మిషన్‌ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే? | Mission Choksi: Sharada Raut key Member  of Team  | Sakshi
Sakshi News home page

మిషన్‌ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?

Published Tue, Jun 1 2021 2:48 PM | Last Updated on Tue, Jun 1 2021 6:10 PM

Mission Choksi: Sharada Raut key Member  of Team  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పీఎన్​బీ  కుంభకోణంలో కీలక నిందితుడు  ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీని స్వదేశానికి రప్పించేందుకు  మల్టీ-ఏజెన్సీ బృందం డొమినికాకు చేరుకుంది. "మిషన్ చోక్సీ"  పేరుతో ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల ఈ బృందానికి సీబీఐ అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్‌ నేతృత్వం వహించడం  విశేషంగా నిలిచింది. సీబీఐ, ఈడీ , సీఆర్‌పీఎఫ్ సభ్యులు ఈ బృందంలో భాగమని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

సీబీఐ బ్యాంకింగ్‌ మోసాలను విచారించే విభాగం చీఫ్‌ ముంబైకి చెందిన శారదా రౌత్‌ నేతృత్వంలోని  ఈ బృందం రేపు (జూన్‌ రెండు)  చోక్సీపై జరిగే కోర్టు విచారణకు హాజరవుతుంది. అక్కడ రాజకీయంగా దుమారాన్ని రేపిన ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేయనుంది. అన్ని ప్లాన్‌ ప్రకారం జరిగితే  ఒక ప్రయివేట్‌ విమానం ద్వారా ఈ బృందం చోక్సీని వెనక్కి తీసుకురానుందని సమాచారం.  డిల్లీలో విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణమే  చోక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది.


 సీబీఐ అధికారి శారదా రౌత్‌ (ఫైల్‌ ఫోటో)

ఇది ఇలాఉంటే అందరూ భావిస్తున్నట్టుగా మే 25 న కాకుండా మే 23నే మెహు్‌ల్‌ చోక్సీ డొమినికాకు చేరుకున్నాడని ఆంటిగ్వా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అవుట్‌ బౌండ్ క్లియరెన్స్ పత్రం ద్వారా తెలుస్తోంది.  సెయింట్ లూసియా ఆధారిత పడవ 'కాలియోప్ ఆఫ్ ఆర్నే' ద్వారా డొమినికాలో అడుగుపెట్టాడు. అక్కడినుంచి భారత్​తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చెక్కెయ్యాలని ప్రయత్నించి  చోక్సీ చివరికి బుక్కయి పోయాడు.

కాగా  నకిలీ పత్రాలు, పీఎన్‌బీ అధికారులతో కుమ్మక్కై  వేలకోట్ల రూపాయల మేర  అక్రమాలకు పాల్పడిన  కేసులో  డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ, అతని మేనమామ మెహెల్‌ చోక్సీ  కీలక నిందితులుగా ఉన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అతిపెద్ద కుంభకోణంగాఈ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వాన్ని అనుభవిస్తున్న మెహుల్ చోక్సీ ఇటీవల క్యూబాకు పారిపోతూ డొమినికాలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొమినికా పౌరసత్వంలేని చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించవచ్చని ఆంటిగ్వా ప్రకటించింది. చోక్సీ భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిందే..అక్కడ నేరారోపణల విచారణను ఎదుర్కోవలసిందే అని ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ తేల్చి చెప్పారు. అలాగే చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించినందుకు చోక్సిని అదుపులోకి తీసుకోవాలని డొమినికన్ ప్రభుత్వాన్ని బ్రౌన్ కోరినట్లు ఆంటిగ్వా మీడియా వెల్లడించింది.

మరోవైపు చోక్సీ భారత పౌరుడు కాదు కాబట్టి, చట్టబద్దంగా భారతదేశానికి తరలించలేరని  చోక్సీ న్యాయవాది  వాదిస్తున్నారు. అంతేకాదు కొన్ని రాజకీయ కారణాల రీత్యా బలవంతంగా డొమినికాకు చోక్సీని తీసుకెళ్లారని కూడా ఆరోపించారు. అటు  చోక్సీ వ్యవహారం డొమినికాలో రాజకీయ వివాదానికి దారి తీసింది. అంతర్జాతీయంగా తమ  ప్రతిష్ట దెబ్బదింటోందంటూ  డొమినికా ప్రతిపక్ష నాయకుడు లెన్నాక్స్ లింటన్ ప్రధానమంత్రి రూజ్‌వెల్ట్ స్కెర్రిట్ ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు.

చదవండి :  Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు
కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement