సాక్షి ప్రతినిధి, గుంటూరు, పట్నంబజార్: అమెరికాలోని వాషింగ్టన్‌లో పనిచేసే పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన కర్నాటి సతీష్‌బాబు అలియాస్ సత్యకుమార్ తనకు పెళ్లి కాలేదని చెబుతూ అనేక మంది మహిళలను మోసం చేశాడు. ఈ క్రమంలో అతనికి బెంగళూరుకు చెందిన ఓ మహిళ ద్వారా గుంటూరు రవీంద్రనగర్‌కు చెందిన మహిళ పరిచయమైంది. ఈమె సతీష్‌ను ఇద్దరి కుటుంబ పెద్దల సమ్మతితో ఈ ఏడాది జూన్ 16న పెళ్లి చేసుకున్నారు. తరువాత హైదరాబాద్ వెళ్లి కేపీహెచ్‌బీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె సతీష్‌బాబు సెల్‌ఫోన్ పరిశీలించి, అందులో లావణ్య అనే మహిళతో పలుమార్లు చాటింగ్ చేసినట్టు గుర్తించి నిలదీసింది.
చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి
దీంతో లావణ్యను కూడా పెళ్లి చేసుకున్నానని అతను చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అతని తల్లిదండ్రులను ప్రశ్నించగా అదే సమాధానం ఎదురైంది. దీంతో సతీష్‌బాబు పై అనుమానం వచ్చిన ఆమె అతడి గురించి ఆరా తీసింది. అప్పటికే అతనికి చాలా పెళ్లిళ్లయ్యాయని, 2019, 2021 సంవత్సరాల్లో సతీష్‌పై కేసులు కూడా నమోదయ్యాయని యూట్యూబ్‌లో ఉన్న వీడియోల ద్వారా తెలుసుకుంది. అప్పటినుంచి సతీష్ ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. ఇంటి కోసం రుణం తీసుకోవాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. తన విషయాలు బయటపెడితే పడకగదిలో అశ్లీలంగా తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతోపాటు ఆమె వద్ద రూ.పది లక్షల వరకు దఫదఫాలుగా తీసుకుని సొంతానికి వాడుకున్నాడు. ఈ బాధలను భరించలేని బాధితురాలు ఎట్టకేలకు దిశ పోలీసులను ఆశ్రయించింది.
వివాహాలు వాస్తవమే!
మహిళ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా అతడికి ఆరు వివాహాలైన మాట వాస్తమేనని గుర్తించినట్లు సమాచారం. 2021లో ఓ మహిళ ఫిర్యాదుతో సతీష్‌పై కేసు నమోదైనట్టు గుర్తించారు. అప్పట్లో నమోదు చేసిన చార్జిషీటుపై, అప్పటి దర్యాప్తు తీరుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లోనే లక్షలాది రూపాయలు చేతులు మారినందున విచారణ పక్కదారి పట్టిందని సమాచారం.
అప్రమత్తమైన పోలీసులు
ప్రస్తుతం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నిందితుడి సెల్‌ఫోన్ సీజ్ చేసి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సతీష్‌బాబు ఆరు వివాహాలే చేసుకున్నాడా? లేదా ఇంకా మరికొంతమందిని కూడా మోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఆయా పెళ్లిళ్లల్లో కీలకంగా వ్యవహరించిన కొందరిని విచారించినట్లు తెలుస్తోంది. సతీష్‌బాబుకు గ్రీన్‌కార్డు ఉండటంతో పాస్‌పోర్టు రద్దుకు సిఫార్సులు చేస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment