
ముంబై: బాంబే హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.
వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.
జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.
ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం