ముంబై: మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు మంగళవారం(ఇవాళ) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తులపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది బాంబే హైకోర్టు. అయితే.. ఈ ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ఈడీ కోరింది.
దీంతో.. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు ఈడీకి వీలుగా బెయిల్ ఆర్డర్ అక్టోబర్ 13 నుంచి అమల్లోకి వస్తుందని హైకోర్టు పేర్కొంది. అయితే.. బెయిల్ లభించినప్పటికీ ఆయన బయటకు రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఏప్రిల్‌లో సీబీఐ ఆయనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. 2019-21 మధ్య హోం మంత్రి పదవిలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందటి ఏడాది నవంబర్‌లో మనీల్యాండరింగ్ ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఏడాది మొదట్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థన తిరస్కరణకు గురైంది.
72 ఏళ్ల అనిల్ దేశ్‌ముఖ్ వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తొలుత హైకోర్టు ఈ అభ్యర్థనలపై స్పందించకపోవడంతో.. సుప్రీంకు వెళ్లారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. ఆరు నెలలుగా విచారణకు సైతం స్వీకరించకుండా అభ్యర్థ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచినందుకు సుప్రీం కోర్టు.. బాంబే హైకోర్టును మందలించింది.
అధికారం అండతో.. ముంబైలోని బార్లు, రెస్టారెంట్‌ల నుంచి అక్రమంగా రూ.4.7 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు అనిల్ దేశ్‌ముఖ్‌పై ఉన్నాయి. ఈ మేరకు ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలంతో సీబీఐ, అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి కేసును నమోదు చేయగా.. ఆ వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment