
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో తలదాచుకున్న రుణ ఎగవేతదారులను భారత్‌కు రప్పించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండిపడింది. పీఎన్‌బీ స్కామ్‌లో నిందితుడు, పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకుని అంటిగ్వా ప్రభుత్వానికి తన పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.చోక్సీ ఏడాదికి పైగా అంటిగ్వాలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. అంటిగ్వా నుంచి భారత్‌కు 41 గంటల పాటు ప్రయాణం చేసే పరిస్ధితిలో తాను లేనని కోర్టుకు వివరించారు. తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి డైమండ్ వ్యాపారి చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ 13,000 కోట్లకు మోసం చేసినట్టు దర్యాప్తు సంస్ధలు ఆయనపై విచారణ చేపట్టాయి. కాగా భారత పౌరసత్వం వదులుకోవడం ద్వారా భారత చట్టాల ప్రకారం తనపై జరిగే విచారణను అడ్డుకునేందుకు చోక్సీ ఇలా వ్యవహరించారని భావిస్తున్నారు.