pmla court
-
జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి
లక్నో: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఇదివరకే రెండు కేసులు నమోదు కాగా, ఆమె విచారణకు హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. -
‘జెట్ ఎయిర్వేస్’ నరేశ్ గోయల్ అరెస్ట్
ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్(74)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద.. ముంబైలో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. జెట్ ఎయిర్ కోసం కెనరా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.848.86 కోట్ల రుణాలను దారి మళ్లించి స్వాహా చేశారని సీబీఐ ఇంతకు ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ గోయల్‌ను ప్రశ్నించి.. అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. గోయల్‌ను శనివారం ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశ పెట్టి..ఈడీ అధి కారులు ఆయన కస్టడీ కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనూహ్యంగా.. దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్.. భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. ఆపై బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంనది. ఇక జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో అడ్డగింత.. తనిఖీలు.. జెట్ ఎయిర్వేస్ సర్వీస్‌లు నిలిచిపోయాక.. 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. ఆ టైంలో నరేష్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇక.. విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేష్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన్ని ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అటు నుంచి అటే అదుపులోకి తీసుకున్నారు. -
ఎట్టకేలకు మాజీ మంత్రికి బెయిల్, కానీ..
ముంబై: మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు మంగళవారం(ఇవాళ) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తులపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది బాంబే హైకోర్టు. అయితే.. ఈ ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ఈడీ కోరింది. దీంతో.. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు ఈడీకి వీలుగా బెయిల్ ఆర్డర్ అక్టోబర్ 13 నుంచి అమల్లోకి వస్తుందని హైకోర్టు పేర్కొంది. అయితే.. బెయిల్ లభించినప్పటికీ ఆయన బయటకు రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఏప్రిల్‌లో సీబీఐ ఆయనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2019-21 మధ్య హోం మంత్రి పదవిలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందటి ఏడాది నవంబర్‌లో మనీల్యాండరింగ్ ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఏడాది మొదట్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. 72 ఏళ్ల అనిల్ దేశ్‌ముఖ్ వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తొలుత హైకోర్టు ఈ అభ్యర్థనలపై స్పందించకపోవడంతో.. సుప్రీంకు వెళ్లారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. ఆరు నెలలుగా విచారణకు సైతం స్వీకరించకుండా అభ్యర్థ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచినందుకు సుప్రీం కోర్టు.. బాంబే హైకోర్టును మందలించింది. అధికారం అండతో.. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి అక్రమంగా రూ.4.7 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు అనిల్ దేశ్‌ముఖ్‌పై ఉన్నాయి. ఈ మేరకు ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలంతో సీబీఐ, అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి కేసును నమోదు చేయగా.. ఆ వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. -
Patra Chawl Scam: ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్
సాక్షి, ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది ముంబై స్పెషల్ కోర్టు. ఆగష్టు 4వ తేదీవరకు ఆయన్ని కస్టడీకి అనుమతిస్తూ సోమవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. పత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ని దర్యాప్తు విభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సోమవారం వైద్య పరీక్షల అనంతరం ముంబై పీఎంఎల్ఏ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టింది. నాలుగుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఏజెన్సీ ముందు ఆయన ఒక్కసారే హాజరయ్యాడని, ఈ గ్యాప్‌లో ఆయన ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశాడని, కీలక సాక్షిని ప్రభావితం చేయాలని చూశారని ఈడీ కోర్టులో వాదించింది. ఈ మేరకు 8 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని కోరింది. మరోవైపు సంజయ్ రౌత్ తరపు న్యాయవాది అశోక్ ముండార్గి ఈ అరెస్ట్‌ను.. రాజకీయ కుట్రగా న్యాయస్థానానికి నివేదించారు. రాజకీయ కోణంలో ఈ అరెస్ట్జరిగిందని, ఆయనకు గుండె సమస్య ఉందని, ఈ మేరకు సర్జరీ కూడా జరిగిందని చెబుతూ.. కోర్టుకు పత్రాలు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. చివరికి సంజయ్ రౌత్‌కు ఆగష్టు 4వ తేదీ వరకు రిమాండ్‌కు అనుమతించింది. నాలుగు రోజుల కస్టడీతో పాటు ఇంటి భోజనానికి ఆయన్ని అనుమతించాలని ఈడీని ఆదేశించింది కోర్టు. చదవండి: సంజయ్ రౌత్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది- నవనీత్‌కౌర్ -
నవాబ్ మాలిక్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌పై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలున్నాయని నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో బుధవారం అరెస్టైన నవాబ్ మాలిక్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేసేందుకు అవసరమైన సమయం కావాలని, ఈకేసు దర్యాప్తు నిమిత్తం ఆయన పోలీసు కస్టడీకి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆర్.ఎన్.రొకడే శుక్రవారం తెలిపారు. పీఎంఎల్ఏ కోర్టు నవాబ్ మాలిక్‌కు మార్చి 3 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి బుధవారం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన అక్రమ నగదు చలామణీ కార్యకలాపాల్లో నవాబ్ మాలిక్‌కు సంబంధాలున్నాయని బుధవారం ఈడీ అరెస్టు చేసింది. అయితే కేసు కీలక విచారణకు సంబంధించి నిందితులు సహకరించలేదని కోర్టు ఉత్తుర్వుల్లో పేర్కొంటూ మార్చి 3 వరకు నవాబ్ మాలిక్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నందున కేసు వెనుక అసలు వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ నిమిత్తం నవాబ్ మాలిక్‌ను కస్టడీకి అప్పగించడం తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేరం జరిగి 20 ఏళ్లు దాటినందున సరైన దిశలో నేరాన్ని దర్యాప్తు చేసేందుకు కొంత సమయం కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కడుపునొప్పితో మాలిక్ ఆస్పత్రిలో చేరిక రెండ్రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన రాష్ట్రమంత్రి, ఎన్సీపీ సీనియర్‌నేత నవాబ్ మాలిక్ తీవ్రమైన కడుపునొప్పితో శుక్రవారం జేజే ఆస్పత్రిలో చేరారు. అయితే శుక్రవారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో తనకు కడుపు నొప్పి వస్తుందని, మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులెదుర్కొం టున్నట్లు ఈడీ అధికారులకు నవాబ్ మాలిక్ చెప్పడంతో వెంటనే ఈడీ అధికారలు ఆయనను నగరంలోని జేజే ఆస్పత్రికి తరలించి, యూరాలజీ విభాగంలో చేర్పించారు. ఈ మేరకు మాలిక్ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. (క్లిక్: మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?) అది సీఎం అభీష్టమే: సంజయ్ రౌత్ అక్రమ నగదు చలామణీ కేసులో రెండ్రోజుల క్రితం నవాబ్ మాలిక్ అరెస్టైన నేపథ్యంలో ఆయన చేసిన రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పూర్తి వ్యక్తిగత నిర్ణయమని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసిన తర్వాత రాష్ట్ర బీజేపీ ఆయనపై విరుచుకుపడుతోంది. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని, అవసరమైతే ఆయన రాజీనామాను ఆమోదించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ శుక్రవారం నగరంలోని విలేకరులతో మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో కీలుబొమ్మలుగా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మంత్రివర్గంలోని మంత్రి రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. అయితే నవాబ్ మాలిక్ రాజీనామాను సంకీర్ణ కూటమిలోని ఎన్పీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. భివండీలో నిరసనలు.. భివండీ: రాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్ అరెస్టు పట్ల భివండీ శుక్రవారం అట్టుడికిపోయింది. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ మహావికాస్ ఆఘాడీకి చెందిన నాయకులు భివండీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈడీ చర్యను వ్యతిరేకిస్తూ ప్రాంత్కార్యాలయం ఎదురుగా ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలో శివసేన పట్టణ ప్రముఖులు సుభాష్ మానే, భివండీ పట్టణ ఎన్సీపీ అధ్యక్షుడు షోయబ్ ఖాన్ గుడ్డు, మహిళా అధ్యక్షురాలు స్వాతి కాంబ్లే, భివండీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రషీద్ తాహిర్ మోమిన్, పాటు శామ్ పాటిల్, మధన్ బోయ్, మహేంద్ర కుంబారే, కోమల్ పాటిల్, రాణి అగ్రవాల్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. (చదవండి: బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?) -
ఐసీఐసీఐ స్కాం : చందా కొచర్‌కు ఊరట
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణా కుంభకోణంకేసులో ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు చందా కొచర్‌కు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు 5 లక్షల రూపాయల పూచీకత్తుతో కొచ్చర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచర్,ఆమె భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఐసీఐసీఐ స్కాంలో చందా కొచర్ వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యాకు మరో షాక్
సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా(63)కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు పీఎంఎల్ఏ ముంబై కోర్టు అనుమతినిచ్చింది. రూ.13వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయనుంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఈ ఆస్తులను వేలం వేయనుంది. అయితే జనవరి 18 తరువాత మాత్రమే ఈ ఆదేశాలను పాటించాలని కూడా కోర్టు వెల్లడించింది. దీనిపై సంబంధిత పార్టీలు ఈ ఆదేశాలపై బొంబాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది. సీజ్ చేసిన ఆస్తుల లిక్విడేషన్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా 2016 మార్చిలో లండన్‌కు పారిపోయాడు. 2017లో అరెస్ట్ అయిన ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్నాడు. మాల్యాను భారత్‌కు రప్పించేదుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ చట్ట ప్రకారం మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్ఏ కోర్టు గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నీరవ్ ఎఫెక్ట్ : చోక్సీ కొత్త రాగం
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలకనిందితుడు, గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీ (60) రోగాల రాగం అందుకుని పీఎంఏల్‌ఏ కోర్టు కొత్త అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆర్థిక నేరస్తుడు చోక్సీని ఆంటిగ్వా నుంచి తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ముంబైలోని మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కోర్టులో కొత్తగా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కారణంగాను తాను విచారణకు రాలేనని కోర్టును కోరాడు. ఇటీవల పీఎన్బీ స్కాంలో మరో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఇటీవల లండన్‌లో అరెస్టు చేయడంతోపాటు బెయిల్ నిరాకరించి జైలుకు తరలించిన నేపథ్యంలో తనకు కూడా అరెస్ట్ తప్పదని భావించిన ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సి చోక్సీ ఈ చర్యకు దిగాడు. తాను దీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ ముంబై కోర్టును ఆశ్రయించాడు. ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధి, కాలిలో తీవ్రమైన నొప్పి, మెదడులో గడ్డ తదితర రుగ్మతలతో బాధపడుతున్నానని పేర్కొన్నాడు. కాగా గతంలో కూడా ఆంటిగ్వానుంచి 41గంటలపాటు విమానంలో ప్రయాణించి ఇండియాలో కోర్టు విచారణకు హాజరు కాలేననీ, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని కోర్టుకు విన్నవించు కున్నాడు. తాజాగా మరోసారి విచారణకు ముఖం చాటేస్తూ కోర్టుకు దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. బ్యాంకింగ్ రంగంలోఅతిపెద్ద కుంభకోణంగా పేరొందిన రూ.13వేల కోట్ల పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీకి మేనమామ మెహుల్ చోక్సీ. వేలకోట్ల రూపాయల మేర బ్యాకులకు ఎగనామం పెట్టిన చోక్సీ విదేశాలకు పారిపోయాడు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ చార్జి షీట్లను దాఖలు చేసాయి. అలాగే చోక్సీ పాస్‌పోర్టును రద్దు చేయడతోపాటు ఇంటర్ పోల్ నోటీసు కూడా జారీ అయింది. ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వంతో అక్కడ తలదాచున్న సంగతి తెలిసిందే. -
మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన ముంబై కోర్టు
-
విలాసాలకు మారుపేరు
బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగ్గొట్టి్ట లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లభించింది. రాజ ప్రాసాదాలను తలపించే భవంతులు, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఎస్టేట్లు, సకల సౌకర్యాలున్న విమానాలు, విలాసవంతమైన నౌకలు, రేసు కార్లు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాల్యాకున్న ఆస్తులు కోకొల్లలు. మాల్యా స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఈడీ ఒక జాబితా రూపొందించింది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, భవంతులను గుర్తించింది. ఈడీ జప్తు చేయడానికి రూపొందించిన జాబితా ఇదే.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల విలువ చేసే భూము లు, ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. మొత్తం 3.09 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది. కర్ణాటక: బెంగళూరులో మాల్స్, మరో నాలుగు గ్రామాల్లో భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.1,937.5 కోట్లుగా ఉంది. బెంగళూరులో యూబీ సిటీ మాల్ విలువ రూ.713 కోట్ల వరకు ఉంటుంది. అలాగే రూ.962 కోట్లతో కింగ్‌ఫిషర్ టవర్ నిర్మాణంలో ఉంది. మహారాష్ట్ర: ముంబై, ఆలిబాగ్లో ఫామ్ హౌస్‌లున్నాయి. వాటి ఖరీదు రూ.28.02 కోట్లకుపైమాటే. తమిళనాడు: వెల్లూరు జిల్లాలో భూముల విలువ రూ. 1.14 కోట్ల వరకూ ఉంటుంది. ఇవే కాక వివిధ కంపెనీల్లో మాల్యాకు షేర్లు ఉన్నాయి. యూబీఎల్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువరూ. 8,758 కోట్లు కాగా, యూఎస్‌ఎల్‌లో రూ.1,692 కోట్లు, యూబీహెచ్ఎల్ రూ.27 కోట్లు, మెక్‌డొవెల్ రూ.10 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఈడీ జాబితాలో తెలిపింది. ఈడీ జాబితాలో లేనివి మరికొన్ని.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకు ఎస్టేట్లు, భవనాలు మొత్తం రెండు డజన్లకుపైగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో 11వేల చ.అ.విస్తీర్ణంలో ఎస్టేట్ ఉంది. దీని విలువ 12 లక్షల డాలర్లు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాతిగాంచిన ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్, దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ సమీపంలో 12,000 హెక్టార్లలో విస్తరించిన మబూలా గేమ్లాడ్జ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎస్టేట్, ఫ్రాన్స్‌లోని రివిరా పట్టణానికి సమీపంలోని లగ్జరీ ఎస్టేట్, భారత్‌లోని కర్ణాటకలో కునిగల్ పట్టణం దగ్గర 400 ఎకరాల్లో విస్తరించిన గుర్రపు శాల(స్టడ్ ఫామ్), గోవాలో రాజభవంతిని తలపించే కింగ్‌ఫిషర్ విల్లా వంటి స్థిరాస్తులు మాల్యా సొంతం. సొంత పనులకు 4 విమానాలు కింగ్‌ఫిషర్ వంటి విమానయాన సంస్థను నడిపించిన ప్రముఖ వ్యక్తికి తనకంటూ సొంతంగా విమానం ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మాల్యా ఎక్కడికి వెళ్లాలన్నా సరే విమానంలోనే వెళ్లేవారు. మొత్తం నాలుగు విమానాలను ఆయన వినియోగించేవారు. ప్రపంచంలోని తనకున్న ఎస్టేట్లలో ఎక్కడికి వెళ్లాలన్నా బోయింగ్ 727 రకం విమానాన్ని వాడేవారు. మాల్యా దగ్గరున్న ఎయిర్‌బస్ ఏ319 విమానం లండన్ నుంచి అమెరికాకు ఒకే ఒక్క హాల్ట్‌తో ప్రయాణించగలదు. ఇక హాకర్ హెచ్ఎస్125, గల్ఫ్ స్ట్రీమ్ త్రీ అనే మరో రెండు విమానాలు కూడా ఎప్పడూ మాల్యా కోసం సిద్ధంగా ఉండేవి. తన అభిరుచికి తగ్గట్టుగా ఆ విమానంలో ఆయన సకల అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విజయ్ మాల్యా వద్ద చాలా ఉన్నాయి. బెంగళూరులోని యూబీ సిటీ మాల్ -
విజయ్ మాల్యా.. పరారైన నేరగాడే
ముంబై: భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు మరోషాక్ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది డి.ఎన్.సింగ్ వాదిస్తూ.. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని తెలిపారు. అక్కడి న్యాయస్థానం సైతం మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ విజయ్‌మాల్యా మాత్రం భారత్‌కు రావడం ఇష్టపడటం లేదనీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని మాల్యా లాయర్లు ఖండించారు. చట్టప్రకారం మాల్యా లండన్ కోర్టు ముందు లొంగిపోయారనీ, ఆతర్వాత బెయిల్ పొందారని కోర్టుకు చెప్పారు. ఫోర్స్ ఇండియా జట్టు డైరెక్టర్ హోదాలో వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ సమావేశంలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లారని, ఈడీ చెబుతున్నట్లు మాల్యా రహస్యంగా వెళ్లలేదని తెలిపారు. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ ఇరుపక్షాల వాదనలు విన్న అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు జడ్జి ఎం.ఎస్.అజ్మీ స్పందిస్తూ.. ‘ఎఫ్ఈవో చట్టంలోని సెక్షన్ 12(ఐ) కింద ఈడీ చేసిన దరఖాస్తును పాక్షికంగా మన్నిస్తున్నాం. విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆస్తుల జప్తు ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది’ అని ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే మాల్యా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు తీర్పు పూర్తి కాపీని అందుకునేందుకు, ఎగువ కోర్టులో అప్పీలుకు వీలుగా ఈ ఆదేశాలపై 4 వారాల స్టే ఇవ్వాలన్నారు. దీంతో ఎఫ్ఈవో చట్టం కింద పనిచేస్తున్న కోర్టు తన ఉత్తర్వులపై తానే స్టే ఇచ్చుకోలేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లు, అంతకుమించి మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గుచూపకపోతే ఎఫ్‌ఈవోఏ చట్టం కింద వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తారు. మా చొరవ వల్లే..: బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం చొరవ కారణంగానే ముంబైలోని కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. మాల్యా లాంటి రుణఎగవేతదారులను అరికట్టేందుకు, చట్టం ముందు నిలబెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం(ఎఫ్‌ఈవోఏ)–2018 తీసుకొచ్చిందని వెల్లడించారు. అన్నింటికీ బీజేపీ గొప్పలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పారిపోయే ముందు మాల్యా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి అనుమతి తీసుకున్నారంది. ‘తమ వల్లే మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించిందని బీజేపీ నేతలు భావిస్తే అలాగే కానివ్వండి. మంగళ్యాన్, పోఖ్రాన్–1 అణుపరీక్షలు.. ఇలా అన్ని విషయాల్లో క్రెడిట్ అంతా తమదేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తామొచ్చాకే అన్నీ జరిగాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 2019, మే 26న భారత్ తన ఐదో బర్త్‌డే చేసుకోవాలి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వినోదాల కోసం రెండు నౌకలు మాల్యా అంటేనే విందు వినోదాలకు పెట్టింది పేరు. తరచూ భారీ పార్టీలు ఇస్తూ ఉంటారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు నౌకలనే కొనుగోలు చేశారు. హెలికాప్టర్లు కూడా దిగడానికి వీలుండే ఈ నౌకల్లో రెండు మెర్సెడెస్ కార్లను కూడా పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వాటిల్లో ఉండే సౌకర్యాలు ఒక్క మాటలో చెప్పలేం. బార్లు, జిమ్, వైద్యశాల, బ్యూటీ పార్లర్, సమావేశ మందిరాలు అన్నీ అందులోనే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీలను మాల్యా ఈ నౌకల్లోనే ఇచ్చారు. డచ్ షిప్‌యార్డ్‌కు చెందిన ఒక నౌకను మాల్యా 9.3 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సినీనటులు సర్ రిచర్డ్ బర్టన్, ఎలిజబెత్ టేలర్ వంటివారు వినియోగించిన క్లజిమా అనే మరో నౌక కూడా మాల్యాకు ఉంది. 1995లో సుమారు కోటి డాలర్లు పెట్టి దీన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ రెండు నౌకల్లో మాల్యా ఇచ్చే పార్టీలకు వీవీఐపీలు సైతం క్యూ కట్టేవారు. -
కొత్త ఆర్డినెన్స్ : విజయ్ మాల్యాకు సమన్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు భారీ రుణ ఎగవేత దారుడు, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా మాల్యాకు సమన్లు జారీ చేసింది. భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27న, లేదా అంతకుముందు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లేదంటే ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం రుణదాతల "అన్ని లింక్డ్ ఆస్తులను" స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్ తరువాత ఈడీ తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ పై చర్యలకు ఈడీ సిద్ధం కానుంది. మరోవైపు మాల్యా బేరానికి దిగొచ్చారన్న వార్తలపై మాల్యా నేడు(శనివారం) స్పందించారు. తనది బేరమైతే..ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఈడీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన ఈడీ అధికారులు ముందు ఈడీ ఛార్జ్‌షీట్ చదవాలని సలహా యిచ్చారు. అదే నిజమైతే ఈడీ అధికారులుకూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే తనఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానంటూ మాల్యా ట్వీట్ చేశారు. -
విజయ్ మాల్యా నేరస్తుడే..!
♦ ప్రకటించిన ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ♦ 30 రోజుల్లోగా ఈడీ ముందు హాజరుకావాల్సిందే..! ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేయడంతోపాటు.. బ్రిటన్‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మరో అడుగుముందుకేసింది. ఈడీ వినతి మేరకు ఇక్కడి ప్రత్యేక మనీల్యాండరింగ్ నేరాల విచారణ(పీఎంఎల్ఏ) కోర్టు మాల్యాను మంగళవారం ప్రకటిత నేరస్తుడిగా నిర్ధారించింది. ఐడీబీఐ బ్యాంకుకురూ.900 కోట్ల రుణ బకాయిలను ఎగవేసిన కేసులో మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మాల్యాపై పీఎంఎల్ఏ చట్టం కింద నాన్ బెయిలబుల్ వారెంట్‌తోపాటు చెక్ బౌన్స్ తదితర కేసుల్లో కూడా అనేక అరెస్ట్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మాల్యాను ప్రకటిత నేరస్తుడిగా పేర్కొంటూ పీఎంఎల్ఏ కోర్టు ప్రత్యేక జడ్జి పీఆర్ భావ్కే ఆదేశాలు జారీ చేశారు. తమ దర్యాప్తు ప్రస్తుత పరిస్థితిని కోర్టుకు వివరించిన ఈడీ... మాల్యాను వ్యక్తిగతంగా విచారించాల్సిందేనని ఈ సందర్భంగా తెలిపింది. ప్రకటిత నేరస్తుడంటే... క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తిని ప్రకటిత నేరస్తుడిగా కోర్టు నిర్ధారించవచ్చు. ఇదివరకే అరెస్ట్ వారెంట్లు జారీచేసినప్పటికీ.. దాన్ని ఆ వ్యక్తి పట్టించుకోకపోవడం, పరారైపోవడం, ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాక్కోవడం వంటి సందర్భాల్లో కోర్టు ఈ చర్యలు తీసుకుంటుంది. సీఆర్పీసీలోని సెక్షన్ 82 ప్రకారం కోర్టు ప్రకటిత నేరస్తుడిగా రాతపూర్వక ఆదేశాలు జారీచేయవచ్చు. ఆ తర్వాత నిందితుడు 30 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ చెప్పినట్లుగా నిర్దేశిత సమయంలో, నిర్ధేశిత ప్రదేశంలో కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు మాల్యా కేసులో ఈడీ తదుపరి చర్యలకు ఉపక్రమించనుంది. మరోపక్క, సెక్షన్ 82 ప్రకారం తమ ఆదేశాలను గనుక పాటించకపోతే... సీఆర్పీసీలోని సెక్షన్ 83 ప్రకారం కూడా(పరారీలో ఉన్న వ్యక్తి ఆస్తులను జప్తు చేయడం) ఈడీ చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, గత శనివారం ఈడీ మాల్యాతో పాటు ఆయన కంపెనీలకు చెందిన రూ.1,411 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘మాల్ట్’ అస్త్రం.. ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్ల ఎగవేతతో పాటు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్షార్షియంకు మాల్యా, ఆయన ప్రమోటర్‌గా ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్లకుపైగానే(వడ్డీతో కలిపి) బకాయి పడ్డాయి. దీంతో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా కూడా ఇప్పటికే బ్యాంకులు ప్రకటించాయి. మనీల్యాండరింగ్ ఇతరత్రా కేసుల భయంతో మాల్యా ఈ ఏడాది మార్చి 2న చడీచప్పుడుకాకుండా బ్రిటన్‌కు పరారయ్యాడు. గతేడాది మాల్యాపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మాల్యా, మరికొందరిపై మనీల్యాండరింగ్ కేసును దాఖలు చేసింది. ఆయనను విచారించడం కోసం భారత్‌కు రప్పించేందుకు చట్టపరంగా చర్యలు ప్రారంభించింది. మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేయించింది. మరోపక్క, మాల్యాను అరెస్ట్ చేయించేందుకు ఇంటర్‌పోల్ వారెంట్‌ను జారీచేయించాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇతర ప్రత్యామ్నాయాలపై ఈడీ దృష్టిపెట్టింది. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక న్యాయ సహకార ఒప్పందం(ఎంఏఎల్టీ-మాల్ట్) అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రభుత్వాన్ని ఈడీ కోరుతోంది. నేరస్తుల అప్పగింతలో భాగంగా మాల్యాను ఇక్కడికి రప్పించొచ్చని భావిస్తోంది. ఇప్పుడు ప్రకటిత నేరస్తుడిగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ ఈ దిశగా చర్యలను వేగవంతం చేయనుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.