కలకత్తా: పార్లమెంటులో డబ్బులు తీసుకొని ప్రశ్నలడిగిన వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే డబ్బులకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగానే ఈడీ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో విచారణకు రావాల్సిందిగా ఈడీ పంపిన సమన్లకు ఇటీవల మహువా స్పందించలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం. లోక్‌పాల్ ఆదేశాలతో మహువాపై కేసు నమోదు చేసిన సీబీఐ ఇటీవలే కలకత్తాలోని ఆమె ఇళ్లలో సోదాలు నిర్వహించింది.
కాగా, డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇచ్చిన ఆరోపణలపై మహువా ఎంపీ సభ్యత్వాన్ని స్పీకర్ ఇప్పటికే రద్దు చేశారు. ఎథిక్స్ కమిటీ సిఫారసుల మేరకు లోక్‌సభ స్పీకర్ మహువాపై సభ్యత్వ రద్దు చర్య తీసుకున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహువా పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున మళ్లీ పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి.. తీహార్ జైలులో కేజ్రీవాల్ కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment