టీఎంసీలో అంతర్గత విభేదాలు.. ఆగని అమిత్ మాలవీయ వరుస పోస్టులు | ‌Rift In TMC:BJP Amit Malviya Serial Posts | Sakshi
Sakshi News home page

టీఎంసీలో అంతర్గత విభేదాలు.. ఆగని అమిత్ మాలవీయ వరుస పోస్టులు

Published Tue, Apr 8 2025 6:48 PM | Last Updated on Tue, Apr 8 2025 7:04 PM

‌Rift In TMC:BJP Amit Malviya Serial Posts

ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అంతర్గత పోరును బీజేపీ రచ్చకెక్కించింది. టీఎంసీ నేతల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు, వాట్సప్ చాట్‌లను కమలం పార్టీ బయటపెట్టింది. సీనియర్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ, ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న మరో ఎంపీ మధ్య గొడవ జరిగిందని.. అదీ ఎన్నికల సంఘం కేంద్రకార్యాలయం వద్దేనంటూ బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయ వాటిని షేర్ చేశారు. ఈ క్రమంలో ఇంకా వరుస వీడియోలు షేర్‌ చేస్తూనే ఉన్నారు.

మాలవీయ  చేసిన పోస్టుల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రతినిధుల బృందం ఒక ప్రజెంటేషన్‌ను సమర్పించడానికి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లింది. ఆ టైంలో.. ఈసీ ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు వినతిపత్రంపై సంతకాలు చేసేందుకు ఒకసారి సమావేశం కావాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. కానీ సదరు ఎంపీ ఆ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. నేరుగా ఈసీ వద్దకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే.. ఇద్దరు ఎంపీల మధ్య గొడవకు దారితీసి పోలీసుల జోక్యం దాకా వెళ్లింది. 

అమిత్‌ మాలవీయా షేర్ చేసిన వీడియోలో కల్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై ‘‘ఇదంతా పబ్లిక్ ప్లేస్. కాస్త సంయమనం పాటించండి’’ అని ఊగిపోతూ కనిపించినట్లు ఉంది. టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రిన్ మధ్యలో వచ్చి‘‘మీడియాలో ప్రసారమవుతుంది. వద్దు..’’ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. కొసమెరుపు ఏంటంటే.. ఈ వ్యవహారం తర్వాత పార్లమెంట్ సభ్యులు బెనర్జీ, కీర్తి ఆజాద్‌ చాటింగ్‌ చేసుకుంటే.. ఏఐటీసీ ఎంపీ 2024 పేరిట ఉన్న గ్రూపులోని ఆ సంభాషణను కూడా మాలవీయ బయటపెట్టారు. ఆ సంభాషణ ధాటి తట్టుకోలేక సదరు మహిళా ఎంపీ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయినట్లు ఆ షేరింగ్‌లో ఉంది. 

ఇక ఈ వ్యవహారంపై టీఎంసీ నేత సౌగతారాయ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ అంతర్గత గోప్యతను కాపాడుకోవాలంటూ టీఎంసీ నేతలకు హితవు పలికారు. ఈ క్రమంలో కల్యాణ్‌ బెనర్జీ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ మహిళా ఎంపీ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను. కల్యాణ్‌ ప్రవర్తనపై పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది అని రాయ్‌ అన్నారు. అయితే అమిత్‌ మాలవీయా ఇక్కడితోనే ఆగలేదు. సౌగతారాయ్‌ను తీవ్రంగా విమర్శించిన కళ్యాణ్‌ బెనర్జీ వీడియోను సైతం షేర్‌ చేశారు.

 

 మరోవైపు.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గోప్యంగా ఈ విషయాన్ని ఉంచాలని మొదటి నుంచి భావించారట. అయితే ఈలోపే  బీజేపీ నేత అమిత్‌ మాలవీయ పోస్టులతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని బెంగాలీ న్యూస్‌ ఛానెల్స్‌ ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement