 హెక్టార్లలో విస్తరించిన మబూలా గేమ్లాడ్జ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎస్టేట్, ఫ్రాన్స్‌లోని రివిరా పట్టణానికి సమీపంలోని లగ్జరీ ఎస్టేట్, భారత్‌లోని కర్ణాటకలో కునిగల్ పట్టణం దగ్గర 400 ఎకరాల్లో విస్తరించిన గుర్రపు శాల(స్టడ్ ఫామ్), గోవాలో రాజభవంతిని తలపించే కింగ్‌ఫిషర్ విల్లా వంటి స్థిరాస్తులు మాల్యా సొంతం. సొంత పనులకు 4 విమానాలు కింగ్‌ఫిషర్ వంటి విమానయాన సంస్థను నడిపించిన ప్రముఖ వ్యక్తికి తనకంటూ సొంతంగా విమానం ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మాల్యా ఎక్కడికి వెళ్లాలన్నా సరే విమానంలోనే వెళ్లేవారు. మొత్తం నాలుగు విమానాలను ఆయన వినియోగించేవారు. ప్రపంచంలోని తనకున్న ఎస్టేట్లలో ఎక్కడికి వెళ్లాలన్నా బోయింగ్ 727 రకం విమానాన్ని వాడేవారు. మాల్యా దగ్గరున్న ఎయిర్‌బస్ ఏ319 విమానం లండన్ నుంచి అమెరికాకు ఒకే ఒక్క హాల్ట్‌తో ప్రయాణించగలదు. ఇక హాకర్ హెచ్ఎస్125, గల్ఫ్ స్ట్రీమ్ త్రీ అనే మరో రెండు విమానాలు కూడా ఎప్పడూ మాల్యా కోసం సిద్ధంగా ఉండేవి. తన అభిరుచికి తగ్గట్టుగా ఆ విమానంలో ఆయన సకల అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విజయ్ మాల్యా వద్ద చాలా ఉన్నాయి. బెంగళూరులోని యూబీ సిటీ మాల్ -
విజయ్ మాల్యా.. పరారైన నేరగాడే
ముంబై: భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు మరోషాక్ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది డి.ఎన్.సింగ్ వాదిస్తూ.. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని తెలిపారు. అక్కడి న్యాయస్థానం సైతం మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ విజయ్‌మాల్యా మాత్రం భారత్‌కు రావడం ఇష్టపడటం లేదనీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని మాల్యా లాయర్లు ఖండించారు. చట్టప్రకారం మాల్యా లండన్ కోర్టు ముందు లొంగిపోయారనీ, ఆతర్వాత బెయిల్ పొందారని కోర్టుకు చెప్పారు. ఫోర్స్ ఇండియా జట్టు డైరెక్టర్ హోదాలో వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ సమావేశంలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లారని, ఈడీ చెబుతున్నట్లు మాల్యా రహస్యంగా వెళ్లలేదని తెలిపారు. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ ఇరుపక్షాల వాదనలు విన్న అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు జడ్జి ఎం.ఎస్.అజ్మీ స్పందిస్తూ.. ‘ఎఫ్ఈవో చట్టంలోని సెక్షన్ 12(ఐ) కింద ఈడీ చేసిన దరఖాస్తును పాక్షికంగా మన్నిస్తున్నాం. విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆస్తుల జప్తు ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది’ అని ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే మాల్యా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు తీర్పు పూర్తి కాపీని అందుకునేందుకు, ఎగువ కోర్టులో అప్పీలుకు వీలుగా ఈ ఆదేశాలపై 4 వారాల స్టే ఇవ్వాలన్నారు. దీంతో ఎఫ్ఈవో చట్టం కింద పనిచేస్తున్న కోర్టు తన ఉత్తర్వులపై తానే స్టే ఇచ్చుకోలేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లు, అంతకుమించి మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గుచూపకపోతే ఎఫ్‌ఈవోఏ చట్టం కింద వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తారు. మా చొరవ వల్లే..: బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం చొరవ కారణంగానే ముంబైలోని కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. మాల్యా లాంటి రుణఎగవేతదారులను అరికట్టేందుకు, చట్టం ముందు నిలబెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం(ఎఫ్‌ఈవోఏ)–2018 తీసుకొచ్చిందని వెల్లడించారు. అన్నింటికీ బీజేపీ గొప్పలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పారిపోయే ముందు మాల్యా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి అనుమతి తీసుకున్నారంది. ‘తమ వల్లే మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించిందని బీజేపీ నేతలు భావిస్తే అలాగే కానివ్వండి. మంగళ్యాన్, పోఖ్రాన్–1 అణుపరీక్షలు.. ఇలా అన్ని విషయాల్లో క్రెడిట్ అంతా తమదేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తామొచ్చాకే అన్నీ జరిగాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 2019, మే 26న భారత్ తన ఐదో బర్త్‌డే చేసుకోవాలి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వినోదాల కోసం రెండు నౌకలు మాల్యా అంటేనే విందు వినోదాలకు పెట్టింది పేరు. తరచూ భారీ పార్టీలు ఇస్తూ ఉంటారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు నౌకలనే కొనుగోలు చేశారు. హెలికాప్టర్లు కూడా దిగడానికి వీలుండే ఈ నౌకల్లో రెండు మెర్సెడెస్ కార్లను కూడా పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వాటిల్లో ఉండే సౌకర్యాలు ఒక్క మాటలో చెప్పలేం. బార్లు, జిమ్, వైద్యశాల, బ్యూటీ పార్లర్, సమావేశ మందిరాలు అన్నీ అందులోనే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీలను మాల్యా ఈ నౌకల్లోనే ఇచ్చారు. డచ్ షిప్‌యార్డ్‌కు చెందిన ఒక నౌకను మాల్యా 9.3 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సినీనటులు సర్ రిచర్డ్ బర్టన్, ఎలిజబెత్ టేలర్ వంటివారు వినియోగించిన క్లజిమా అనే మరో నౌక కూడా మాల్యాకు ఉంది. 1995లో సుమారు కోటి డాలర్లు పెట్టి దీన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ రెండు నౌకల్లో మాల్యా ఇచ్చే పార్టీలకు వీవీఐపీలు సైతం క్యూ కట్టేవారు. -
ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయమొద్దు
బ్యూనోస్ ఎయిర్స్: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల కేసుల్లో జీ–20 (గ్రూప్ ఆఫ్ 20) దేశాల మధ్య బలమైన, చురుకైన సహకారం ఉండాలని భారత్ కోరింది. దీనికి సంబంధించి 9 అంశాలతో కూడిన ఎజెండాను ప్రధాని మోదీ శుక్రవారం జీ–20 సదస్సులో ప్రవేశపెట్టారు. రెండ్రోజుల జీ–20 సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్లో జరుగుతుండటం తెలిసిందే. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను త్వరగా స్వదేశాలకు అప్పగించడం, ఇతర న్యాయపరమైన విషయాల్లో జీ–20 సభ్యదేశాల మధ్య సహకారం ఉండాలని ఈ ఎజెండాలో భారత్ పేర్కొంది. స్వదేశాల్లో భారీ ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఇతర దేశాల్లో నివసించేందుకు ఆయా దేశాలు అనుమతి ఇవ్వకుండా చూసేలా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంది. వివిధ దేశాల ఆర్థిక నిఘా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల మధ్య అత్యంత వేగంగా సమాచార మార్పిడి కోసం ఆర్థిక కార్యాచరణ దళం (ఎఫ్ఏటీఎఫ్)ను సహాయం తీసుకోవాలని సూచించింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను గుర్తించేందుకు, న్యాయప్రక్రియను పూర్తి చేసేందుకు, ఇతర దేశాలకు అప్పగించేందుకు ఓ నిర్దిష్టమైన ఉమ్మడి ప్రణాళిను ఎఫ్ఏటీఎఫ్ రూపొందించాలని కూడా భారత్ కోరింది. ఇతర దేశాలకు పారిపోయిన నేరగాళ్ల ఆస్తులు ఏ దేశంలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకునేలా ఓ వ్యవస్థ ఉండాలని కూడా భారత్ అభిప్రాయపడింది. హవాలా, ఉగ్రవాద సంస్థలకు నిధులు తదితర ఆర్థిక నేరాల కేసుల పరిష్కారం కోసం ఎఫ్ఏటీఎఫ్ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటుచేశారు. 12 ఏళ్ల తర్వాత తొలిసారి రష్యా, భారత్, చైనాల మధ్య 12 ఏళ్లలో తొలి, మొత్తంగా రెండో త్రైపాక్షిక సమావేశం శుక్రవారం జరిగింది. మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతోనూ భేటీ అయ్యారు. ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్థసహా పలు బహుళపక్ష సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో మూడు దేశాల మధ్య సహకారంపై వారు చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై పుతిన్, మోదీ, జిన్‌పింగ్‌లు చర్చించారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రనకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిపాలనను సరైన దిశలో నడిపించేందుకు, ప్రాంతీయంగా శాంతిని పరిరక్షించేందుకు కలిసి పనిచేయాలని మూడు దేశాలు నిర్ణయించాయి. ‘వుహన్’ తర్వాత పురోగతి జిన్‌పింగ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో మోదీ చైనాలోని వుహన్ నగరంలో అనధికారిక భేటీలో పాల్గొనడం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మంచి పురోగతి నమోదవుతోందని ఇరుదేశాధినేతలు తెలిపారు. వుహన్ భేటీ తర్వాత సంబంధాలు బాగున్నాయనీ, 2019లో మరింత బలపడే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీరు కలవడం ఇది నాలుగోసారి. అంతకుముందు ఎస్సీవో సదస్సు కోసం చైనాలోని చింగ్డావ్లో, బ్రిక్స్ సదస్సు సమయంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో వీరిద్దరూ కలిశారు. వచ్చే ఏడాది భారత్‌కు రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను మోదీ తాజాగా ఆహ్వానించారు. ఇలా తరచూ కలుస్తూ ఉండటం వల్ల సంబంధాలు చెడిపోకుండా ఉంటాయని ఆయన తెలిపారు. -
జెట్‌పై నేడు టాటా సన్స్ భేటీ..
ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు చేసే ప్రతిపాదనపై టాటా సన్స్ అంతర్గతంగా సమాలోచనలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్ చేసే ప్రతిపాదనపై చర్చించేందుకు టాటా సన్స్ బోర్డు శుక్రవారం సమావేశమవుతుంది‘ అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, టాటా సన్స్, జెట్ ఎయిర్వేస్ ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఊహాగానాలపై తాము స్పందించబోమని టాటా సన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ తమ సిబ్బందికి జీతాలివ్వడంలోనూ, లీజుకు తీసుకున్న విమానాల అద్దెలు చెల్లించడంలోనూ విఫలమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించింది. నిధుల సమీకరణలో భాగంగా 6 బోయింగ్ 777 విమానాలను విక్రయానికి ఉంచింది కూడా. విలీనానికి అంగీకరిస్తేనే? ఇప్పటికే విమానయాన సేవల వెంచర్స్ ఉన్న టాటా సన్స్.. తాజా పరిస్థితుల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసే ప్రయత్నాలపై దృష్టి సారించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరిట ఒక వెంచర్‌ను, మలేషియాకి చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి ఎయిర్ ఏషియా ఇండియా పేరిట మరో విమానయాన వెంచర్‌ను నిర్వహిస్తోంది. ఈ వెంచర్స్‌కి ఉపయోగపడేలా ఉంటే జెట్ ఎయిర్వేస్లో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వీటి ప్రకారం జెట్ ఎయిర్వేస్ను పూర్తిగా విలీనం చేసుకుంటే శ్రేయస్కరమని విస్తార మాతృసంస్థ టాటా–సింగపూర్ ఎయిర్‌లైన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయొచ్చు. దీనిలో జెట్ వైస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కుటుంబం, జెట్‌లో వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్, టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వాములుగా ఉంటారు. షేరు జూమ్.. టాటా సన్స్ టేకోవర్ వార్తల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేరు గురువారం దాదాపు 26 శాతం దాకా ఎగిసింది. బీఎస్ఈలో 24.5 శాతం పెరిగి రూ.320.95 వద్ద క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలో 26.41 శాతం ఎగిసి రూ. 326 వద్ద ముగిసింది. -
ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు సెబీ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్!
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల గురించి పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలలో అవగాహన పెంచడం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. ఫైనాన్షియల్ మార్కెట్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి నేరాలు చాలా వరకు సంక్లిష్టంగా ఉంటాయని, ఏజెన్సీలు వాటిని అర్థం చేసుకోవడం కొంత కష్టసాధ్యమని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఏజెన్సీలకు ఫైనాన్షియల్ క్రైమ్ గురించి వివరిస్తే.. అవి నేరాలను సమర్థంగా ఎదుర్కోడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ చర్య పోంజి స్కీమ్స్ వంటి తదితర క్యాపిటల్ మార్కెట్ సంబంధిత ఆర్థిక నేరాల త్వరితగతి పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా సెబీ తన సొంత సిబ్బందికి కూడా టెక్నికల్, బిహేవియరల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తోంది. -
బ్యాంకు ఖాతాలో రూ.50వేలు మాయం
బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు రాత్రికి రాత్రి మాయమయ్యాయి. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన శ్రీదేవి స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త కోనారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. స్థానిక ఆంధ్రా బ్యాంకులో శ్రీదేవి పేరిట ఖాతా ఉంది. ఆమె ఖాతాలో సోమవారం సాయంత్రం వరకు రూ.50వేలు ఉన్నాయి. అయితే, మంగళవారం ఉదయం చూసుకునేసరికి బ్యాలెన్స్ సున్నాగా కనిపించడంతో ఆమె కంగారుపడి అధికారులను సంప్రదించారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు రూ.2 వేల చొప్పున 25 సార్లు షాపింగ్ పోర్టల్ ద్వారా డ్రాచేసినట్లు తెలిసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.