విజయ్ మాల్యా నేరస్తుడే..!
♦ ప్రకటించిన ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు
♦ 30 రోజుల్లోగా ఈడీ ముందు హాజరుకావాల్సిందే..!
ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేయడంతోపాటు.. బ్రిటన్‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మరో అడుగుముందుకేసింది. ఈడీ వినతి మేరకు ఇక్కడి ప్రత్యేక మనీల్యాండరింగ్ నేరాల విచారణ(పీఎంఎల్‌ఏ) కోర్టు మాల్యాను మంగళవారం ప్రకటిత నేరస్తుడిగా నిర్ధారించింది. ఐడీబీఐ బ్యాంకుకురూ.900 కోట్ల రుణ బకాయిలను ఎగవేసిన కేసులో మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
మాల్యాపై పీఎంఎల్‌ఏ చట్టం కింద నాన్ బెయిలబుల్ వారెంట్‌తోపాటు చెక్ బౌన్స్ తదితర కేసుల్లో కూడా అనేక అరెస్ట్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మాల్యాను ప్రకటిత నేరస్తుడిగా పేర్కొంటూ పీఎంఎల్‌ఏ కోర్టు ప్రత్యేక జడ్జి పీఆర్ భావ్కే ఆదేశాలు జారీ చేశారు. తమ దర్యాప్తు ప్రస్తుత పరిస్థితిని కోర్టుకు వివరించిన ఈడీ... మాల్యాను వ్యక్తిగతంగా విచారించాల్సిందేనని ఈ సందర్భంగా తెలిపింది.
ప్రకటిత నేరస్తుడంటే...
క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తిని ప్రకటిత నేరస్తుడిగా కోర్టు నిర్ధారించవచ్చు. ఇదివరకే అరెస్ట్ వారెంట్లు జారీచేసినప్పటికీ.. దాన్ని ఆ వ్యక్తి పట్టించుకోకపోవడం, పరారైపోవడం, ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాక్కోవడం వంటి సందర్భాల్లో కోర్టు ఈ చర్యలు తీసుకుంటుంది. సీఆర్‌పీసీలోని సెక్షన్ 82 ప్రకారం కోర్టు ప్రకటిత నేరస్తుడిగా రాతపూర్వక ఆదేశాలు జారీచేయవచ్చు. ఆ తర్వాత నిందితుడు 30 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ చెప్పినట్లుగా నిర్దేశిత సమయంలో, నిర్ధేశిత ప్రదేశంలో కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు మాల్యా కేసులో ఈడీ తదుపరి చర్యలకు ఉపక్రమించనుంది. మరోపక్క, సెక్షన్ 82 ప్రకారం తమ ఆదేశాలను గనుక పాటించకపోతే... సీఆర్‌పీసీలోని సెక్షన్ 83 ప్రకారం కూడా(పరారీలో ఉన్న వ్యక్తి ఆస్తులను జప్తు చేయడం) ఈడీ చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, గత శనివారం ఈడీ మాల్యాతో పాటు ఆయన కంపెనీలకు చెందిన రూ.1,411 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ‘మాల్ట్’ అస్త్రం..
ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్ల ఎగవేతతో పాటు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్షార్షియంకు మాల్యా, ఆయన ప్రమోటర్‌గా ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్లకుపైగానే(వడ్డీతో కలిపి) బకాయి పడ్డాయి. దీంతో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా కూడా ఇప్పటికే బ్యాంకులు ప్రకటించాయి. మనీల్యాండరింగ్ ఇతరత్రా కేసుల భయంతో మాల్యా ఈ ఏడాది మార్చి 2న చడీచప్పుడుకాకుండా బ్రిటన్‌కు పరారయ్యాడు. గతేడాది మాల్యాపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మాల్యా, మరికొందరిపై మనీల్యాండరింగ్ కేసును దాఖలు చేసింది. ఆయనను విచారించడం కోసం భారత్‌కు రప్పించేందుకు చట్టపరంగా చర్యలు ప్రారంభించింది.
మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేయించింది. మరోపక్క, మాల్యాను అరెస్ట్ చేయించేందుకు ఇంటర్‌పోల్ వారెంట్‌ను జారీచేయించాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇతర ప్రత్యామ్నాయాలపై ఈడీ దృష్టిపెట్టింది. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక న్యాయ సహకార ఒప్పందం(ఎంఏఎల్‌టీ-మాల్ట్) అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రభుత్వాన్ని ఈడీ కోరుతోంది. నేరస్తుల అప్పగింతలో భాగంగా మాల్యాను ఇక్కడికి రప్పించొచ్చని భావిస్తోంది. ఇప్పుడు ప్రకటిత నేరస్తుడిగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ ఈ దిశగా చర్యలను వేగవంతం చేయనుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.