‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ నరేశ్‌ గోయల్‌ అరెస్ట్‌ | Jet Airways Founder Naresh Goyal Arrested In Rs 538 Crore Alleged Bank Fraud Case - Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ లోన్‌ మోసం కేసు.. జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ అరెస్ట్‌

Published Sat, Sep 2 2023 6:46 AM | Last Updated on Sat, Sep 2 2023 9:23 AM

Jet Airways Founder Naresh Goyal Arrested - Sakshi

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌(74)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సంస్థ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద.. ముంబైలో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది.

జెట్‌ ఎయిర్‌ కోసం కెనరా బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.848.86 కోట్ల రుణాలను దారి మళ్లించి స్వాహా చేశారని సీబీఐ ఇంతకు ముందే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ గోయల్‌ను ప్రశ్నించి.. అరెస్టు చేసింది.

మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

గోయల్‌ను శనివారం ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశ పెట్టి..ఈడీ అధి కారులు ఆయన కస్టడీ కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అనూహ్యంగా..
దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్‌వేస్.. భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. ఆపై బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంనది. ఇక జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది.

ఎయిర్‌పోర్ట్‌లో అడ్డగింత.. తనిఖీలు..
జెట్ ఎయిర్వేస్ సర్వీస్‌లు నిలిచిపోయాక.. 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి  అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. ఆ టైంలో నరేష్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం.

ఇక.. విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేష్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన్ని ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అటు నుంచి అటే అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement