బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగ్గొట్టి్ట లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లభించింది. రాజ ప్రాసాదాలను తలపించే భవంతులు, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఎస్టేట్‌లు, సకల సౌకర్యాలున్న విమానాలు, విలాసవంతమైన నౌకలు, రేసు కార్లు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాల్యాకున్న ఆస్తులు కోకొల్లలు. మాల్యా స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఈడీ ఒక జాబితా రూపొందించింది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, భవంతులను గుర్తించింది.
ఈడీ జప్తు చేయడానికి రూపొందించిన జాబితా ఇదే.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల విలువ చేసే భూము లు, ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. మొత్తం 3.09 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది.
కర్ణాటక: బెంగళూరులో మాల్స్, మరో నాలుగు గ్రామాల్లో భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.1,937.5 కోట్లుగా ఉంది. బెంగళూరులో యూబీ సిటీ మాల్ విలువ రూ.713 కోట్ల వరకు ఉంటుంది. అలాగే రూ.962 కోట్లతో కింగ్‌ఫిషర్ టవర్ నిర్మాణంలో ఉంది.
మహారాష్ట్ర: ముంబై, ఆలిబాగ్‌లో ఫామ్ హౌస్‌లున్నాయి. వాటి ఖరీదు రూ.28.02 కోట్లకుపైమాటే.
తమిళనాడు: వెల్లూరు జిల్లాలో భూముల విలువ రూ. 1.14 కోట్ల వరకూ ఉంటుంది.
ఇవే కాక వివిధ కంపెనీల్లో మాల్యాకు షేర్లు ఉన్నాయి. యూబీఎల్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువరూ. 8,758 కోట్లు కాగా, యూఎస్‌ఎల్‌లో రూ.1,692 కోట్లు, యూబీహెచ్‌ఎల్ రూ.27 కోట్లు, మెక్‌డొవెల్ రూ.10 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఈడీ జాబితాలో తెలిపింది.
ఈడీ జాబితాలో లేనివి మరికొన్ని..
ప్రపంచవ్యాప్తంగా మాల్యాకు ఎస్టేట్‌లు, భవనాలు మొత్తం రెండు డజన్లకుపైగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో 11వేల చ.అ.విస్తీర్ణంలో ఎస్టేట్ ఉంది. దీని విలువ 12 లక్షల డాలర్లు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాతిగాంచిన ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్, దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ సమీపంలో 12,000 హెక్టార్లలో విస్తరించిన మబూలా గేమ్‌లాడ్జ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎస్టేట్, ఫ్రాన్స్‌లోని రివిరా పట్టణానికి సమీపంలోని లగ్జరీ ఎస్టేట్, భారత్‌లోని కర్ణాటకలో కునిగల్ పట్టణం దగ్గర 400 ఎకరాల్లో విస్తరించిన గుర్రపు శాల(స్టడ్ ఫామ్), గోవాలో రాజభవంతిని తలపించే కింగ్‌ఫిషర్ విల్లా వంటి స్థిరాస్తులు మాల్యా సొంతం.
సొంత పనులకు 4 విమానాలు
కింగ్‌ఫిషర్ వంటి విమానయాన సంస్థను నడిపించిన ప్రముఖ వ్యక్తికి తనకంటూ సొంతంగా విమానం ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మాల్యా ఎక్కడికి వెళ్లాలన్నా సరే విమానంలోనే వెళ్లేవారు. మొత్తం నాలుగు విమానాలను ఆయన వినియోగించేవారు. ప్రపంచంలోని తనకున్న ఎస్టేట్‌లలో ఎక్కడికి వెళ్లాలన్నా బోయింగ్ 727 రకం విమానాన్ని వాడేవారు. మాల్యా దగ్గరున్న ఎయిర్‌బస్ ఏ319 విమానం లండన్ నుంచి అమెరికాకు ఒకే ఒక్క హాల్ట్‌తో ప్రయాణించగలదు. ఇక హాకర్ హెచ్‌ఎస్125, గల్ఫ్ స్ట్రీమ్ త్రీ అనే మరో రెండు విమానాలు కూడా ఎప్పడూ మాల్యా కోసం సిద్ధంగా ఉండేవి. తన అభిరుచికి తగ్గట్టుగా ఆ విమానంలో ఆయన సకల అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విజయ్ మాల్యా వద్ద చాలా ఉన్నాయి.
బెంగళూరులోని యూబీ సిటీ మాల్
Comments
Please login to add a commentAdd a comment