ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌పై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలున్నాయని నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టు పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో బుధవారం అరెస్టైన నవాబ్ మాలిక్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేసేందుకు అవసరమైన సమయం కావాలని, ఈకేసు దర్యాప్తు నిమిత్తం ఆయన పోలీసు కస్టడీకి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆర్.ఎన్.రొకడే శుక్రవారం తెలిపారు. పీఎంఎల్‌ఏ కోర్టు నవాబ్ మాలిక్‌కు మార్చి 3 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి బుధవారం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన అక్రమ నగదు చలామణీ కార్యకలాపాల్లో నవాబ్ మాలిక్‌కు సంబంధాలున్నాయని బుధవారం ఈడీ అరెస్టు చేసింది. అయితే కేసు కీలక విచారణకు సంబంధించి నిందితులు సహకరించలేదని కోర్టు ఉత్తుర్వుల్లో పేర్కొంటూ మార్చి 3 వరకు నవాబ్ మాలిక్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నందున కేసు వెనుక అసలు వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ నిమిత్తం నవాబ్ మాలిక్‌ను కస్టడీకి అప్పగించడం తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేరం జరిగి 20 ఏళ్లు దాటినందున సరైన దిశలో నేరాన్ని దర్యాప్తు చేసేందుకు కొంత సమయం కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
కడుపునొప్పితో మాలిక్ ఆస్పత్రిలో చేరిక
రెండ్రోజుల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన రాష్ట్రమంత్రి, ఎన్సీపీ సీనియర్‌నేత నవాబ్ మాలిక్ తీవ్రమైన కడుపునొప్పితో శుక్రవారం జేజే ఆస్పత్రిలో చేరారు. అయితే శుక్రవారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో తనకు కడుపు నొప్పి వస్తుందని, మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులెదుర్కొం టున్నట్లు ఈడీ అధికారులకు నవాబ్ మాలిక్ చెప్పడంతో వెంటనే ఈడీ అధికారలు ఆయనను నగరంలోని జేజే ఆస్పత్రికి తరలించి, యూరాలజీ విభాగంలో చేర్పించారు. ఈ మేరకు మాలిక్ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. (క్లిక్: మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?)
అది సీఎం అభీష్టమే: సంజయ్ రౌత్
అక్రమ నగదు చలామణీ కేసులో రెండ్రోజుల క్రితం నవాబ్ మాలిక్ అరెస్టైన నేపథ్యంలో ఆయన చేసిన రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పూర్తి వ్యక్తిగత నిర్ణయమని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసిన తర్వాత రాష్ట్ర బీజేపీ ఆయనపై విరుచుకుపడుతోంది. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని, అవసరమైతే ఆయన రాజీనామాను ఆమోదించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ శుక్రవారం నగరంలోని విలేకరులతో మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో కీలుబొమ్మలుగా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మంత్రివర్గంలోని మంత్రి రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. అయితే నవాబ్ మాలిక్ రాజీనామాను సంకీర్ణ కూటమిలోని ఎన్పీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
భివండీలో నిరసనలు..
భివండీ: రాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్ అరెస్టు పట్ల భివండీ శుక్రవారం అట్టుడికిపోయింది. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ మహావికాస్ ఆఘాడీకి చెందిన నాయకులు భివండీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈడీ చర్యను వ్యతిరేకిస్తూ ప్రాంత్‌కార్యాలయం ఎదురుగా ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలో శివసేన పట్టణ ప్రముఖులు సుభాష్ మానే, భివండీ పట్టణ ఎన్సీపీ అధ్యక్షుడు షోయబ్ ఖాన్ గుడ్డు, మహిళా అధ్యక్షురాలు స్వాతి కాంబ్లే, భివండీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రషీద్ తాహిర్ మోమిన్, పాటు శామ్ పాటిల్, మధన్ బోయ్, మహేంద్ర కుంబారే, కోమల్ పాటిల్, రాణి అగ్రవాల్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. (చదవండి: బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?)
Comments
Please login to add a commentAdd a comment