సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలకనిందితుడు, గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీ (60) రోగాల రాగం అందుకుని పీఎంఏల్‌ఏ కోర్టు కొత్త అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆర్థిక నేరస్తుడు చోక్సీని ఆంటిగ్వా నుంచి తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ముంబైలోని మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కోర్టులో కొత్తగా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కారణంగాను తాను విచారణకు రాలేనని కోర్టును కోరాడు.
ఇటీవల పీఎన్‌బీ స్కాంలో మరో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఇటీవల లండన్‌లో అరెస్టు చేయడంతోపాటు బెయిల్ నిరాకరించి జైలుకు తరలించిన నేపథ్యంలో తనకు కూడా అరెస్ట్ తప్పదని భావించిన ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సి చోక్సీ ఈ చర్యకు దిగాడు. తాను దీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ ముంబై కోర్టును ఆశ్రయించాడు. ముఖ‍్యంగా హృదయ సంబంధ వ్యాధి, కాలిలో తీవ్రమైన నొప్పి, మెదడులో గడ్డ తదితర రుగ్మతలతో బాధపడుతున్నానని పేర్కొన్నాడు.
కాగా గతంలో కూడా ఆంటిగ్వానుంచి 41గంటలపాటు విమానంలో ప్రయాణించి ఇండియాలో కోర్టు విచారణకు హాజరు కాలేననీ, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని కోర్టుకు విన్నవించు కున్నాడు. తాజాగా మరోసారి విచారణకు ముఖం చాటేస్తూ కోర్టుకు దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం.
బ్యాంకింగ్ రంగంలోఅతిపెద్ద కుంభకోణంగా పేరొందిన రూ.13వేల కోట్ల పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీకి మేనమామ మెహుల్ చోక్సీ. వేలకోట్ల రూపాయల మేర బ్యాకులకు ఎగనామం పెట్టిన చోక్సీ విదేశాలకు పారిపోయాడు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ చార్జి షీట్లను దాఖలు చేసాయి. అలాగే చోక్సీ పాస్‌పోర్టును రద్దు చేయడతోపాటు ఇంటర్ పోల్ నోటీసు కూడా జారీ అయింది. ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వంతో అక్కడ తలదాచున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment