సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్‌ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది.
ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు.
నకిలీ ఐఆర్‌ఎస్ అధికారిగా అవతారమెత్తి..
నకిలీ ఐఆర్‌ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్‌ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్‌ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి..
ఎన్నారై మహిళలను టార్గెట్‌గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్‌మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు.
ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్‌ను ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్‌పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్‌మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్‌పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఆ 18 మంది కోసం వేట ముమ్మరం
వెంకట్‌తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్‌డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్‌తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు.
వీరి కస్టమర్లు రామ్‌చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్‌రెడ్డి, సురే ష్, రామ్‌కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్‌అ జామ్, అమ్‌జద్‌ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment