న్యూఢిల్లీ: పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందుతుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు బార్బరా జబారికా. మెహుల్ చోక్సీ గర్ల్ ఫ్రెండ్‌గా వెలుగులోకి వచ్చిన జబారికా ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తాను చోక్సీని ఓ స్నేహితుడిగానే భావించానని.. కానీ ఆయన తన దగ్గర నుంచి వేరే ఆశించేవాడని తెలిపింది. అందులో భాగంగానే తన విమాన టిక్కెట్ల ఖర్చు భరించేవాడని.. హోటల్లో రూమ్ బుక్ చేసేవాడని తెలిపింది. ఇక తాను చోక్సీతో కలిసి కాఫీ, డిన్నర్, వాకింగ్‌కు వెళ్లానని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా జబారికా మాట్లాడుతూ.. ‘‘చోక్సీ నా అపార్ట్‌మెంట్‌కి వచ్చేవాడు. నేను తనతో కేవలం స్నేహం, బిజినెస్ అంతవరకు మాత్రమే ఉండాలని భావించేదాన్ని. కానీ అతడు అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేసేవాడు . అందులో భాగంగా హోటల్ రూం బుకింగ్, ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేయడం వంటివి చేసేవాడు. కానీ నేను వాటన్నింటిని తిరస్కరించేదాన్ని. ఏం ఆశించి అతను ఇవన్ని చేసేవాడో నేను ఊహించగలనను. అతడు మా రిలేషన్‌ని తప్పుగా అర్థం చేసుకున్నాడు’’ అని తెలిపింది.
‘‘ఇక మే నెలలో మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి. చోక్సీ నాకు బిజినెస్ ఆఫర్స్ ఇవ్వడం ప్రారంభించాడు. నేను ప్రాపర్టీ సంబంధింత పనులు చూసుకుంటుండంతో అతడు ఆంటిగ్వాలో క్లబ్బులు, హోటళ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. వాటన్నింటికి తానే పెట్టుబడి పెడతానని తెలిపాడు. అలా వ్యాపారం మీద నాకు ఆసక్తి కలిగించాడు’’ అంటూ చెప్పుకొచ్చింది జబారికా.
‘‘ఇండియా నుంచి పారిపోయి వచ్చిన వజ్రాల వ్యాపారి చోక్సీ తనను రాజ్‌గా నాకు పరిచయం చేసుకున్నాడు.. నకిలీ వజ్రపుటుంగరాలను నాకు బహుకరించాడు. వాట్సాప్, సిగ్నల్ వంటి వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేర్వేరు నంబర్ల నుంచి నాకు మెసేజ్‌లు చేసేవాడు. ఆరు నెలల్లో అతడు ఆరు నంబర్లు మార్చాడు. వాటి నుంచి మెసేజ్ చేసేవాడు. ప్రతి సారి రాజ్ అనే చెప్పుకునేవాడు. ద్వీపంలోని ప్రజలు, రెస్టారెంట్ సిబ్బంది తనను రాజ్ అనే పిలిచేవారు’’ అంటూ 33 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో బార్బరా జబారికా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment