మహిళలకు బీజేపీ మాజీ ఎంపీ వార్నింగ్‌.. మీ గొంతు నులిమేస్తా అంటూ.. | BJP Dilip Ghosh Controversy Women Protesters In Viral Video | Sakshi
Sakshi News home page

మహిళలకు బీజేపీ మాజీ ఎంపీ వార్నింగ్‌.. మీ గొంతు నులిమేస్తా అంటూ..

Published Sat, Mar 22 2025 11:45 AM | Last Updated on Sat, Mar 22 2025 12:24 PM

BJP Dilip Ghosh Controversy Women Protesters In Viral Video

కోల్‌కత్తా: బెంగాల్‌లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాజీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ సహనం కోల్పోయి స్థానిక మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, బెంగాల్‌ మహిళలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగాల్‌‌కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ శుక్రవారం ఖరగ్‌‌పూర్‌‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఖరగ్‌పూర్‌లోని వార్డు నంబర్-6లో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. అయితే, రోడ్డు ప్రారంభోత్సం సందర్బంగా దిలీప్‌ ఘోష్‌ను అక్కడున్న మహిళలు అడ్డగించారు. మేం ఇప్పుడు గుర్తొచ్చామా?. మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా ఏరియాకు ఎందుకు ఒక్కసారి కూడా రాలేదని నిలదీశారు. రోడ్డును మా కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ నిర్మిస్తే మీరు వచ్చి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు.

మహిళల ప్రశ్నలకు దిలీప్‌ ఘోష్‌ అసహనం వ్యక్తం చేశారు. వారితో వాదిస్తూ..‘ఈ రోడ్డు నిర్మాణానికి నేనే డబ్బులు ఇచ్చాను. మీ తండ్రి డబ్బులతో రోడ్డు వేయలేదు. కావాలంటే వెళ్లి ప్రదీప్ సర్కార్‌ను అడగండి’ అంటూ మండిపడ్డారు. ఆయన సమాధానానికి సదరు మహిళలు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోసారి మహిళలు కల్పించుకుని.. మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?. ఎంపీ మీరు కదా.. రోడ్డు వేయాల్సింది కూడా మీరే అని అని నిలదీశారు. ఈ క్రమంలో పూర్తిగా సంయమనం కోల్పోయిన దిలీప్ ఘోష్ బెదిరింపులకు దిగారు. వెంటనే..‘అలా అరవకండి. అలా అరిస్తే మీ గొంతు నులిమేస్తా’ అని మహిళకు వార్నింగ్ ఇచ్చారు.

అనంతరం, మహిళలకు, దిలీప్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు దిలీప్ ఘోష్‌ను వెంటనే కారు ఎక్కించగా.. మహిళలు వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే ఘోష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. తాను పార్లమెంటేరియన్‌‌గా ఉన్న సమయంలోనే ఎంపీ లాడ్ ఫండ్ నుంచి ఈ రోడ్డుకు డబ్బు ఇచ్చానని వివరణ ఇచ్చారు. అయితే, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై టీంఎసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement